Home » Dr jandhyala papayya sastry » Karunasri Sahityam - 4 - Balasahiti - 2


                         మూఁడు వరములు

    ఒక గ్రామమునందు సోమయ్య రామయ్య యను నిరువురు స్నేహితులుండిరి. సోమయ్య భాగ్యవంతుఁడే కాని పరమలుబ్ధుఁడు. బీదసాదలకు పిడికెడు గింజలైన దానధర్మము చేసెడివాఁడు కాఁడు. తాను దినక మఱి యొకరికిఁ బెట్టక యాతఁడు తన ధనమును చీమవలె గూడబెట్టుచుండెను.
    రామయ్య గర్భదరిద్రుడు. కాని కనికరము గలవాఁడు. పేదరికముతో తాను బాధపడుచున్నను, బీదసాదకు లేదనువాఁడు కాఁడు. తన యింటికి వచ్చి చే సాచినవారికిఁ దనకున్నంతలో దృణమో కణమో దానము చేయుచుండెడివాఁడు.
    భగవంతుడు వారిరువురను బరీక్షింపనెంచెను. ఒకనాఁడాయన వృద్ధభిక్షుకుని వేషము ధరించి, సోమయ్య సౌధములోఁ బ్రవేశించెను. ఇంతలో మేడలోనుండి సోమయ్య వీధిలోనికి వచ్చుచుండెను.
    సోమయ్య " ఎవడవురా నీవు? వెళ్ళు, వెళ్ళు.
    భిక్షకుఁడు : బాబూ! ప్రొద్దు క్రుంకినది. ఈ రాత్రి నే నెచ్చటకు పోలేను. ఈరేయి మీ పంచలోఁబరుండి తెల్లవాఱఁగనే లేచి పోవుదును.
    సోమయ్య : ఓరీ! ఇదేమి ధర్మసత్ర మనుకొంటివా? కళకళ లాడుచుఁ గాపురమున్న గృహములో నీవంటి పీనుగులను గాలుపెట్టనిత్తు రనుకొంటివా? పొమ్ము! పొమ్ము!
    భిక్షుకుఁడు : బాబూ! వయోవృద్దుఁడను. కన్నులు కాన్పింపవు. కనికరింపుఁడు.
    సోమయ్య : ఛీ! పో! ఈ దొంగవేషములు నే నెఱుంగుదును. మర్యాదగా వెడలిపోదువా మెడబట్టి గెంటవలయునా?
    భిక్షుకుడు కదలలేదు. సోమయ్య గబగబ వచ్చి వానిని బలవంతముగా బయటకు గెంటి తలుపు బిగించుకొనెను. కపట భిక్షుకుఁడు లోలోన నవ్వుకొనుచు నెదురుగా నున్న రామయ్య కుటీరములోనికిఁ బ్రవేశించెను.
    భిక్షుకుఁడు : ఎవరు బాబూ! నాకీ రాత్రి తలదాచుకొనుటకు కొంచెము చోటిత్తురా?
    రామయ్య : (వెలుపలికి వచ్చి) ఎవరు నాయనా నీవు? పాపము చీకటిపడి వచ్చితివి. పెద్దవాఁడవువలె నున్నావు. రా! లోపలికి రా!
    భిక్షుకుఁడు : నా రాక మీకుఁ గష్టము గలిగింపదుగదా! ఈ రాత్రి నా కిచ్చట కొంచెము చోటిత్తురా?
    రామయ్య : నీ కిచ్చట నెట్టి యభ్యంతరమును లేదు. ఇవిగో ఈ రొట్టెలు తిను. ఈ మజ్జిగ త్రాగు.
    రామయ్య భిక్షకున కాశ్రయమిచ్చి సత్కరించెను. భిక్షుకుఁడు రొట్టెలు తిని మజ్జిగ త్రాగి పరుండెను. పాపము రామయ్య కా రాత్రి యుపవాసమే!
    తెల్లవారినది భిక్షుకుఁడు మేల్కొని రామయ్యను జూచి "ఓయీ! నేను భగవంతుడను. నిన్నుఁ బరీక్షింప వచ్చితిని. నీ భక్తికి మెచ్చితిని. నీకేమి కావలయునో కోరుకొనుము" అని పల్కెను, రామయ్య భగవంతుని పాదములపైఁబడి "స్వామీ! నకేమియు వలదు. నిరంతరము మిమ్ము ధ్యానించుచుఁ గలిగినంతలోఁ బరోపకారము చేయుచు నుండున ట్లనుగ్రహింపుడు" అని ప్రార్థించెను. భగవంతుడు "మంచిది అట్లేయగుగాక!"యని పలికి యటనుండి బయలుదేరెను.
    ఆయన నాలుగడుగులు వేసెనో లేదో రామయ్య కుటీరము రమణీయమైన రత్న ప్రాసాదముగా మారిపోయెను. అకస్మాత్తుగాఁ దళతళ మెరయుచున్న బంగారు భవనమును జూచి యచ్చటి వా రచ్చెరువొందిరి.
    సోమయ్య పరుగు పరుగున వచ్చి రామయ్యను జూచి "ఓయీ! నీకీ భాగ్యమెట్లు ప్రాప్తించినది?" అని ప్రశ్నించి జరిగిన వృత్తాంతమంతయుఁ దెలిసికొని మిక్కిలి పశ్చాత్తాప పడెను. "సిరి రా మోకాలొడ్డి" నట్లు తనయింటికి వచ్చిన భగవంతుని బరాభవించినందుల కాతఁడెంతయు సంతాపమందెను వెంటనే సోమయ్య భిక్షుకుఁడుపోయిన త్రోవవెంబడి పరువులిడెను.
    కపట భిక్షుకుఁడు మెల్లమెల్లఁగా నడుగులో నడుగులిడుచు నడచిపోవుచుండెను. సోమయ్య యాతని చరణములకు సాష్టాంగపడి "స్వామీ! క్షమింపుఁడు. అపరాధము జరిగినది. మాగృహమునకు విచ్చేసి మాయాతిథ్యము స్వీకరించి మాకు వరములిచ్చి మమ్మను గ్రహించి పొండు" అని ప్రార్థించెను.
    భగవంతుఁడు చిరునవ్వు నవ్వి "ఓయీ! నిన్ను క్షమించితిని. కాని తిరిగి వెనుకకు రాలేను. నీకు మూఁడు వరములిత్తును. కోరుకొనుము" అని పలికెను. సోమయ్య యానందమున కవధి లేకపోయెను. అధిక లాభము లభించునట్టు లా మూఁడు వరము లేవిధముగా కోరవలయునో వానికిఁదోచఁలేదు. ఎంత యాలోచించి బుర్ర బద్దలు కొట్టుకున్నను నాలుబ్ధేగ్రేసరునకేమి యడుగుటకుఁ బాలుపోలేదు.
    అంతట సోమయ్య భగవంతుని జూచి "స్వామీ! నేనిప్పుడేమియుఁ గోరుకొనలేను. ఇంటి కరిగి సావధానముగా నాలోచించుకొని కోరుకొందును" అని బ్రతిమాలుకొనెను. జగన్నాథుఁడు కరుణించి "ఓయీ! నీవు నీ గృహము చేరిన యనంతరము మూఁడు పర్యాయము లేమి కావలయునన్న నది యగును పొ"మ్మని పలికి యంతర్హితుఁడయ్యెను.
    సోమయ్య పరమానంద పరవశుఁడై యింటికి బరువెత్తుకొని వచ్చెను. అతఁడు వాకిట నలుగు పెట్టునప్పటి కొక వాయసము వాని శిరస్సుపై రెట్టవైచెను. సోమయ్య కోపముతో "ఛీ ఈపాడు కాకి నాశనముగాను! ఇదెక్కడ దాపురించినదిరా!" అనుచుండగనే భగవంతుని వర ప్రభావము వలన కాకి 'కావు కావు' మనుచు నేలపైఁ బడి ప్రాణములు విడిచెను.
    సోమయ్య విషణ్ణుఁడై "అయ్యో! నేనెంత మందబుద్ధిని. మూడు వరములలో నొక వరము వ్యర్థముగాఁ బాడు జేసికొంటిని. ఇఁక జాగరూకుఁడనై శేషించిన రెండు వరము లైనను సద్వినియోగము చేసికొనవలయును" అని నిశ్చయించుకొనెను. వెంటనే యతఁడు తన యింటివెనుక తోటలోనికిఁబోయి యేకాంతముగా నొక శిలాఫలకముపై నాసీనుఁడై యాలోచింపసాగెను.
    సోమయ్య భార్య బుద్ధిమంతురాలు; సుగుణవతి. ఎంతసేపటికి భర్త తిరిగి రానందున నామె యొక సేవకుని దోఁటలోనికిఁ బంపించెను. సేవకుడు యజమాని చెంతకు వచ్చి "బాబూ! ప్రొద్దెక్కినది. అమ్మగారు మిమ్ము శీఘ్రముగాఁ బిలుచుకొని రమ్మనినారు" అని విన్నవించుకొనెను. తనయాలోచన కంతరాయము కలిగినదను నావేశములో మైమరచి సోమయ్య "పోరా! నేను రాను. నేనిచ్చటనే కూర్చుందును" అని బిగ్గరగా నరచెను. సోమయ్య భార్య భర్తను బ్రతిమాలి పిలుచుకొని పోవుటకై యచటికి వచ్చెను.
    ఆమె భర్త సమీపమునకు వచ్చి "యింటిలోనికిఁ బోవుదముర"మ్మని యెంతయో ప్రాధేయపడెను. సోమయ్య లేవఁబోయెను. కాని పాపమాతని శరీరము బండ కంటుకొనిపోయెను. అతఁడెంత ప్రయత్నించినను శిలాఫలకము నుండి లేవలేఁ డయ్యెను.

           

    సోమయ్య తన తెలివిలేమికి విచారించుచు జరిగిన సమాచారమంతయు భార్యకు వినిపించెను. రెండవ వరముకూడ నిష్ఫలమైపోయెనని యాతఁడు గోడు గోడున దుఃఖించెను. సోమయ్య భార్య "భగవంతుఁ డనుగ్రహించిన బంగారువంటి వరములను పరమ లుబ్ధుఁడవై పాడుచేసికొంటివి. "పిల్లికి బిచ్చము పెట్టని పిసినిగొట్టు" వగుటవలన నీకీ యధోగతి కల్గినది. సరే ఇఁక నేమి! మిగిలియున్న మూడవ వారము నుపయోగించి యీ పాషాణమును వదిలించుకొమ్ము" అని తన భర్తగారికి హితోపదేశము చేసెను.
    సోమయ్య భార్య చెప్పిన విధముగాఁ బ్రవర్తించి 'బ్రతుకుజీవుడా' యని బయటపడెను. నాఁటినుండి యాతఁడు బుద్ధి తెచ్చుకొని దాక్షిణ్యముతో దానధర్మములు చేయసాగెను.


                                             * * * *

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra