"వుండుండు భీంసెయిన్! చెప్పడం మర్చిపోయా. నువ్వు చేసే పప్పులో ఇంకో దినుసు కూడా కలపాలి!" అని అతని వెనకే వెళ్ళబోయాడు రాజా.
అతనికి అడ్డంగా నిలబడింది అయేషా.
"ఇలాంటి చమత్కారాలతో నన్ను మరిపించి మీరెళ్ళిపోతారు" అంది సీరియస్ గా.
సరిగ్గా అదే క్షణంలో.
సామంత్ అక్కడికి వచ్చాడు.
అతను పాపం చాలా కన్ ఫ్యుజన్ లో ఉన్నట్టున్నాడు. ఆ కన్ ఫ్యుజన్ అంతా అతను బట్టలు వేసుకున్న పద్దతిలోనే కనబడుపోతోంది. ఖరీదైన షర్ట్ వేసుకుని వున్నడతను. దానిమీద బనీను వేసుకున్నాడు. కింద పైజమా వుంది. కుడికాలికి నార్త్ స్టార్ షూ ఎడంకాలికి హవాయ్ చెప్పు వుంది. రెండు పాదాలకీ రెండు రంగుల సాక్స్ వున్నాయి.
నవ్వాపుకుంటూ అడిగింది అయేషా.
"వాట్ మిస్టర్ సామంత్! ఏదో గొప్ప కన్ ఫ్యూజన్ తో వున్నట్టున్నావ్!
"నిజమే! చాలా గొప్ప కన్ ఫ్యూజన్ తో వున్నాను" అన్నాడు సామంత్.
"ఏమిటది?" అంది అయేషా కుతూహలంగా.
"జఫిమాఏమేజూజూ అసె అనడి" అన్నాడు సామంత్ అయోమయంగా.
"అంటే ఏమిటి?" అంది అయేషా.
"అదే నేను అడుగుతున్నది" అన్నాడు సామంత్.
"అసలీ మాటని ఎక్కడనుంచి కొట్టుకొచ్చావు!" అంది అయేషా.
"అలా అనే ఎర్రటి అక్షరాలతో మన బట్లర్ యంగ్ హజ్బెండ్ గది గోడ మీద రాసి వుంది" అన్నాడు మళ్ళీ.
"జ.......ఫి.......మా.....ఏ.....మే.....జూ.......జూ....ఆ.......సే......ఆ.......న.....డి" అన్నాడు సామంత్ అదేదో మళయాళ మంత్రాన్ని జపిస్తున్నట్లుగా.
"జఫిమాఏమేజూజూ అసెఅనడి" అంటే ఏమిటి!" నిజంగానే ఇది చాలా చిత్రంగానే వుందే" అంది అయేషా.
"అది నాకూ అంతుపట్టలేదు."
"యంగ్ హజ్బెండ్ నే అడక్కపోయావా!" అంది అయేషా.
"నాకూ తెలీదు మేడమ్!" అన్నాడు చాపకిందికి నీరు వచ్చినట్లు అక్కడికి వచ్చేసిన బట్లర్ యంగ్ హజ్బెండ్ అయోమయంగా. తన బుర్ర గోక్కోబోయి యంగ్ హజ్బెండ్ బుర్రని గోకాడు సామంత్.
అందరూ పెద్దగా నవ్వేశారు.
ఇంక అంతమందిలో "ప్రైవైట్ టాక్స్" కుదరదని గ్రహించిన అయేషా మెల్లగా అక్కడినుండి వెళ్ళిపోయింది.
అదే టైం లో పెద్దగా గాలి వీచి రాజా క్రాపు చెదిరిపోయి జుట్టు మొహంమీద పడింది.
తక్షణం డ్యూటీలోకి దిగిపోతూ తన కోటు జేబులోంచి ఓ దువ్వెన తీసి భక్తిగా రాజా తల దువ్వబోయాడు బట్లర్ యంగ్ హజ్బెండ్.
తక్షణం రెండు అడుగులు వెనక్కి వేశాడు రాజా.
"నో! అన్నాడు గట్టిగా. మళ్ళీ దానికే ఇంకాస్త ఫోర్స్ జోడిస్తూ "న్నో! నెవర్! ఎవర్!" అన్నాడు తర్జనితో యంగ్ హజ్బెండ్ ని బెదిరిస్తూ.
సేవాభాగ్యం తప్పిపోయినందుకు నిరాశగా చూసాడు యంగ్ హజ్బెండ్.
* * *
తను రాజా దగ్గర కొలవులో చేరుతున్న సంగతి తన తల్లికి చెప్పాలని చాలా గట్టిగా అనిపిస్తోంది మీనాక్షికి.
కనీ తన తల్లి వసుధ ఈ మధ్య అసలు ఈ లోకంలోని మనిషిలా ప్రవర్తించడంలేదు. ఎప్పుడూ మగత నిద్రలోనే వుంటోంది ఆమె. మెలకువ వచ్చిందంటే చాలు జరిగిపోయినది ఏదో తలచుకుని కుమిలిపోతున్నట్లు వుంటోంది.
డాక్టర్ లతా, అలోక్ వాళ్ళ బంధువుల ఇంట్లో పెళ్ళి వుందని వెళ్ళారు.
అందుకని,
దేవుడికి దణ్ణం పెట్టుకుని, మంచం మీద పడుకుని, వున్న తల్లి పాదాలకి నమస్కరించి , పాలెస్ కి బయలుదేరింది మీనాక్షి.
పాలెస్ లో కనుక తన ఉద్యోగం నిజంగానే సాగేటట్లు వుంటే అప్పుడిక తల్లి సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు ఏమైనా చెయ్యవలసి వస్తుంది తను. అలా అనుకుంటూ ఆమె పాలెస్ ని సమీపించి అటో దిగగానే .
రాష్ గా ఒక కారు వచ్చి పక్కనే ఆగింది.
అప్పటికే ఒక తలుపు తెరచి వుంది దానికి. అందులో నుంచి బలిష్టమైన ఒక చెయ్యి వచ్చి మీనాక్షి నడుం చుట్టూ బిగిసింది. మరుక్షణం కార్లో లాగేసుకోబడింది మీనాక్షి. కారు కదిలిపోయింది. క్షణంలో జరిగిపోయింది ఇదంతా!
కార్లో వెనక సీట్లో ఒక ఫారినర్ వున్నాడు.
"ఎవరు నువ్వు!" అంది మీనాక్షి కోపంగా.
"నా పేరు క్లయివు ! క్లయివ్ స్పెన్సర్! అన్నాడతను.
ఆమె ఆ షాక్ లో నుంచి తేరుకునేలోగానే మెరుపు వేగంతో ఒక ప్లాస్టిక్ తాడు తీసి ఆమె చేతులు కట్టేశాడు క్లయివు. స్కాచ్ టేపు తీసి ఆమె నోటికి పట్టిలా అడ్డంగా అతికించేశాడు. ఆమె కళ్ళ మీద కాస్త కాటన్ పెట్టి దానిపైన ఒక గుడ్డ కట్టేశాడు
అతని అపారమైన బలం ముందు ఆమె పెనుగులాటకి అర్ధం లేకుండా పోయింది. ఈ ఫారినర్ తనని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నాడో, ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో అర్ధం కాలేదు మీనాక్షికి. అరవడానికి లేదు. కళ్ళు కనబడడం లేదు. చేతులు కట్టేసి వున్నాయి.
ఎందుకు! ఎందుకు కిడ్నాప్ చేస్తున్నాడు తనని!
ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ ఆడపిల్లని కిడ్నాప్ చేసినా కూడా దానికి మొదటగా స్పురించే కారణం ఒక్కటే!
ఆడదాని ఒళ్ళు!
అందంగా వుండడం, అబలగా వుండడం ఈ రెండూ ప్రకృతి ఆడదానికి ఏర్పరచిన బలహీనతలు.
ఈ క్లయివు తనని ఏం చేస్తాడు?
విలాసాలకోసం తీసుకెళ్తున్నాడా! లేక ఎవరికైనా అమ్మేస్తాడా?
ఆ రెండు కాక ఇంకేదయినా కారణం వుందా!
తను పెనుగులాడి లాభం లేదు.
మరి ఇప్పుడు తనకి తక్షణ కర్తవ్యం ఏమిటి!
మరుక్షణంలోనే ఆమెకి స్పురించింది అలాంటి పరిస్థితుల్లో తను ఏం చేయాలో!
వెంటనే
కదలకుండా, మెదలకుండా నిశ్చలంగా కూర్చుండిపోయాడు మీనాక్షి.
హటాత్తుగా ఆమెలో వచ్చిన ఆ మార్పుని తక్షణం గమనించాడు క్లయివు.
గమనించి అదోరకంగా నవ్వాడు.
"దట్స్ మై గర్ల్! అల్లరి చేసే ప్రయత్నం మానేసి అలా బుద్దిగా కూచుంటే నీకే మంచిదని గ్రహించావన్నమాట! గుడ్ గుడ్!" అన్నాడు.
మాట్లాడలేదు మీనాక్షి.
"నువ్వు చాలా బాగుంటావని నీకు తెలుసా!" అన్నాడు క్లయివు.
తనకి వినబడనట్లు అలాగే వుండిపోయింది మీనాక్షి.
క్లయివు మాత్రం ఏదేదో మాట్లాడుతూనే వున్నాడు.
అతనేం వాగుతున్నా పట్టించుకోకుండా శిలా విగ్రహంలా వుండిపోయింది మీనాక్షి.
ఆమె పద్దతి చూస్తుంటే సన్నటి భయంలాంటిది కలిగింది క్లయివుకి. భయం కాదు. భయంలాంటిది!
ఎందుకని........
ఎందుకని అంటే
అతనిలో ఓ ప్రత్యేకత వుంది.
అతను ఎదుటివాడు శారీరక బలానికి భయపడదు!
హింసకి ఎప్పుడూ వెరవడు అతను. అతనికి వయోలెన్స్ ఏ మాత్రం కొత్తకాదు.
కానీ అతను జంకేది ఒక్క విషయానికే.
ఎదుటివాళ్ళు తమ బుద్దిబలంతో తనని డామినేట్ చేస్తారేమో అన్న భయం వుంది తనకి. కండబలం కంటే కూడా ఎదుటి వాళ్ళలో ఉన్నదేమో అనిపించే మేధ అతనికి ఒక విధమైన అనీజీ ఫీలింగ్ ని కలుగ చేస్తుంది.
ఇప్పుడే మీనాక్షి మౌనవ్రతం పట్టినట్లు అస్సలు పెనుగులాడటం లేదు. కనీసం అసహ్యాన్ని ప్రదర్శించడం కూడా లేదు.
డీప్ ట్రాన్స్ లో వున్నట్లు కూర్చుని వుంది తను.
"హె గర్ల్! వాట్ ఆర్ యూ అప్ టూ!" అన్నాడు క్లయివు ఇబ్బందిగా.
మౌనమే తన భాష అన్నట్లు కూర్చునే వుంది ఇబ్బందిగా.
నిజానికి అ టైం లో ఆమె ఏమి చేస్తున్నదో చెప్పినా కూడా క్లయివు నమ్మి వుండేవాడు కాదు.
ఆరొందల ఒకటి , రెండు .........మూడు......నాలుగు...అయిదు.....ఆరు.....ఏడు ......ఆరొందల అరవై.......డెబ్బయ్......తొంబై..........ఏడువందలు.......


