-: రక్తపాయి హస్త లక్షణము (జలగ) :-
తా: సూచీహస్తము కదలించుచు అడ్డముగా బట్టిన జలగయందు వినియోగించును.
-: డుణ్డుభ హస్త లక్షణము (ఇరుతలల పాము) :-
తా: కర్తరీ దండహస్తము ఇరుతలల పాముకు వర్తించును. (కుడి చేత కర్తరీ ముఖహస్తమును ఊర్ధ్వముఖముచేసి అన్యప్రకోష్టమందు కాటకాముఖమును బట్టినచో కర్తరిదండ హస్తము వచ్చును.)
-: గ్రంధాంతర వాణహస్త లక్షణము :-
తా: చూపుడు వ్రేలు మొదలు మూడువ్రేళ్ళును బొటనవ్రేలితో చేర్చి, చిటికెన వ్రేలిని చాచిపట్టినచో బాణహస్త మగును. ఇది ఆరు అను లెక్కించుటకు, నాళనృత్యమందు వినియోగించును.
-: గ్రంధాంతర అర్ధసూచిక హస్త లక్షణము :-
తా: కపిత్ధహస్తపు చూపుడువ్రేలును పొడవుగా ఎత్తిపట్టినయెడల, అర్ధసూచిక హస్తము వచ్చును. ఇది మొలక, పక్షిపిల్ల, పెద్దపురుగు మొదలగు వాటికి వినియోగింపబడును.
-: గ్రంధాంతర ఊర్ణ నాభ హస్త లక్షణము :-
తా: పద్మకోశ హస్తపు వ్రేళ్ళను వంచినచో ఊర్ణ నాభ హస్తమగును. ఇది నృసింహస్వామివల్ల పుట్టినది. వీనికి శార్దూలకుడు ఋషి. రక్తవర్ణము. ఆదికూర్మము అధిదేవత. క్షత్రియ జాతి.
అసంయుత, సంయుత, సంకర, నానార్ధ, కాల, ఋతు, చతుర్వేద, చతుర్విధోపాయ, భూత భవిష్యద్వర్తమాస, బాంధవ్య, చతుర్వర్ణ, విప్రకీర్ణ, బ్రహ్మాది దేవతా, నవగ్రహ, దశావతార, ప్రశిద్ధరాజ, చతుర్దశలోకాల, వృక్ష, సింహాదిమృగ, పక్షి, జలజంతు ఇత్యాది సర్వహస్తములు గల హస్తాధ్యాయము సర్వము సంపూర్ణము.
చ తు ర్విం శ తి
-: శిరోభేదములు లక్షణములు :-
శ్లో: ధుత, విధుత, మాధూత, మనధూతంచ, కంపితమ్ !
అకంపితో, ద్వాహితేచ, పరివాహిత, కాంచితే !
నిహంచితం, పరావృత్తముత్క్షిప్త్కాధోముఖేతధా !
లోలితంచేతి విజ్ఞేయం చతుర్ధశవిధంశిరః !
తిర్యజ్ఞే తోన్నతం స్కంధానతమారాత్రికం సమం !
పార్శ్వాభిముఖమిథ్యన్యచ్చేదం పంచపారేజగుః !
సౌమ్యలాలోలితంచై వతిరిశ్చీనం ప్రకంపితమ్ !
సౌందర్యం పంచధాప్రోక్తం శిరసాం లక్షణం తధా !!
తా: 1 ధుతము, 2 విధుతము, 3 అధూతము, 4 ఆవధూతము, 5 కంపితము, 6 అకంపితము, 7 ఉద్వాహితము, 8 పరివాహితము, 9 అంచితము, 10 నిహంచితము, 11 పరావృత్తము, 12 ఉత్క్షిప్తము, 13 ఆథోముఖము, 14 లోలితము ఈ పదునాల్గున్నూ. 1 తిర్యజ్ఞతోన్నతము, 2 స్కంధానతము, 3 ఆరాత్రికము, 4 సమము, 5 పార్శ్వాభిముఖము ఈ ఐదున్నూ, 1 సౌమ్యము, 2 ఆలోలితము, 3 తిరిశ్చీనము, 4 ప్రకంపితము, 5 సౌందర్యము ఈ ఐదున్నూ కలిసి 24 శిరోభేదములు అయినవి.
1. ధుతశిరస్సు లక్షణము :
శ్లో: వామదక్షణ భాగేతు, చలితం తద్దుతం శిరః !!
తా: వామ, దక్షణ భాగములయందు శిరమును చలింపచేసినచో "ధుత" శిరస్సు వచ్చును. ఇది లేదుయను పచనమందును, మాటిమాటికి పార్శ్వములను చూచుటయందును, జనుల సమాధానము లేకపోటయందును, విస్మయమునందును, దుఃఖమునందు, అనిష్టమగు దానియందు ఈ శిరస్సును యింకా, వలదు అనుటయందు కూడా వినియోగించును.
2. విధుత శిరస్సు లక్షణము :
శ్లో: ధృత శిరస్సునకు, ధృతగతి కల్గినచో విధుత శిరస్సు వచ్చును. ఇది సీతబాధచే వీడింపబడువాని జూపుటయందును, జ్వరపీడితునియందును, సద్యఃపానము చేసినవానియందును ఈ విధుత శిరస్సు వినియోగించును.
3. అధూత శిరస్సు లక్షణము :
శ్లో: అధూతంతుసకృత్తిర్య, గూర్ధ్వనీతం శిరోమతం !!
తా: ఒకమారు వంచి ఊర్ధ్వముఖముగ త్రిప్పినచో, అధూత శిరస్సుయనబడును. ఇది గర్వముచేత తన శరీరమును తాను చూచుకొనుటయందును, పార్శ్వభాగములందుండు వస్తువులును ఊర్ధ్వముగ చూచుటయందును, నేను సమర్ధుడనెడు అభిమానమునందు ఈ అధూతశిరము వినియోగించును.
4. అవధూత శిరస్సు లక్షణము :
శ్లో: యదధసకృతానీత, మవధూతంతదుచ్యతే !!
తా: ఒకమారు అథోముఖముగ వంచబడిన శిరము "అవధూత" శిరమగును. ఇది కూర్చుండుటకు స్థానము చూపుటయందు, ప్రశ్నయందును, ఉపదేశమునందును, ఆలాపమునందును ఈ అవధూత శిరస్సు వినియోగించుచున్నది.


