Home » Kommanapalli ganapathi rao » Goruvechani Suridu

    ఇందాకటి ఆమె అభినందన గుర్తుచేస్తూ అన్నాడు విస్సు - "అభినందిస్తున్నాను."  
    "దేనికి"    
    "నేను ఎందుకు వచ్చిందీ తెలుసుకున్నందుకు" విస్సులో ఎలాంటి సంచలనమూ లేదు. "అయితే వెళ్ళేముందు ఈ కవరు చూడండి"
    కొన్ని లిప్తల విరామం తర్వాత కవరు అందుకుంది కృషి కవరులోని ఫోటోల్ని చూస్తూ అదిరిపడింది.    
    అవి మామూలు ఫోటోలు కాదు.    
    అతడి గుండెలపై ఆమె ఆదమరిచి నిద్రపోతున్నట్టు తీయబడిన ఫోటోలు.    
    నిలువునా కంపించిపోతున్న కృషిని చూస్తూ అన్నాడు "ఇవి మీ తాతయ్యకి చేరకూడదూ అనుకుంటే ఇప్పటి మీ ప్రయత్నాన్ని విరమించుకోవాలి. తప్పదు"    
    అదిగో అప్పుడు చూసింది కృషి...    
    ఛాంబర్ లో నుంచి తమవైపే వస్తున్నారు ఉపాధ్యాయ.    
    ముందు కృషి గొంతు పెగల్లేదు.    
    వెంటనే తేరుకుని ఉపాధ్యాయ గారికి ఎదురువెళ్ళి  "మీరొచ్చి ఎంతసేపైంది గ్రాండ్ పా" అంది ఫోటోల్ని వెనక దాచేస్తూ..... నిబ్బరంగా నిజాయితీగా బ్రతకడం తెలిసిన కృషికి ఇలాంటి సన్నివేశం అలవాటులేనిది "అదే గ్రాండ్ పా..." అర్ధం కానట్టు చూస్తున్న ఉపాధ్యాయ గారితో అంది.    
    "ముందుకు దూసుకుపోయే వ్యక్తికి ఓ సమస్య సైంధవుడిలా అడ్డుపడినా క్రియేటివిటీ వుంటే నెగ్గుకురావడం కష్టం కాదని చెబుతున్నాను విశ్వనాథ్ కి."    
    "యస్సర్" తననో సైంధవుడిగా ఆమె ఆలోచించడం ఇష్టపడని విస్సు వెంటనే అన్నాడు "మిస్ కృషి ఆ మాట అనగానే అమెరికాలో చదివి వచ్చిన మీకు సైంధవుడి గురించి కూడా తెలుసా అన్నాను. అంతే జవాబు కోసం ఆమె వెదుక్కుంటుండగా మీరొచ్చారు."    
    ఉపాధ్యాయగారి రియాక్షన్ ఏమైనా గాని సైంధవుడి గురించి తనకు తెలీనట్టు విస్సు మాట్లాడ్డం నచ్చలేదు కృషికి - తనను ఓడించడానికి విస్సు ఇక్కడా  సైంధవుడిలాగే అడ్డం పడుతుంటే మొహంలో భావాల్ని అణిచిపెడుతూ అంది "సైంధవుడి గురించి మీకెంత తెలుసో తెలుసుకోవాలని వుంది."    
    "సింధు దేశాధిపతి వృద్దక్షత్రుని కొడుకు జయద్రధుడు. సైంధవుడంటే అతడే."    
    "సైంధవుడు దృతరాష్ట్రుడు కుమార్తె. దుర్యోధనుడి చెల్లెలు అయిన దుస్సలని పెళ్ళిచేసుకున్నాడు" కృషి చెప్పడం ప్రారంభించింది వెంటనే "ఒకనాడు ద్రౌపదిని మోహించి ఆమెను బలవంతంగా ఎత్తుకుపోతుంటే భీమార్జునులు వెళ్లి సైంధవుడు పాండవులందర్నీ ఓడించే శక్తినిమ్మని వరమడిగితే ఒక్క అర్జునున్ని తప్ప మిగతా నలుగురు పాండవుల్ని ఒకరోజు ఓడించే వరమిచ్చాడు శివుడు ఆ శక్తితో పద్మ వ్యూహంలో అడుగుపెట్టిన అభిమన్యుడికి సహాయంగా రాబోయిన ధర్మజ భీమ నకుల సహదేవుల్ని అడ్డగించి ఓడించిన సైంధవుడు అభిమన్యుడి చావుకి కారణమయ్యాడు.    
    ఆ తర్వాత అర్జునుడి చేతిలో హతమయ్యాడు. అలా గొప్పవాళ్ళ పురోభివృద్దికి అల్పుడెవడైనా అడ్డుపడితే అతడ్ని సైంధవుడు అనడం ఆనవాయితీగా మారింది."    
    విస్సు మాత్రమే కాదు ఉపాధ్యాయ గారూ అవాక్కయిపోయారు కృషి చెప్పింది విని- పెరిగింది ఎక్కడైనా ఏ వాతావరణంలోనైనా గాని ఇక్కడి సంస్కృతి గురించి కృషి మరిచిపోకపోవడం ఒక్కటే కాదు - ఒక సాధనలా విషయాన్ని క్షున్నంగా శోధించడాన్ని అలవాటుగా మార్చుకుంది ఇప్పటిక్కూడా-    
    మృదువుగా నవ్వారాయణ "సో....సమస్యల సైంధవుల్ని నెగ్గుకురావాలీ అంటే క్రియేటివిటీ వుంటే చాలంటావు."    
    "యస్ గ్రాండ్ పా..." విశ్వనాథ్ వేపు చూసింది. ఇప్పుడు ఆమె టార్గెట్ విస్సు మాత్రమే- "క్రియేటివిటీ పట్టుదలకీ కారణమౌతుంది. ఆ పట్టుదల ఆలోచనా శక్తిని పెంచుతుంది - ఆ శక్తి పైకి దూసుకొచ్చే చీకటిని ఓడించే విద్యుచ్చక్తి ఉనికిని కనుక్కోటానికి, మనిషి పురోభివృద్దికి, సైంధవులని కడతేర్చే మారణాస్త్రాలని తయారుచేయడానికి, మొత్తం చరిత్ర పరిణామానికి మూలమౌతుంది. దాన్నే కృషి అంటారు."    
    చురుక్కుమందేమో వెంటనే జోక్యం చేసుకున్నాడు విస్సు "కృషి ఒక్కటే చాలదు మిస్ కృషి....దీక్ష కావాలి....దీక్షంటే మొండితనం కాదు"    
    "దీక్ష కావాల్సింది తపోభంగం కాకూడదనుకునే ఋషులకి మిస్టర్ విస్సూ....భంగపడుతున్నా ముందుకెళ్ళే ప్రాక్టికాలిటీకి అవసరం మొండితనమే."        
    "అది రిస్క్ తీసుకోవడం అవుతుంది" తన చర్యని సమర్ధించుకోబోయాడు విస్సు.    
    "ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న పాప్కార్న్ కంపెనీ అధిపతి ఓర్ వెల్లి రెడెన్ బీచర్ తన జీవితాన్ని ప్రారంభించింది ఓ మామూలు సేల్స్ మెన్ గా - ఆదిలో అంతా అతడ్ని అవమానించారు. పాప్ కార్న్ తో వ్యాపారం చూసి రిస్క్ తీసుకుంటున్నావని ఎగతాళి చేశారు. అయినా మొండితనంతో సాధించాడు. ఇప్పుడు రెడెన్ బేచర్ స్లోగన్ "ఒక్కటే నన్ను ప్రోత్సహించి పైకి తెచ్చింది. ఆనాడు నన్ను నిరుత్సాహపరిచిన వ్యక్తుల స్ఫూర్తి!" అలాగే కాలేజీ నుంచి సస్పెండ్ అయ్యాక టెక్సాస్ ఆయిల్ ఫీల్డులో అడుగుపెట్టి వ్యక్తిగతంగా ఆయిల్ ఎక్స్ ప్లోరేషన్ కి సిద్దపడ్డ 'డ్యూక్ రడ్ మన్' పదకొండు సంవత్సరాల సుదీర్ఘకాలం ఓడిపోయాక చివరికి నూనె నిక్షేపాన్ని సాధించాడు. మొండి పట్టుదలతో రెండు వందల ఇరవై మిలియన్ డాలర్ల ఆస్తికి అధిపతి అయ్యాడు. అతడి స్లోగన్ "నా గెలుపులో ఎక్కువ శాతం నన్ను ప్రోత్సహించింది నేను పొందిన వైఫల్యాలే" అన్నది. "సో...." క్షణం ఆగి అంది. "అమెరికాకి చెందిన ఈ ఇద్దరు ప్రముఖులు ఎదిగింది సమస్యల నుంచి రిస్కుల నుంచి మొండితనం నుంచీ - ఇక్కడ మొండితనం అనే పదాన్ని నేను ఎందుకు వాడాల్సి వచ్చిందీ అంటే ఓటమి ఎదురైతే ప్రతిసారీ వాళ్ళు వెనుకడుగు వేయకుండా మొండితనంతోనే ముందుకు దూసుకుపోయారు కాబట్టి"    
    "మీ ఆర్గ్యుమెంట్ ని నేను అంగీకరించలేక పోతున్నాను మిస్ కృషి" ఆమె ఆలోచనా విధానం తప్పని నిరూపించడమే తన ధ్యేయం అన్నట్టుగా చెప్పాడు విస్సు "మీరు చెప్పింది అన్ని రంగాలకీ వర్తించదు. పాట పాడలేని వాడు ఎంత మొండిగా కృషి చేసినా సంగీత విద్వాంసుడు కాలేడు."    
    "అసలు పాటే పాడలేనివాడు సంగీత విద్వాంసుడు కావాలనుకోడు మిస్టర్ విశ్వనాథ్. మరో వ్యాపకం అంటే, తన అభిరుచికి అనుకూలమైన మరో వ్యవహారం వేపు మొగ్గు చూపిస్తాడు. లేదూ మొండిగా సంగీత విద్వాంసుడ్ని మాత్రమే కావాలీ అనుకుంటే ప్రారంభం దగ్గరే అంతమైపోతాడు.    
    "అంటే మొండితనం ఒక్కటే ఏదన్నా సాధించడానికి సరిపోదనేగా" కంక్లూడ్ చేశాడు విస్సు కృషిని ఖండిస్తున్నట్టుగా "యస్ మిస్ కృషి.....మనిషి ఒక గమ్యాన్ని చేరాలీ అంటే కావాల్సింది ముందు సంకల్పం. తర్వాత దానికోసం ప్రణాళిక. ఆ తర్వాత సాధించింది నిలుపుకోటానికి నిర్విరామ పోరాటం.... ఈ పోరాటం అన్నది ఓ స్థాయికి చేరిన సంగీత విద్వాంసుడు రోజూ చేయాల్సిన సాధనలాంటిది. IF YOU MISS ONE DAY PRACTICE YOU NOTICE THE DIFFERENCE. IF YOU MISS TWO DAYS OF PRACTICE, THE CRITICS NOTICE THE DIFERENCE, IF YOU MISS THREE DAYS OF PRACTICE THE AUDIENCE NOTICES THE DIFFERECE. ఇది కేవలం సంగీతానికే కాదు, మనిషి జీవితంలో ప్రతి ప్రక్రియకీ వర్తిస్తుంది."    
    తెలివిగల యిద్దరు వ్యక్తుల మధ్య సాగుతున్న ఆ చర్చ ఉత్సాహాన్ని కలిగించిందో లేక వారి చర్చలలో జోక్యం చేసుకోకూడదనుకున్నారో ఉపాధ్యాయ నెమ్మదిగా లేచి వెళ్ళిపోయారు......ఆ గదిలో తన ముందు అణుకువగా నిలబడటం మాత్రమే తెలిసిన విస్సు యిప్పుడు క్రమంగా ఆ యింటిలోని ఓ వ్యక్తిలా కృషితో మాట్లాడం ఆయనకీ ఆనందంగా వుంది....విస్సు ఉనికిని భరించలేనట్టుండే కృషి సైతం విస్సుని తనతో బాటు ఓ మేధావిగా అంగీకరించడం ఆయన కోరుకుంటున్నదే. ఇక్కడకూడా వ్యాపార బంధంలాగే ఆలోచించారు తప్ప అంతకుమించి స్నేహాన్ని ఆయన ఆశించలేదు... ఆశించరుకూడా.... తన సామ్రాజ్య విస్తరణలో కొందరు విశ్వనాథ్ లు తనకు అండగా వుండటాన్ని ఆయన కోరుకుంటున్నారు. అంతే...    
    ఉపాధ్యాయగారు వెళ్ళాక విస్సు కూడా తన గదివేపు నడవబోతుంటే పిలిచింది కృషి "ఆగు"    
    నిశ్చలంగా చూశాడు విస్సు "తెలివైనదానివి కృషి....మొత్తానికి మీ గ్రాండ్ పాకి ఫోటోలు చూపించే అవసరాన్ని తప్పించావు"    
    కృషి పిడికిళ్ళు బిగుసుకున్నాయి "ఎలా తీశా నీ ఫోటోలు"    
    "అది చెప్పాలీ అంటే కెమెరాలోని రకాలు వాటి ఉపయోగాల గురించి నీకు చిన్న సైజు లెక్చరివ్వాల్సి వుంటుంది."    
    "ఆ వివరాలు నాకు అవసరం లేదు మిస్టర్ విస్సు.... ఈ సాహసాన్ని ఎక్కడ ఎలా చేయగలిగావూ అని"    
    "నీ బెడ్ రూంలోనే..."మృదువుగా నవ్వాడు విస్సు.    
    "అవును కృషి. నీకు ప్రతిరాత్రీ నిద్రపోయేముందు కాంప్లాన్ తాగడం అలవాటుగా. అందులో కొన్ని ట్రాంక్విలైజర్సు కలిపాను..... తర్వాత నువ్వు మత్తుగా నిద్రలోకి జారేక అర్ధరాత్రి నీ బెడ్ రూంలోకి దూరి నిన్ను నా గుండెలపైకి లాక్కుని అప్పుడు..."    
    "స్టాపిట్" అరిచింది ఆవేశంగా.    
    "చెప్పనియ్ కృషీ....నిన్ను నా గుండెలపైకి లాక్కున్నాక నాలో కలిగిన రసాయనికమైన మార్పుల గురించి, ఆ తర్వాత నన్ను నేను అదుపు చేసుకోటానికి నేనుపడ్డ శ్రమ గురించి వివరంగా తెలియచేయనియ్.'    
    "అవసరం లేదు" అది అతడిపైన ద్వేషమో లేక తన ఇంటిలో తనపై చేసిన ప్రయోగానికి తన శరీరాన్ని తనే కోసుకోవాలన్నంత జుగుప్సాకరమైన భావమో కంపించిపోతూ అంది" అసలు ఇలా చేయడానికి నీకెన్ని గుండెలు..."    
    "ఒక లక్ష్యం సాధించడానికి రిస్క్ ఎంత అవసరమో బిజినెస్ టైకూన్స్ రెడెన్ బేచర్ డ్యూక్ రడ్ మన్ ల కథల ద్వారా యిందాకే తెలియచెప్పావుగా కృషీ....అయినా నిన్ను నేనేం రేప్ చెయ్యలేదే....రెచ్చిపోయే నీలాంటి ఆడపిల్లని అదుపు చేయడానికి అవసరమని ఇలా ఫోటోలు తీశాను....అఫ్ కోర్స్ కొన్ని పుట్టుమచ్చల్ని చూశాననుకో."    
    "వ్వాట్" రొప్పుతూ చూసింది కృషి "అంటే నువ్వు...."    
    మనసు విస్ఫోటనంతో మెదడు నిశ్శబ్దం చెదిరిన కృషి కలవరపాటుగా ఆగిపోయింది. అది కలవరం కూడా కాదు. ఏ విషాద నిశీధాల వెన్నెల మరకలో కలుషితమయినట్టు ఇంకా ఒలకని యవ్వన మధు పాత్రలోని అనుభూతుల మాధుర్యాన్నో అనుమతిలేకుండా మరెవరో తాకినట్టు కలత చెందింది.....యింతకు తెగించిన ఈ మనిషి ఇంకా ఏం చేసి వుంటాడు.    
    "కేవలం చూశావే తప్ప ఏదో చేసినట్టు అంత కంగారు పడతావేం - కృషీ" ఆర్ద్రతకి భావుకతని రంగరించి స్వప్నంలోలా అన్నాడు విస్సు. "అప్పటిదాకా తెలీదు నాకు పగిలిపోతున్న క్షణాలలోని నిశ్శబ్దాల మధ్య అందం కూడా ఓ అస్థిత్వం కాగలదని - మనసు పడితే నేను తలదాచుకునే దివ్యరస సౌధానివి కాగలవని అప్పటిదాకా నాకు అర్ధం కాలేదు. ఏకాంతపు పాలరాతి మందిరాన నీ సన్నిధిలో కూర్చుంటే నిన్నటి నా ఎడారి తీరాల్ని మరిచి విస్ఫారిన నేత్రాలలో నీ తనువంతా వెదకాలనిపించింది - అరమోడ్పులైన నేత్రాంచలాల్లో అనంతానంత లోకాల్ని చూస్తూ కదలని నీ పాద మంజీర ధ్వనుల్ని వింటూ ఏ సుదూర తీరాలకో పారిపోవాలనిపించింది ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణం కోరికల గుర్రాల మీద స్వారీ చేసి నీ స్మృతుల జీవన భ్రుతిలో రాలిపోతేనేం అనిపించింది. నీలోని ప్రభాత కోమలత్వాన్ని ఆస్వాదిస్తూ నిన్ను తాకే ప్రత్యూష పవనాన్నై యోగసిద్దిని పొందాలనీ మనసు తొందరపడింది. నఖసిఖ పర్యంతం తక్షకుడిలా కాటు వేయడం నాకు కష్టం కాదు కృషీ. అప్పటి అవకాశం నాది - అయినా నిగ్రహించుకున్నాను ఎందుకో తెలుసా - నువ్వు తరుణివీ వైతరణివీ అన్న ఆలోచన నా మనసు మైదానంలో అలవోకగా మెదిలిన సజీవ స్వప్న లావణ్య శాఖవని."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra