రోజులు గడుస్తున్నాయి. ఆమె వచ్చి సంవత్సరం పైగానే అయింది.
జొన్నకండెలా వుండే అమ్మాయి పెద్ద కంకిలా సన్నగా అయిపోవడం ప్రారంభించింది.
సడెన్ గా తన చెల్లెలు అలా ఎందుకు తగ్గిపోతుందో వుందో అర్ధం కావడం లేదు అక్కకి.
"ఏమిటే ప్రియంవదా! అలా అయిపోతున్నావ్? ఒంట్లో బాగాలేదా? ఏదయినా నలతగా వుంటే చెప్పు. డాక్టర్ దగ్గరికి వెళదాం" అక్క ఆప్యాయంగా దగ్గర కూర్చుని అడిగింది.
ఆమె ఏమీ లేదన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది తప్ప తన సమస్య చెప్పదు.
గత నెలలో ఆమెకి పీరియడ్స్ రాలేదన్న విషయం గుర్తుంది అక్కకి. ఈ నెలలో అయినా అవుతుంది లెమ్మని ఊరుకుంది తప్ప చెల్లెల్ని ఏమీ అడగలేదు ఆ నెలా రాలేదు. ఏదో అనుమానం పీకింది.
చెల్లెల్ని దగ్గర పెట్టుకుని కారణం ఏమిటో అడిగింది. మవునంగా వుండిపోయిన ఆమెని గద్దించింది. భయపెట్టింది. బుజ్జగించింది.
చివరికి ప్రియంవద నోరు తెరిచింది.
"గత రెండు నెలలుగా పీరియడ్స్ రావడం లేదక్కా" అంటూ చెప్పి ఏడుపు అందుకుంది.
నవనాడులూ కుంగిపోయాయి అక్కకి. కళ్ళు బైర్లు కమ్మాయి చాలా సేపటివరకు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయింది.
హడావుడిగా బయల్దేరి టౌన్ లోని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది. డాక్టర్ అన్ని పరీక్షలూ చేసి గర్భవతి అని తేల్చి చెప్పింది.
చెల్లెలి కంటే ఎక్కువగా డాక్టర్ దగ్గరే ఏడ్చేసింది అక్క చెల్లెల్ని తీసుకుని ఇంటికి వచ్చింది.
దీనికి కారణం ఎవరో చెప్పమని ఎంత అడిగినా ప్రియంవద చెప్పడం లేదు. బెదిరించినా లాభం లేకపోయింది. బుజ్జగించినా ఫలితం లేకపోయింది. ఏడుపులూ, కేకలూ విని పక్కింటివాళ్ళు వచ్చారు. వాళ్ళూ దగ్గర బంధువులే గనుక తమకు వచ్చిన కష్టం గురించి చెప్పుకుంది అక్క.
అప్పటికి సాయంకాలం ఆరుగంటలయింది. శీతాకాలం కావడంతో చీకట్లు ముసురుకుంటున్నాయి.
అందరూ దొడ్లో చేరారు.
అంతలో కాశీపతి కూడా మిల్లునుంచి వచ్చాడు. తమ ఇంటి దొడ్లో పక్కింటి వాళ్ళు వుండడం, అందరి ముఖాల్లోనూ బాధ కదులుతుండడంతో ఏం జరిగిందోనని కంగారుగా లోపలికి వచ్చాడు.
"ఏం జరిగింది?" అడిగాడు కాశీపతి.
అత్త వరసయ్యే ఆమె సన్నటి ఎక్కిళ్ళ మధ్య విషయం చెప్పింది.
అగ్గుల్ని తొక్కినట్లయిపోయాడు కాశీపతి.
"ఎవడు వాడు? నా మరదల్ని నలుగురి ముందూ నిలబెట్టిన ఆ నీచుడెవడు? వాడెవడో కనుక్కోండి నరికి నలగంగమ్మకు ప్రసాదంగా పెట్టేస్తాను" అంటూ ఎంతో ఆవేశంగా ఊగిపోయాడు.
"వాడెవడో ఎంత అడిగినా చెప్పడంలేదు నాయనా! నువ్వడిగితే అయినా చెబుతుందేమో - కనుక్కో"
మరదలు వైపు తిరిగి "చెప్పు..... నిన్ను మోసం చేసిన దుర్మార్గుడెవరో చెప్పు వాడ్ని చంపి పేగులు మెళ్ళో వేసుకుని నరసింహస్వామిలాగా వీధుల్లో తిరుగుతాను" అని సోర్స్ గా ముందుకెళ్ళి ప్రియంవద ముందు నిటారుగా నిలబడ్డాడు.
ఆమె ఏడుస్తోందే తప్ప నోరు విప్పలేదు. కాశీపతి ఉగ్రుడైపోయాడు తన మరదల్ని గర్భవతిగా చేసినవాడ్ని బూతులు తిడుతున్నాడు.
కోపంతో చిందులు తొక్కుతున్నాడు.
ఏడుగంటలయింది. చీకటి మరింతగా చుట్టూ అల్లుకుంటోంది. అక్కకి అసహనం ఎక్కువైంది.
"ఇదిగో చివరిసారి అడుగుతున్నాను వాడెవడో చెప్పు- లేదంటే ఇలానే ఇంట్లోకి వెళ్ళి కిరసనాయిల్ పోసుకుని నిప్పంటేసుకుంటాను" అని ఎంత వేగంగా అందో,అంతే వేగంతో పైకి లేచింది.
దాంతో ప్రియంవద భయపడిపోయింది.
"అలా భయంతో అల్లల్లాడిపోవద్దు. వాడెవడో చెప్పు వాడికి ఈ భూమ్మీద నూకలు చెల్లిపోయాయి గనుకే వాడికి ఈ దుర్భుద్ది పుట్టింది. ఈరోజు వాడి రక్తం కళ్ళజూస్తాను" కాశీపతి బుసకొడుతున్నా, ఎవరూ అతనివైపు చూడడం లేదు. ప్రియంవద ఏం చెబుతుందోనని ఆసక్తిగా చూస్తున్నారు.
ఆమె మెల్లగా నోరు విప్పి బావ అంది.
అప్పుడు పిడుగులే కురిశాయో, అగ్గులే వర్షించాయో తెలియదు గానీ అందరూ శిలాప్రతిమల్లా బిగుసుకుపోయారు.
"ఎవరూ!" అక్క మరోసారి వినడానికని అడిగింది.
"బావే" ఆ రెండు అక్షరాలూ పలికి ఏడుస్తోంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ తన పేరు చెప్పదని ధీమాగా వున్న కాశీపతి కుదేలైపోయాడు. తేలుకుట్టిన దొంగలా అక్కడి నుంచి మెల్లగా జారుకోబోయాడు.
అప్పుడు లేచింది ఆమె. సివంగిలా దూకి అతని కడుపుమీద బలంగా తన్నింది.
భార్య తన్నడంతో కాశీపతి సిగ్గుతో చచ్చిపోయాడు. ఏడ్వాలో, తిరిగి భార్యను కొట్టాలో, తను కాదని దబాయించాలో తెలియని అయోమయ స్థితిలో అలాగే వుండిపోయాడు.
అప్పటికీ ఆమె ఆవేశం చల్లారలేదు. అతని చొక్కా ముందు భాగాన్ని ఒడిసి పట్టుకుని, "ఇప్పుడు తన్నింది మా చెల్లెల్ని చెరిచినందుకు కాదు - అదిగో ఏమీ తెలియని అమాయకుడిలా నటించావే - అందుకు నిన్ను తన్నింది. కడుపు చేసి మగవాడు అనిపించుకునే ముందు కడుపులో కల్మషం లేకుండా ప్రవర్తించి మనిషి అనిపించుకో" అని నోట్లోని చెమ్మనంతా నాలుకమీదకు తెచ్చుకుని ఉమ్మింది.
సుజన మధ్యలో అడ్డు తగిలి "చాలా మంచి పనిచేసింది" అంది.
"మగవాళ్ళు ఎలా వుంటారో అన్నదాన్ని చెప్పడానికే ఈ సంఘటన గురించి వివరించాను. రాజేష్ - వాడు నా భర్త. కాశీపతి వాడికంటే ఎన్నోరెట్లు మేలు అంతా - తొలినుంచీ, నా ఫస్ట్ నైట్ వరకూ చెప్తాను" అంటూ తిరిగి చెప్పడం ప్రారంభించింది వైదేహి.
"అమ్మా నాన్నకు నేను ఒక్కదాన్నే సంతానం. నాకు పదేళ్ళు వచ్చేటప్పటికి అమ్మ క్యాన్సర్ తో చనిపోయింది. నేనూ, నాన్న మిగిలాము.
ఈ షాక్ నాకంటే మా నాన్నను ఎక్కువగా కుంగదీసింది. మేం వంటరి వాళ్ళం అయిపోయినట్లుగా భావించేవాడు. దాంతో చుట్టాల మీద మమకారం ఎక్కువయింది.
మా అమ్మ చనిపోయిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళింటికి మకాం మార్చేశాం.
ఆ యింట్లో మా పెద్దమ్మా, పెదనాన్నలతో పాటు, వాళ్ళ కూతురూ కొడుకూ వుండేవాళ్ళు.


