Home » Yandamuri veerendranath » Bharya Gunavathi Sathru

 

    అయితే ఆ డాక్టరు అతడి ప్రశ్నకి సమాధానం చెప్పకుండా, "ఏడోనెలలో ట్వెల్త్ పౌండ్ల బాబా" అన్నాడు ఆశ్చర్యంగా.   
    అక్కడున్న అందరూ ఈ విషయంమీద ఆసక్తి చూపించే సరికి, అకస్మాత్తుగా అది టాపిక్ అయింది.    
    "ఇంటెన్సివ్ కేర్ లో పెట్టలేదా?"    
    "కొన్ని కేసుల్లో అవసరం లేదు-" ఇంకెవరో అన్నారు.    
    "అయినా 12 పౌండ్లంటే.. అది సాధ్యమేనా! ఏమండి, శమంతకమణి గారూ-"    
    శమంతకమణి గైనకాలజిస్టు అందరి కళ్ళూ అటుతిరిగాయి.    
    ఆమె చెప్పిన సమాధానమే ఇప్పుడు బాలు మనసుని తొలిచేస్తూంది ఆమె స్థిరంగా చెప్పింది.    
    "ఏడో నెలలో 12 పౌండ్ల బేబీ - చాలా ఆరోగ్యంగా -మామూలు ప్రసవంలా పుట్టటం దాదాపు అ....సం....భ.....వం..."    
    అతని మూడ్ అప్పట్నుంచీ పాడయింది.    
    అటువంటి మూడ్ లోనే చేయవలసిన మ్యూజిక్ పై గురించి ఆలోచించసాగాడు.    
    ఇంకా రెండు బిట్లు కంపోజ్ చెయ్యాలి.    
    మామూలుగా అయితే రెండు బిట్లూ రెండు నిముషాల్లో కంపోజ్ చెయ్యగలడు తను. అందరినీ ఆకట్టుకునే కొన్ని శబ్దాలు సృష్టించడం....    
    జస్ట్ ప్రొడ్యూసింగ్ వాయిస్ అంతే?    
    కానీ అదికూడా చెయ్యడం అసాధ్యం అనిపిస్తోంది యివాళ.    
    మనసంతా మబ్బుపట్టినట్లు వుంది. వర్షం ముందు వచ్చే దీపపు పురుగుల్లా వెర్రి వెర్రి ఆలోచనలు ముసురుకుంటున్నాయి. రాకూడని అనుమానాలకి తెలియకూడని జవాబుల కోసం వెదుకుతున్నాడతను?    
    తెల్ల చెప్పులు? ఆసెయ్య బావమరిది?    
    తెల్ల చెప్పుల సంగతి అలా వదిలేస్తే రాత్రి తనకంత మొద్దు నిద్దర ఎందుకు పట్టింది?    
    అది అలా ఉంచి టెలిఫోన్.... ఎందుకు అన్నిసార్లు డిస్ కనెక్ట్ అయింది?    
    బురద అంటిన అడుగుజాడలు ఎవరివి? వాచ్ మన్ ని ఉద్యోగానికి ఎందుకు వద్దంది సౌదామిని?    
    ఇదివరకు అంత ప్రాముఖ్యత లేనివిగా కనబడిన చిన్న చిన్న విషయాలు అన్నీ ఇప్పుడు ముఖ్యాతి ముఖ్యంగా గోచరిస్తున్నాయి.    
    మనసు అనే సున్నితమైన తీగలోనుంచి హై ఓల్టేజి కరెంటు ప్రవహిస్తున్నట్లు అనిపించింది బాలూకి. భరించలేనంత ఆ ఉధృతానికి ఫ్యూజ్ వైరు కాలిపోయినట్లు తన మనసు కాలిపోతుందేమో అని భయం కలిగింది బాలూకి.    
    కానీ అలా జరగలేదు. ఆ ఆలోచన రాపిడికి బ్రహ్మాండమైన మెరుపు మెరిసినట్టయింది.    
    ఊహ రూపుదిద్దుకుంది.    
    ఒక యంత్రంలో తమ నిర్ణీతమైన స్థలాల్లో విడిభాగాలు పొందికగా అమరిపోయినట్లు కట్టిన మ్యూజిక్ బిట్లు పాటలో ఇమిడి పోయాయి.    
    వెంటనే ఆ పాటకు నామకరణం చేశాడు బాలూ, 'డౌటింగ్ ధామస్' అని! తనని తనే వెక్కిరించుకుంటున్నట్లు.    
    దానితో అతని మనసు మబ్బుతునకలా తేలిపోయింది.    
    ఆర్కెస్ట్రా రిహార్సల్ మొదలెట్టమని చెప్పి అక్కడినుంచి మారుతీ కార్ల షోరూముకి వెళ్ళి, తనకి అలాట్  అయిన ఎయిర్ కండీషన్డు కారు డెలివరీ తీసుకున్నాడు.    
    తను ఇంతవరకూ కారు సంగతి సౌదామినితో చెప్పలేదు. అందమైన రహస్యంగా వుంచాడు దాన్ని ఒక్కసారిగా సౌదామినిని ఆశ్చర్యములో ముంచేసే ఉద్దేశ్యంతో.    
    ఈ రహస్యం చెప్పెయ్యగానే ఎలా వుంటుంది సౌదామిని మొహం.    
    పెదిమలు బిగపట్టి, తలవంచి, కళ్ళు ఎత్తి విల్లు ఆకారంలో ఉంటే కనుబొమ్మల కింద పదునైన చూపుల తూపులు సంధించి వదులుతుంది. కోపం, నవ్వు కలిపిన కాక్ టెయిల్ లో ముంచి వుంటాయి ఆ చూపుల తూపులు.    
    ఇష్టమూ, కోపమూ ఏక సమయంలో ప్రదర్శించడం సౌదామినికి చేతనైనంతగా ఇంకెవరికీ చేతకాదు.    
    ఎర్రటి ఎయిర్ కండీషన్డు మారుతీకారు- తెరచి వున్న గేట్లోకి ప్రవేశించింది.    
    కారు లాక్ చేసి, మారుతి-సుజుకీ అన్న ఎంబ్లం వున్న కీ చెయిన్ ని అపురూపంగా చూసుకుంటూ ఇంట్లోకి వచ్చాడు బాలూ.    
    కాలింగ్ బజర్ నొక్కాడు.    
    వెంటనే తలుపులు తెరుచుకోలేదు.    
    రెండు నిమిషాలు తర్వాత తలుపు తీసింది సౌదామిని. భీతహరిణీక్షణలా వుంది తను.    
    కొత్తకారు మోజులోవున్న బాలూ ఆ విషయాన్ని గమనించలేదు. "సర్ ప్రయిజ్! సర్ ప్రయిజ్!" అన్నాడు నాటకీయంగా.    
    ఒక్క గుటక మింగి 'ఏమిటి?' అన్నట్టు చూసింది.    
    "అదిగో అటు చూడు" తర్జనితో చూపించాడు బాలూ నవ్వుతూ.    
    అతను చూపించినవైపు కాకుండా లోపలి గదివైపు ఒక్కసారి చూసి, తర్వాత బయటకు దృష్టి సారించింది. బాబు కూడా చూస్తున్నాడు.    
    ఎండలో నిగనిగలాడుతూ కనబడుతోంది మారుతీ-సుజుకీ దాని అద్దంలో.....    
    దెయ్యాన్ని చూసినవాడిలా ఉలిక్కిపడ్డాడు బాలూ! తల వంచుకుని, వెనుక వైపున్న చిన్న గేటుదాటి వెళ్ళిపోతున్నాడు ఒక మనిషి చప్పున ఇంటి వెనక్కు వెళ్ళాడు.    
    ఆ నడక తనకు బాగా పరిచయం . ఎవరిది?    
    కారు తాలూకు ఎర్రటి ఎరుపు బాలూ కళ్ళలో ప్రతిఫలించింది. ఆ మనిషి పరుగులాంటి నడకతో వెళ్ళిపోతున్నాడు. అతన్ని గుర్తుపట్టాడు బాలు.    
    అతను ఆంజనేయులు! బ్రహ్మానంద అనుచరుడు!!    
    అదే సమయానికి అట్నుంచే ఆసెయ్య కూరల సంచీ పట్టుకుని మార్కెట్ నుంచి తిరిగి వస్తున్నాడు. "ఆసెయ్యా! అదిగో! ఆ మనిషిని చూడు! వాడు ఇదివరకు ఇటువైపు ఎప్పుడైనా వచ్చాడా!" అన్నాడు త్వరత్వరగా.    
    ఆంజనేయుల్ని గుర్తుపట్టడం ఆసెయ్యకి పెద్ద కష్టం కాలేదు.    
    "గీదొరనా! గీదొర రెండు దినాలకోసారి ప్రసాదం తెచ్చి అమ్మకి ఇస్తాడు కదూ దొరా! నాకు ఎరికే! మన బాబు అంటే ప్రాణం పెడతాడు గీయన. మంచోడు దొరా!" అన్నాడు.    
    నిశ్చేష్టుడై అలాగే చాలాసేపు నిలబడిపోయాడు బాలు.    
    "దొరా! దొరా!" అంటున్నాడు ఆసెయ్య! మెల్లగా తెప్పరిల్లుకున్నాడు బాలు. అతను తిరిగి ఇంట్లోకి వెళ్ళలేదు. రెండు అంగల్లో కారు చేరి, డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు టర్న్ చేశాడు. కొరడా దెబ్బ తిన్న రేసుగుర్రంలా ముందుకు ఉరికింది కారు! కారు కన్నా వేగంగా వెళుతున్నాయి ఆలోచన్లు. అతడి మనసులో పాత జ్ఞాపకాలన్నీ రీలులా గిర్రున తిరుగుతున్నాయి.    
    ఒకే ఒక దృశ్యం అతడి మనసులో హత్తుకుపోయి ఇప్పటివరకూ వున్నది- ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రింటులా కదలాడుతూంది. కోటనుంచి సౌదామినిని తీసుకు వచ్చేస్తున్నప్పుడు ఆంజనేయులు ఆమె దగ్గిరగా వచ్చాడు. ఆ మాటలు అంటున్నప్పుడు అతడు ఆమెకి చాలా దగ్గరగా, చనువుగా నిలబడి వున్నాడు. లోగొంతుతో ఎంత నెమ్మదిగా మాట్లాడాడు! ఆ మాటల్లో ప్రతిదీ తనకు గుర్తుంది.    
    "ఆర్నెల్ల తర్వాత నిన్ను ఒకసారి కలిసి మాట్లాడుతాను సౌదామినీ! పర్మిషనివ్వు-"    
    గాలిలో తేలి తేలి వచ్చి తన చెవుల కందిన మాటలు ఇవి.    
    ఆర్నెల్లే ఎందుకు?    
    సరీగ్గా ఆర్నెల్లే ఎందుకు?    
    ఆరునెలలకి సౌదామిని డెలివరీ అవుతుందాని వాడికి అప్పట్లోనే తెలుసా?    
    అంటే ఆశ్రమం వదిలేనాటికే సౌదామినికి మూడోనెలా?   
    బాలు తల విదిలించాడు. 'కాదు-కాదు' అని మనసు చెపుతోంది కానీ ఏదో సందిగ్ధం!! బాబు అంత ఆరోగ్యంగా ఎలా పుట్టాడు? ఈ మధ్యకాలంలో ఆంజనేయులు తమ ఇంటికి తరచు వస్తున్నట్టు సౌదామిని తన కెందుకు చెప్పలేదు?    
    తను కొత్తకారు ఇంటికి తీసుకువచ్చినపుడు ఆమె గదిలో ఆంజనేయుల్తో వున్నదన్నమాట నిర్వివాదాంశం.. తను తలుపు తట్టినపుడు తీయటానికి అయిన ఆలశ్యం, ఆమె కళ్ళలో కనపడిన గిల్టీ కాన్షస్ నెస్, వెనుక తలుపుగుండా వెళ్ళిపోతూ, కారు రియర్ వ్యూ గుండా కనపడిన ఆంజనేయులు ఆకారం- ఇవన్నీ నిజాలే. ఏ ఒక్కటీ అబద్దం కాదు.    
    బాలూ శాడిస్టు. సినిక్ కాదు. అనవసరమైన అపోహలతో అపార్ధాలు చేసుకుని మనసు పాడుచేసుకునే వ్యక్తికాదు. అసలు ఈ మాత్రం జరిగిన ఆ స్థానంలో మరొక వ్యక్తి ఎవరైనా వుండి వుంటే ఆవేశంతో వెర్రెక్కిపోయి వుండేవాడు. కానీ అతడు సౌదామినిని ప్రాణంకన్నా మిన్నగా ప్రేమిస్తున్నాడు. అదే బాధ ప్రాణమే మోసం చేసిందన్న వ్యధ. ఎక్కడ ప్రేమ వుంటుందో అక్కడ బాధ అంత ఎక్కువగా వుంటుంది. కోపంకన్నా బాధే ఎక్కువగా వుంది. అందరూ కలిసి తనని మోసం చేశారన్న కసి! మామూలు ప్రేమలూ, పెళ్ళి చూపులూ లేవు. ఒక హిరాయిక్ డీడ్ గా ఆమెని చేసుకున్నాడు. స్నేహం, ప్రేమలకన్నా పెళ్ళి అనే పవిత్రమైన బంధం ముఖ్యమని ఆశించాడు. అసలా కోట వాతావరణంలోనే అదోలాటి కృత్రిమత్వం వుంది. అక్కడ వారందరూ విపరీతమైన తెలివితేటలున్నవారు. కానీ అవి అన్నీ వినాశనానికి దారితీసే తెలివితేటలు భయంకరమైనవి.    
    అటువంటి వాటికి సౌదామిని విభిన్నమైనది అనుకున్నాడు. అది తప్పని తేలుతోంది. తన ఊహే నిజమైతే - తను దారుణంగా మోసపోయాడు! బురదలో పుట్టినా, కమలమనుకొని కోస్తే, అది గడ్డిపూవుకన్నా చౌక అయినదిగా తోస్తోంది. అందుకే అంటారనుకుంటా-ఏడుతరాలు చూసి చేసుకోవాలని.    
    మనసులో ఇంత సంఘర్షణ జరుగుతున్నా అతడు సౌదామిని గురించి పూర్తిగా ఒక నిర్ణయానికి రాలేదు. ఈ ఆరునెలల సామీప్యత ఆమె గురించి 'చెడు' ని ఆలోచించనివ్వటంలేదు. తనపట్ల ఇంతవరకూ చూపిన ఆప్యాయత కూడా నాటకమేనా? అన్న ఆలోచన్నే అతడు భరించలేకపోతున్నాడు. అది తేల్చుకోవాలనే ఇప్పుడు ఇంత వేగంగా వెడుతున్నాడు.    
    ఇప్పుడు తెలియబోయే నిజం అతడి భవిష్యత్తుని నిర్దేశిస్తుంది.    
    అది అగ్ని పర్వతమే అవుతుందో, శీతల పవనమే అవుతుందో, రాబోయే రెండురోజుల కాలమే నిర్ణయిస్తుంది.    
    అతడి కారు నర్సింగ్ హోమ్ ముందు ఆగింది.    
                                               *    *    *    
    ఈ రెండేళ్ళలో ఇంకా లావెక్కినట్లు కనబడుతోంది డాక్టర్ మృదుల బుగ్గలు లావయిపోయి, కళ్ళు చిన్నవిగా కనబడుతున్నాయి. కానీ ఆ కళ్ళలో స్నేహపూర్వకమైన పలకరింపూ, ఆమెకు సహజమిన్ దయాగుణం తొంగిచూస్తూనే వున్నాయి.    
    ఆమె బాలూని గుర్తుపట్టలేదు. అతను తనని తాను పరిచయం చేసుకోవడానికి కొంచెం కష్టపడవలసి వచ్చింది.    
    "రెండేళ్ళక్రితం డాక్టర్! నా భార్యకి డెలివరీ టైం అయినా గవర్నమెంటు హాస్పిటల్లో డాక్టర్లు కనుక్కోకపోతే, మీరు దేవతలా కనబడి రక్షించారు. గుర్తుందా డాక్టర్?"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra