"నా గురించి చెప్పాను కాను."
"ఏమిటది?"
"ఈ లోకంలో మీలాంటి అపురూపమైన అమ్మాయి వున్నప్పుడు ఎలా దూరంగా వుండగలగాలి?"
"అవునా?"
"అవునండీ!"
"జవాబు చెప్పమంటారా?"
"చెప్పండి."
"మా అమ్మదగ్గరకెళ్ళి అడగండి. మీకు సరైన సమాధానం లభిస్తుంది."
"అయ్యబాబోయ్. నాకు పెద్దవాళ్ళను చూస్తే కాళ్ళు గడగడలాడతాయి. నోట్లోంచి మాట పెగలదు. ఈ సమస్య వాళ్ళదాకా ఎందుకులెండి? మనం మనం పరిష్కరించుకుందాం."
"సారీ! నాకిలాంటివి గిట్టవు."
"అంతేనా?"
"అంతేమరి."
ఈలోపల బస్ వచ్చేసింది. కిరణ్మయి అతనివైపు చూడకుండా బస్ ఎక్కేసి లోపలకు వెళ్లి కూర్చుంది. అతనితో ధైర్యంగా మాట్లాడినందుకు ఆమె మనస్సు తేలిగ్గా వుంది.
* * *
ఆ రాత్రి పన్నెండు గంటలదాకా కిరణ్మయి బుక్స్ ముందేసుకొని చదువు కుంటూ కూర్చుంది. లెసన్స్ లో లీనమై చదువుతూ కూర్చుంటే ఆమెకు వొళ్ళు తెలీదు గంటలకి గంటలు గడిచిపోతాయి.
చదువులో ఆమె క్లాస్ ఫస్ట్. ఎలాగైనా స్టేట్ ర్యాంక్ సంపాదించాలి. తర్వాత అవకాశమొచ్చిన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషనూ రాసిపారెయ్యాలి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నీ మధించిపారెయ్యాలి.
మధ్యమధ్య ప్రొద్దుటి స్మఘటన గుర్తొస్తోంది. కొంతసేపటికి, ఆ పుస్తకాలు మూసేసి లైటార్పేసి తల్లిప్రక్కకి వెళ్లి పడుకొంది.
"నీ ఆవేదనా, పవిత్ర హృదయమూ నాకు తెలుసునమ్మా. ఎలాంటి పరిస్థితిలో కూడా ఏ పొరపాటూ జరగనియ్యనమ్మా!"
ఆమెమీద చెయ్యివేసి తృప్తిగా కళ్ళు మూసుకుంది.
రెండురోజులు గడిచిపోయాయి. కిరణ్మయికి ఆ యువకుడు తారసపడలేదు. ఆమె చాలా రిలీఫ్ గా ఫీలయింది.
ఆమె జీవితంలో కోరుకునేదదే. తన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులూ వుండకూడదు. తనకూ తల్లికి మధ్య ఎలాంటి అవాంఛనీయమైన అడ్డుతెరలూ రాకూడదు. తనవల్ల తల్లికి ఎలాంటి సమస్య తలెత్తకూడదు.
మూడోరోజు...
బస్ స్టాప్ దగ్గర నిలబడి వుంది. బుక్స్ చేతిలో పట్టుకుని పరధ్యానంగా ఏదో ఆలోచిస్తోంది.
"హలో" అని వినబడింది ప్రక్కనించి.
ఉలిక్కిపడి తలత్రిప్పి చూసింది.
అతను...
గుండె గబగబ కొట్టుకుంది. మళ్ళీ వెంటనే తల త్రిప్పేసుకుంది.
"సారీ! కోపమొచ్చిందా?"
ఆమె మాట్లాడలేదు.
"రాకుండా వుందామనుకున్నాను... కాని, వుండలేకపోయాను."
ఆమె కోపంగా అతనివైపు తిరిగింది. "చూడండి! అసలు మీరెవరో నాకు తెలీదు. మీ మనోభావాలతో నాకు పనేమిటి?"
"మీరన్నమాట నిజమే. కాని యిది మనస్సుకి సంబంధించైనా విషయమే మనం చెప్పినట్లు వినదే."
"వినకపోతే మీరూ మీ మనసూ చూసుకోండి. నాదాకా రానివ్వకండి."
"అంతేనంటారా?"
"అంతే మరి."
"నిజంగా..."
"ప్లీజ్ షటప్."
బస్ వస్తే అందులో ఎక్కి వెళ్లిపోయింది.
* * *
రాత్రి పదిగంటలు దాటింది. శాయికృష్ణ తనగదిలో కూర్చుని నిద్రరాకపోతే వీడియో వేసుకుని ఓ ఇంగ్లీషు థ్రిల్లర్ సినిమా చూస్తున్నాడు.
ఇంట్లో లోపలిగదుల్లో పార్టీ జరుగుతోంది. తండ్రి, అతని స్నేహితులూ, అందులో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళుకూడా వున్నారు. వాళ్ళు భర్తలతో వస్తారు, విడిగా వస్తారు. ఎలా పడితే అలా వస్తారు.
డ్రింక్స్, పేకాట, ఇంకేవేవో వెకిలిచేష్టలు.
తల్లి పోయినప్పట్నుంచీ యింట్లో పార్టీల గొడవ మరీ ఎక్కువైపోయింది. అంతేకాదు, వహ్చిన ఆడవాళ్ళు ఇంట్లో ఒక్కోసారి రాత్రంతా వుండిపోవటం, తండ్రికీ వారికీమధ్య చూడరాని దృశ్యాలు చూడటం సంభవించింది. అతని మనస్సు వికలమైపోయేది. ఒక్కోసారి యీ ఇంట్లోంచి పారిపోవాలనిపించేది.
తనకి యింట్లో పూర్తి స్వేచ్చా, స్వాతంత్ర్యాలున్నాయి. ఇంటికెప్పుడు వచ్చినా, ఎప్పుడు బయటకు వెళ్ళినా అడిగేవాడు లేడు. 'నేనిది చేస్తానూ' అలా ఎదురు చెప్పేవారు లేరు. కాని తన మనస్తత్వం ఆలోచనా దృక్పథం అలా తయారు కానివ్వటం లేదు. మరీ ఫాస్ట్ గా, విచ్చలవిడిగా తిరిగే తన స్నేహితులతోకూడా కలవలేకపోయేవాడు.
ఆ అమ్మాయి...
వంటరితనంతో, తోడెవరూ లేనట్లు, ఓ రకం మానసికజాడ్యంతో విలవిల్లాడుతూ గడిచిపోతున్న తన జీవితంలో ఆ అమ్మాయి సందర్శనంతో మృదుసుగంధం వీచినట్లయింది. మనసంతా పన్నీరొలికినట్లయింది.


