Home » Harikishan » Endamavulu


    "అవును బావుంటుంది" అన్నది జయలక్ష్మి. ఆ మాట యథాలాపంగా అన్నట్లుగానే ఉందిగాని మనస్పూర్తిగా అన్నట్లుగా లేదు. ఆమె మనస్సు ఏదో అన్వేషణలో లీనమై ఉంది.
    "నువ్వు వచ్చే ఏడు పి.యు.సి లో చేర్తావా జ్యోతి" అన్నది జయలక్ష్మి.
    "ఇంకా ఏం తేల్చుకోలేదు. అయినా ఇంకా పరిక్షా ఫలితాలు తెలియాలిగా. మర్చి పోయాను మా బావ కూడా విశాఖపట్నంలోనే ఆనర్సు చదివాడు. శలవులకు వచ్చి నాలుగు రోజులయింది"
    గతుక్కుమన్నది జయలక్ష్మి మనస్సు. కాని బైట పడకూడదు.
    "అట్లాగా, ఎంతో మంది చదువుతూ ఉంటారు యూనివర్శిటీలో మీ బావగారి పేరు"
    ఆత్రంగా ఏం సమాధానం చెపుతుందోనని జ్యోతి వైపు చూసింది.    
    "మురహరి మా అత్తయ్యా, మావయ్యా లేరు. మా బావ ఇక్కడే ఉంటాడు" సంతోషంగా చెప్పింది జ్యోతి. ఆదుర్దాగా విని, ఆంతర్యం లోని ఆరాటాన్ని కుంగదీసుకుని, అర్ధంగాని అనుమానంతో మరోసారి జ్యోతి వైపు చూసి, "బావుందమ్మా, ఇంక చీకటి పడింది వెళ్లొస్తాను". అంటూనే బయల్దేరింది జయలక్ష్మి.
    సంతోషంగానే సాగనంపుతూ, "అప్పు డప్పుడూ వస్తూండు అక్కా, నీ రాకకోసం ఎప్పుడూ ఎదురు చూస్తుంటాను" అన్నది జ్యోతి జయలక్ష్మి చెయ్యి పట్టుకుని.
    మనస్సులో చీకట్లు ఆవరించగా ఏమీ మాట్లాడలేక "వూ" అని వెళ్ళిపోయింది జయలక్ష్మి మళ్ళీ వెనక్కు తిరిగి చూడకుండా.
    ఎక్కడకో వెళ్ళి వస్తున్న మురహరిని జయలక్ష్మి చూడనేలేదు. రోడ్డు మీద పలకరించటానికి మనస్కరించలేదు మురహరికి.
    
                                *    *    *

    ఇంటికి వెళ్ళంగానే శ్రీలక్ష్మి, ఆమె తల్లీ అడిగారు జయలక్ష్మిని "కృష్ణమూర్తి అన్నయ్య గారింటికి వెళ్ళావా" అని.
    "వెళ్లాను" ముక్తసరిగానే సమాధానం చెప్పింది జయలక్ష్మి.
    తన గదిలోకి వెళ్ళబోతున్న జయలక్ష్మి ని చూసి "జయా, స్నానంచేసి, ఆ బట్టలు తడిపేసి వెళ్ళు. ఎంత చదువుకున్న వాళ్ళయినా సుచీ, సుభ్రమూ ఉండాలి. మాంసము తింటున్నారని బొమికలు మెళ్ళో కట్టుకుని తిరగరు కదూ" అన్నది శ్రీ లక్ష్మి.
    తల్లి మాట్లాడలేదు. తలొంచుకుని వెళ్ళింది. ఆమె మనస్సులోని మాతృత్వపు వేదన శీలక్ష్మికి అర్ధంకాదు. కరుడుకట్టిన సనాతన ఆచార పరురాలు శ్రీలక్ష్మి. ఈ ఆచార వ్యవహారాలకు ఏ మాత్రం అన్యాయం జరిగినా ఆమె మనస్సు ఆరాట పడుతుంది. తల్లి మనస్సు అటువంటిదే అయినా మాతృ ప్రేమ అడ్డు పట్టంనుంచి అంతగా ఆమె పట్టించుకోటం లేదు. సనాతన సాంప్రదాయ ఆచారాలను పాటించడంలో శ్రీ లక్ష్మి తండ్రి నోట్లోనుంచి వూడిపడ్డది. ఈవిషయంలో ఈ వైధవ్యం మరింత పట్టుదల చేకూర్చింది.
    స్వాతితో, మాట్లాడి ఆ ఇంటికి వెళ్ళినందుకు జయలక్ష్మి మైలపడ్డదని శ్రీలక్ష్మి అభిప్రాయం. ఇదివరలో జానకిరాం తో ఇవే మాటలు అన్నది శ్రీలక్ష్మి. దానికి సమాధానంగా జానకిరాం ఇట్లా అన్నాడు.
    "ఆచారమూ, అనాచారమూ అనేది శరీరానికే గాని ఆత్మకుకాదు శ్రీలక్ష్మి! ఆత్మ ఏనాటికీ మైలపడదు. మన మనస్సులో ఇతరుల మీద ఏర్పడే దురభిప్రాయాలే మన ఆత్మను మలిన పరుస్తయ్యి. కట్టు కున్న బట్టలు తడిసినంతమాత్రాన ఆత్మశుద్ది అయినట్లు కాదు. అదీగాక నీ మనస్సును కించ పర్చటం కూడా నా కిష్టంలేదు. నీ అభిప్రాయం నీది. నా అభిప్రాయం నాది. అన్నయ్య ఇంటికి వెళ్ళొచ్చిన రోజున నా గదిలో బట్టలు మార్చుకునే వంట గదిలోకి వస్తాను. సరేనా. ఈ పద్ధతి అన్నయ్యను కించపర్చటం కోసంకాదు. నీ మనశ్శాంతి కోసం. నీ ఆచారాన్ని మన్నించటం కోసం. ఇది నా మనస్సుకు విరుద్ధమైనా, నా మనస్సును నేను మార్చలేను కదా"
    జయలక్ష్మి కూడా ఇట్లాగే అంటుందేమో అనుకుంది శ్రీలక్ష్మి. ఈ మాటలేవీ జయలక్ష్మి మనస్సులో ముద్ర వేసుకోలేదు. శ్రీలక్ష్మి తత్వం తెల్సింది కనుక స్నానం చేసి, కట్టుకున్న బట్టలు తడిపేసి, మంచి బట్టలు కట్టుకుంది. విజయ గర్వంతో మనస్సు నింపుకుంది శ్రీలక్ష్మి.
    "చూడు జయా నే నిట్లా అన్నానని మనస్సు చిన్న బుచ్చుకున్నావా. మన పరువు, ప్రతిష్టలూ, సత్సంప్రదాయాలూ, ఆచార వ్యవహారాలూ మంట గలిపాడు కృష్ణమూర్తి అన్నయ్య. ఈ మాట జానకిరాం అన్నయ్యతో అంటే, మత ప్రమేయంలేని లౌకిక ప్రపంచంలో ఉంటూ కూడా ఇంకా పూర్వాచారాలు పాటించటం మనల్ని మనం మోసం చేసుకోటమే అని అంటాడు. కాని ఆ మాటల్ని నేను వప్పుకోను. కృష్ణమూర్తి అన్నయ్య ఏమన్నాడు. ఆ అప్రాచ్యురాలు స్వాతి ఉన్నదా" అన్నది శ్రీలక్ష్మి.
    తన మనస్సులోని ఆలోచనలను దూరం చేసుకుని వాస్తవ ప్రపంచంలోకి వచ్చింది జయలక్ష్మి.
    "ఏమంటాడు, అనటానికి ఏముంది? నన్ను అన్నయ్యా, వదినా ఎంతో ఆప్యాయంగా ఆదరించి పలకరించి గౌరవించారు. సాంప్రదాయాలను పట్టుకుని ప్రాకులాడి వాటికి పందిళ్ళువేసే స్వార్ధాన్ని, ఈర్ష్యనూ ఆ పందిళ్ళ మీద పాకించే మనస్తత్వం కలవారికి ఆ దంపతుల మనస్తత్వాలు ఎట్లా అర్ధమవుతయ్యి" అన్నది జయలక్ష్మి.
    "కులభ్రష్టుడైన అన్నయ్య మాయని మచ్చ మాపుకోటానికి ఎంతపనయినా చేస్తాడు. ఈ ఇంటికీ, వాడికీ ఏనాడో ఋణం తీరిపోయింది. సిగ్గులేక మనమే వాడింటికి వెళుతుంటే ఎట్లాగయినా వాడి తెచ్చిపెట్టుకున్న ఆదరాభిమానాలకు లొంగిపోయి మళ్ళీ మనలో కలుపుకుంటామేమో నని వాడి ఆశ" అన్నది శ్రీలక్ష్మి.

                              *    *    *

    అంతలోనే ప్రభావతమ్మ కూడా వచ్చింది. కృష్ణమూర్తిని గురించి వాళ్ళు మాట్లాడుకుంటుంటే కన్న కొడుకు పరిస్థితి వినాలని ఆవిడ ఆకాంక్ష.
    "వాడి ఆరోగ్యం ఎట్లా ఉంది జయా, గుండె జబ్బు ఏమయినా తగ్గుతుందన్నారా డాక్టరు." అన్నది.
    "ఆ జబ్బుకు విశ్రాంతి చాలా అవుసరం పెద్దమ్మా. అన్నయ్యకు విశ్రాంతి లోటు లేదు. పుట్టింది హరిజన కుటుంబంలోనైనా మెట్టినది సదాచార సాంప్రదాయ కుటుంబంలో, అన్నింటినీమించి ఆమె అంద చందాలకీ, సహృదతకూ నేను దాసురాలినయాననుకుంటున్నాను. అందమూ, గుణమూ పుణికి పుచ్చుకున్న పుణ్యమూర్తి. కడ జాతి స్త్రీ అని ఆమెను మీరంతా అని ఆమెను మీరంతా కసిరికొడుతున్నారు. ఆమె సుగుణాల్లో ఏ వక్కటయినా మనం నేర్చుకుంటే మనం ధన్యులమే. ఏం శ్రీలక్ష్మీ, నా మాటలు నువ్వు వప్పుకోవుకదూ" అన్నది.
    "ప్రభావతమ్మ హృదయం ఆనందంతో నిండిపోయింది. కళ్ళు చమర్చినయ్యి. ఇంటికీ కంటికీ వాడు దూరమైనా, ఇహపరాలకు దూరంకాక పేరు ప్రతిష్టలతో పరువుగా బ్రతికితే చాలుననుకుంది మనస్సులో. శ్రీలక్ష్మికి వళ్ళు మండింది.
    "వాడు ఉద్యోగం చెయ్యటం లేదుగదా, ఆవిడ సంపాదనతోనే కాలం వెళ్ళబుచ్చుతున్నాడా" అన్నది.
    "అవును పెద్దమ్మా, స్కూల్లో జీతం వంద రూపాయ లిస్తారు. ట్యూషన్లు రెండు మూడు ఉన్నట్లున్నయ్యి. ఆదర్శ జీవితమే గడుపుతున్నారు. స్వాతి వదినె హృదయం నవనీతంలాంటిది. కోమల మైన మనస్సు. ఆవిడ మాటలు వింటుంటే ఎంత కఠినాత్ములకైనా ఆవిడకు నమస్కరించ బుద్ధవుతుంది. అంత చక్కగా, సరళంగా మృదువుగా మాట్లాడుతుంది. అలాంటి కోడల్ని ప్రసాదించి నందుకు ఆ పరమాత్ముని వేనోళ్ళ స్థుతించాలి పెద్దమ్మా, చూస్తే నీకే తెలుస్తుంది" అన్నది జయలక్ష్మి.
    మనస్సులో నవ్వుకుంటూ వెళ్ళింది ప్రభావతమ్మ. శ్రీలక్ష్మికి కారం రాచుకున్నట్లయింది.
    "అంత నంగనాచి కనుకనే అన్నయ్యను వల్లో వేసుకుని భ్రష్టున్ని చేసింది. తను చేసిన ఈ ఘోరకలికి మాట పొందికయినా లేక పోతే ఎట్లా. ఆ మాటలకి నువ్వూ బోల్తా పడ్డావు. ఆవిడకు బ్రహ్మరథం పడుతున్నావు. అవున్లే కాలేజీ చదువు వెలగబెట్టి పది మందిలో తిరిగే మీకు వర్ణాశ్రమ ధర్మాలేం తెలుస్తయ్యి!" అన్నది శ్రీలక్ష్మి.
    "ఏమిటమ్మా వర్ణాశ్రమ ధర్మాలంటన్నావు" అంటూ వచ్చారు గోపాలశాస్త్రి:
    పెద తండ్రిని చూడంగానే నవ్వుతూ తలొంచుకుని వెళ్ళబోయింది జయలక్ష్మి. ఆయన ఎదుట మాట్లాట్టానికి భయపడుతుంది. కారణం ఆయన యందున్న భయభక్తులు, గౌరవం చేతనే.
    "ఏంలేదు నాన్నా, కృష్ణమూర్తి అన్నయ్య గారింటికి వెళ్ళొచ్చింది జయలక్ష్మి. స్వాతిని గురించి చెపుతుంటే ఏదో అంటున్నాను" అన్నది శ్రీలక్ష్మి.
    వయస్సులో చిన్నదయినా, సంసార జీవితంలోని సుఖదుఃఖాలను ఎక్కువ రోజులు అనుభవించక పోయినా, చిన్నతనంలోనే పసుపు కుంకుమకు దూరమైన శ్రీలక్ష్మిని చూస్తుంటే ఆయన కడుపు తరుక్కు పోతుంది. పసుపు కుంకుమతో బాటే ఐహిక వాంఛలను దూరం చేసుకుని ఆముష్మికాన్వేషణకు పాటుపడుతూ శిష్టాచార సంప్రదాయాన్ని పాటిస్తూ వంశగౌరవాన్ని పాటిస్తున్నదని ఆయనకు శ్రీలక్ష్మి అంటే ఎంతో అభిమానం. శ్రీలక్ష్మి చెప్పిన ఏమాటా ఆయన కాదనడు. కాని, కొన్ని విషయాల్ని, గౌరవప్రతిష్టలకు భంగం వాటిల్లే ఏ సంఘటనలనూ శ్రీలక్ష్మి ఆదేశించి ఆమోదిస్తుందనే అనుమానం ఆయనకు ఏ కోశానాలేదు. కడుపుతీపి చేత ఎప్పుడయినా తను కృష్ణమూర్తి విషయంలో ముభావకంగా వూరుకుంటే శ్రీలక్ష్మి జోక్యం కలుగచేసుకుని అన్నయ్య కన్నూ మిన్నూ కానక ఆ యింటి పరువు ప్రతిష్టలను గంగలో కలిపాడని వాదించి తండ్రి చేత వప్పిస్తుంది. నా తల్లి శ్రీలక్ష్మి ఉన్నంత వరకూ నా వంశ మర్యాదలకూ, గౌరవప్రతిష్టలకూ ఇంక ఏ అనర్ధకమూ రాదని ఆయన స్పష్టంగా చెప్పేవాడు. కాని ఈ నాడు ఆయన అదే విషయాన్ని ఇప్పుడు స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. అందుకు ప్రధాన కారణం అనుకోకుండా వెళ్ళి పోయిన గౌతమి ఉద్యోగం చెయ్యటమే. ఇదే ఆయన మనస్సులో చెలరేగే కొత్త బాధ.
    "కృష్ణమూర్తిని గురించి ఇవాళ కొత్తగా చర్చించవలసిందేమీ లేదు తల్లీ. వాడి విషయంలో నేను ఎప్పుడో ఒక నిర్ణయానికి వచ్చేశాను." నాకు వాడు కొడుకూకాదు, నేను వాడికి తండ్రినీ కాదు. గౌతమి విషయమే ఇప్పుడు కలిగిన కొత్త సమస్య. నీ ఉద్దేశ్యం ఏమిటి జయలక్ష్మి" అన్నారు గోపాలశాస్త్రి.
    అనుకోని విషయం చర్చకు వచ్చినందుకు శ్రీలక్ష్మి, జయలక్ష్మి స్తబ్దులై పోయారు. ఆలోచిస్తే ఇది శ్రీలక్ష్మికి కొత్త సమస్యగానే ఉంది.
    ఏం చెప్పలేక జయలక్ష్మి మెల్లిగా అక్కడి నుంచి జారుకుంది.
    "వదినె రాసిన ఉత్తరానికి జానకిరాం ఏం సమాధానం రాశాడో" అన్నారు గోపాలశాస్త్రి.
    "నేనూ మళ్ళా కనుక్కోలేదు నాన్నా, అన్నయ్య రాగానే కనుక్కుంటాను." అని వెళ్ళింది శ్రీలక్ష్మి.
    ఆ ముసలాయన మనస్సు వ్యధతో నిండిపోయింది. చిన్నతనంనుంచీ కొడుకులిద్ధర్నీ చెరోకన్నుగా భావించి అల్లారు ముద్దుగా పెంచాడు. తనమటుకు తాను పంచకావ్యాలనూ చెప్పుకుని వేద వేదాంతాలను మననం చేసుకుని, అష్టాదశ పురాణాలను అవగాహన చేసుకున్నా కొడుకు లిద్ధరికే వాళ్ళు చదువుకున్నంత వరకూ ఇంగ్లీషు చదువులు చెప్పించి ఉన్నత స్థాయిలోని ఉద్యోగాలు చేయించాలని అభిలాష పడ్డాడు. అభిలాషలన్నీ గగన కుసుమాలుకాగా ఫస్టు ఫారంనుంచే తప్పటం మొదలుపెట్టాడు కృష్ణమూర్తి. ఆయనకోరిక ఒక్కొక్క మెట్టూ దిగిపోగా కృష్ణమూర్తి కనీసం సెకండరీగ్రేడు టీచరయినా చాలుననే పరిస్థితి ఏర్పడింది. అందుక్కూడా నోచుకోనట్లుగా ఆయన స్వాతిశయాన్ని సమూలంగా నాశనం చేసి స్వాతిని చేపట్టాడు కృష్ణమూర్తి. దాంతో ఆయన సగం కృంగిపోయి "అభానే విరక్తి!" అన్న ఆర్యోక్తి ననుసరించి తనరెండు కళ్ళలో ఒకకన్ను పోయిందనుకున్నాడు. నిజంగా ఒక కన్నుకు ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra