"ఊళ్ళో సన్నాయి మ్రోగితే గుండెలో గుబులుపుట్టడానికి నువ్వేం ఆడపిల్ల తల్లివి కాదుకదా?"
"పెళ్ళీడు వచ్చాక ఆడపిల్లయితేనేం? మగపిల్లాడయితేనేం?"
"చూస్తున్నావుగా, శశీ! అమ్మ ఆరాటం! నువ్వింకా ఆమెను బాధ పెట్టడం భావ్యం కాదంటాను."
శిశిర్ సమాధానం చెప్పకుండా మౌనంగా లేచివెళ్ళి పేపరు చదువుతూ కూర్చున్నాడు.
పెళ్ళి ప్రసంగం వచ్చినప్పుడల్లా అతడిలాగే మవునం వహిస్తుంటాడు.
మరునాడు ప్రొద్దుటే సుధానిలయంలో అతిధులొస్తున్న హడావిడి మొదలైంది.
వంటమనిషికి స్వీట్లూ హాట్లూ ఫర్మాయిస్తూ సుధ వంటింట్లో బిజీగా ఉంటే రామకృష్ణ ఎయిర్ పోర్టుకెళ్ళాడు స్నేహితుడినీ, వాళ్ళమ్మాయినీ రిసీవ్ చేసుకోడానికి.
గంట తరువాత వాళ్ళతో తిరిగివచ్చేశాడు.
"సుధా! రాజోచ్చేశాడు!" బయటినుండే కేక పెట్టాడు రామకృష్ణ.
"చైత్ర రాలేదా?" అంటూ వచ్చిన సుధకి ఎదురుగా కుందనపు బొమ్మలా చైత్ర.
"నమస్తే ఆంటీ!" చిరునవ్వుతో చేతులు జోడించిన ఆ పిల్లని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది సుధ. "బాగున్నావా చైత్రా? అమ్మెందుకు రాలేదు?"
"అమ్మ క్లబ్బు సెక్రటరీకదా? క్లబ్బుమెంబర్స్ తో కాశ్మీర్ టూర్ వెడుతూంది. అందుకని నేనొక్కదాన్ని ఇంట్లో ఉండడం ఎందుకని నాన్నవెంట తీసుకువచ్చారు. నాన్న వారం పదిరోజులు ఉంటారట ఇక్కడ! ఈ వారం రోజులు చిన్నప్పటి స్నేహితులను కలుసుకుంటూ హాయిగా గడుపొచ్చని వచ్చాను"
"ఇప్పటికైనా నీకు పుట్టి పెరిగిన ఊరు చూడాలనిపించింది. ఢిల్లీ వెళ్లాక మీ అమ్మయినా ఒకటి రెండుసార్లు వచ్చిందిగాని నువ్వసలు రాలేదు"
"నాకు శలవులున్నప్పుడు అమ్మకీ, నాన్నకీ ఇక్కడికి వచ్చే ప్రోగ్రాం ఉండదు. వాళ్ళిక్కడికి వచ్చినప్పుడు నాకు సెలవులుండవు. ఇకిప్పుడు సెలవులే. పి.జి. మ్యూజిక్ లో రీసెర్చి చేస్తున్నాను. అది ఆడుతూ పాడుతూ తెచ్చుకొనే పట్టా."
"తన కూతురు ఏ అయ్యేయస్ ఆఫీసరో కావాలని వాళ్ళ అమ్మ కోరిక. చైత్రకేమో ఇక చదవాలని పించడంలేదు" చెప్పాడు తండ్రి.
"ఇక చదవాలని లేదంటే పెళ్ళికి తొందరపడుతున్నావన్నమాట."
"పొండి ఆంటీ! తొందరేంలేదు నాకు."
చైత్ర చెంపల్లో విచ్చిన గులాబీలు చూసి "అందుకే మీ నాన్నకి గుండెలో గుబులుపుట్టి పెళ్ళికొడుకుల వేటకు బయలుదేరాడు?" అంది సుధ ఆమె చెంపల్ని నొక్కుతూ.
హఠాత్తుగా రాజగోపాల్ పెదవులమీద వ్రేలుంచి "ఉష్" అంటూ సైగచేశాడు.
చప్పున మాట మార్చింది సుధ. "అయ్యో! నా మతిమండ! నిలబెట్టే కబుర్లు మొదలుపెట్టానా! ఇంట్లోకి రండి అన్నయ్యా!"
అందరూ వచ్చి హాల్లో సోఫాల్లో కూర్చున్నారు.
"శిశిర్ లేడా ఆంటీ?"
"కంపెనీకి వెళ్ళాడు. భోజనానికి వస్తాడు. ఇంతకీ ఇప్పుడు స్నానమా , భోజనమా?"
"ముందు ఒక కప్పు వేడివేడిగా టీ కావాలి, అంతే!" చిన్నప్పటి చనువుతో అరమరికలు లేనిదానిలా అడిగింది.
"నాక్కూడా కావాలమ్మా!" రాజగోపాల్ అన్నాడు.
"ఇద్దరికీ తెస్తాను"
"నేనేం పాపం చేశాను? నాక్కూడా?" అన్నాడు రామకృష్ణ.
"మిమ్మల్ని డాక్టర్లు టీలు, సిగరెట్లు తగ్గించమన్నారు కదా?"
"తగ్గిస్తాను! పది పెంచి నాలుగు తగ్గిస్తాను"
"చాల్లెండి తెలివి" సుధ చిరుకోపంతో వెళ్ళిపోయింది.
ఇంట్లో నౌకర్లు చాకర్లు ఎంతమంది వున్నా తనకి ప్రయిమయిన వాళ్ళకి స్వయంగా అతిధి మర్యాదలు చేయడం సుధకి అలవాటు. ఐదు నిమిషాలు మించకుండా ట్రేలో పొగలు క్రక్కే టీతో తిరిగి వచ్చింది.
ముగ్గురికీ ఇచ్చి తనొకటి తీసుకుంది.
టీ త్రాగేసి సూటుకేసులోంచి బట్టలు తీసుకొని స్నానానికి వెళ్ళిపోయింది చైత్ర.


