ఆడిటోరియం ఉత్కంఠగా గమనిస్తుంది వేదిక పై వున్న సౌందర్యతోబాటు త్యాగిని కూడా...... సౌందర్య కావాలనే త్యాగినిలా యిబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని గుర్తించింది ఒక్క నీలిమ మాత్రమే......
"మిస్టర్...... త్యాగీ ..... మా విద్యార్ధుల సంశయాల్ని నివృత్తిచేయడానికి అంగీకారం తెలిపిన మీకు కృతజ్ఞతలు....." తొలి అస్త్రాన్ని సంధిస్తూ అడిగింది సౌందర్య, "రాజకీయాలలో వాగ్దానాలకి పురుషుడ్ని అడుగు ఆచరణకి స్త్రీని సంప్రదించు అన్న ప్రముఖ వ్యక్తి ఎవరు....."
ఆ ప్రశ్నతోనే బోధపడిపోయింది త్యాగికి, అసలు సౌందర్య అడుగుతున్నది తెలీనిది తెలుసుకోవాలని కాదు ..... తనకు తెలీదని విద్యార్ధులకు తెలియచెప్పి తెలివిగా విద్యార్దులకు తెలియచెప్పి తెలివిగా అవమానించడానికి.
"ఎక్కువ డిటైల్స్ అక్కర్లేదు మిస్టర్ త్యాగీ ..... అలా అన్న వ్యక్తెవరో చెప్పగలిగితేచాలు."
క్షణం చూసేడు రెప్పలార్పకుండా ....... 'ఇలా ఎన్ని ప్రశ్నలు అడగాలని మీరు నిర్ణయించుకున్నారో అదే మీ విద్యార్ధులు ప్లాన్ చేశారో ముందు చెప్పండి."
"వెల్" భుజాలు ష్రగ్ చేసింది చిరుగర్వంగా "ఓ పది ప్రశ్నలు పైగా అవన్నీ రాజకీయాలకి సంబంధించినవే వుంటాయి కూడా."
"సరే....." అరలిప్త తర్వాత అన్నాడు "ఇందాక మీరన్న స్టేట్ మెంటు మాజీ బ్రిటిష్ ప్రధాని మార్గరెట్ థాచర్ ది."
"ఇందాక మీరు లోక్ సభ రద్దుచేయడం గురించి అన్నారే......అలారద్దు జరిగితే వేలకోట్లలో ఖర్చు జరిగి అది ప్రజలకే చివరికి భారంగా పరిణమిస్తుందన్నారు ఎలాగో చెప్పగలరా......"
"సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఎన్నికల నిర్వహణకు ప్రత్యక్షంగా నూటయాభై కోట్లు, పరోక్షంగా అయిదు వందలకోట్లు ఖర్చు ఉంటుందని ఎన్నికల సంఘమే అంచనావేసింది......సుమారు యాభైనాలుగుకోట్లు ముఫ్ఫై లక్షల ఓటర్ల సంఖ్యగల మన దేశంలో సార్వత్రిక ఎన్నికలకి యించు మించు ఆరు లక్షల పోలింగ్ బూతులు, ఇరవై లక్షల నలభై వేలబేలెట్ బాక్స్ లు, పదిహేనుకోట్ల దాకా ఖర్చయ్యేనాలుగుటన్నులవోటింగ్ క్పేపరూ, ఈశాన్య ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలలో సిబ్బంది నీ బేలెట్ బాక్సుల్నీ చేరవేయడానికి వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు అవసరం పడడమే గాక ప్రతి బూత్ కీ ఆరుగురు సిబ్బంది ......."
"ఓకె....." అర్దోక్తిగా అంది సౌందర్య" ఇదంతా కాదు ...... మీరు చెప్పిందంతా కలిపినా వెయ్యికోట్ల లోపే వుంటుంది."
"కావచ్చు కాని ఎన్నికలలో ప్రతిపారిశ్రామిక వేత్తా పార్టీలకు కోట్ల రూపాయలు ఫండ్ గా యివ్వడం ప్రభుత్వం నిషేధించినా అవసరంనాయకులది కాబట్టి 1985 లో కంపెనీ సవరణ చట్టాన్ని అమలులోకి తెచ్చి ఈ ఫండ్స్ ని అనుమతించడం మొదలు పెట్టింది. ఇది వందల కోట్లదాకా వుంటుంది. వేలకోట్ల దాకా నల్లదనం కూడా చేతులు మారి అలా ద్రవ్యోల్భణం పెరగడానికి, పార్టీ ఫండ్స్ గా ఖర్చు చేసినమొత్తాన్ని పారిశ్రామిక వేత్తలుతిరిగి రాబట్టే ప్రయత్నంలో తమ ఉత్పత్తుల ధరలు పెంచడానికి కారణమవుతుంది. అప్పుడు బలిపశువుగా మారేది సగటు మనిషేగా."
నిశ్శబ్దంగా చూస్తూ వుండిపోయిన సౌందర్య వెంటనే అడిగింది "ప్రాథమిక హక్కుల గురించి తెలీనివాడిక్కడ ప్రెసిడెంటాఫ్ ఇండియా కాగలడు......కాని తెలుగు స్వాతంత్ర్యసమరం తెలీనివాడు తెలుగువాడు పైగా మీలాంటి మేథావి అయ్యే అవకాశం లేదన్నది. నా అభిప్రాయం. చెప్పండి...... బ్రిటిష్ పాలనలో సహాయ నిరాకరణోధ్యమంలో మన రాష్ట్రంలో ప్రఖ్యాతివహించిన మూడు ఉద్యమాల పేర్లు చెప్పండి......అందులో ఆంద్ర శివాజీగా పేరు పొందిన వ్యక్తెవరు......"
ఈ ప్రశ్నతో త్యాగి పునాది కదుల్తుందనుకుంది.
ఇంచుమించు త్యాగి మొహంలో భావాలూ అలానే వున్నాయి.
అరనిమిషం పాటు నిశ్శబ్దం.
సౌందర్యకి అనుకూలంగా కూతలుమొదలయ్యేవే.....
"మంచిప్రశ్న అడిగారు సౌందర్యా...... తెలుగు నేలపైమీకున్న అభిమానానికి, తెలుగు స్వతంత్ర్య, చరిత్రని మిత్రులకి తెలియచెప్పాలనే మీ ప్రయత్నానికి జోహారు......" నవ్వేడు అల్లరిగా పెదవుల్ని నొక్కిపెడుతూ "బ్రిటిష్ వాళ్ళు పెంచిన మునిసిపాలిటీ పన్నులకు వ్యతిరేకంగా చీరాల పేరాల యిళ్ళను ఖాళీచేయించి పదకొండూ నెలలపాటు ఆ ప్రాంతాన్ని నిర్మనుష్యంగా మార్చిన ఆ మొదటి ఉద్యమం పేరు చీరాల పేరాల పోరాటం. దాన్ని నిర్వహించింది ఆంధ్రరత్న దుగ్గిరాలగోపాల కృష్ణయ్య. ఇది జరిగింది 1920లో రెండవది ...... ఫారెస్టు నిబంధనలు, ఉద్యోగుల లంచాలు భరించలేక పలనాడు, రాయచోటిలాంటి ప్రాంతాల ప్రజల సాగించిన సహాయ నిరాకరణోధ్యమం. 1922 ఫిబ్రవరి ఇరవైరెండున జరిగిన ఈ ఉద్యమ కాల్పులలోనే మరణించాడు కన్నెగంటిహనుమంతుదీన్నేవ 'అడవి పుల్లరి సత్యాగ్రహం' కూడా అన్నారు. ఇక మూడవదీ పెదనందిపాడు పన్నులనిరాకరణ. గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు ప్రాంతంలో నాలుగువేల మందివాలంటీర్లతో శాంతిసేనని ఏర్పాటు చేసిన ఉద్యమ నాయకుడు పర్వతనేని "వీరయ్య చౌదరిని ఆ రోజు ఆంద్రశివాజీ అని కూడా పిలిచేవారు."
"స్వతంత్ర్యం కోసం జరిగిన సత్యాగ్రహోద్యమంలో విద్యార్ధుల ఆత్మాహుతులు జరిగిన ఉదాహరణలున్నాయా."
"వయసుతో నిమిత్తం లేకుండా దేశంకోసం ప్రాకులాడిన ప్రతి వ్యక్తి ఆత్మబలిదానమూ ఒక ఆత్మాహుతే సౌందర్యా....... 1930 ఏప్రిల్ 18 తేదీన మొదలైన చిట్ గాంగ్ ఉద్యమంలో చాలామంది విద్యార్ధులు హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లిక్ ఆర్మీలో బిగ్రేడ్ వీరులుగా భాగస్వామ్యం వహించారు. చిట్ గాంగ్ కొండపై వున్న బ్రిటిష్ ఆయుధాగారాన్ని దోచుకోవాలని బ్రిటిష్ సైన్యం దుస్తుల్లో అడుగుపెట్టి జయప్రదంగా.
ఆ కార్యక్రమాన్ని ముగించి ఆ తర్వాత వేలాది బ్రిటిష్ సేనచేత వేటాడబడ్డారు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన సూర్యసేన్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. చిట్టగాంగ్ లోని స్థర్ ఘాట్ ప్రాంతంలో పరిస్థితిని తెలుసుకు రమ్మని సూర్యసేన్ అమరేంద్రనంది అనబడేపదహారేళ్ళ విధ్యార్ధిని పంపించాడు. ఆ ప్రాంతంలో అడుగు పెట్టిన అమరేంద్ర అనుకోకుండా పోలీసుల కంటబడ్డాడు. వారిచేతికి చిక్కకూడదని తనకుతానే ఆత్మాహుతి లా రివాల్వర్ తో కాల్చుకుని ప్రాణాలు వదిలాడు. రికార్డయిన మొదటి విద్యార్ధి ఆత్మాహుతి అది. ఆ తర్వాత బెంగాల్ పోలీసాధికారి క్రెయగ్ ని మరో ఇద్దరు కాలేజీ విద్యార్ధులు చంపాలని రివాల్వర్ పేల్చారు. అక్కడ దొరికిన విద్యార్ధి రామకృష్ణ విశ్వాస్ ని ఉరి తీశారు. ఆ స్ఫూర్తితో పది హేనేళ్ళ ప్రాయంగల కుమారి శాంతికుమారి, సునీత కలిసి ప్రహాకంటకు డయినజిల్లా మేజిస్ట్రేట్ స్టేవెన్స్ ని ఆయన మేజిస్ట్రీ బంగళాలోకి అప్లికేషన్స్ అందించాలని చెప్పి వచ్చివోణీల్లో దాచుకున్న పిస్టల్ తీసి కాల్చిచంపారు. కలకత్తా యూనివర్శిటీలో బి.ఏ చదివిన కుమారి వీణాదాస్ యూనివర్శిటీ కాన్వొకేషన్ కు వచ్చి అధ్యక్ష స్థానంలో కూచున్న గవర్నర్ స్టాన్లీ, సుఖదేవ్......యించుమించు అందరూ విధ్యార్ధిలోకం నుంచి ఉద్యమంలో అడుగుపెట్టి ప్రాణం పోవడం ఖాయమనితెలిసే ఆత్మాహుతిలా పోరాటం చేసినవాళ్ళే......."
తొణుకూ బెణుకూ లేకుండా చరిత్రనంతా కంఠస్థంచేసినట్లు మాట్లాడుతున్న త్యాగిని విద్యార్దులంతా అప్రతిభులై చూస్తుంటే ఏ ప్రశ్నలో అతడ్ని ఇబ్బందిపెట్టాలా అని సౌందర్య ఆలోచిస్తూంది.
"సౌందర్యా......" అతడి గొంతులో చిత్రమైన ఆర్తిధ్వనించింది. కళ్ళముందు కదలాడుతున్న స్వాతంత్ర్య సమరచరిత్ర గురించి మరెంతో చెప్పాలన్నతపనా కనిపిస్తోంది. "ఇక్కడ మనం లెక్కపెట్టాల్సింది ఆత్మాహుతుల సంఖ్య కాదు...... ఒక లక్ష్యంకోసం మృత్యువుని ఆహ్వానించగలిగిన ఆ నాటి యువకుల చిత్తశుద్దిని అర్పించే అదృష్టంకోసమే గవర్నర్ పై కాల్పులు జరిపానన గల్గినకుమారి వీణాదాస్ మతలుకాని-ఉరితీయబడానికి ముందు భగత్ సింగ్ ని, 'జైలు నుంచి తప్పిస్తాన'ని మరో విప్లవ యోధుడు జహంగీర్ లాల్ చీటీ పంపితే..... 'నా మరణం మరెందరి యువకులకో స్ఫూర్తి కాగలిగే అదృష్టాన్ని నేనిలాకోల్పోగల' నంటూ జవాబు చెప్పి, తప్పించుకునే అవకాశాన్ని సైతం తిరస్కరించిన అతడి దేశభక్తికాని.......
"నేను నా రక్తాన్ని చిందించి అమర వీరుడిగా ఆత్మార్పణం చేయని నాడు రాతి ఫలకం అమర్చిన గోతిలో బానిసగా పడి వున్నానా శవం పై ఉమ్మి వేసినా పాపంలేద'ంటూ బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడిన ఫక్తూన్లఉద్యమం కాని వెలకట్టలేని వాస్తవాలే అలాంటి చరిత్ర ఈనాడు వ్యక్తుల స్వార్ధపూరితమైన ఆలోచనలతో కళంకితమై పోతూంది. ఆ కళంకాన్ని పెంచి పోషిస్తున్న రాజకీయ నాయకులు ఇప్పుడు తమ అవసరాలకోసం కుర్రల్లా ఆత్మాహుతులకుకారణమై పోతున్నారు."
"వెల్ మిస్టర్ త్యాగీ ....." త్యాగి మాటల్ని అర్దోక్తిగా ఖండిస్తూ మరోప్రశ్నా సంధించి సౌందర్య....... "భారతదేశప్రధాని కావటానికి కనీస వయసెంత?"
"ఇరవై అయిదు."
"భారతదేశ మొదటి ఉప ప్రధాని?"
"సర్దార్ వల్లభాయి పటేల్."
"మనదేశంలో మొదటి లోక్ సభ స్పీకర్ ఎవరు?"
"జి.వి.మావ్లింకర్."
"భారతదేశంలో భాషా ప్రాతిపదికపై ఏర్పడిన తొలి రాష్ట్రమేది?"
"మనరాష్ట్రమే."
సౌందర్యకి ఉక్రోషం ముంచుకొస్తూంది. అవమానించాలని ప్రారంభించిన అతని ప్రయత్నం దురదృష్టవశాత్తూ త్యాగి యిమేజ్ ని పెంచటానికి కారణమై పోతూంది.
"భారత రాష్ట్రపతికి దేశంలో ఫైనాన్షియల్ ఎమర్జన్సీని విధించగలిగే అధికారాన్ని అందించేది రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్స్......"


