ఇలాంటి సమయంలో ఓ వ్యక్తి వూరి రోడ్డులో దిగాడు. ఆయన కాషాయ వస్త్రాలు ధరించి చూడగానే స్వామి అనిపిస్తాడు. నుదుటున విభూది పట్టీలు, వాటి మధ్యన కుంకుమబొట్టు, మెడలో రుద్రాక్షమాలలు, దిట్టమైన శరీరంతో చూడగానే ఓ విధమైన గౌరవం, భక్తి కలుగుతాయి.
ఆయన చిన్నగా మునెయ్య దగ్గరికి వెళ్ళాడు.
"ఏం స్వామీ! టీనా కాఫీనా?" అని అడిగాడు మునెయ్య.
"రెండూ కావు నాయనా..... కాస్తంత మనశ్శాంతి" నవ్వుతూ చెప్పాడు స్వామి.
మునెయ్యకి వెంటనే అర్ధం కాలేదు. అర్ధమయ్యాక చిన్నగా భయం భయంగా నవ్వాడు.
ఆ స్వామి పేరు చిదంబరం అంతవరకు ఎక్కడెక్కడో తిరిగాడు. చివరికి దైవదర్శనం అయింది దేముడు ఆయనకి వెంటనే మోక్షం ఇవ్వడానికి నిరాకరించాడు. ఇంకా నీ పాపం పండలేదు. అందుకే నీకు వచ్చిన వైద్యంతో జనానికి సేవలు చెయ్. ఆ తరువాత నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పి మాయమై పోయాడు.
ఇదీ స్వామి సూక్ష్మంగా మునెయ్యకి చెప్పిన కథ.
"అందువల్ల నాయనా ఇక్కడ నేను వుండడానికి మీరేదైనా సాయం జేస్తే వైద్యం ప్రారంభిస్తాను" అని స్వామి ముగించాడు.
"ఇలాంటి పెద్ద పని నావల్ల ఎలా అవుతుంది స్వామీ! వూర్లో రంగనాథం అనే ఆసామి వున్నాడు. మీరు ఆయన్ని కలవండి"
"అలానే" అని స్వామి వెళ్ళిపోయాడు.
ప్రస్తుతానికి గుడిలోనే వుండమని ఆ తరువాత వీలుబట్టి ఆశ్రమం నిర్మించి ఇస్తామని, గుడిలో వుండే వైద్యం ప్రారంభించమని రంగనాథం గుడి తాళాలు స్వామి చేతిలో పెట్టాడు. గుడి ఆలనాపాలనా చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో స్వామికి సులభంగా ఆశ్రయం లభించింది.
ఇక అప్పట్నుంచి తన విద్య ప్రరర్సించడం ప్రారంభించాడు స్వామి.
వైద్యమంటే ఏమీలేదు. రోగిని ముందు కూర్చోబెట్టుకుని వేపమండలను తాకిస్తూ ఏవో మంత్రాలు చదువుతున్నట్టు పెదవులను ఆడించడమే.
మొత్తానికి కొద్ది కాలానికే ఆయన చాలా పాపులర్ అయిపోయాడు. మొదట్లో నడిచివచ్చే రోగులే వస్తే ఇప్పుడు కార్లో కూడా రోగులు వస్తున్నారు.
దీంతో జనం రద్దీకూడా పెరిగింది.
మునెయ్య రెండు చేతులా సంపాదిస్తున్నాడు.
ఇది గమనించి తనూ రోడ్డులో అంగడి పెట్టాలన్న ఆలోచన మొదలయింది తిప్పరాజుకి.
తిప్పరాజుకి ఈ మధ్యనే పెళ్ళయింది. మొన్నటివరకు జల్సాగా తిరిగిన అతనికి సడన్ గా కుటుంబ బాధ్యతలు మీద పడిపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. ఆలాంటప్పుడు వాడికి టీ అంగడి ఆలోచన వచ్చింది.
వెంటనే మునెయ్య అంగడికి ఎదురుగ్గా, గుడికి పక్కన నాలుగు కొబ్బరి ఆకులతో చిన్నపాక లాంటిది వేసి టీ అంగడి ప్రారంభించాడు.
తిప్పరాజు బాగా మాటకారి. వాడు పలకా బలపం పట్టుకుని పాఠాలు చదవక పోయినా ప్రపంచాన్ని చదివిన జ్ఞానమెక్కువ ఎవర్ని ఎలా బుట్టలో వేయాలో బాగా తెలుసు.
వాడిలో వుండే ఇంకో గుణం ఏమిటంటే అది హాస్య ప్రియత్వం. సమయానుకూలంగా జోక్ లు వేస్తూ అందర్నీ నవ్విస్తుంటాడు.
ఈ కారణాల వల్ల మునెయ్య టీ అంగడికన్నా తిప్పరాజు టీ అంగడి నెంబర్ వన్ అయింది.
ఇలా అక్కడ ఓ చిన్న బజారంత జనం వచ్చి పోవడం ప్రారంభించారు.
గుడికి ఆనుకుని రామారావు అనే వ్యక్తికి పదెకరాల పొలం వుంది. దానికి నీటివసతి అంత బాగా లేకపోవడంతో పంటలు పండించటం పెద్ద కష్టమైపోయింది.
అందుకే ఎవరో వచ్చి ఫ్యాక్టరీకి స్థలం కావాలంటే రామారావు ముందూ వెనకా చూడకుండా పొలాన్ని అమ్మేశాడు.
"తొందర్లోనే ఫ్యాక్టరీ వచ్చేస్తుంది. ఇక మీద జనమే జనం" ప్రారంభించారు గ్రామస్థులు తిప్పరాజుతో.
ఈ విషయం వాళ్ళకంటే ముందే తెలుసు అతనికి.
అంగడిని మరింత ఇంప్రూవ్ చేయాలన్న ఆలోచన మొదలైంది. కానీ అతనికి డబ్బు వెసులుబాటు తక్కువ.
అందులోనూ వచ్చేది వేసవి కార్లు, లారీలు బాగా ఆగుతాయి. అందుకే టీ అంగడితో పాటు కూల్ డ్రింక్స్ షాపు కూడా పెట్టాలనుకున్నాడు.
అందుకుఓ కూలర్ కొనాలి. కరెంట్ కనెక్షన్ తీసుకోవాలి. అంగడిని మరి కాస్తంత పెంచాలి.
వీటికంతా ఎలా లేదన్నా ముఫ్ఫైవేల రూపాయలు కావాలి. వెయ్యో రెండు వేలో అయితే అతనిని నమ్మి ఎవరయినా ఇవ్వగలరు. ఏకంగా ముఫ్ఫై వేలంటే కష్టమే.
అందుకే ఎంత ప్రయత్నించినా డబ్బు సమకూరడం లేదు.
ఫ్యాక్టరీ పనులు మొదలయ్యాయి.
మొదట ఫ్యాక్టరీ చుట్టూ ప్రహరీగోడ కట్టే పని ప్రారంభమయింది.
ఫ్యాక్టరీ ఓనర్ ప్రహరీ గోడ కట్టే పనిని శ్రీనివాసరావుకి అప్పగించాడు.
శ్రీనివాసరావుది అనంతపురం. ఆయన ఓ చిన్నపాటి కాంట్రాక్టర్. ఆ జిల్లాలో పనికి, దాంతో పాటు తిండికీ కరువు, లేబర్ చౌకగా దొరుకుతారు. ఆయన ఓ పదిమందిని తాపీ పనికి కుదుర్చుకున్నాడు. వాళ్ళందరికీ నెలకింతని జీతాలు ఇస్తాడు. మూడుపూట్లా తిండి పెడతాడు. ఆయన కాంట్రాక్ట్ కు పని కుదుర్చుకుని తన దగ్గరున్న పనివాళ్ళతో పనులు పూర్తి చేస్తాడు.
ఫ్యాక్టరీ ప్రహరీగోడంటే పెద్ద పనే. దాదాపు ఎనిమిది లక్షల రూపాయల కాంట్రాక్ట్. నాలుగయిదు నెలలు పడుతుంది.
పని ఒప్పుకుంటూనే శ్రీనివాసరావు సైట్ కి వచ్చాడు. సైట్ చూశాక తిప్పరాజు అంగడికి వచ్చాడు.


