పెడదామన్న తలంపుతో వున్నారని తెలిసి రామకృష్ణయ్యగారు యిక్కడ చిందులు తొక్కాడు. "నాకే పంగనామాలు పెడదామని చూస్తున్నారా? ఇలాంటి వాళ్ళను బోలెడు మందిని చూశాను. చూపిస్తాను నా తడాఖా" అంటూ ఒకసారి దగ్గర వున్నవాళ్ళ ముందు విశ్వరూపం ప్రదర్శన చేశాడు. తరువాత వీలు చూసుకుని ఆత్మ విశ్వాసం కలవాడవటంచేత మొండిధైర్యంతో వంటరిగా ప్రయాణమయ్యాడు. అంతవరకూ బాగానేవుంది. కాని దృఢ కాయుడూ, ఢక్కా ముక్కలు తిన్నవాడూ అయివున్న యీ వ్యక్తి ఆ సరిహద్దు ప్రాంతంలోకి రాత్గానే, యీయన రాకకోసం అక్కడ ఉత్కంఠగా కాచుకు కూర్చున్న ముఠా బొత్తిగా సభ్యత, మొహమాటం విసర్జించి మరొకతనితో చెప్పుకోవటానికి వీలుకాని దుర్భాషలాడి, బుర్ర రామకీర్తనం పాడించటం లాంటి పన్లు జరిగించారనీ, యింకోసారి ఆ గడ్డమీద అడుగు పెడితే వూహించనలవిగాని పెద్ద పెద్ద పరాభవాలు జరుగుతాయనీ హెచ్చరిక చేశారనీ, తెలిసినవాళ్ళు చెప్పుకున్నారు. రైల్లో వున్నంతసేపూ మానవుడు ఎంత చిత్రహింస అనుభవించాడోగాని, రామకృష్ణయ్యగారు కాకినాడలో అడుగుపెట్టి "నే రంగంలో వుండగానే కుర్ర సన్యాసిని చేసి మోసగిద్దామని చూస్తునారా వెధవలు? వీళ్ళ అందు తేలుస్తాను. ఈ రామకృష్ణయ్య అంటే ఏమనుకుంటున్నారో?" అని ప్రగల్భాలు పలికి గబగబా ప్లీడరుగారి దగ్గరకు పోయి మంతనాలు జరిపి రిజిస్టర్ నోటీసు ఇప్పించాడు.
ఆ విషయం అలా వుండగా వీరభద్రం పుట్టి ముంచుకుపోయినట్లు ఆస్తి పంపకంలో సరిగ్గా తేలక తటస్థంగా వొదిలేసిన భాగము న్యాయప్రకారం తమకు చెందాలని రాధమ్మగారి పేరా దావా వేశాడు. కేసు ముమ్మరంగా జరుగుతోంది.
వీటన్నిటికీ మించి దారుణమైన సంగతి ఏమిటంటే బలరామయ్యగారి అసలైన దాయుదులమని చెప్పుకుంటూ, యీ ఆస్తిలో తమకు న్యాయబద్దంగా వాటా రావటానికై సవాలక్ష కారణాలు చూపిస్తూ గణపవరంలోని బలరామయ్యగారి దూరపు బంధువులు కొందరు ఆ సత్యమూర్తి మీద కలిసికట్టుగా పాపరు దావా వేశారు అసలీ యావదాస్తి తమదేనట. తాము చిన్నప్పుడు ఆకతాయితనంగా తిరుగుతూండటం చేత తమ పెద్దలు బలరామయ్య బుద్దిమంతుడని ఆయన పేరా ఆస్తి రాసేసి, యీ పిల్లలు పెద్ద వాళ్ళయి బుద్ది కుదుర్చుకున్నాక తిరిగి అప్పగించమని ఆదేశించారట. ఈ బలరామయ్యేమో అలా చేయకుండా తినేశాడు. దానికి బోలెడన్ని ఆధారాలూ సాక్ష్యాలూ...సత్యమూర్తి తన హక్కుని దృఢపర్చుకోవాలంటే కోర్టు ద్వారానే సంవత్సరాల తరబడి దెబ్బలాడాలి, తప్పదు.
మరో అత్యవసర పరిస్థితి : లిమిటేషన్ పట్టి పోతూన్న ప్రోనోట్లు సరిచూసి ఎదురు తిరిగిన వాళ్ళమీద దావాలు తగిలించటము.
దావాలు....వాయిదాలు...కోర్టులు...ప్లీడర్లు....ప్లీడరు గుమాస్తాలు గోల...
అతని పని సాకేగూడులో ఇరుక్కునట్లయింది.
ఒక్క విషయమూ సరిగ్గా తేలదు. ఏమీ జరక్కపోయిన, ఏదో బ్రహ్మాండమైనది జరిగిపోతున్నట్లు ఎక్కడికక్కడ, ఎవరిమట్టుకు వారు నిగూఢం...గుంభన...గంభీరత్వం...
రామకృష్ణయ్యగారు ఎడ తెరపి లేకుండా ప్లీడర్లచుట్టూ తిరుగుతున్నాడు. ఒక్క అంశమూ పరిష్కారం కాకపోయినా ఫీజుల క్రింద డబ్బు మాత్రం మంచినీళ్లలా ఖర్చు అవుతున్నది.
సత్యమూర్తికి విసుగుపుట్టింది. "పోనీ మనకు కొంత నష్టమయినా సరే ఏదోవిధంగా రాజీకి వద్దాం. నాన్నా, ఎన్నాళ్ళని కోర్టుల చుట్టూ తిరుగుతాం?" అన్నాడు తండ్రితో.
"అలా మనం ప్రతివారితో రాజీ పడుతూ కూర్చుంటే ఆస్తంతా మూడురోజుల్లో ముక్కలై కూర్చుంటుందిరా వెర్రినాగన్నా నీ కెందుకు నేనున్నాగా" అంటూ రామకృష్ణయ్యగారు మళ్ళీ పాత పాట పాడాడు.
మేడ క్రిందిభాగం మొత్తం నాలుగు వాటాలుగా విభజింపబడింది. ఓ కాలేజీ లెక్చరరూ, ఆడిటరూ, ఓ చిన్న ఎత్తు వ్యాపారస్థుడూ, అన్నిటికన్న చిన్నదైన ఆఖరివాటాలో ఓ పంతులమ్మా చేరారు.
కాలేజి లెక్చరరు ఇంకా యువకుడే. భార్యా, ఒకపాపాయి అతని సంసారం.
ఆడిటరుగారికి గంపెడు సంసారం పిల్లలు పిడుగులు. నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునేవరకూ ఇంటిని చక్కబెట్టటమే వాళ్ళపని. పిల్లల తల్లి వాళ్ళని ప్రక్క వాటాల్లోకి తరిమేసి తను ఇంట్లో విశ్రాంతి తీసుకుని సుఖపడుతూ వుటుంది. వాళ్ళ అల్లరికి అడ్డూ, అవధులూ లేవు. మేడ కూడా ఎక్కి ప్రత్య్గాదిలోనూ ప్రవేశించి బీరువాలూ, డ్రాయరు సోరుగులూ సవరించేస్తారు. వంటింట్లోకి జొరబడి తినుబండారం ఏది కళ్ళబడినా, లేక అల్మారాలలో వున్నట్లు వాళ్ళ నాసికలు పసిగట్టినా మొహమాటం లేకుండా ఎగబడి, దాడిచేసి వాటిని అవలేలగా ఖాళీచేసేస్తారు. తోటలోవాళ్ళు ఎక్కని చెట్టూ, విరిచెయ్యని మొక్కాలేవు. ఆఖరికి అరటిచెట్లను కూడా కనికరించకుండా వాటిమీదకు ఎగబ్రాకి ఊపి ఊపి విడిచిపెడతారు. అంత అజమాయిషీ చలాయించే రామకృష్ణయ్యగారికిగాని" ఆయన కొడుకులుగాని వాళ్ళని దారిలో పెట్టటం శక్యం కాలేదు.
వ్యాపారస్థుడు జల్సారాయుడు ఎప్పుడూ ఖుషీగా వుండటానికి ప్రయత్నిస్తూ వుంటాడు. ఆయన పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. వాళ్ళని వృద్దురాలిన తన తల్లికి వొదిలేసి తరచు భార్యతో సినిమాలకూ, శికార్లకూ వెడతాడు. స్నేహితుల్ని ఇంటికి పిలిచి వాళ్ళతో డబ్బెట్టి పేకాట ఆడుతూండటం కూడా కద్దు.


