"ఏమిటీ వాగుతున్నావ్! నేను నీ తముడ్ని చంపానా?" చివ్వున లేచి నిల్చున్నాడు శంకర్రావ్.
"శంకర్రావ్ కూర్చో! రంకెలెయ్యకు, నువ్వే చంపావ్. ఆ సంగతి నాకూ తెలుసు. అందుకే నిన్ను అరెస్టు చేశాను" గద్దిస్తూ అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
ఇన్స్ స్పెక్టర్. మీరు పొరపాటు పడ్తున్నారు. నేను ఎవర్నీ హత్య చెయ్యలేదు" అన్నాడు శంక్రరావు.
"ఆ సంగతి చెప్పాల్సింది నువ్వుకాదు. నోరు మూసుకొని కూర్చో!" ఆజ్ఞాపిస్తున్నట్టు అన్నాడు అద్వయితం.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాయింట్స్ నోట్ చేసుకుంటూ శ్రద్దగా వింటున్నాడు.
"పైడయ్యా! ఆ రోజురాత్రి మీ అయ్యగారిని హత్య చెయ్యమని ఎవరో వచ్చారనీ, అతడి చేతికి ఆరేళ్ళు ఉన్నాయనీ చెప్పావ్. నువ్వెళ్ళేసరికి అతడు గేటు దూకినాడన్నావ్. మరి అతడి చేతికి ఎన్ని వెళ్ళు ఉన్నాయో ఎలా చూశావ్- ఆ చీకట్లో?"
పైడయ్య గజగజ వణికిపోతూ రమణరావు కేసి చూశాడు.
"అతడ్నేం చూస్తావులే. నిజం చెప్పు, నీకేం భయంలేదు."
"ఆ...ఆరోజు అయ్యగార్ని చంపడానికి ఎవరూ రాలేదు."
"ఆ కిటికీ అద్దాలు ఎవరు పగలగొట్టారు?" నువ్వేనా?"
"అవును బాబూ! మా అయ్యగారే అలా చెయ్యమన్నారు"
"ఆ తర్వాత ఏం జరిగింది?"
"నన్ను కేకలువేస్తూ గేటు కేసి పరుగుతియ్యమన్నారు. ఆయన కూడా కేకలు వేశాడు. మా కేకలు విని చిన్నబాబుగారు లేచి వచ్చారు."
"మీ చిన్నబాబుగారు ఎలాంటి వారు?"
"చాలా మంచివారు బాబయ్యా, ఆయన నిజంగానే ఎవడో వచ్చాడని నమ్మారు."
"ఇంకా?"
ఆ తర్వాత చిన్న బాబుగారు తమ గదిలోకి వెళ్ళిపోయారండి. పోలీసు వాళ్ళు వచ్చి అడిగితే నన్ను అలాగే చెప్పమన్నరండి. నేను తప్పు చేశాను బాబూ, బీదవాడ్ని రక్షించండి.
"అది సరే! ఆ వస్తువులన్నీ నీ పెట్టెలోకి ఎలా వచ్చాయ్?"
"బాబుగారే నా పెట్టెలో పెట్టమన్నారండి. నిన్న రాత్రి ఆ పెట్టె తీసుకెళ్ళి హుసేన్ సాగర్ లో పారెయ్యమన్నారండి. రాత్రంతా నేను జ్వరంతో కదలలేకపోయాను. ఇవ్వాళ రాత్రికి పడేస్తానన్నానండి" అన్నాడు పైడయ్య.
పోయిన శనివారం కాక ఆ ముందు శనివారం మీ అయ్యగారు ఇంటికి ఎన్ని గంటలకు వచ్చారు?"
"ఆ రోజంతా ఎక్కడికీ పోలేదండి...." అంటూ రమణరావు కేసి చూశాడు.
"అవును శూల నొప్పి వచ్చిందన్నావు గదూ?"
"అవునండీ"
"ఇన్స్ స్పెక్టర్ ఆ లాఠీతో నాలుగు తగిలించు."
ఇన్స్ స్పెక్టర్ ఒక్క దూకులో పైడయ్య ముందుకు వచ్చి లాఠీ ఎత్తాడు.
ఎత్తిన లాఠీని నరేంద్ర పట్టుకొని పైడయ్యను చూశాడు.
"చెప్తాబాబు! నన్ను కొట్టకండి."
"అలారా దారికి" అంటూ ఇన్స్ స్పెక్టర్ వెనక్కు వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు.
"చెప్పు! ఎన్నిగంటలకు వచ్చాడు."
"రెండు దాటి పోయిందండి?"
"నీకెలా తెలుసు?"
"నేనేగదండీ గేటు తెరిచాను?"
"అంతకు ముందే ఆఫీసు గదిలో గడియారం రెండు కొట్టింది."
"అప్పుడు ఆయన ఎలా ఉన్నారు?"
"చాలా గాభరాగా ఉన్నారయ్యా. అయ్యగారి వెనకే ఇంట్లోకి వెళ్ళబోయాను. నువ్వెళ్ళి పడుకో అని తలుపు వేసేసుకొన్నారు. పోలీసు వాళ్ళు అడగరు, ఒకవేళ అడిగితే ఆ రాత్రంతా తనకు శూలనొప్పి వచ్చిందని చెప్పమన్నాడు. అందుకే అలా చెప్పాను. తప్పయి పోయింది దొరా."
నరేంద్ర వచ్చి తన కుర్చీలో కూర్చుని సిగరెట్ వెలిగించుకొన్నారు.
"రమణరావ్! ఇప్పుడైనా రాధారాణిని రేప్ చేసి, ఆ తర్వాత హత్య చేసింది నువ్వేనని ఒప్పుకొంటావా?" ఇన్స్ స్పెక్టర్ కంఠం గర్జించింది.
రమణరావు తలవంచుకొని కూర్చున్నాడు.
"నరేంద్రా! నీ బుర్ర అమోఘం అయ్యా! జీనియస్ వి. కాని నాకొక అనుమానం.
"ఏమిటి?"
"రమణరావు రాధారాణిని హత్య చేశాడనే ఆలోచన అసలు నీకు ఎలా వచ్చింది. ఎప్పుడొచ్చింది? మొదటి నుంచీ నీకు అతడి మీదే అనుమానం ఉందా?"
"లేదు. అప్పటికి నేను అతడ్ని చూడలేదు. అతని పేరు కూడా వినలేదు."
"మరి ఏ ఆధారంతో నీకు అతడి అనుమానం వచ్చింది. గుండీ క్లూతోనేనా?"
"కాదు రామకృష్ణ హత్య జరిగాకనే రమణరావును చూశాను."
"రామకృష్ణ హత్యకూడా అతడే చేశాడంటావా?"
"చెప్తాను. కాస్త ఓపికపట్టు"
"నా తమ్ముడ్ని ఆ శంకర్రావే హత్య చేశాడు" అరిచింది కమలాంబ.
"అమ్మా! మీరు కాసేపు మాట్లాడకుండా కూర్చొండి" అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
"ఇక రామకృష్ణ హత్య గురించి చెప్పండి" అన్నాడు పబ్లిక్ పాసిక్యూటర్.
"చెప్తాను రెండు నిముషాలు....." అని కాలిపోయిన సిగరెట్ కు మరో సిగరెట్ అంటించుకొన్నాడు నరేంద్ర.
"కాఫీ తాగుతావా?" ఒక హంతకుడు దొరికాడనే ఉత్సాహంతో ఉప్పాంగిపోతూ అడిగాడు ఇన్స్ స్పెక్టర్.
"తెప్పించు" అన్నాడు నరేంద్ర.
"నరేంద్రా, పబ్లిక్ ప్రాసిక్యూటరూ పిచ్చాపాటీ మాట్లాడుకొంటూ కూర్చున్నారు.
26
అందరూ నరేంద్ర కేసి చూస్తూ కూర్చున్నారు.
నరేంద్ర సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తున్నాడు.
"నరేంద్రా! రామకృష్ణ హత్య గురించి చెప్పండి" అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుతూహలంగా.
"రాధారాణి హత్య జరిగిన రాత్రి దాదాపు పదిగంటలవరకు నువ్వు నాతోనే ఉన్నావ్" అన్నాడు ఇన్స్ స్పెక్టర్ ను చూసి నరేంద్ర.
"అవును! నువ్వు చాలా అలసిపోయావు. నిద్రోస్తుందని నిన్ను వెళ్ళిపోమ్మాన్నావు."
"అవును. నువెళ్ళగానే పడుకొన్నాను. మంచి నిద్రలో ఉన్నాను దాదాపు 11 గంటల సమయంలో అనసూయా, సూర్యనారాయణా వచ్చి తలుపుకొట్టారు. తలుపు తీసి ఇప్పుడు మాట్లాడను, రేపు రండి అన్నాను. వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నామని ప్రాధేయపడ్డారు.
వాళ్ళ ద్వారానే తెలిసింది అనసూయ మొదటి భర్త, మూడేళ్ళ క్రితం చచ్చిపోయినవాడు తిరిగి వచ్చాడని.....
పబ్లిక్ ప్రాసిక్యూటర్ "చచ్చిపోయినవాడు తిరిగి రావడం ఏమిటి?" అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు.
'అతడు చచ్చిపోలేదు. ఏదో రైలు ప్రమాదంలో చిక్కుకుపోయాడు. ఆ తర్వాత అతడు తిరిగి రాలేదు, ఆ ప్రమాదంలో ఎందరో చనిపోయారు. అనసూయా, సూర్యనారాయణా, కమలాంబా అందూ అతడు రైలు ప్రమాదంలో చచ్చిపోయాడనే భావించారు. ఇదంతా ఇన్స్ స్పెక్టర్ కు తెలుసు. మీకు తర్వాత వివరాలు ఇస్తాను. ఇప్పుడు ముఖ్యమైన ఆధారాలను మాత్రమే హంతకుడు ఎవరని నిర్ణయించడానికి అవసరమైన ఆధారాల వరకే చెప్తాను" అన్నాడు నరేంద్ర.
"చెప్పు!" అన్నాడు అద్వయితం.
"ఆ రాత్రి అనసూయా, సూర్యనారాయణా ణా దగ్గరకు వచ్చారు. వాళ్ళ ద్వారానే అనసూయ మొదటి భర్త రామకృష్ణ తిరిగి వచ్చాడనీ, జూబ్లీ హిల్స్ లోని వెంకటరమణా ప్యాలెస్ లో దిగినట్టుగా తెలుసుకొన్నాను.
నువ్వు అనుమానించినట్టుగా నేనే ఆరోజు అర్థరాత్రి 1-20కి ఆ హొటల్ కు వెళ్ళింది. ఈ విషయంలో మాత్రం కరెక్టుగా ఊహించావ్ ఇన్స్ స్పెక్టర్.
"ఇన్స్ స్పెక్టర్ ఊహించాడా? అక్కడ నిన్ను చూసినవాళ్ళు వర్ణించి చెబితే నువ్వే వెళ్ళావేమోననే అనుమానం వచ్చింది. అది స్వంత ఆలోచనేంకాదు" అన్నాడు విజయ్ ఇన్స్ స్పెక్టర్ ను ఉడికిస్తూ.
నరేంద్ర విజయ్ ను "నువ్వాగు" అన్నట్లు చూశాడు?
"నువ్వేనా వెళ్ళింది? ఎందుకెళ్ళావ్? నా దగ్గర ఎందుకుదాచావ్?" ఇన్స్ స్పెక్టర్ అదోలా ముఖం పెట్టి అడిగాడు.
"ఇన్వెస్టు గేషన్ చేస్తున్నప్పుడు ప్రతి విషయం డిటెక్టివ్స్ పోలీసులకు ఎందుకు చెప్పాలి?" అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్.
"అవుననుకోండి! మేం చాలా సన్నిహితంగా ఉంటాం. అందుకే అన్నాను." ఇన్స్ స్పెక్టర్ తగ్గి అన్నాడు.
"రాధారాణి హాండ్ బ్యాగ్ లో దొరికిన ఉత్తరం నువ్వూ చూశావుగా?"
"అవును చూశాను-రామకృష్ణ, రామానందస్వామి అనే పేరుతో రాశాడు. మూడు సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండిపోయాడు. రాధారాణికి రాసిన ఉత్తరంలో తనకు ప్రపంచం మీదే విరక్తి కలిగించని రాశాడు. తాను చాలా ధనవంతుడినని కూడా రాశాడు. తను చట్చిపోయినట్టు భావించి, ఆరు నెలలు తిరక్కుండానే తన భార్య తన స్నేహితుడినే వివాహం చేసుకుందని రాశాడు. తనకు వాళ్ళిద్దరూ అనుభావించింది అనుభవించగా, ఇంకా నాలుగు తరాల వాళ్ళు తిన్నా తరగని ఆస్తి ఉందని రాశాడు."
అనసూయా, సూర్యనారాయణా చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత, రాధారాణి ప్రియుడు రామానంద స్వామీ, అనసూయ మొదటి భర్త రామకృష్ణా ఒక్కడేనని నాకు తోచింది.
రాధారాణిని చంపిన వాడికి రామకృష్ణతో కూడా ఏదో పనిఉండే ఉంటుందని నాకు అన్పించింది.
అప్పటికె ఒంటిగంట దాటింది. నేను హొటల్ కు వెళ్ళాను.


