"మొన్న ఆదివారం మీ పాత సినిమా టి.విలో చూశాం" అంది రజని లోపలికొస్తూ.
"ఏ పిక్చరది?" అడిగాడు శ్రీనాద్.
"భార్య భర్తల అనుబంధం.
"మీరూ , మీ భార్యగా చేసిన హీరోయిన్ రత్నాజ గారూ చాలా చూడముచ్చటయిన జంట అనిపించింది. భార్యను అంత అమితంగా ప్రేమించే భర్తగా నిజంగా మీరు చాలా నేచురల్ గా నటించారు" అంది ఉమాదేవి కొంచెం ఎత్తిపొడుపు ధోరణిలో.
"అవునవును! భార్య భార్తలంటే అలా ఉండాలనిపించింది ఆ సినిమా చూస్తుంటే "వప్పుకున్నాడు రామచంద్రమూర్తి.
"మీరు ఉన్నారు ఏనాడయినా నాతొ అంత ప్రేమగా మసిలారా! భార్యను ఒక్కక్షణం కూడా వదలకుండా వున్నారా?" రామచంద్రమూర్తికి చురక అంటించింది సీత.
"శ్రీనాద్గారికి అంత ప్రేమ ఒలకబోయాదానికి ప్రొడ్యుసర్ బోలెడు డబ్బిచ్చాడే...! నాకూ ఎవడయినా డబ్బిస్తే నేనూ అంతకంటే ఎక్కువ ప్రేమే ఒలకబోస్తాను."
"ఆ మాట నిజమే! లేకపోతే అలా భార్యకొంగుపట్టుకుని ఎవడు తిరుగుతాడు....? మా ఆవిడ నేనూ రోజూ పీచీ పడుతూ వుంటాం మా ఇంట్లో" అన్నాడు శ్రీనాద్.
అందరూ ఘొల్లుమంటూ నవ్వారు. చుట్టుపక్కల ఆడాళ్ళు మరి కొంతమంది చాలా ఫాషనబుల్ ముస్తాబయి వచ్చేసరికి హౌస్ ఫుల్ అయిపొయింది.
చాసేపు శ్రీనాద్ సినిమాల మీద చర్చ జరిగింది.
"ఇప్పుడు ఏ సినిమాల్లోనూ నటించటం లేదేంటి.....?" అడిగింది ఒకామె.
"నాకే ఇష్టం లేదు ఈ రోజుల్లో సినిమాలు చూస్తుంటే విరక్తి కలుగుతోంది. సెక్సూ, వయోలేన్సూ , బూతు డైలాగులూ....."
నటరాజ్ నవ్వాడు.
"సినిమాలలో అవకాశాలు రాని పాత నటీనటులందరూ ఇలాగే చెబుతారులెండి.
అందరూ నవ్వేసరికి శ్రీనాద్ తల పట్టుకున్నాడు.
"ఏయ్ నటరాజ్! మా ట్రేడ్ సీక్రెట్ అలా బయటపెట్టావంటే మర్యాదగా వుండదు ఆ......." చిరుకోపంతో అన్నాడు.
మధ్యాహ్నం భోజనాలయ్యాక శ్రీనాద్ కోసం కొందమంది స్టేజ్ ఆర్టిస్టులు వచ్చి ఏదో ఫంక్షన్ కి తీసుకెళ్ళారు. సాయంత్రం వరకూ అందమే అనందం పాట వినబడుతూనే వుంది.
చీకటి పడుతోండగా రజని హడావుడిగా వచ్చింది లోపలకు.
"'అంకుల్ ! ఓసారి మా ఇంటికి రావాలి" అంది కంగారుగా.
"ఎందుకమ్మా?"
"శాంతికి జ్వరం వచ్చిందంకుల్!"
రామచంద్రమూర్తితో పాటు సీత కూడా నవ్వేసింది.
"చచ్చాం! ఇప్పుడు ఆ జ్వరాన్ని దేనికో లింక్ పెడుతుంది" అన్నాడు నటరాజ్.
రామచంద్రమూర్తి, సీత రజని యింటికి చేరుకున్నారు.
శాంతి వాళ్ళను చూస్తూనే ఆనందంగా పలుకరించింది.
"అంకుల్! నాకు జ్వరం వచ్చింది. పదమూడో తారీఖున చచ్చిపోతున్నాను.
అందరూ షాక్ తిన్నారు.
"ఏమిటా మాటలు శాంతీ!" మందలింపుగా అన్నాడు రామచంద్రమూర్తి.
"అయ్యో! నేనేం చెప్పినా నమ్మరేమిటి అంకుల్! బై గాడ్ చెబుతున్నాను. పదమూడున డెఫినెట్ గా చచ్చిపోతాను. నమ్మకపోతే పొండి నాకేం........"
"ఎవరు చెప్పారు నీకలా అని?" అడిగింది సీత.
"ఎవరంటారేమిటి? బల్లి .....జ్వరం రాగానే గోడమీదున్న బల్లిని చూశాను అది కాలెండర్ మీదున్న ఓ లెక్కల పురుగుని పట్టుకోడానికి ట్రై చేస్తోంది.....ఆ పురుగు బల్లికి దొరక్కుండా తప్పించుకుంటే బ్రతుకుతాను. లేకపోతే చచ్చిపోతాను అనుకున్నాను. పురుగు బల్లికి దొరికిపోయింది. ఎప్పుడో తెలుసా? కాలెండర్ మీద యీ నెల పదమూడో తారీఖున అంకె వేసి ఉన్న గడిలో వుండగా దొరికింది. అంటే నేను పదమూడు ఎగిరిపోతాననే కదా?"
ఎవరికీ కొద్ది క్షణాల వరకూ మాట రాలేదు.
"ఇదే గొడవ అంకుల్ పొద్దుట్నుంఛీ! చంపుకు తింటుంది. కోపంగా అంది రజని.
"శాంతీ! అలా అనకూడదమ్మా! జ్వరం నీకెన్ని సార్లు రాలేదు. ఎన్నిసార్లు తగ్గిపోలేదు? ఉరికే అన్నింటికీ అలా మాట్లాడకూడదు. సముదాయింపుగా అన్నాడు రామచంద్రమూర్తి.
"నేనలా అన్నా అనకపోయినా జరిగేదదే అంకుల్! నాకు తెలుసు కదా! ఇంతవరకూ నేననుకున్నవన్నీ ఖచ్చితంగా జరిగాయ్."
"సరే! నువ్వనుకుంటే అనుకోగానీ అందరికీ చెప్పి కంగారు పెట్టకు. నీకేం కాదని నేను హామీ యిస్తున్నాను సరేనా?"
శాంతి నవ్వింది.
"సరే! ఎవరు కరెక్టో పద్నాలుగో తారీఖు ఉదయం తెలుస్తుందంకుల్. అప్పుడు బాధపడతారు నేను కరెక్ట్ గా చెప్పానని....."


