"చిన్న పిల్లలు నిమిషంలో యిమిడిపోతారు. కల్సిపోతారు. మా తన్మయ వుందిగదా నిమిషంలో కొత్త పోగొట్టేస్తుందిలే-"సునీత అభయం యిస్తున్నట్లుంది.
పూజ తన్మయతో బాగానే మాట్లాడింది. తన క్లాసు పుస్తకాలు, స్కూలు గురించి ఫ్రెండ్స్ గురించి చెప్తుంటే ఆసక్తిగా విని తనస్కూలు పుస్తకాల గురించి మాట్లాడింది పూజ. ఆమె ఉన్నంతసేపు పూజ మొహం విప్పారింది.
ఆ రాత్రి పడుకునే ముందు రాజేష్" పూజ ఎక్కడపడుకుంటుంది-" అన్నాడు మామూలుగా.
ఎక్కడేముంది- పక్క బెడ్ రూములో పడుకుంటుంది-" అంది అర్చన బెడ్ షీట్లు, గలేబులు మారుస్తూ.
"ఒక్కర్తి పడుకోగలదా. మనగదిలో, యింకో మంచం వేద్దామా పోనీ-" అన్నాడు పూజని ఒక్కర్తిని పడుకో బెడితే అర్చన నొచ్చుకుంటుందేమోనని.
"ఇప్పటికే రెండు మంచాలు వేస్తేనే గదిలో నడవడానికి చోటు లేదు. ఇంకో మంచం ఎక్కడవేస్తాం. అయినా జ్ఞానం వస్తూన్న పిల్ల...మన బెడ్ రూములో వద్దు అంది గొంతు తగ్గించి- కాని ఆ మాటలు పూజ చెవినపడక మానలేదు. ఓ భార్యభర్త పిల్లలు పెద్దవాళ్ళయ్యాక విడిగా గదిలో పడుకోబెట్టడం అతి మామూలు విషయం. తల్లి తండ్రి ఒక గదిలో పిల్లలు ఒక గదిలో పడుకోడం పిల్లలకి ఏమనిపించే అనుకునే విషయమూకాదు.
కాని పూజకి.....ఆమెవున్న స్థితిలో, అసలే కొత్తచోటు, కొత్త వాతావరణం, కొత్తడాడి.....ఆఖరికి తల్లి కూడా తనని ఏదో వేరుచేసి అన్యాయంచేసిన భావన...... పూజకి కాస్త ఊహతెల్సిన దగ్గరనుంచి తల్లి పక్కలో, ఆ తరువాత నాయనమ్మ దగ్గిర పడుకోడం అలవాటు. తాత, నాయనమ్మల మధ్య పడుకునేది. వంటరిగా పడుకునే అలవాటులేని పూజ పక్కగదిలో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ పడుకుంది. పక్క గదిలో తల్లి, ఆ డాడి పడుకుని గొంతులు తగ్గించి మాట్లాడుకోడం, నవ్వుకోడం వింటూ మనసులో ఏదో తెలియని భావనతో ఉడికిపోయింది. అభిషేక్ అక్కడ పడుకోవచ్చునేం. తనక్కడ పడుకో కూడదుట. ఆలోచనలతో అల్సిపోయి తెలియకుండానే నిద్రలోకి జారింది. మధ్య రాత్రి ఏదోకల వచ్చి "మామ్మా.." అంటూ లేచికూచుంది- పక్కన ఎవరూలేరు - చీకటి. చచ్చిపోయిన మామ్మ మొహం గుర్తువచ్చి భయంతో వణికిపోయింది. ఒక్క ఉదుటున లేచి తల్లి గదిలోకి పరిగెత్తింది - గుమ్మం దగ్గరకి వెళ్ళి బెడ్ లైటు వెలుగులోచూసి టక్కున ఆగిపోయింది. తల్లి తండ్రి నిద్రలో కూడా ఒకరి కౌగిలిలో ఒకరువున్నట్లు రాజేష్ కాళ్ళు ఆమె కాళ్ళ మీద, అర్చన చేతులు రాజేష్ మీద వున్నాయి. అర్చన పక్కన తమ్ముడు.ఆ స్థితిలో వారిని చూసిన పూజ అలాగే నిమిషంచూస్తూ నిల్చుని, టక్కున వెనక్కి తిరిగి తనపక్కమీదకి వెళ్ళి పడుకుంది. వాళ్ళు ముగ్గురూ ఒకటి. తను ఏంకాదు వాళ్ళకి- తన నిలా ఒంటరిగా పడుకోబెట్టివాళ్ళు హాయిగా పడుకున్నారు. భయం, ఒంటరితనం, ఏదోనిస్సహాయత, కసి అన్నీ కలిసి "మామ్మా....తాతగారూ..." అంటూ లోపల కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది. చాలా సేపు ఏడ్చి వెక్కిళ్ళమధ్య ఎప్పుడో నిద్రలోకి జారింది.
* * *
మర్నాడు ఉదయం పాలుతాగుతున్న కూతురి ఏడ్చినట్లు ఉబ్బిన మొహం చూసి "ఏమిటి ఏడ్చావా" అంది అనుమానంగా అర్చన కూతురి దగ్గరకువచ్చి ఆ మాటకి పూజ గొంతులో దుఃఖం అడ్డు పడింది. కాని తల్లి ముందు బైటపడటం యిష్టం లేక కళ్ళల్లో తిరిగే నీరు కనపడకుండా పాలగ్లాసులోకి తలదించుకుంది. "ఎందుకు ఏమయింది చెప్పు" ఆదుర్దాగా కూతురి తలపైకెత్తి అడిగింది అర్చన. పూజ విసురుగా తల విదిల్చి...." ఏంలేదు. ఏంలేదు...." అంటూ బాత్ రూములోకి పరిగెత్తినట్టే వెళ్ళి తలుపు మూసుకుంది. అర్చన నిట్టూర్చింది. ఈ పిల్లకి అక్కడ బాగా అలవాటయి పోయింది. దాని మనసు అక్కడ వుంది యిక్కడ వుండాలనిలేనట్టుంది. ఇలా అయితే ఎలా బాబూ దీనితో.... ఎన్నాళ్ళకి సర్దుకుని అలవాటవుతుందో ఏమిటో అనుకుంది కాస్త విరక్తిగా.
ఆ రోజు అర్చన పూజని వెంటబెట్టుకుని స్కూల్లో జాయిన్ చేసి వచ్చింది. అప్లికేషన్ యివ్వడం టెరము ఫీజు కట్టి పుస్తకాలు అవి కొని రెడీగా వుంచిందేమో ట్రాన్స్ ఫర్ సర్టిఫికట్ తీసుకుని ప్రిన్సిపాల్ తో మాట్లాడి కూతుర్ని జాయిన్ చేసి.....తన్మయకి అప్పచెప్పి బస్సులో తన్మయతో యింటికి రమ్మని అన్నీ చెప్పి వచ్చింది. స్కూలుకెడితే చదువు, ఫ్రెండ్స్ తొందరగా అలవాటు పడుతుంది అని నమ్మింది.
స్కూలుకెళ్ళి వస్తున్న దగ్గిరనుంచి పూజ మొహం కాస్త తేట పడింది. ఉదయం లేవడం గబగబ తయారయి స్కూలుకి వెళ్ళడం.....సాయంత్రం వచ్చి తన్మయతో కల్సి ఆడుకోవడం మళ్ళీ హోమ్ వర్క్ చేసుకుని భోజనం చేసిపడుకోడం దినచర్యతో క్రమంగా పరిసరాలకి అలవాటు పడింది. అయితే యింట్లో వున్నంత సేపు ఎవరితో మాట్లాడదు. వచ్చి పది రోజులైనా.....యింట్లో ఏదో కొత్తగా చూస్తూ, బితుకు బితుకు మనే తిరుగుతుంది. ఇది కావాలి అని తల్లిని కూడా అడగదు. ఆ ఇంటి మనిషి కానట్టు ఆ ఇల్లు తనది కానట్టు చుట్టపు చూపుగా నాలుగు రోజులు వుండిపోడానికి వచ్చిన బంధువు మల్లే ఎచ్ది పట్టించుకోకుండా, కల్పించుకోకుండా అనతి ముట్టనట్టుండి పోతుంది. అర్చన ఏదన్నా అడిగితే అడిగిన దానికి ముభావంగా సమాధానం చెబుతుంది. రాజేష్ తో అసలు మాట్లాడదు అర్చన రాజేష్ ఏ టిఫిన్ టేబుల్ దగ్గరో కాస్త సరస సంభాషణ, కాస్త శృంగార చేష్టలు అంటే టిఫిను తిని అర్చన కొంగు లాగి మూతి తుడుచుకుంటుంటే అర్చన సుతారంగా అతని నెత్తిన మొట్టడం, 'అబ్బ నీవు రావేం అన్నానికి....అని భోజనం ముందు కూర్చుని రాజేష్ పిలిస్తే - 'వస్తున్నాను మీరు కానీండి' అని అర్చన అంటే, 'ఊహు. అదేం కుదరదు' అంటూ రాజేష్ ఆమె పమిటలాగి కుర్చీకి కట్టేయడం, తింటూ తింటూ అర్చన కంచంలోని ఏదన్నా లాగేసుకుని చిలిపిగా అల్లరి పెట్టడం లాంటి దృశ్యాలు, మాటలు ఏమన్నా జరుగుతే పూజ మొహం ఎర్రబడిపోయేది. ఆమె కళ్ళల్లో తిరస్కారం, ఏహ్యత, కసి కనక ఆ యిద్దరిలో ఎవరి దృష్టినైనా పడితే నిలువునా మాడిపోయే వారు. అన్నట్టు పెద్ద పెద్ద కళ్ళతో వారి వంక మింగేస్తున్నట్టు చూసి తలదించుకుని ఎవరో తరుముకొస్తున్నట్టు గుటకు గుటకు మింగి టక్కున లేచి వెళ్ళి పోయేది పూజ.


