ఆ సమయంలో డాక్టర్ నోటి వెంట అలాంటి మాట వినాల్సివస్తుందని వూహించలేదు అభినవ్.
"ఏమైందీ? కంగారుపడుతూ అడిగాడు అభినవ్.
"వ్యాధి ముదిరిపోకముందే మనం జాగ్రత్తపడాలి."
ఆ మాటతో బాంబు మీద పడ్డట్టయింది అతనికి.
"ఎప్పట్లోగా పంపించాల్సి వుంటుంది" అభినవ్ మనసు అకస్మాత్తుగా కకావికలమైపోయింది.
"పదిహేను రోజుల్లో పంపించగలరా?"
"ఎంత లేదన్నా పది లక్షలకు పైగా వుండాలనుకుంటాను" తనలో తను అనుకున్నట్టుగా అన్నాడు అభినవ్.
"చీనాంబరలాంటి ఆర్ట్ లవర్స్ నీ ఫ్రెండ్స్ అయినప్పుడు మనీ కోసం అంత వర్రీ అయిపోతావేంటోయ్?"
అభివన్ రియాక్షన్ కోసం చూస్తోంది చీనాంబర.
తెలియని నిస్సహాయస్థితి.....
చాలా సీరియస్ గా ఉంటేనే తప్ప ఆ సందర్భంలో, ఆ సమయంలో ఆ విషయం చెప్పాడు డాక్టర్.
"నందినికి క్యూర్" అయిపోతే, ఆ అమ్మాయికి పెళ్ళి చేసేస్తే, మీరు మీ ప్రొఫెషన్ మీద మరింత కాం సన్ ట్రేట్ చేయడానికి బావుంటుంది కదా?" సరైన టైమ్ లో ఒక బాణాన్ని వదిలింది చీనాంబర.
చీనంబర సలహాని పాజిటివ్ గానే తీసుకున్నాడు అభినవ్.
అవును బాగుంటుంది. ఏ వ్యాధీ లేకుండా నందిని హాయిగా నవ్వుతూ, బాధల్ని మరిచిపోయి ఇల్లంతా కలివిడిగా తిరిగితే..
అభినవ్ కళ్ళ ముందు పచ్చని తోరణం లాంటి మధుర భావన.
"నందిని బాగుపడడం నాకు ముఖ్యం డాక్టర్! మీరు ఫిక్స్ చేసిన టైమ్ కి నందినిని అమెరికా పంపించడానికి సిద్ధంగా వుంటాను" చాలా కాన్ఫిడెంట్ గా చెప్పి ముందుకు కదిలాడు అభినవ్.
"కాసేపు ఉండండి మిస్టర్ అభినవ్" చీనాంబర ఉయ్యాల్లోంచి లేచింది.
"నాకు పనుంది. నేను వెళతాను" పోర్టికోలోకొచ్చాడు అభినవ్. అదే సమయంలో అతనికెదురుగా వచ్చి నిల్చుంది చీనాంబర.
"సీ యూ ఎగైన్ చీనాంబర."
"హొటల్ రెసిడెన్సీలో వుంటున్నాను. రేపు సాయంత్రం మీ కోసం ఎదురు చూస్తుంటాను" అన్నదామె.
"డ్రైవర్ మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు" చెప్పాడు కుమరన్.
అభినవ్ ఎక్కిన కారు వెంటనే స్టార్టయింది.
"హి ఈజ్ టూ సెన్సిటివ్ కదా?" కుమరన్ కారు గేటు దాటాక అన్నాడు.
"ఆర్టిస్టు కదా?" అంతవరకే వూహించింది చీనాంబర.
చీనాంబర లాంటివాళ్ళు అంతవరకే వూహించగలరు...... కుమరన్ ద్వారా తను వేసిన ఎత్తు అభినవ్ ని మరో వైపు తిప్పుతుందని, ఆ మలుపు దగ్గర కావ్య వుందని చీనాంబరకు తెలీదు.
* * *
నిశ్చలమయిన నీళ్ళళో రాయిపడి అలలు, తమలో తాము ముడుచుకుని పోతున్నాట్లు అయిపోయింది అభినవ్ మనసు.
అందుకే సగంలోనే కారు దిగిపోయి రోడ్డు మీద నడవడం మొదలెట్టాడు. ఎంతదూరం నడిచాడో తెలీదు.
చేపాక్ సెంటర్ కొచ్చాడు. అక్కడికి కొంచెం దూరంలోనే వుంది సముద్రం.
వెళ్ళి ఇసక తిన్నెల మీద కూర్చున్నాడు.
నందినిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫారిన్ కు పంపించాలి. ఎంత డబ్బయినా ఫర్వాలేదు. ఇన్ టైమ్ లో తను సంపాదించాలి.
తప్పదు. రాజీపడక తప్పదు. కావ్య ప్రపోజల్ గుర్తుకొచ్చింది అతనికి.
ఒకసారి కమర్షియల్ ఊబిలోకి దిగితే, తన వ్యక్తిత్వం కాదు- తన ఆర్ట్ వ్యక్తిత్వం నాశనమై పోతుంది. అయినా సరే వేరే దారే లేదు తన చెల్లెల్ని రక్షించుకోటానికి.
ఆ మధ్య-
ఎమ్. ఎఫ్. హుసేన్ అమెరికాలోని ఒక హోటల్ ని తన పెయింటింగ్స్ తో అలంకరించడానికి పూనుకొన్నాడు. ఇండియన్ ఆర్ట్ ని విదేశీయులకు బానిసగా మారుస్తున్నాడని సీనియర్ ఆర్టిస్టులంతా హుసేన్ కు విరుద్ధంగా ప్రకటనలివ్వడం, ఆ ప్రకటనల్లో భాగంగా సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆర్టిస్టులతో పాటు తను కూడా హుసేన్ చర్యలకు వ్యతిరేకంగా సంతకం చేయడం గుర్తొచ్చింది. తను అలాంటి ఊబిలోనే చిక్కుకుంటున్నాడు!
విధి విలాసం......
రాత్రి పది గంటలు దాటింది.
చీకట్లో సముద్రం నల్లటి చీరలా మెరుస్తోంది. లేచి నడవటం మొదలెట్టాడు అభినవ్.
సరిగ్గా రెండున్నర గంటల తర్వాత-
వెల్లివాకం మెయిన్ రోడ్డులోకొచ్చాడు.
తను ఇంటికి వెళ్ళేసరికి అందరూ నిద్రపోతుంటారు. లిపి ఇంటికి వెళ్ళిపోయుంటుంది.
ఒంటరిగా నందిని వుంటుందని గుర్తుకు రావడంతో గబగబా అడుగులు వేస్తున్న అభినవ్ -
తన్నింట్లో లైట్లు వెలుగుతుండటం చూసి అడుగుల వేగం పెంచాడు.
అతని ఆలోచనలకు భిన్నంగా-
గుమ్మంలో కూర్చుని వుంది లిపి. అతని కోసం ఎదురుచూస్తున్నట్లుగా!
అభినవ్ ని చూడగానే లేహి నిలబడింది.
"ఏమైంది లిపీ? పడుకోలేదా?"
"లేదు. తొమ్మిదిన్నర ప్రాంతంలో గిలగిల కొట్టుకుంటూ పడిపోయింది. డాక్టర్ కుమరన్ కు ఫోన్ చేస్తే ఆయనొచ్చారు. ఇప్పటివరకూ వుండి వెళ్ళారు. రేపు మాణింగ్ హాస్పిటల్ కు తీసుకురమ్మన్నారు."
గబగబా లోపలికి పరుగెత్తాడు అతను- చెల్లెలి రూమ్ వైపు.
నిద్రపోతున్న నందిని వైపు తడి నిండిన కళ్ళతో చూసి వెనుదిరిగాడు.
పక్కనే నిల్చుంది లిపి.
"మీరు ఇంటికి వెళ్ళండి."
"లేదు. ప్రతి గంటకూ ఇంజక్షన్ చేయాలి" అంది లిపి బాధగా.
అలాగే కుర్చీలో కూర్చుండిపోయాడతను. ఆ రాత్రి లిపికి నిద్ర లేదు.


