మరుక్షణంలో ఆ వ్యాను గల్లీలోంచి దూసుకుపోయి, కొంతదూరం తర్వాత మెయినురోడ్ మీదకు మళ్ళింది.
౦ ౦ ౦
"ఎక్కడా వ్యానుని ఆపొద్దు.... ఎవరైనా వ్యానుని ఆపడానికి ప్రయత్నించినా.....వ్యానుకి అడ్డంగా నుంచున్నా... స్పీడ్ ని పెంచు....వ్యానుని మాత్రం, మేం చెప్పేవరకూ ఆపొద్దు..." డ్రైవర్ కి సీరియస్ గా చెప్పాడు వీర్రాజు. ఇన్ స్ట్రక్షన్సు ఇచ్చిన పావుగంట తర్వాత వ్యాను నెమ్మదిగా స్పీడు తగ్గడం గమనించి "ఏవైంది" అనడిగాడు కంగారుగా సేతురాజు.
"తెలీదు సార్..." తను కూడా కంగారుపడుతూ చెప్పాడు డ్రైవర్.
సరిగ్గా అదే సమయంలో....
దూరంగా ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర నుంచుని వాకీటాకీ పట్టుకున్న పోలీసు కానిస్టేబుల్ని చూడగానే ముగ్గురి పై ప్రాణాలు పైనే పోయాయి.
అంతవరకూ బ్యాక్ సీట్లో వున్న తేజ, ఒక్కసారిగా ఏడవడం మొదలెట్టాడు. పోలీస్ ఐలాండ్ కొంచెం దూరంలో వ్యాను ఆగిపోవడం, బాబు ఒక్కసారి గుక్కపట్టి ఏడ్వడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి.
డ్రైవరు గబుక్కున కిందకుదిగీ, ఇంజను టెస్టు చేస్తున్నాడు. పోతురాజు బాబు ఏడుపుని ఆపించడానికి శత విధాల కృషి చేస్తున్నాడు. విండోలోంచి పోలీసు కానిస్టేబుల్ కదలికల్ని నిశితంగా గమనిస్తున్నాడు వీర్రాజు.
ఆ పోలీసు కానిస్టేబుల్ వ్యానువేపు రావడం చూసిన వీర్రాజు, పోతురాజు వేపు తిరిగి "పోలీసు... పోలీసు... వాడి నోరు నొక్కేయ్" అంటూ హెచ్చరించాడు.
పోతురాజు తన అరచేతిని బాబు నోటికి అడ్డంగా పెట్టబోయాడు. ఆ చేతిని విసిరికొట్టి, తేజ మరింతగా గుక్కపట్టి ఏడుస్తున్నాడు.
డ్రైవర్ దగ్గరకొచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏదోమాట్లాడుతున్న హావభావాలు మిర్రర్ లోంచి కనబడడంతో వాడేదొ మన గురించే ఎంక్వయరీ చేస్తున్నట్టున్నాడు" గాభరాగా అన్నాడు సేతురాజు.
"వాడు.... మనపాస్ పోర్టు ఫోటోల గురించి అడుగుతున్నాడు. మనం కిడ్నాపర్లం...ప్రతి విషయానికీ కంగారు పడిపోకూడదు....యెలాంటి సిట్యువేషనయినా....తెలివిగా జాగ్రత్తగా డీల్ చెయ్యాలి .....గుర్తుంచుకోండి...ముందా పాపడి ఏడ్పు ఆపండి..." వీర్రాజు కానిస్టేబుల్ మాటల్ని వినడానికి చెవియొగ్గి, ఏవీ విన్పించడం లేదన్నట్టుగా చేత్తో సంజ్ఞ చేశాడు. అక్కడున్న డబ్బాల్ని, డొక్కుల్ని ఆడిస్తూ యెలాగయినా బాబుచేత ఏడుపు ఆపించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాడు పోతురాజు.
"రోడ్డుకి మధ్యలో వ్యానుని ఆపితే ఎలాగయ్యా.... ఆ రిపేరేదో త్వరగా చెయ్యి" అంటూ చిన్న పిల్లాడి ఏడుపు వినబడడంతో ముందుకొచ్చి మిర్రర్ లోంచి లోనికి చూడసాగాడు ఆ కానిస్టేబుల్.
తేజ బయటకు కనపడకుండా, ఆ మిర్రర్ కి తన వీపుకి ఆన్చుకుని కూర్చున్నారు సేతురాజు.
లాఠీతో మిర్రర్ ని కొట్టాడు కానిస్టేబుల్.
తప్పదన్నట్టుగా మిర్రర్ ని దించాడు సేతురాజు. సరిగ్గా అదే సమయంలో బాబుని తన ఒడిలో పెట్టుకుని, వాడు బయటకు కన్పించకుండా శాలువాని కప్పేశాడు పోతురాజు.
"ఏంటీ....వ్యానులోంచి చిన్నపిల్లాడి ఏడుపు విన్పిస్తోంది..." మిర్రర్ కి అతుక్కుపోయినట్లుగా నిలబడ్డ వీర్రాజు వేపు కనుగుడ్లను గోళీకాయల్లా తిప్పుతూ అడిగాడు కానిస్టేబుల్.
"ఏం లేదే....మిమిక్రీ....మిమిక్రీ"
"వ్యానులో మిమిక్రీ ప్రోగ్రామా....ఇదేం వ్యానా.... త్యాగరాయగానసభ" అంటూ మెడను వంచి లోనికి అనుమానంగా చూస్తున్న కానిస్టేబుల్ ముందు మిర్రర్ లోంచి ఓ టేపు రికార్డరును ఆడిస్తూ చూపించాడు సేతురాజు.
"రేడియోలో మిమిక్రీ ప్రోగ్రామన్నమాట...రేడియో వాళ్ళలాగే మా వాడిక్కూడా ఈ మిమిక్రీ ప్రోగ్రాములన్నా- పశువుల పెంపకం, పేడతో పిడకలు...ఇలాంటి వెరైటీ ప్రోగ్రాములన్నా చాలా ఇష్టమన్న మాట. అలాంటి ప్రోగ్రామ్స్ హెల్త్ క్కూడా చాలా మంచిదని బాలమురళీ కృష్ణగారు కూడా చెప్పారు."
"ఏం చెప్పడమో- ముందు వ్యాన్ ని ఇక్కడ నుంచి తీసెయ్యండి. ఈ దారంట మినిస్టర్ వస్తున్నాడు!"
వాకీ టాకీ చెవికానించుకుని ముందుకెళ్తున్న కానిస్టేబుల్ ని చూసి-
"వీడి గోల అదన్నమాట! మనకేం పర్వాలేదు-" అంటూ నవ్వాడు వీర్రాజు.
ఇంజన్ బర్ర్ మని శబ్దం చేయడంతో, ఓ.కే. అన్నట్టుగా సంజ్ఞ చేసి, డ్రైవర్ సీట్లోకొచ్చి కూర్చున్నాడు.
వ్యాన్ సర్రుమని ముందుకు కదిలింది.
౦ ౦ ౦
"డోన్ట్ వర్రీ కాళేశ్వరప్రసాద్! సిటీ అంతా ఎలర్టు చేశాం-సెంటర్ మినిస్టర్ రాక సందర్భంగా పోలీసులందరూ ట్రాఫిక్ డ్యూటీలో ఉన్నారు. లేకపోతే మీవాడు ఈ పాటికి దొరికిపోయేవాడు- రెండు, మూడు గంటల్లో మీవాడ్ని పట్టించే పూచీ నాది!" ధీమాగా చెప్పాడు సి.ఐ.
"మీరేం చేస్తారో నా కనవసరం...ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదు- సాయంత్రం లోపల మా తేజ, మా ఇంట్లో వుండాలి!" మ్లాన వదనంతో అన్నాడు కాళేశ్వరప్రసాద్.
"నాకందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, వాళ్ళు నోటేడ్ క్రిమినల్స్ కారు- పెట్టీ థీవ్స్....అయిదు వేలకీ, పది వేలకీ కక్కుర్తిపడే రకం.....వాళ్ళు తీసికెళ్ళేముందు, మీ బాబు వంటిమీద విలువైన వస్తువులు ఏవేం వున్నాయ్?"
సుదేష్ణాదేవి వేపు చూశాడు కాళేశ్వరప్రసాద్.


