ఇదిలా వుండగా.....
అక్కడ.....
నిమ్మీకపూర్....
తన నిజనివాసంలో....
తన తండ్రి దగ్గరకెళ్ళింది ముద్దులు గునుస్తూ.
నిమ్మీకపూర్ తండ్రి జతిన్ కపూర్ ఫోన్లోనే బేరసారాలు చేసేస్తూ కార్లని శేర్లలెక్కన అమ్మేస్తున్నాడు. కిలోల లెక్కన కొనేస్తున్నాడు.
ఫోన్లో బేరాలు సెటిల్ చేస్తూనే కన్నకూతురి రాకని గమనించాడు జతిన్ కపూర్.
"క్యా! మారుతీ 1000!" అన్నాడు ముద్దుగా.
"నీతో మాట్లాడాలి పితాజీ" అంది.
"బోల్! మేరి స్సారీ నిస్సాన్"
"చాలా సీరియస్ విషయం పాపా!"
"కుచ్ ఫర్వా నై! బోల్ మేరీ ఫియట్ 118" అన్నాడు జతిన్ కపూర్.
"ఎప్పుడూ కార్ల గొడవేనా నాన్నా?" అంది నిమ్మీకపూర్ విసుగ్గా.
వెంటనే జతిన్ కపూర్ కి తన గతం గుర్తొచ్చింది.
గతంలో తనెవరూ? ఒక ఢాబావాలా! పంజాబీ వంటకాల స్పెషలిస్టు. వెంటనే అతని ట్రాక్ మారింది. ఢాబా మాటలే నోటివెంట రావడం మొదలెట్టేశాయి.
"చెప్పు నా మక్కీదీ రోటీ" అన్నాడు ముద్దుముద్దుగా.
"అబ్బ! సీరియస్ గా విను నాన్నా" అంది చిరాగ్గా.
"సీరియస్ నెస్ ఎందుకే పుదీనాకీ చెట్నీ! హసో! ఔర్ హసావో!"
"నేను ప్రేమించాను నాన్నా!" అంది నిమ్మీ.
"అరె బలెబలెబలే!" అన్నాడు జతిన్ కపూర్.
"ఎవర్నని అడగవేం?"
"నువ్వు జాన్. జానీ, జనార్ధన్, జంగయ్యా.....ఎవర్ని చేసుకున్నా నాకిష్టమే గన్నేకీ రస్! నీ ఇష్టమొచ్చినట్లు చెయ్ ఆలూ పరోట!" అన్నాడు జతిన్ కపూర్.
"పెళ్ళన్న తర్వాత మంచీ, చెడూ చూసుకోనక్కర్లేదా నాన్నా!" అంది నిమ్మీకపూర్.
అప్పుడు కాస్త ఈ లోకంలో కొచ్చాడు జతిన్ కపూర్.
"అవును! మంచీ, చెడూ చూసుకోవాల్సిందే! చెప్పు" అన్నాడు.
"అతని పేరు జెయ్ చంద్ర" అంది నిమ్మీ.
"నే చెబుతా! జాన్, జానీ, జనార్ధన్, జంగయ్య, జెయ్ చంద్ర. ఐతే నేను చెప్పిందే కరెక్టయింది. పేరు కల్సింది" అన్నాడు జతిన్ కపూర్.
"అతనెవరని అడగవేం?"
"అతనెవరూ?"
లేడీ డాక్టర్ సునీతాసుందరి లేదూ? మన ఫ్యామిలీ డాక్టర్! వాళ్ళ అబ్బాయి."
"మన దగ్గర పాత కార్లమ్మి కొత్తవి కొంటూంటుంది.....ఆ డాక్టరా?"
"ఆ డాక్టరే!"
"అయితే ఇంకేం! మంచి కారు! ప్రొసీడ్ మైడియర్ బేబీ ఆస్టిన్"
"థాంక్స్ నాన్నా!"
"నో మెన్షన్ మేరీ మారిస్ మైనర్."
తండ్రి మెడలో చేతులేసి చిన్నపిల్లలా వేళ్ళాడింది నిమ్మీకపూర్.
ఆ అమ్మాయి నుదుటిని చుంబించి "నా పిచ్చి అంబాసిడర్" అనుకున్నాడు జతిన్ కపూర్ మృదువుగా.
ఆ తండ్రీ కూతుళ్ళు జెయ్ చంద్ర ప్రమేయం లేకుండా అతడ్ని తమ అల్లుడ్ని, మొగుడ్నీ చేసుకునే వూహల్లో వుండగా....
అక్కడ.....
వారి ఊహలకి మూలవిరాట్టయిన జెయ్ చంద్రేమో తన తల్లయిన సునీతా సుందరి ముందు నిలబడున్నాడు.
పావుగంట సేపు అతన్ని గమనించనట్లే నటిస్తూ యమాబిజీగా ఉండిపోయింది సునీతా సుందరి.
ఆమె మనసు సైలెంటుగానే ఉప్పొంగి పోతోంది.
ఎంతో లోకం చూసింది తను.
తనకి తెలుసు. డబ్బుకి లోకం దాసోహం అని.
డబ్బు చేయలేని పనేం లేదు ఈ ప్రపంచంలో. డబ్బు ప్రేమని కొంటుంది. డబ్బు ప్రేమని అమ్మేస్తుంది కూడా.
డబ్బు! డబ్బు! డబ్బు! డబ్బు!
ఇదే తారకమంత్రం.
ఇదే మనుషుల్ని బతికించే ఆక్సిజన్.
ఇదే మనుషుల్ని చంపేసే కార్బన్-డై-ఆక్సైడ్ కూడా.
డబ్బు! ఆ డబ్బుని వెదజల్లింది తను.
ఆ పిల్లకి ఓ బ్లాంకు చెక్కు యిచ్చింది.
రిజల్టు ఇదిగో! ఇప్పుడు తన ఎదురుగానే తన కొడుకు రూపంలో ఆరడుగుల ఎత్తున నిలబడుంది.
చెక్కుతీసుకుని ఎక్కడికో చెక్కేస్తుంటుందది. తన కొడుకుని తరిమేస్తుంటుంది. ఇలాంటి వాళ్ళు దానికెందరో?
వీడు దానికెన్నోవాడో అసలు?
డబ్బు కోసమే వాడికి వలవేసిన ఆ పిల్లకి ఇక డబ్బు దొరికాక వాడెందుకు?
"వాట్ సన్నీ! వాట్ హేపెన్డ్?" అంది లేడీ డాక్టర్ అంతా తనకి తెలుసన్న అర్ధం పలికిస్తూ.
"ఈ కాయితం ముక్కని నీకిచ్చెయ్యమంది" అన్నాడతను.
"ఎవరు! ఏ కాయితం?" అంది సునీతా సుందరి.
"సితార! ఈ బ్లాంకు చెక్కుని" అన్నాడు అతను.
సునీతా సుందరి మొహంలో ఆశ్చర్యంతో బాటు అవమానం కూడా కనబడింది. ఆ వెంటనే ఆగ్రహం కూడా తొంగిచూసింది.
"ఏమిటీ? చెక్కు రిటర్న్ చేసేసిందా?"
"అవును మామ్!" అన్నాడు అతను తాపీగా.
అవమానాన్ని తొక్కిపెట్టేస్తూ, క్షణంలో ప్లేటు మార్చేసింది సునీతా సుందరి "డబ్బంటే అంత లక్ష్యం లేని పిల్లతో నువ్వెట్లా సుఖపడతావు సన్నీ!" అంది ఆందోళన వ్యక్తం చేస్తూ.


