ఆ మాట నిజమే! తను ఆ ఫోటోల సంగతి త్వరగా తేల్చాలి. తీసినవాడు ప్రొఫెషనల్ బ్లాక్ మెయిలర్ అయితే మయూరి సంగతి తెలుసుకుని ప్రహ్లాద్ చేతుల్లోపెడతానని బెదిరించకమానడు.
ఆ సాయంత్రం మళ్ళీ ఆ ఫ్లాట్స్ కి వెళ్ళాడతను. లోపల లైట్ వెలుగుతోంది గానీ బయట లాక్ చేసి ఉంది. అంటే ఎవరో వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళారన్నమాట.
తను అక్కడే వెయిట్ చేస్తే ప్రయోజనం వుండవచ్చు.
రోడ్ మీద హోటల్లోకెళ్ళి కాఫీతాగి కాసేపు రోడ్ మీదే నిలబడి మళ్ళీ ఫ్లాట్స్ లోకొచ్చాడు. ఇప్పుడు తలుపు తెరచివుంది. లోపలికి అడుగుపెట్టాడు రమేష్. హాల్లో కూర్చునివున్నాడతను.
టేబుల్ మీద టెలిఫోన్. అతనిని చూస్తేనే అర్ధమైపోతోంది...... పెద్ద గూండా అని!
"రా! నీకోసమే చూస్తున్నా! లేకపోతే ఇందాకే వెళ్ళిపోయేవాడిని."
రమేష్ ఆశ్చర్యపోయాడు.
"ఇందాక నువ్ రావటం చూశాను. పోలీసుల్ని తీసుకొచ్చావేమో నని కాసేపు నిన్ను అబ్జర్వ్ చేశాను కూర్చోమాట్లాడదాం!"
రమేష్ కూర్చున్నాడు.
"నువొస్తావని మాఫోటో గ్రాఫర్ చెప్పాడు నువూ, మీ ఆఫీస్ లో పనిచేసేమయూరీ - మీ ఇద్దరూ మాంచిభంగిమలో ఉండగా మావాడు తీసిన ఫోటోలు చాలా బాగావచ్చినయ్ సాధారణంగా ఆ లైట్ లో అంత మంచి క్వాలిటీరావటం కష్టం! ఫోటోలు చూస్తావా?"
"అవును -"
అతను సొరుగులో నుంచి రెండు ఫోటోలు తీసి అతని ముందు పడేశాడు. రమేష్ చప్పున వాటిని అందుకునిచూశాడు.
చాలా గాఢమైన కౌగిలిలో ఉన్నారిద్దరూ-
"మా వాళ్ళు ఇవాళే మీ గురించి వివరాలు కనుక్కొచ్చారు. మీ ఫోటోలకు చాలామంచి డిమాండ్ ఉందనిపించింది. వీటిని మయోరి భర్తప్రహ్లాద్ కిస్తే- అతను మీ ఇద్దరినీ చంపేస్తాడు! పోనీ మీ ఆవిడకిస్తే ఆమె తను తెచ్చిన ఆస్తినంతా తీసుకుని పుట్టింటికెళ్ళిపోతుంది. దాంతో నువ్ వీధిన పడాల్సి వస్తుంది."
రమేష్ కి చెమటలు పట్టినయ్. చాలా భయంకరంగా ఇరుక్కుపోయాడతను. అయినా అతను తన లోపల ఫీలింగ్స్ ని బయటకు కనిపించనీలేదు.
"మర్యాదగా ఈ ఫోటోలూ, నెగటివ్ లూ రేపు ఉదయంలోగా మాఇంటికి పంపించు!
లేకపోతే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. ప్రహ్లాద్ అంటే నాకేం భయంలేదు. మా ఆవిడ కెలా నచ్చజెప్పుకోవాలో నాకు తెలుసు -"
అనేసి ఆ ఫోటోలు అతనిమీదకు విరిరేసి బయటకు నడిచాడు నిర్లక్ష్యంగా. ఒకోసారి ఇలాంటి బెదిరింపులు పనిచేస్తాయన్న విషయం తనకు తెలుసు.
"ఓ.కే. బ్రదర్! నీకెలాకావాలంటే అలాగే జరుగుతుంది! వెళ్ళు పోలీసుల దగ్గరకు-" హేళనగా అతననటం వినబడుతూనే వుంది.
ఆ రాత్రంతా ఆలోచనలతో నిద్రపట్టలేదు. తన బెదిరింపులు ఆ గూండా దగ్గర పనిచేయవని తనకు తెలుసు. తన సమస్యలన్నీ తొలగిపోవాలంటే తనకు మయూరి డక్కాలంటే ఒకే ఒక్క మార్గముంది.
ఆ ఫోటోలు కొనుక్కోవటం, ప్రహ్లాద్ కి డబ్బిచ్చి మయూరికి డైవర్స్ ఇప్పించటం.;
అందుకు సుమారు ఆరు లక్షలుకావాలి.
అంత డబ్బు తనకెక్కడిది?
బాంక్ బాలెన్స్ మహా అయితే ఓ లక్ష వుంటుంది.
అదిగాక తను ఉంటున్న ఫ్లాట్! కానీ ఆ ఫ్లాట్ తనదికాదు. తన భార్యది! ఆమె తండ్రి ఆమె పేరున కొనిచ్చాడు. అంత డబ్బు సంపాదించటం తనవల్లకాదు. తనకెవరు అప్పిచ్చేవాళ్ళుకూడా లేరు.
ఉదయం ఆఫీస్ కి చేరుకున్నాడు.
సరిగ్గా పదిగంటల కు ఫోన్ మోగింది.
"రమేష్ హియర్!"
"నమస్తే! తెల్లారిపదయిందికదా! ఇంతవరకూ నువ్ పోలీసుల దగ్గరకు పోలేదు. సంగతేమిటో కనుక్కుందామని ఫోన్ చేశాను" గొంతులో హేళన ధ్వనిస్తోంది.
"దటీజ్ నన్నాఫ్ యువర్ బిజినెస్"
"ఆ మాట నిజమే! ఆల్ రైట్! నువిచ్చినగడువు అయిపోయింది కాబట్టి నేను గడువిస్తానిప్పుడు! కాస్కో వారం రోజుల్లోగా మా ఆఫీస్ కి లక్షరూపాయలు పంపకపోతే ఫోటోలు ఎవరెవరికి అందుతాయో నువ్ చూద్దువుగాని."
ఫోన్ పెట్టేశాడతను. రమేష్ కి అర్ధమైంది. తన బెదిరింపులకువాడు భయపడటంలేదు. అంటే వాడికి పోలీసుల్లో ఇన్ ఫ్లుయెన్స్ వుండివుండాలి. ఇప్పుడేమిటి చేయటం?
"గుడ్ మార్నింగ్" మయూరిలోపలికొచ్చింది.
"గుడ్ మాణింగ్ మయూరీ!"
"ఏం జరిగింది? ఆ ఫోటోలవాడిదగ్గరకెళ్ళారా?"
"వెళ్ళాను! లక్షరూపాయలు ఇవాళ సాయంత్రం ఆరులోగా ఇవకపోతే మన ఫోటోలు ప్రహ్లాద్ కీ, మా ఆవిడకూ పంపుతాడట!"
ఎంత నార్మల్ గా మాట్లాడ్డానికి ప్రయత్నించినా గొంతులో టెన్షన్ కనబడుతోంది.
"మై గాడ్! ఇప్పుడెలా మరి?"
వాడిని నిజంగానే పోలీసులకు పట్టిద్దామనివుంది.
"నాకు తెలుసు! ఆ తెలివితక్కువ పని చేస్తారనే అనుకున్నాను. ఓ.కే. నేను వెళుతున్నాను"
వెనక్కు తిరిగి వెళ్ళిపోబోయింది.
"ఎక్కడికి?
"ముందే చెప్పాను......నా ప్రాణాలు నేను రక్షించుకోడానికి ఎక్కడికయినావెళ్ళిపోతాను"
రమేష్ చప్పున ఆమెకు అడ్డువచ్చాడు.
"ఓ.కే! లక్ష రూపాయలుయిచ్చి ఫోటోలు తీసుకుంటాను - సరేనా?"
"అంత డబ్బు ఆ ఫోటోలకోసం ఖర్చు చెయ్యటం అనవసరం! ఫోటోలు మనకు అందినా ఆ తరువాత వారంరోజుల్లో ప్రహ్లాద్ కి" అయిదు లక్షలు ఇవాలి! ఎక్కడి నుంచి వస్తాయవి?"
రమేష్ కుర్చీలో కూలబడ్డాడు నీరసంగా.
"మనం నూతన్ తో ఈ విషయం మాట్లాడటం మంచిది! నూతన్ మనకేమయినా సహాయం చేయగలడేమో!" అంది మయూరి.
రమేష్ ఆశ్చర్యంగా ఆమెవేపు చూశాడు.
"నూతన్ మనకేంసాయం చేస్తాడు?"
"ఏమో! మంచి తెలివిగలవాడు! మనకేమయినా ఉపాయం చెప్పగలడేమో! ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను" అంటూ ఫోన్ డయల్ చేసింది.
కొద్దిసేపు నూతన్ తో మాట్లాడాక ఫోన్ డిస్కనెక్ట్ చేసింది.
"కాసేపట్లో నూతన్ ఇక్కడికొస్తున్నాడు! తప్పకుండా మన మీ మెస్ నుంచి బయటపడే మార్గం చెప్తాడు" అందామె.
రమేష్ అయోమయంగా చూశాడు. నూతన్ ఏ విధంగా పరిష్కరించగలడో తెలీటంలేదు. మరో గంటలో వచ్చాడు నూతన్.
"మీరు నాకు ఉద్యోగం ఇప్పించి ఎంతో సహాయం చేశారు రమేష్ గారూ! ఈ పరిస్థితిలోమీకు సహాయం చేయటం నా బాధ్యత అనుకుంటాను"
"కానీ నువ్ మాత్రం ఏం చేయగలవ్?"


