Home » M d sowjanya » Soujanya Saahithi

               
    
                                భూపతిగారి  భూతదయ
                                                                                  ---వసుంధర


    భూపతిగారి భూతదయాగుణం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
     ఆయన భౌద్ద జైనమతాలకు చెందిన వ్యక్తికాడు ఆఖరికి బ్రాహ్మణుడు కూడా కాడు. ఆయన మాంసాహారం జోలికిపోడు. మాంసంవైపు చూస్తెనే ఆయనకు జంతువులు గుర్తుకువచ్చి మనసు పాడైపోతుందిట. జీవహింస నాయన. ఏమాత్రమూ సహించలేడు, క్షమించలేడు.
     ఈ సృష్టిలో అమాయకమైనవీ, మూగవీ అయిన జంతు పక్షి సముదాయ ముండడం వల్లనే ప్రకృతికి శోభ వచ్చింది. మనిషికి వలెనే వాటికీ బ్రతికే హక్కువుంది. సమ్మెలు చేయలేనంత మాత్రాన, తమబాధను ప్రకటించుకోలేనంత మాత్రాన మనిషి వాటి విషయంలో క్రూరంగా వుండడం చాలా పెద్దనేరం.
     వన్యమృగ సంరక్షణకు సంబంధించిన ఓ సంఘంలో భూపతిగారు గౌరవసభ్యుడు. ఆయన మా ఎదురింటి వ్యక్తి కావడంవల్లనూ, మా ఇంట్లో అందరికీ ఆయనంటే అపరిమితమైన గౌరవాదరాభిమానాలుండటంవల్లనూ, నాకాయనతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఆరాధనగా నారడానికెంతో సేపు పట్టలేదు.
     చాలా విషయాలు నే నాయన్నడిగి తెలుసుకుంటూండేవాడిని. 'చెట్లకు కూడాప్రాణ ముందంటారు కదా. కూరగాయల్లో జీవపదార్దమున్న విత్తులుంటవి గదా. వాటిని  నిర్దాక్షిణ్యంగా వండుకొని తినగలుగున్న మనం మాంసాహారులన్న ఏ విధంగా గొప్పవాళ్లం? అనడిగాను - ఒక  పర్యాయం.
     భూపతిగారు నవ్వి - 'ఇది చాలా సామాన్యమైన సందేహం. చెట్లకు మనవల్ల హాని కలగడంలేదు. మనమో కొమ్మ విరిస్తే చెట్టు చనిపోదు. మనం ఆకులు దూస్తే అది మళ్లీ చిగుర్చుతుంది. మనం నాలుగుకాయలు కోస్తే మళ్లీ ...అని ఆగి - 'వివరించనక్కర్లేదుగా' అన్నారు.
    'జంతువుల విషయమూ అంతేగదా - బోనేరపిల్లని చంపామనుకోండి. దాని తల్లి మళ్లీ పిల్లల్ని కనగలదు. కోడి రోజు గ్రుడ్లు పెట్టగలదు....' అన్నాను.
     'నువ్వు చెప్పింది బాగానే వుంది. కానీ నువ్వోలేడిని చంపితే అదేమో బ్రతికిరాదు. కాని చెట్ల విషయంలో అలాకాదు. అదీకాక ప్రాణాలు రెండురకాలు. చెట్లు జడ ప్రాణులు. అవి భగవంతుడిచేత మనిషి కి ఆహారం కావడానికి  సృష్టించబడ్డాయి....' అన్నాడు భూపతి.
     'మాసాంహారం కూడా భగవంతుని దృష్టిలో తప్పుకాదేమో - పెద్దచేప చిన్నచేపని మింగడమూ, సింహాలు లేడిని వేటాడటమూ, సృష్టిలో ఒక  భాగమే కదా!' అన్నాను.
     'అది నిజమేనోయ్. కాని మనిషికీ జంతువుకీ తేడాలేదంటావా? చంపడానికి కత్తినెత్తిన కసాయివాడి  వంక చూసే ఆ జంతువుచూపు, మెడను మెలపెట్టడానికి వచ్చే వంటవాని వంక కోడిపిల్ల మనసులో కలిగే సంచలనం  - తలచుకుని వణికిపోగల ఆలోచనాశక్తి మనిషికుంది. అది వుండి జీవ హింస చేసేవాడెంత క్రూరుడో ఆలోచించు...' అన్నాడు భూపతి.
     'క్రూరత్వం కూడా సృష్టిలో బాగమేకదా -' అన్నాను నేను.
     'వాదన ద్వారా మాంసాహారం తప్పని ఋజువు చేయడం కష్టమనుకో - అందుకే నేను నా ఉపన్యాసాల్లో మాంసాహారం గురించి చెడ్డగా చెప్పను. భూతదయ గురించి ప్రోత్సహిస్తాను. అట్నించి నరుక్కు రావడమంటే ఇదే!' అన్నాడు భూపతి.
     భూపతిలో  గొప్పదనం ఇదే - ఆయన తనవాదమే సరియైనదంటూ పట్టుకొని కూర్చోడు. ఎంత చిన్నవాడైనా ఎదుటివాడు చెప్పేది వింటాడు. అవసరమనిపిస్తే తన అభిప్రాయాలు మార్చుకుంటాడు కూడా. ఆయన తన ఉపన్యాసాలలో భూతదయ ప్రాముఖ్యతను వివరిస్తాడు. తప్పితే మాంసాహారులను నొప్పించడు. ప్రపంచంలో వారి సంఖ్యే ఎక్కువనీ వారిలో ఆలోచనాశక్తి అధికంగా వున్నవారు చాలామంది వున్నారనీ ఆయనకు తెలుసును.
     మాంసాహారం గురించి ఆయన చెప్పేది ఒకే ఒక్క విషయముంటుంది - 'శాకాహారి , మాంసాహారి కూడా జీవహింస చేస్తున్నారు. ఎటొచ్చీ ఇందులో తరతమ భేదాలు మాత్రం చూసుకోవాలి!'
    తన ఉపన్యాసంలో శ్రోతల కన్నులనీరు తెప్పించగల సామర్ద్యం భూపతిగారికి వుంది. ఆయన ఉపన్యాసాలు విని మాంసాహారం విడిచిపెట్టినవారు కొద్దిమందైనా వున్నారు.
     ఒక పర్యాయం భూపతిగారి గ్రామంలో అమ్మవారి జాతరకు పెద్ద ఎత్తున జంతుబలులు జరుగుతున్నట్లు ఆయనకు వార్త అందింది. అమ్మవారా సంవత్సరం చాలామందికి మొక్కుకున్ భక్తుల కోర్కెలు తీర్చిందట. భూపతిగారు చెప్పుకోదగ్గ ధనవంతుడు కాబట్టి ఊళ్లో ఆట్టే వుండకపోయినా  ఆయనకు అక్కడ చాలా పలుకుబడి వుంది. అది ఉపయోగించి జంతు బలులాపడానికి  తన గ్రామం వెళుతూ ఆయన నన్నుకూడా రమ్మనమని కోరారు. ఇదేదో  చారిత్రాత్మక సంఘటన వంటిదని అభిప్రాయపడినోళ్లలో స్వయానా తిలకించేటందుకు నేనూ ఆయనతో వెళ్లాను.
     అమ్మవారి ఆలయంవద్ద గొర్రెపొటేళ్ళు మేకలు, కోళ్లు - చాలా వున్నాయి. భూపతిగారు అక్కడి దృశ్యం చూసి చలించిపోయి - 'ఇదేదో మిలటరీహోటల్లో, వంటశాల లాగున్నది కానీ అమ్మవారి అలయంలా లేదు- అన్నాడు. ఆయన మీద గౌరవంకొద్దీ ఎవరూ మాట్లాడలేదు. తర్వాత ఆయన ఆ బలుల నాపవల్సిందిగా అందర్నీ కోరారు.
     'అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారి కోరికమీద జరిగే బలులు మనుషుల మాటమీద ఆగవు' అన్నాడు పూజారి. అతను బాగా తాగివున్నట్లు తెలుస్తోంది.
     భూపతి ఎంత చెప్పినా ఎవ్వరూ వినలేదు. ఆన పెద్దమనిషి కాబట్టి సరిపోయింది కానీ లేకుంటే చాలుదెబ్బలు తిని వుండేవాడని నాకు అనిపించింది. మా కళ్ళముందే మొట్టమొదటగా ఓ పొట్టేలు పుచ్చ ఎగిరి  ఎర్రటిరక్తం గాలి లోకి చిందింది. భూపతి కెవ్వుమని కేకవేసి పడిపోయాడు. నలుగురైదుగురు పరీక్షించి చూడగా ఆయనకు స్పృహ తప్పినట్లు తెలిసింది. నేనూ మరో ఇద్దరూ కలిసి ఆయన్ను సాయంపట్టి ఊళ్ళోని హాస్పిటల్ కు తీసుకువెళ్లాం. ఓ గంట తర్వాత  ఆయనకు స్పృహ వచ్చింది. నన్ను చూసి -  'ఓడిపోయానోయ్ - మన వూరు పోదాం - అన్నాడాయన. ఆయన ముఖం చూస్తె నాకు జాలివేసింది.
     ఆ రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకుని మర్నాడుదయమే అక్కణ్ణించి బస్సులో బయల్దేరి పదకొండు గంటలయ్యే సరికి మా పట్నం చేరుకున్నాం. అప్పటికే ఎంత మాడ్చేస్తోంది. ఇంటికి వెళదామంటే రిక్షావాళ్లందరూ ధరలుబాగా పెంచేశారు. అడగవలసిన దానికంటే ఓ రూపాయెక్కువ అడిగేస్తున్నారు. నాకూ, భూపతిగారికి ఒళ్లు మండిపోతోంది.
     'ఏమైనా సరే రూపాయిన్నర కు పైసా కూడా ఎక్కువియ్య వద్దు. ఎప్పటికి దొరికితే అప్పుడే' అన్నాడు భూపతి.
     "ఆఖరికి నేను చెప్పిన రేటుకి ఓ రిక్షావాడు దొరికాడు. వాడు మరీ పదహారేళ్ల కుర్రాడిలాగున్నాడు. కాళ్లకు చెప్పుల్లేవు. చిన్న ముతకపంచె కట్టుకొన్నాడు. వంటిమీద మరే ఆచ్చాదనా లేదు. మనిషిలో అట్టే శక్తి వున్నట్లులేదు. కష్టం మీద రిక్షా తొక్కుతున్నాడు. భూపతిగారెంత తొందర పెట్టినా వాడి వేగం పెరగడంలేదు.
     "కొత్తగా నేర్చున్నావేమిటి?' అనడిగాడు.
     "అవునండి. మా నాయన కిప్పుడు జ్వరం...." అంటూ వాడు తన కష్టగాథ మొదలుపెట్టాడు. రిక్షా వేగం తగ్గింది.
    'నీ రొద ఇంకోరోజు వింటాం కానీ - కాస్త వేగంగా పోనీ - రూపాయిన్నర కొచ్చావు గదా అని నీ రిక్షా ఎక్కితే' అంటూ విసుక్కున్నాడు భూపతి.
     'బాగా ఎండగా వుందిబాబూ  - ఇంతవరకు బోణీలేక ఒప్పుకొన్నాను కానీ ఇంత ఎండలో అంతదూరం రెండున్నర కెవ్వరూ తక్కువరారు బాబూ -' అన్నాడు రిక్షావాడు వేగం హెచ్చించడానికి ప్రయత్నిస్తూ. వాడిఒళ్లంతా చెమటలు కారిపోతున్నాయి. వెనకాల సీట్లో కూర్చున్న మాకే ఆ ఎండలో సుఖంగాలేదు. మరి వాడి కెలాగుందో ?
    'వీళ్ళతో కబుర్లకి దిగకూడదు. ఇలాగే మాట్లాడతారు...' అన్నాడు భూపతి.
                                                        *    *    *    *
     ఇంతలో ఎత్తువచ్చింది. రిక్షావాడు దిగాడు. వాడిబాధ నేను చూడలేకపోతున్నాను. రిక్షా దిగితే వాడికి కొంత తేలికవుతుందనిపించింది. కానీ భూపతిగారు నన్ను దిగనివ్వలేదు. "రూపాయిన్నరిచ్చింది దిగినడవడానికా - కూర్చో!"  అన్నారు. నేనేమీ మాట్లాడలేక పోయాను. కానీ ఏదోలా వుంది.
     'ఈ రిక్షాలుపోయి అందరూ టాక్సీలు నడిపేరోజు లెప్పటికివస్తాయో -' అని మనసులో అనుకొన్నాను. ఇల్లుచేరేక రిక్షావాడికి అదనంగా ఓ అర్దరూపాయిద్దామని భూపతిగారికి రహస్యంగా సజెస్టు చేశాను. ఆయన అంత రహస్యంగానూ నన్ను మందలించి 'మనమో అర్దరూపాయెక్కువిస్తే వీళ్ళు కోడినికొని వండుకుతినే రకాలు. బొత్తిగా భూతదయలేని వెధవలు -' అన్నాడు. రిక్షావాడెంత వేడుకున్నా వాడికో పైసాకూడా ఎక్కువియ్యలేక పోయాను.
     తర్వాత ఇంట్లోకి వెళ్లి దేవుడి పటంముందు నిలబడ్డాను. నాకేదో బాధగా వుంది. భూపతిగారిలో నిజంగానే భూతదయ వుంది. పదిహేను రూపాయలకుపైగా ఖర్చుచేసి జంతుబలిని ఆపడానికి వెళ్లాడాయన. జంతుబలిని చూసినప్పుడు నిజంగానే ఆయనకు స్పృహతప్పింది. అటువంటి మనిషి సాటి మనిషి కష్టాలకెందుకు చలించటం లేదు! - 'భూపతిగారి వంటి మనుషులైనా మనిషిని మనిషిగా కాక జంతువుగా గుర్తించేలాచేయి భగవాన్ - ' అని దేవుని కోరుకున్నాను.
                                        *

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra