అయిదవ అనువాకము
మొదటి సూక్తము -21
వినియోగము :-
1. భార్య మీద భర్తకు వచ్చిన కోపము పోగొట్టుటకు కుపిత పురుషుని చూచుచు రాతిని తొలితృచచే అభిమంత్రించి, ఇందలి రెండవ మంత్రము జపించుచు రాతిని నేలకు కొట్టి, మూడవ మంత్రముచే దానిపై ఉమ్మివేయునది.
కుపిత పురుషుని ఛాయా యందు దీనిచే ధనుస్సును అభిమంత్రించి ఎక్కు పెట్టునది. భార్తమీద భార్య కోపించినను ఇట్లే చేయునది.
దీక్షలో యజమానికి కోపము వచ్చిన ఈ తృచను జపించునది.
2. అన్ని విధముల కోపమును పోగొట్టుటకు రెండవ తృచచే దర్భను మొక్కను వలె త్రవ్వి పాతి సంపాత అభిమంత్రణలు చేసి భక్షించునది.
1. ధనుస్సునుండి నారిని తొలగించినట్లు నీ మనసునందలి కోపమును తొలగించుచున్నాను. ఇక మనము ఏక మనస్కులమై మిత్రుల వలె నడచుకుందుము గాక.
2. మనము మిత్రుల వలె ఏక మనస్కులమై మసలుటకు నీ కోపమును బరువైన రాతికింద పడవేయుచున్నాను.
3. కోపి యొక్క కోపమును ముని పాదముతోను, మడమతోను నలచివేయుచున్నాను. నీవు నాకు అనుకూలుడవు అగునట్లు కోపమును త్రొక్కివేయుచున్నాను.
--౦౦౦--
1. ఈ దర్భ స్వ, పర జనుల కోపమును పోగొట్టునది. ఇది నిత్య క్రోధనుని, సకృత్ క్రోధనుని కోపమును పోగొట్టునది అగుచున్నది.
2. భూరిమూలయగు ఈ దర్భ సముద్రమును అణచి పెట్టుచున్నది. నేలన మొలచి ఆకాశమున నిలచిన ఈ దర్భ కోపమును శాంత పరచునది అనబడుచున్నది.
3. కోపీ! నీ గద్దున కదిలించు కోపమునకు కారణమగు ధమనిని శాంత పరచుచున్నాను. నీ నొసట ప్రకటితమగు కోపపు ధమనిని కూడ శాంత పరచుచున్నాను. అందువలన కోపము పరాధీనయై అణగి ఉండును. నీవు నా మనసునకు అనుకూలమగు రీతిగ నీ కోపమును అణచి వేయుచున్నాను.
రెండవ సూక్తము - 22
వినియోగము :-
1. మొదటి తృచచే అపవాద నివారణకు తనంతతాను పడిపోయిన గోవు కొమ్మును సంపాతించి నీట ముంచి, అభిమంత్రించి ఆ నీటితో ఆచమనము చేయించి, పైన చల్లునది.
2. రెండవ తృచచే దుస్స్వప్న పరిహారార్ధము మేలుకొని ముఖము కడుగుకొనునది. అతి ఘోర దుస్స్వప్న పరిహారార్ధము ధాన్యము, యవలు, గోధుమల మిశ్ర ధాన్యపు రెండు పురోడాశములు చేసి ఒక దానిని ఈ తృచచే అగ్నికి ఆహుతి చేసి రెండవ దానిని శత్రువు ఇంట పెట్టునది.
1. ఎట్లు ఆధార రహితముగ ద్యులోకము, పృథ్వి, ఈ సమస్త విశ్వము నిలిచి ఉన్నవో ఎట్లు నిలిచి నిద్రించు ఊర్ధ్వ స్వాప వృక్షము నిలిచి ఉన్నదో - అట్లు నీ రక్తస్రావము నిలిచిపోవునుగాక.
2. వ్యాధి నివారకములు వందలు ఉన్నవి. వేలు ఉన్నవి. వాటిలో రక్తస్రావమును నిలుపగలది సర్వ శ్రేష్ఠమగు రోగనాశకము అగుచున్నది.
3. శృంగోదకమా! నీవు రుద్రుని మూత్రమవు. అమృతపు నాభివి అగుచున్నావు. నీ పేరు విషాణ - రోగ నివారకము నీవు పిత్రు దేవతల మలము నుండి లేచినదానవు. నీవు 'అస్రావ' రోగనాశనివి.
--౦౦౦--
1. దుస్స్వప్న ములు కలిగించు మనస్తాపమా! నీవు అశుభ భాషిణివి. దూరమునకు వెళ్ళిపొమ్ము. నాకు నీ అక్కర లేదు. చిక్కని చెట్లు అడవిలో దూరుము. నా మనసు గృహములందు గోవులందు నిలుచునుగాక.
2. కలలందలి అర్ధ హింస, పూర్ణ హింస, అవహింసల వలన అదిరిపడుదుము. కరచునట్టి దుస్స్వప్నములు పీడించును. అగ్ని మా యొక్క సమస్త దుస్స్వప్న బాధలను దూరము చేయునుగాక.
3. ఇంద్ర, బృహస్పతులారా! దుస్స్వప్న పీడకు పలవరించుచున్నాము. అంగిరసుల మంత్ర జ్ఞానము గలవారు మమ్ము దురితములనుండి, పాపముల నుండి రక్షింతురుగాక.
మూడవ సూక్తము - 23
వినియోగము:
1. తొలి తృచకు పూర్వ సూక్తపు మలి తృచ వలె ఆచరించునది.
2,3 ఋక్కులచే ఘోర దుస్స్వప్నము కలిగిన మేల్కొని ముఖము కడుగుకొనునది.
2. రెండవ తృచలోని మూడు మంత్రములచే ఉదయ, మధ్యాహ్న, సాయం పవనములందు వరుసగా ఆహుతులు ఇచ్చునది.
1. స్వప్నమా! నీవు జీవించిన దానవు కావు. మృతి చెందిన దానవు కూడ కావు. నీవు దేవతల అమృత గర్భావు. వరుణుని పత్ని నీకు తల్లి, నియంత వరుణుడు నీకు తండ్రి అగుచున్నారు. నీ పేరు అరరు. ఆర్తి కలిగించుదానవు.
2. స్వప్నమా! నీ మూలము మాకు తెలియును. నీ తల్లి వరుణాని. నీవు యముని కార్యమవు. అంతకమవు. మృత్యువవు. నిన్ను గురించి మాకు సర్వము తెలియును. మమ్ము దుస్స్వప్న భయమునుండి రక్షింపుము.
3. గోవు ఖురములు మున్నగు పనికిరాని వానిని తొలగించినట్లు రుణగ్రస్తుడు అప్పు తీర్చి విముక్తుడైనట్లు దుస్స్వప్న భయమును మా శత్రువుల మీదకు తోలుచున్నాము.
--౦౦౦--
1. అగ్ని వైశ్వానరుడు విశ్వ కృతుడు. విశ్వ శంభువు. అతడు మా ప్రాతస్సవనమును రక్షించునుగాక. పావకుడగు అగ్ని మమ్ము ధనములందు నిలుపును గాక. మేము ఆయుష్మంతులమై, సహ భోజనులము అగుదుముగాక.
2. విశ్వే దేవతలు, మరుత్తులు, ఇంద్రుడు మా మధ్యాహ్న సవనమును విడువకుందురుగాక. మేము ప్రియ భాషణముల ఆయుష్మంతులము అగుదుముగాక. దేవతల మనసులందు నిలుతుముగాక.
3. ఋభువులు ఋషుల ఋతమున చమసములు కల్పించినారు. వారలు సుధన్య పుత్రులు. వారు ఈ సాయం సవనమును రక్షింతురుగాక. సవనమును పూర్తి చేయింతురుగాక.
నాలుగవ సూక్తము -24
వినియోగము:-
1. తొలి తృచచే గురువు ఉపనీత బాలునకు దండము మంత్రించి ఇచ్చునది. వటువు వీనిని జపించుచు దండము తీసికొనునది.
అభయకామి సప్తర్షులను ఈ తృచాచే యజించునది. ఉపస్థానము చేయునది.
మూడు సవనములందు బ్రహ్మ యజమానిచే ఈ మూడు ఋక్కులను వరుసగా చెప్పించునది. అట్లే సవనముల సమాప్తియందు ఆహుతులు ఇచ్చునది.
2. మలి తృచచే శుభము కోరు బ్రహ్మచారి తన మృత గురువును అగ్నికి ఆహుతి చేయునపుడు సూత్రోక్తరీతిన పురోడాశమును హోమించునది.
1. ప్రాతః సవనమా! నీవు శ్యేనమవు. గాయత్రీ ఛందమవు. నిన్ను ఆలంబన దండముగా గ్రహించుచున్నాను. "మమ్ము యజ్ఞపు చివరి ఋక్కు వరకు చేర్చుము. శుభములు కలిగించుము స్వాహా. స్వస్తి మా సం వహాస్య యజ్ఞస్యో దృచి స్వాహా"
2. సాయం సవనమా! నీవు ఋభవవు. జగతీ చందమవు. నిన్ను ఆలంబన దండముగా గ్రహించుచున్నాను.
"స్వస్తి మా సం వహాస్య యజ్ఞస్యో దృచి స్వాహా"
3. వృషాసి త్రిష్టుప్చన్దాసి అను త్వా రభే |
స్వస్తి మా సం వహాస్య యజ్ఞస్యో దృచి స్వాహా ||
ఇది మధ్యాహ్న సవనము.
--౦౦౦--
1. అగ్నీ! మానవులు నీ దేహమును తాకలేరు. పట్టలేరు. నీవు కోతి వంటి చంచలవు. ఈనిన ఆవు తన మాయను తిన్నట్లు నీవు దేహములను కాల్చుచున్నావు.
2. మేక పచ్చిక బయలులో చేరి మొదటి తృణముతో ఆరంభించి పచ్చికనంతను మేసినట్లు అగ్నిదేవా! నీవు కాల్చదగిన కళేబరపు అవయవముతో ప్రారంభించి మొత్తము దేహమున వ్యాపించుచున్నావు. దావాగ్ని, శవాగ్ని తమ జ్వాలా రూప శిరస్సులచే వృక్షముల, దేహముల శిరస్సులు కాల్చి బభ్రు వర్ణలై సోమలతాదులను మ్రింగుచున్నవి.
3. అగ్నిదేవా! నీ జ్వాలలు శ్యేనము వంటి వేగవంతములు. అవి మండుచు ధ్వనులు చేయును. కృష్ణ మృగము వలె గంతులు వేయును. నీ ధూమములు అంతరిక్షమునంటి, సూర్యమండలము చేరి నాట్యము లాడుచు వర్షము కలిగించుచున్నవి.


