స్టేషన్ కు దగ్గర్లో వుందికాబట్టి వారిడ్డారూ సుందరరావు పడుకున్నారా రాత్రి. వీరిద్దరితోపాటు సుందరరావుకూడా లేచి వేడి వేడి పాలూ, ఈశ్వరరావు పొగలుకక్కే కాఫీ తయారుచేసి ఇచ్చి- తను మాత్రం బెడ్ కాఫీ తీసుకున్నాడు. వీళ్ళు వెళ్ళగానే అతను మళ్ళీ నిద్రకు పడతాడని తెలుస్తూనే వుంది.
ఇద్దరూ అన్నీ సర్దుకుంటూండగా- సుందరరావు వెళ్ళి ఆటో పీల్చుకుని వచ్చాడు. ఇద్దరూ బ్యాగులతో పాటు కొద్దిగా పెరిగి వ్రే ప్యాకెట్ల రూపంలోకి మారిన తమ సామానును- ఆటలోకి ఎక్కించి- సుందర్రావుకు శతధా ధన్యవాదాలర్పించి- స్టేషనుకు తరలి వెళ్ళారు.
ట్రయిన్ ఆరుకూ, ఆరున్నరకూ మధ్యలోవుంది. ఒక్క నిముషంకూడా తేడా లేకుండా కరెక్టు టయిమ్ కి ట్రయిన్ వచ్చేసింది. బోగీ నంబర్ తో సహా అన్నీ కరెక్టుగా తెలిసిన మీదట- ట్రయిన్లో ఎక్కడానికి ఎంతోసేపుపట్టలేదు. ట్రయిన్లో కండక్టర్ గా వున్నా కఫూర్ ని ఈశ్వర్రావు గుర్తు పట్టాడు. కఫూర్ కథను గుర్తులేడు. ఈసారి తనను మర్యాదగా పలకరించినందుకు ఈశ్వర్రావు సంబరపడి- "వీడి ట్రయిన్లో కెలా గొచ్చాడూ- అని కఫూర్ అంటాడేమోనని భయపడ్డాను..." అని రాజారావుతో చెప్పుకున్నాడు.
"ఒకసారి చూసిన కండక్టర్ని మళ్ళీ చూడడం - రైలు ప్రయాణాల్లో ఇదే ప్రధమంనాకు..." అన్నాడు రాజారావు "అయినా మీరు చేసిన ప్రయాణాలెన్నిలేండి?" అన్నాడు ఈశ్వర్రావు.
ఇద్దరివీ పక్కపక్క సీట్లు అది రాజధానీ ఎక్స్ ప్రెస్. లోపల అంతా ఎయిర్ కండీషన్లు. కుషన్ సీట్లు. రాజారావు ఈశ్వర్రావుతో - "విమానాల్లో సీట్లూ, సీటింగ్ అరేంజి మెంటూ ఇలాగే వుంటుంది..." అన్నాడు.
ఈ మాటలు విని ఈశ్వరరావు కంపార్టుమెంటంతా కలయజూడసాగాడు. కొద్దిసేపలాచూసి- "మా అత్తారింటికి వెళ్ళి నేను విమాన ప్రయాణం చేశానని చెబుతాను. ఒకవేళ నిజంగా విమాన ప్రయాణం చేసిన వాడున్నా దొరక్కుండా వుండడానికి బోగీ అంతా పరిశీలిస్తున్నాను__" అన్నాడు.
కంపార్టుమెంటు చూస్తుంటే రాజారావుకి చాలా బాధకలిగింది. అతనికి జనరల్ కంపార్టుమెంటు గుర్తుకొచ్చి__"దేశంలో సోషలిజం ఏర్పడాలనీ-పేదా, గొప్పా తేడాలుండకూడదని గోషించే ప్రభుత్వం- కాసింత డబ్బు తేడాతో ప్రయాణికులపట్ల ఎంత పక్షపాతంతో వ్యవహరిస్తోందో?" అనుకున్నాడతను.
జనరల్ కంపార్టుమెంటులో ఎక్కేవాడిలాంటి కంపార్టుమెంటు ఎక్కాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి. ఆ డబ్బు సంపాదించాలానే కోరిక తీవ్రతరం కావడానికి ఈ తేడా ఒక ముఖ్య ఆకర్షణ! ఆ విధంగా సామాన్యుడు డబ్బుకోసం తప్పటడుగులు వేయవచ్చు. సమాజంలో తేడాలు తొలగించాలనుకునే ప్రభుత్వం- రైళ్ళలో ఈ తేడాలనెందుకు తొలగించదు? డబ్బున్నా లేకపోయినా అందరికీ ఒకేరకం సదుపాయాలెందుకు చేయదు?
రాజారావు బాత్రూంలోకి వెళ్ళాడు. అక్కడ చక్కటి వాసన వేస్తోంది. సాధారణంగా ట్రయిన్సు లో బాత్రూం లో అడుగు పెడితే- ఎప్పుడు బయటపడతామా అనిపిస్తుంది. ఈ బాత్రూంలోకివెళ్ళిన రాజారావు కాలకృత్యాలు సుందరరావు ఇంతో తీర్చుకున్నందుకు విచారించాడు.
ట్రయిన్ కదిలింది. చాలామంది తమ తమ సీట్లను వెనకు వాల్చి పడుకున్నారు. ఈశ్వర్రావు నాలుగైదుసార్లు తన సీటును వెనక్కుతోసి చూశాడు. అది వాలలేదు. రాజారావుని అడగడానికి మొహమాటపడి అతనలాగే కూర్చున్నాడు. అప్పుడప్పుడు ఓరగా రాజారావుని పరిశీలిస్తున్నాడు. అతనూ సీటు వాల్చుకుంటాడేమోనని కానీ ఈలోగా రాజారావు ఓ పర్యాయం బాత్రూంకి వెళ్ళివచ్చి- దాని సోయగాన్ని పొగిడాడు. ఈశ్వర్రావుకూ వెళ్ళాలనిపించి వెళ్ళాడు.
ఈశ్వరరావు వచ్చేలోగా రాజారావు పక్కసీట్లో కూర్చున్న ముసలావిడ తన సీటును వెనక్కివాల్చి పెట్టమని కోరింది. రాజారావు ఏమిటని అడిగాడు. ఆవిడమళ్ళీ హిందీలో చెప్పింది. అర్ధంకాని ముఖం పెట్టాడు రాజారావు.
"నీకు హిందీ రాదా?" అనడిగిందావిడ.
"నేను సౌత్ ఇండియన్ ని-" అన్నాడు రాజారావు. అప్పుదావిడ అభినయ పూర్వకంగా సీటువాల్చిపెట్టమని అడిగింది అడిగేక రాజారావు ముఖం చూసేక సౌత్ ఇండియన్సు కి తన భాషేకాక అభినయంకూడా అర్ధంకాదేమోనని అనుమానం వచ్చిందావిడకు. ఆవిడ అభినం చేస్తూండగా ఈశ్వర్రావు అక్కడికి వచ్చాడు. అతనికి విషయం అర్ధమయింది. వెంటనే సీటు పక్కనున్న బటన్ వుపయోగించి ఆవిడ సీటు వెనక్కు వాలేలాచేశాడు. తర్వాత రాజారావు వంకచూసి_ "ఎలాంటి యక్షనైనా అర్ధం చేసుకోగలను నేను..." అన్నాడు.
"యాక్షనేం కర్మ- ఆవిడ భాషకూడా నాకు చక్కగా అర్ధమయింది. ఎటొచ్చీ సీటునెలావాలుస్తారో మరిచిపోయాను ఎంత ఫారిన్ వెళ్ళినా రానూ పోనూ మాత్రమేగదా-విమాన ప్రయాణం-!" అన్నాడు రాజారావు. తన సీటునుకూడా వెనక్కు వాలుస్తూ ఈశ్వరరావు నవ్వి- "ఇంకా నేను మిమ్మల్నడగాలనుకున్నాను-" అన్నాడు.
"మరి మీకెలా తెలిసింది?"
"నేను బాత్రూంకి వెడుతూంటే ఒకాయన ఈ పని చేస్తూండగా చూశాను."


