ఏలక వాసన గుండెలకు తగులుతోంది. పూర్వం స్త్రీలకు, పురుషులకు వేర్వేరు తాంబూలాలు వుండేవట. తాంబూలం వాసన పట్టి దూరాన వున్నది పురుషుడో, స్త్రీనో కనిపెట్టే వారట. మనుచరిత్రలో దారితప్పిన ప్రవరాఖ్యుడు వరూధిని అక్కడ వుందని అలాంటి తాంబూలం వాసన తోనే పసికట్టాడట. మరి ఈరోజు ఇవన్నీ పోయాయి. గుట్కాలు వచ్చి నోటిని, ఒంటిని గబ్బు చేస్తున్నాయేతప్ప సుగంధాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వడంలేదు.
ఆమె తాంబూలాన్ని ఎంజాయ్ చేస్తూ ఇంటికి చేరుకుంది. మరో పది నిమిషాలకి చిట్టి వచ్చాడు.
"శివాలయం పక్కన వున్న మామిడితోపులో పడుకున్నాడు" అని వివరంగా చెప్పాడు.
"నువ్వు పడుకో -నేను రావడం ఆలస్యం కావచ్చు" అని చెప్పి బయల్దేరింది.
ఊరు దాటుకున్నాక చిన్న పంటకాలవ వుంది. అందులో చంద్రుడు నవ్వుతూ కనిపిస్తున్నాడు. ఆ నవ్వుని చెరపడం ఇష్టంలేక మెల్లగా అడుగుపెట్టింది. దానికే నీళ్ళన్నీ వంకీలు తిరిగినట్టు కదిలాయి.
కాలవ దాటి శివాలయం చుట్టూ వున్న ముళ్ళకంచె దాటి లోపలికి ప్రవేశించింది.
శివాలయం నిశ్శబ్దంగా పద్మాసనం వేసుకు కూర్చున్నట్టుంది. ముందున్న నంది విగ్రహం వెన్నెల్లో అరవడం మరిచిపోయిన ఎద్దులా కనపడుతోంది.
ఇంకాస్త లోపలికి వెళితే ఓ రెండు మామిడిచెట్లుంటాయి. ఒక దానికి ధర్మకర్తలు సిమెంట్ చప్టా కట్టించారు. దానిమీద పడుకున్న వాసూ ఎవరో వచ్చినట్టు పసికట్టి "ఎవరూ?" అంటూ పలకరించాడు.
"నేను చంద్రరేఖని"
అతను దిగ్గున లేచి కూర్చున్నాడు.
అంత రాత్రివేళ అక్కడ తనను చూసి అతను మాట్లాడలేకపోతున్నాడని గ్రహించి "నీ కోసమే వెదుక్కుంటూ వచ్చాను" అని చప్టా ఓ కొసన కూర్చుంది.
"నా కోసమా!" అతను ఆశ్చర్యపోయాడు.
"ఆఁ - అయినా భార్య వుండగా బ్రహ్మచారిలా ఈ బండరాళ్ళ మీద పడుకోవడమేమిటి? ఈపాటికి ఎంచక్కా బెడ్ రూమ్ లో భార్య ముఖంలో సంతృప్తి మెరిసినట్టు బెడ్ లైట్ వెలుగు ఆమె జుమికీల్లో ప్రతిఫలిస్తుండగా చూడాల్సింది పోయి ఇలా గుళ్ళల్లో, గోపురాల్లో కాపురం చేయడమేమిటి ఖర్మ"
అతను మౌనంగా వుండిపోయాడు. సిగ్గు సగం మగతనాన్ని చంపేస్తుండగా ముఖం దించుకున్నాడు.
"నీ భార్య శశి - పెద్దింటిపిల్ల నీ మూలాన మతిచెడి ఎలా అయిపోయిందో తెలుసా?" అని ప్రారంభించి ఇప్పటివరకు జరిగిన సంఘటనలన్నీ చెప్పింది.
చివరికి "నీకేంటి మగవాడివి. నీకున్న కోరిక గురించో, లేకుంటే నీ మనసులోని ఇష్టాల గురించో ఎక్కడైనా చెప్పుకోగలవ్. కానీ ఆడది అలా చెప్పే వీలుందా? లేదు కాబట్టే స్త్రీలు ఇలాంటి బాధ లొచ్చినప్పుడు తమలో తామే కుమిలిపోయి పిచ్చివాళ్ళు అయిపోతున్నారు.
నీకొచ్చిన సమస్య నాకు తెలుసు. కానీ అది నువ్వనుకునేంత జటిలమైన సమస్య కాదు. దాన్ని సులభంగా పరిష్కరించుకోవచ్చు.
అయితే నువ్వు చేయాల్సిందల్లా ప్రతీదీ తొందర తొందరగా కానిచ్చేయాలన్న బలహీనత ఎలా వచ్చిందో చెప్పాలి. అది తెలిసిపోయిందనుకో నిన్ను తిరిగి మామూలుగా చేయవచ్చు. క్షణాలమీద పని. ఆ రిస్కు నాకు వదిలెయ్. నిన్ను నీ భార్య దగ్గర సెహభాష్ అనిపించే బాధ్యత నాది" అంది.
అతనిలో చిన్న ఆశ కదలాడింది.
"పుట్టినప్పట్నుంచీ నువ్వు తొందరమనిషై వుండవు. చిన్నదో, పెద్దదో....ఏదో ఒక సంఘటన నిన్ను అలా తయారుచేసి వుంటుంది అవునా?"
అవునన్నట్టు తల ఊపాడు అతను.
"అదేమిటో చెప్పు"
అతను మౌనం వీడలేదు.
"ముందు మనం మనల్ని బద్దలుకొట్టుకోగలగాలి. మనమీద అమితమైన ప్రభావం చూపిన సంఘటన విశ్లేషించుకోగలగాలి. ఆ తరువాత దానికి విరుగుడేమిటో ఆలోచించాలి. శారీరక జబ్బుల్నే మనం దేవుడి శాపమనో, దెయ్యం పని అనో భావించి తాయెత్తులు కట్టుకుంటున్నాం. ఇక మానసిక జబ్బుల గురించి చెప్పనక్కర్లేదు. మానసిక రుగ్మతల్ని జబ్బుల కింద గుర్తించే స్థాయికి మనం ఎదగలేదు. ఇదంతా చేతబడో, దెయ్యం పట్టిందనో అనుకుంటున్నాం.


