మళ్ళీ ఒకసారి సంజయ్ మొహంలోకి చిత్రంగా చూశాడు నాగరాజ్. పిట్టలా? కొత్త ఏ.సీ.పీ.గారు పదవిలోకి రాగానే తన పవర్ ని అంతా ఉపయోగించి అమ్మాయిల వేటలో మునిగిపోతున్నాడా?
అయి ఉండవచ్చు.
వయస్సు!
వెనక్కి తిరిగి ఒక కానిస్టేబుల్ కి సైగ చేశాడు నాగరాజ్.
"సబ్ ఇన్స్ పెక్టరు కొండారెడ్డిని రమ్మను.
కొద్దిసేపటి తర్వాత సబ్ ఇన్స్ పెక్టరు కొండారెడ్డి లోపలికి వచ్చి సెల్యూట్ చేశాడు.
అతనివైపు తిరిగాడు నాగరాజ్.
"ఏం రెడ్డీ! నూర్జహాన్ కత ఏమయింది?"
"కన్ ఫర్మ్ అయింది సార్!"
"ఏమని?"
"ఆమె దగ్గర ఎనిమిదిమంది అమ్మాయిలు ఉన్నారు. అంతా టాప్ క్లాస్! ఒక రాత్రికి వెయ్యి రూపాయల రేటు"
"ఎలా కన్ ఫర్మ్! అయింది?" అన్నాడు నాగరాజ్. అతను అలా అడగడంలో తనుసమాచారం తెలుసుకోవాలన్న కోరికతోబాటు. ఆ సమాచారాన్ని ఏ.సీ.పీ.కి కూడా వినాలన్న ఆత్రం కూడా ఉంది.
"ఆ ఇంటి ముందు ఒక హెడ్ కానిస్టేబుల్ ని ఐదు రోజులనుంచి మఫ్టీలో ఉంచాను సార్! ఆ బంగళాలోకి వెళ్ళివస్తున్న వాళ్ళందరినీ గుర్తుపెట్టుకున్నాడు అతను. అక్కడే ఉన్న పాన్ షాపతను కూడా కన్ ఫర్మ్ చేశాడు సర్ అది బ్రోతల్ హవుస్ అని."
"మరి ఆలస్యం ఎందుకు? రెయిడ్ చెయ్యండి" అన్నాడు సంజయ్.
"నూర్జహాన్ అంటే అగ్గిబరాటా సర్! ఆమెకి చాలా ఇన్ ప్లుయెన్స్ ఉంది."
అహల్యమాటలు వినగానే సంజయ్ కనుబొమలు ముడిపడ్డాయ్.
"దెన్ మేక్ ఇట్ ఏ పాయింట్ టూరెయిడ్ హర్ హవుస్! టుడే ఇట్సెల్ఫ్! వితవుట్ ఫెయిల్!"
సర్కిల్ ఇన్స్ పెక్టరు నాగరాజ్, సబ్ ఇన్స్ పెక్టరు కొండారెడ్డి మొహమొహాలు చూసుకున్నారు.
తర్వాత సంజయ్ వైపు తిరిగాడు నాగరాజ్. "రెయిడ్ కి ఆర్దర్సు మీరు సైన్ చేస్తే బాగుంటుంది సర్!"
"ఏం! ఎందుకని? కొత్త రూల్సు ప్రకారం సర్కిల్ ఇన్స్ పెక్టరుకూడా రెయిడ్స్ కి ఆర్డరు చెయ్యవచ్చునే!" అన్నాడు సంజయ్.
"కొత్తరూల్సు కూడా కంఠత పట్టేసివచ్చాడంటే ఉద్ధండుడన్నమాట ఈ కొత్త ఏ.సీ.పీ" అనుకున్నాడు నాగరాజ్.
"యస్సర్! కానీ ఇది చాలా స్పెషల్ కేసు!"
సంజయ్ మొహం ఎరుపురంగుకి తిరిగింది. "వాటీజ్ సో స్పెషల్! సరే? పేపర్స్ పుటప్ చెయ్యండి. నేనే సైన్ చేస్తాను. ఆ నూర్జహాన్ ఇంటితోబాటు కొన్నిపాష్ హోటల్స్ కూడా రెయిడ్ చెయ్యండి ఇవాళ. ఓ,కే?"
పదినిమిషాల తర్వాత, నూర్జహాన్ ఇంటిమీద, కొన్ని లగ్జరీ హోటల్స్ మీదా రెయిడ్స్ చెయ్యడానికి ఆర్డర్స్ టైప్ అయివచ్చాయి. చదివి సంతకం పెట్టాడు సంజయ్.
"రెయిడ్ చేసేముందు ట్రాప్ అరేంజ్ చెయ్యాలి సర్! మీరు సరేనంటే మనకొండారెడ్డిని నూర్జహాన్ ఇంటికి కష్టమర్ గా పంపుతాను? అతను ఆ ఇంట్లో వున్నప్పుడు మనం రెయిడ్ చేసి రెడ్ హాండెడ్ గా పట్టుకోవచ్చు."
"ఏం రెడ్డీ? వెళతావా?"
కొండారెడ్డి కొంచెం సిగ్గుపడి, ముసిముసిగా వచ్చాడు.
నూర్జహాన్ ఇంటిమీద రెయిడ్ చెయ్యడం అంటే, విశ్రాంతిగా పడుకుని వున్న సివంగిని తట్టిలేపడమే అని కొత్త అసిస్టెంట్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ కి తెలియదు కానీ పాత సర్కిల్ ఇన్స్ పెక్టరు నాగరాజు కి తెలుసు. సబ్ ఇన్స్ పెక్టరు కొండారెడ్డికి తెలుసు.
అందుకని అతి పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం మొదలెట్టాడు నాగరాజ్. ప్లీస్ స్టేషన్ లో" బెల్ ఆఫ్ ఆరమ్స్" అనబడే ఆయుధాగారం తెరవబడింది. ఇరవై మంది కానిస్టేబుల్ స్తో, ఒక సబ్ ఇన్స్ పెక్టరు నీలంరంగు పోలీస్ వ్యాను రెయిడ్ కి వెళ్ళడానికి రెడీగా వుంది.
అంతకుముందే ఇంకో సబ్ ఇన్స్ పెక్టరు కొండారెడ్డి సిల్కులాల్చీ వేసుకుని, రెవలాన్ సెంటుపూసుకుని, పూలరంగడిలా తయారయి, నూర్జహాన్ ఇంటివైపు సాగిపోయాడు.
"ఆ హోటల్ కి ఎవరెళ్తున్నారు?" అన్నాడు సంజయ్.
"సబ్ ఇన్స్ పెక్టరు పురుషోత్తం సర్" అన్నాడు నాగరాజ్.
ఆ తర్వాత రెయిడ్స్ కి బయలుదేరాయి పోలీస్ పార్టీలు.
13
నగరంలో అతి విలాసవంతమైన హోటల్సులో అది ఒకటి పైలట్ వారంగ్ ఆ హోటల్లో తనకోసం బుక్ చేసి వుంచిన లగ్జరీసూట్ లో అడుగుపెట్టింది సీత. ఆమెకోసమే ఎదురుచూస్తున్నట్లు అసహనంగా కూర్చుని వున్నాడు వారంగ్. సీత హైదరాబాద్ ఫ్లయిట్ ఎయిర్ పోర్టులో గంటసేపు విమానాన్ని ఆపేసినవాడు అతను సీతకి వెర్రి అభిమాని. ఆమెను చూడగానే అతనిమొహం వికసించింది.
"కమాన్ బేబీ! కమ్!" అన్నాడు సంతోషంగా! అతని చూపులు ఆమెను నిలువెల్లా తడిపేస్తున్నాయి.
అది గమనించి నవ్వుతూ గుమ్మందగ్గరే ఆగిపోయింది సీత. తర్వాత చూపుడు వేలుఎత్తి బెదిరింపుగా అంది. "నో మంకీ బిజినెస్ అండర్ స్టాండ్?"
హతాశుడైనట్లు చూశాడు వారంగ్.
"అంతేనా? నువ్వు ఫోన్ చేస్తీ నీ కోసం నేను విమానాన్ని బాంబేలో గంటసేపు ఆపేశాను ఆ అభిమానం అన్నా లేదా?"
"అభిమానానికేం? ఈ రూం పట్టనంత ఉంది. కానీ ఐ రిపీట్, ఆబ్సల్యూట్ లీ నో మంకీ బిజినెస్! ఇప్పుడు చెప్పు! ఎలా ఆపేశావ్ విమానాన్ని?"
"వెరీ సింపుల్! స్టార్టింగు టైంకి ముందు రొటీన్ చెక్స్ చేయాలి ఫైలట్. ఏదో ఫాల్టువున్నట్లు అనుమానంగా వుందని చెప్పాను. విమానాన్ని వెనక్కి తీసుకెళ్ళాడు. టెక్నీషియన్ లు చెకప్ చేసి ఏమీ స్నాగ్ లేదని తేల్చారు. విమానం వెనక్కి వచ్చింది. ఇదంతా అయ్యేసరికి ఒకగంట గడిచిపోయింది. ఈ లోపల నువ్వు ఎయిర్ పోర్టుకి వచ్చేశావ్. సుఖాంతం!"
"మరి ఫాల్టు లేకుండానే విమానాన్ని వెనక్కి పంపించినందుకు వాళ్ళేమీ అనలేదా?"
"ఏమంటారు! ఫైలట్ కి స్నాగ్ ఉందని అనుమానం వచ్చింది. సేఫ్టీ ప్రికాషన్స్ ప్రకారం మళ్ళీ టెక్నీషియన్స్ చెకప్ చేసి తీరాల్సిందే! స్నాగ్ వుందని అనుమానంరావటమూ, స్నాగ్ లేదని చివరికి తేలడమూ రెండూ నా తప్పుకాదుకదా! 'ఐ హావ్ టాక్టెడ్ ఇన్ ద బెస్ట్ ఇంట రెస్టెస్ ఆఫ్ ది పాసింజర్స్ సేఫ్టీ!" అని నోరుమూయించేస్తాను ఎవరన్నా నోరెత్తితే!
నవ్వింది సీత. ఆమె నవ్వుతూ వుంటే ఆమె వక్షంవేపేతదేకంగా చూశాడు వారంగ్.
అప్పుడు జరిగింది అది.
ఆమె ఊహించలేనంత వేగంగా ఆమెని చేరుకున్నాడు వారంగ్. ఆమెని తన చేతులతో చుట్టేశాడు. ఆమె నోరు తెరిచి కేకవెయ్యడానికి వీలులేకుండా అతనిపెదిమలు ఆమె పెదిమలని నొక్కిపట్టేశాయి! ఒక చేత్తో డోర్ లాక్ చేశాడు అతను.
తల అటూ ఇటూ విదిలించింది సీత. అతని పట్టువదిలించుకోవడానికి గింజుకుంది.
కానీ భల్లూకంలాపట్టేసుకున్నాడు అతను.


