Home » Dr. dasaradhi rangacharya » Jeevanayanam


    దీనినిబట్టి ప్రభుత్వం ఎంత బెదిరిపోయిందో అర్థం అవుతుంది. సభలకు అనుమతి ఇవ్వము అని ప్రధాని అంతటివాడు చెప్పడం ఇందుకు నిదర్శనం.

 

    ఆంధ్రమహాసభ రాజకీయ ఉద్యమం కాదు ఉత్తరువును పునరాలోచించవలసినది అని మాడపాటివారు ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. జవాబు లేదు. మళ్లీ వ్రాసుకున్నారు. అయిదునెలల తరువాత పోలీసు శాఖామంత్రిని దర్శించమని ఆదేశం అనుగ్రహించారు. 19-7-1932న కలుసుకొమ్మన్నారు. ముఖము చాటు వేసినారు. తుదకు 3-8-1932 పగలు 12-00 గంటలకు దర్శనం ఇచ్చారు. అప్పుడు అక్కడ పోలీసు శాఖ అధ్యక్షుడు, హోం సెక్రటరీ కూడా ఉన్నారు. కర్నల్ ట్రెంచ్ గారు మాడపాటివారితో సుదీర్ఘంగా చర్చించి, ఒక శ్రీముఖం అందజేశారు.

 

    ఆ లేఖ సారాంశం ఇలా ఉంది:

 

    1) విద్యావిషయక, రాజకీయ ఇతర విషయాలలో ప్రభుత్వపు పాలసీగాని, ఆదేశములను గాని సభలో చర్చించరాదు. ఎందుకనగా, వాటిని గురించి వ్యక్తికిగాని, సంఘానికిగాని ఉన్న ఆక్షేపణలు నివేదించుకోవడానికి అవకాశాలున్నాయి.

 

    2) హనుమంతరావుగారు, సభా నిర్వాహకులు రెండువేల రూపాయీల నగదు ప్రభుత్వానికి ధరావతు చెల్లించాలి. పై షరతు అతిక్రమించబడిందీ లేనిదీ నిర్ణయించే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

 

    ఈ హకుంనామాను గురించి నిర్ణయించడానికి మహాసభ కార్యవర్గం 29-8-1932న సమావేశమయింది. "ఆంధ్ర మహాసభకు రాజకీయాలతో సంబంధం లేదు. ఇది రాజకీయ సంస్థ కాదు. అందువలన ధరావతు విషయం తొలగించి అనుమతించవలసింది. ఇంకను 3-8-1931 నాటి ప్రభుత్వ హుకుం జనులకు తెలియజేయుటకు అనుమతి ఇవ్వగలరు" అని వ్రాశారు.   

 

    ప్రభుత్వ ఉత్తరువును ప్రకటించరాదని పోలీసు శాఖామంత్రినుండి జవాబు వచ్చింది.

 

    ఎంతటి క్రూరత్వం అంటే - సభ జరుపుకోనివ్వరు. అలాంటి ఉత్తరువును బహిరంగపరచనీయరు. ఇలాంటి నికృష్టపరిస్థితుల్లో ఉద్యమాన్ని నిర్వహించినవారు వందనీయులు. నిస్వార్థంగా వారు చేసిన నిరంతర సేవకు ఆంధ్రజాతి వారిని నిత్యం స్మరించాల్సి ఉంది.

 

    అసలు విషయం ప్రభుత్వం తేల్చదు. జవాబు వ్రాయదు. విసుగు చెందక నిరంతరం విన్నపాలు పంపుకున్నమీదట 20 నెలల తరువాత పోలీసు శాఖామాత్యులు తమను దర్శించుకొనుటకు అనుమతి నొసంగినారు.

 

    5-3-1934 నాడు బూర్గుల రామకృష్ణారావుగారు, మాడపాటి హనుమంతరావుగారు కర్నల్ ట్రెంచ్ ను కలుసుకున్నారు. అప్పుడు పోలీసుశాఖాధిపతి ఆర్మ్ స్ట్రాంగ్ గారు, హోం సెక్రటరీ కూడా ఉండిరి. మహాసభ పక్షాన బూర్గులవారు మాట్లాడారు. సంభాషణ ఇలా సాగింది:

 

    బూర్గుల:- మా ఉద్యమం రాజకీయేతరం. గ్రంథాలయాలద్వారా విజ్ఞానం వ్యాపింపచేయడమే మా ఉద్దేశ్యం.

 

    ఆర్మ్ స్ట్రాంగ్:- అయ్యా! గ్రంథాలయోద్యమం అంటే ఏమిటో నాకు బాగా తెలుసు. ఇందు విషయంలో బెంగాల్లో మంచి అనుభవం సంపాదించాము. గ్రంథాలయం అంటే విప్ల సంఘం. విప్లవాన్ని మించింది గ్రంథాలయం.

 

    ట్రెంచ్ - ధరావతు చెల్లించడానికి ఆక్షేపణ ఎందుకు? అంతమాత్రం డబ్బు మీ దగ్గర లేదా? లేక ఆ డబ్బు ప్రభుత్వం గుంజుకుంటుందని భయమా?

 

    బూర్గుల - మేము రాజ్యంలో అర్ధభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. అంతమాత్రం డబ్బులేకా కాదు, ప్రభుత్వం లాక్కుంటుందని భయమూ కాదు. అది మా ఆత్మగౌరవానికి భంగకరం. మహాసభ నిర్వహిస్తున్న విద్యావైజ్ఞానిక సామాజిక సేవలను గురించి ప్రజల గౌరవ భావాన్ని ఈ షరతు నిర్మూలిస్తుంది. అందువల్ల అందుకు మేము వప్పుకోజాలం.

 

    తరువాత గత సభలో తీర్మానాలనుగురించి ప్రభుత్వంవారు ఆక్షేపణ తెలిపారు. తుదకు సభ జరుపుకోవడానికి అనుమతి ఇవ్వవలసిందిగా సిఫార్సు చేస్తామన్నారు.

 

    ట్రెంచ్ - ఇకముందయినా బుద్ధిగల పిల్లలవలె ప్రవర్తించండి.

 

    20-6-1934న హోం సెక్రటరీనుంటి కార్యదర్శికి దిగువ షరతులమీద అనుమతి ఇవ్వబడుతుందని తెల్పారు:

 

    1. బహిరంగసభల విషయంలో ప్రభుత్వనిబంధనలను ప్రత్యక్షరం పాటించాలి. ఇందుకు కరారునామా సమర్పించాలి.

 

    2. సభ జరుపు స్థలము - సభాధ్యక్షుని పేరు తెలియపరచాలి.

 

    3. భూమిపన్ను తగ్గించుటను గురించి తీర్మానించరాదు.

 

    4. ప్రభుత్వాధికారులకు పనులు చేయరాదని బోధించకూడదు.

 

    5. ప్రభుత్వానికి, కార్యకర్తలకు ఘర్షణ జరగకుండా బాధ్యత వహించాలి.

 

    6. ఈ నియమాలను ఉల్లంఘిస్తే మహాసభ కార్యదర్శి అందుకు బాధ్యత వహించాలి.  

 

    మహాసభ ఖమ్మంమెట్టులో జరుగుతుందనీ, పులిజాల వేంకట రంగారావుగారు సభకు అధ్యక్షత వహిస్తారనీ, సభలు 13, 14, 15 డిసంబరు 1934లో జరుగుతాయనీ ప్రభుత్వానికీ తెలియపర్చడం జరిగింది.

 

    ప్రభుత్వంనుంచి 5-12-1934న జారీ అయిన హుకుంలో స్పష్టత లేదు. "వరంగల్లు జిల్లా అవ్వల్ తాలూక్దారు - కలెక్టరుగారికి ఖమ్మంమెట్టులో మహాసభా సమావేశాలను గురించి వ్రాయడం జరిగింది. ఆదేశాల వివరాలు వారినుంచి అందుకొనవలసినది."

 

    అనుమతి ఇచ్చినట్లు, ఇవ్వనట్లు తెలియదు. అక్కడ మరిన్ని చిక్కులు కల్పించమన్నదో తెలియదు. ఈ ఉత్తరువులు కూడా సభ జరగడానికి సరిగ్గా ఒక వారం ముందు ఇచ్చారు.

 

    సనాతనుల బెడద:

 

    మూడేళ్లు ముప్పుతిప్పలుపెట్టి సర్కారు అనుమతించినట్లు నటిస్తే, ఖమ్మం మెట్టు సనాతనులు మరిన్ని ఇబ్బందులు కలిగించారు.

 

    మహాసభలో సంఘసంస్కరణల చర్చ జరుగుతుంది. అది హిందూ సంప్రదాయ వాదులకు బాధ కలిగిస్తుంది. తద్వారా ఘర్షణలు చెలరేగవచ్చు. శాంతికి భంగం కలుగవచ్చు. కాబట్టి ఖమ్మంమెట్టులో ఆంధ్రమహాసభ జరపనీయరాదని సనాతనులు మహజర్లు పంపారు.

 

    ఈ సనాతనుల దుష్టప్రచార కార్యక్రమంలో మా నాయనగారి హస్తం బలంగా ఉంది.

 

    "సంకరము నరకమూలమగు
    తండ్రితాతల ధర్మము తప్పరాదు"

 

అనేది రేకు స్టెన్సిలు తీయించి ఊరిలోని గోడలన్నింటిమీదా రుద్దించారు.

 

    "అస్పృశ్యులను దూరముగా ఉంచవలెను" అని ఒక కరపత్రం అచ్చు వేయించి పంచిపెట్టారు. నేను కూడా ఆ పత్రాలు కొన్ని ఇండ్లలో వేశాను.

 

    మహాసభలో మాల, మాదుగులతో కలిసి తింటారానీ, అందువల్ల వర్ణసంకరం జరుగుతుందనీ, అది పాపహేతువనీ ఖమ్మంపురానికి అరిష్టదాయకమనీ ప్రచారం చేశారు.

 

    మహాసభ జరుగుతే మాల, మాదుగులు ఇళ్ళలో జొరబడ్తారనీ, చేతికి అందినవి ఎత్తుకు పోతారనీ జనాన్ని భయకంపితులను చేశారు. మహాసభకు జనం వెళ్లకుండా, సాయం చేయకుండా కట్టుదిట్టం చేశారు.

 

    ఆంధ్ర జన సంఘానికి అన్ని విధాల సహకరించినవారు వర్తకులే. ఆ వర్తకులే ఇప్పుడు సహాయనిరాకరణ చేశారు.

 

    తమ ప్రయోజనం మాత్రమే చూసుకోవడం వర్తకుల వ్యాపారుల స్వభావం.

 

    మాదిరాజు వెంకటేశ్వరరావు, ఇటిక్యాల రాజేశ్వరరావుగారలు సనాతనులకు నాయకత్వం వహించారనీ, అసలు కథ సాంతం గుంటూరునుంచి కాశీకృష్ణాచార్యులవారు నడిపించారనీ మాడపాటివారి అభిప్రాయం.

 

    నిజాం ప్రభుత్వమే కాశీకృష్ణాచార్యులవారితో ఇదంతా చేయించి ఉండవచ్చు. నిజాం రాజు - తన ఉనికికోసం రాజ్యం బయటివారితో సంబంధాలు ఏర్పరచుకున్న నిదర్శనాలూ సందర్భాలూ ఉన్నాయి.

 

    "దగాకోరు బటాచోరు
    రజాకారు పోషకుడవు" అన్నారు దాశరథి.

 

    ఇక్కడ ఒక విషయం తెలియపరచాలి. మాడపాటివారు మహిళలకు తెలుగులో విద్య బోధించాలని తమ ఇంట్లోనే ఒక పాఠశాల నడిపారు. అందులో వారి భార్య మాణిక్యమ్మ సహితంగా ఏడుగురు మహిళలు ఉండిరి. వారిని మెట్రిక్యులేషనుకు సిద్ధం చేశారు. బ్రిటిషాంధ్రంలోని ఒక విశ్వవిద్యాలయాన్ని - ఆ మహిళలను మెట్రిక్యులేషన్ పరీక్షకు అనుమతించవలసిందిగా కోరారు. నిజాం నవాబు ఆ సంస్థకు లక్షరూపాయలు విరాళం ఇచ్చారు. ఆ విద్యాలయం "మాకు దేశీయ సంస్థానాలతో సంబంధం లేదు" అని తెలియపరచింది.

 

    తదుపరి హనుమంతరావుగారి నిరంతర ప్రయత్నంవల్ల మహారాష్ట్రలోని కార్వే విద్యాలయం వారు ఈ మహిళల కోసం ప్రత్యేకంగా తెలుగు విభాగం ప్రారంభించి, తెలుగులో పరీక్షలు నిర్వహించి, డిగ్రీలు ప్రదానం చేశారు.

 

    ఖమ్మంమెట్టులో జరుగుతున్న ఆంధ్రమహాసభకు ఖమ్మంపురంనుంచి అంతగా సాయం లభించలేదు. ఎర్రుపాలెం, రేమిడిచర్ల, రామన్నపేట, పెదమండవ, కొదుమూరు నుండి కార్యకర్తలు వచ్చి, కార్యభారం వహించారు. వారిలో జమలాపురం కేశవరావు, మాడపాటి రామచంద్రరావు ముఖ్యులు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra