"నా సొమ్ము తినేసరికి నీక్కూడా ఒళ్ళు బలిసేసిందా?" అన్నాడు వాకిట్లో పడుకొని వున్న కుక్కడొక్కలో తంతూ. అది అరుస్తూ పారిపోయింది. ఆ మాటలు అంది కుక్కని కాదనీ, తనను ఉద్దేశించేనని నాగమ్మ గ్రహించకపోలేదు. కాని మౌనంగా వుండిపోయింది.
మరోనాడు పెరటి గోడమీద కాకి అరుస్తూంది. ఆ ప్రక్కగానే నాగమ్మ కూచుని అంట్లు తోముతూంది.
"కొవ్వుపట్టి ఒకటే కూస్తున్నావ్?" అంటూ కర్రపుల్ల కాకిమీదకన్నట్లు విసిరాడు.
కాని అది వెళ్ళి నాగమ్మ వీపుమీద పడింది. నాగమ్మ ఉలిక్కిపడింది. వెంటనే అర్ధం అయింది. కిందపడ్డ కర్రపుల్లను తీసుకొని చివ్వున లేచి నిల్చుంది. కళ్ళు చింతనిప్పుల్లా మండిపోతున్నాయి. పుల్లఎత్తి విసరబోయి "ఛీ!" అంటూ నేలకేసి కొట్టింది. భద్రయ్య అక్కడనుంచి చల్లగా తప్పుకున్నాడు.
"ఊళ్ళో పాలూ పెరుగూ తిని ఎంత నున్నగా బలిశావే!" పక్కనుంచి పోతున్న పిల్లిని అన్నట్లు అన్నాడు మరో రోజు నాగమ్మ వినేలా.
ఒక రోజు అనవసరంగా పార్వతిని కసురుకున్నాడు.
పార్వతి బుస్సున లేచింది.
భద్రయ్య చెయ్యి చేసుకున్నాడు.
పార్వతి భద్రయ్య చేతిని కసిగా కరిచింది.
నానా తిట్టూ తిడుతూ పొలం వెళ్ళిపోయాడు. అందులో ఎక్కువభాగం తనను ఉద్దేశించి తిట్టినవేనని నాగమ్మకు తెలియకపోలేదు.
నాగమ్మ వంటింటి గోడకు చేరబడి కూచుంది. తనేం చెయ్యాలి? ఒకవైపు కూతురి సంసారం! మరోవైపు తన శీలం! తను పార్వతికి తెలియకుండా వెళ్ళిపోతే?
"అమ్మా!" పార్వతి పిలుపుకు తలెత్తి చూసింది. నాగమ్మ కూతుర్ని చూస్తూనే స్తంభించిపోయింది.
పార్వతి జుట్టు రేగివుంది. నుదుట బొప్పికట్టి వుంది. కళ్ళు చింతనిప్పుల్లా కణకణ మండిపోతున్నాయి. కోపంతో బుసలు కొడుతోంది. కూతురివైపు కళ్ళప్పగించి చూస్తూ వుండిపోయింది నాగమ్మ.
"అమ్మా! వెళదాం పద, ఈ కొంపలో ఒక్క క్షణం వుండను" అంది పార్వతి.
పార్వతి మాటలు అర్ధంగాక అయోమయంగా చూసింది నాగమ్మ.
"ఈ చాకిరి ఎక్కడ చూసినా మన పొట్టలు గడవకపోవు. పద వెళదాం. ఇక ఆ ముసలాడి ముఖం చూడను." మొండిగా రోషంగా అంది పార్వతి.
నాగమ్మ లేచి కూతురి తలను తన గుండెలకు హత్తుకుంటూ అంది; "తప్పమ్మా అలా అనకూడదు. గౌరవంగల ఆడపిల్లలు ఇల్లు వదిలిపోరు. ఎన్ని కష్టాలయినా నాలుగు గోడల మధ్య వుండే అనుభవించాలి. అందులోనే ఆడదాని గౌరవం ఇమిడివుంది."
"నేను చస్తే నీలా గౌరవం అంటూ అడ్డమయిన వాళ్ళ చేతా మాటలు పడను. వెళదాం పదా!"
"ఎక్కడికి వెళతామమ్మా! ఇంకా వయసు మళ్ళని నేను, వయసులో వున్న నిన్ను తీసుకొని ఎక్కడికి వెళ్ళనమ్మా! ఈ లోకం మనల్ని గౌరవంగా బతకనిస్తుందా?" అంది నాగమ్మ దిగులుగా.
"ఎక్కడికో అక్కదికి౧ ఇక్కడ మాత్రం ఉండను" అంది పార్వతి మొండికెత్తినదానిలా.
"తప్పు తల్లీ! అలా అనకు. ఆడదాని జీవితం అరిటాకులాంటిది. మన వంశం మచ్చలేనిది. నువ్వు భర్తను వదలి వెళ్ళిపోవటం మన వంశానికి మచ్చ తెస్తుంది తల్లీ!" అంది నాగమ్మ కూతుర్ని బుజ్జగిస్తూ.
పార్వతి విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతున్న కూతుర్ని చూస్తూ నిట్టూర్చింది నాగమ్మ.
పార్వతికి మొగుడంటే యిష్టం కానీ అయిష్టంకానీ ఏదీ వున్నట్లు తోచదు. డబ్బు దొరికినంతవరకు చీరలు కొనటం, దొరికిన చెత్త పుస్తకాలన్నీ కొని చదవటం కంటే వేరే ఆలోచిస్తున్నట్లే కనబడదు.
మేనల్లుడంటే భద్రయ్యకు కాస్త భయం అని గ్రహించింది పార్వతి. భద్రయ్యకు వివాహం అయాక ఆరు నెలలకు ఒకసారి సూర్యనారాయణ వచ్చి రెండు రోజులు వుండి వెళ్ళాడు.
ఆ వున్న రెండు రోజులూ పార్వతంటే అభిమానం, నాగమ్మ అంటే ఆదరణ గౌరవం చూపించాడు సూర్యనారాయణ.
ఆ మధ్య పార్వతంటే భద్రయ్య కొంచెం భయపడుతున్నాడని తెలుసుకున్న నాగమ్మ కూతుర్ని అడిగింది. పార్వతి చిలిపిగా నవ్వింది.
"చెప్పమ్మా!"
"నువ్వు కొప్పడతావు!"
"లేదు చెప్పు తల్లీ!"
"ఆ ముసలాడితో ఖచ్చితంగా చెప్పేశాను నువ్వంటే నాకు ఇష్టంలేదనీ, నన్ను విసిగిస్తే ఎవరితోనయినా లేచిపోతాననీను. దాంతో భయపడిపోయాడు ముసలాడు!" కిలకిలా నవ్వుతూ అంది పార్వతి.
నాగమ్మ స్థాణువులా అయిపోయింది. ఏమిటి ఈ పార్వతి! మొగుణ్ణి మరీ అంత లెక్క చెయ్యకుండా! పైగా ఎంతమాట ఎంత అవలీలగా అనేసింది?!
"తప్పమ్మా! అలాంటి మాటలు నీ నోటిమీదకు కూడా తెచ్చుకోకూడదు." అంతకంటే ఎలా చెప్పాలో తోచని నాగమ్మ అంది.
పార్వతి నిర్లక్ష్యంగా నవ్వేసింది.
27
డిసెంబరు సెలవులకు సూర్యనారాయణ ఇంటి కొచ్చాడు.
వస్తూ పార్వతికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన రాధాకృష్ణ బొమ్మను తెచ్చి యిచ్చాడు.
అది చూచుకొని పార్వతి పొంగిపోయింది. ఆనాడు పార్వతి కళ్ళలో వెలుగును చూసి విస్తుపోయింది నాగమ్మ.
సూర్యనారాయణ వచ్చాక నాగమ్మకు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లయింది. భద్రయ్య పోరు తగ్గింది మేనల్లుడు వచ్చినప్పటినుంచి పొద్దున్నే యిన్ని మెతుకులు గొంతులో వేసుకొని పొలంపోయి రాత్రికికాని తిరిగివచ్చేవాడుకాదు. సూర్యనారాయణ నాగమ్మ దగ్గర కలుపుగోలుతనంగా ఉండేవాడు. నాగమ్మ కూడా సూర్యనారాయణను సొంత కొడుకులా అభిమానించసాగింది.
కాని పార్వతితో అతడు అంత చనువుగా వుండటం, వాళ్ళిద్దరూ ఎప్పుడూ కబుర్లు చెప్పుకుంటూ ఎదురుగా కూర్చోవటం అంత బాగా అనిపించలేదు నాగమ్మకు. ఏమన్నా అంటే చిన్నవాళ్లు బాధపడతారేమోనని భయపడేది. పరాయివాళ్ళుకాదుగా! మేనల్లుడేగా? ఈడు కుర్రాడు. పట్నం సంగతులు చెబుతూంటే పార్వతి కుతూహలంగా వింటూంది. అతను వచ్చినప్పటినుంచీ పార్వతిలో ఎంత ఉత్సాహం కనిపిస్తూంది! మొదటిలా మొండిగా కూడా కనిపించటంలేదు. పార్వతి స్వభావం మారుతూంది. కనీసం ఇలాగన్నా పార్వతి మారిపోయి, మంచీ, చెడూ తెలుసుకొని, భర్తను గౌరవించటం నేర్చుకుంటే చాలు. తన కూతురు ఎంత ఉత్సాహంగా ఉంటుందో! అంతకంటే తనకు కావల్సిందేమిటి? సత్యనారాయణ మంచి కుర్రాడు- బుద్ధిమంతుడు. అతనికి తెలియదా ఏమిటి ఎలా వుండాలో?
నాగమ్మ తన మనసుకు తనే పరిపరివిధాలు నచ్చచెప్పుకొనేది. కాని ఒక రోజు మధ్యాహ్నం_
ఓరవాకిలిగా వేసివున్న తలుపు తోసుకొని ఏదో పనిమీద నాగమ్మ కూతురు గదిలోకి వెళ్ళబోయి గడపలోనే ఆగిపోయింది.
ఆమె తన కళ్ళను నమ్మలేకపోయింది.
కాళ్ళకింద భూమి కదిలిపోతున్నట్లుంది.
శరీరం కొయ్యబారిపోయింది.
తను ఏం చూస్తూంది? కళ, నిజమా? కాదు కలే! అవును నిజం!
సూర్యనారాయణం మంచంమీద వారగా కూచునివున్న పార్వతి ఒడిలో తల పెట్టుకొని వున్నాడు. పార్వతి అతని జుట్టులోకి వేళ్ళు పోనిస్తూ ఆడుకుంటూ అతని ముఖంలోకి వంగి చూస్తోంది తన్మయత్వంలో.
నాగమ్మ గిర్రున వెనక్కి తిరిగింది.
కాళ్ళు తేలిపోతున్నాయి, మతి చలించిపోతూంది.
తల్లో నరాలు పగిలిపోవటానికి సిద్ధంగా వున్నాయి.
పార్వతి.... తన కడుపున పుట్టిన బిడ్డ - ఇంత పాపానికి .... నైచ్యానికి.... పాలుబడిందా? సూర్యనారాయణ! చండాలుడు! అసలు వాళ్ళ వంశమే అంత! భద్రయ్య మేనల్లుడు కదూ! మరి తన కూతురు? తన వంశంలో ఏనాడయినా ఇలాంటి నైచ్యం విన్నారా? మరి తన కన్నబిడ్డ.... ఎందుకిలా చేసింది? ఎందుకు?
నాగమ్మ శరీరం దహించుకుపోతుంది.
"పార్వతీ!" ఆడపులిలాగా గాండ్రించింది నాగమ్మ.
"ఆ వస్తున్నా!" పార్వతి పరుగెత్తుకుంటూ వచ్చింది.
"పిల్చావా! అమ్మా?" అంది తల్లిని చిత్రంగా చూస్తూ.
"ఛీ పాపిష్టిదానా! నా కడుపున చెడబుట్టావ్-" పార్వతి చెంప చెళ్ళుమంది.
"ఈ పాడుబతుకూ బతక్కపోతేనేం?"
పార్వతి నిశ్చేష్టురాలై నిలబడింది.
"ఛీ! పో నా ముందునుంచి! ఇక నీ పాపిష్టిముఖాన్ని నాకు చూపించకు. నువ్వు నా కూతురివీ కావు. నేను తల్లినీ కాను." నాగమ్మ రయ్యిన అక్కడనుంచి వెళ్ళిపోయింది.
సావిట్లో గుంజకు చేరబడి కూచుంది నాగమ్మ.
ఆమెలో ఆలోచించే శక్తి లేకపోయింది.
కొయ్యబారి కూర్చుండిపోయింది.
పార్వతికి కళ్ళు మసకలు కమ్మినాయ్. ఆమె శరీరం ఆమెకే బరువుగా తోచింది.
గొడవంతా చూసి సూర్యనారాయణ చల్లగా జారుకున్నాడు.
పార్వతి గది తలుపులు బిగించుకొని, మంచంమీద పడుకొని దిండులో తలదూర్చి ఏడ్చింది. శరీరం కంపించిపోతూంది.
"ఛీ! ఆ పాడుబతుకు బతక్కపోతేనేం? నీ పాపిష్టిముఖం నాకు చూపించకు." ఆ మాటలంది తన తల్లేనా? తనకోసం ఇన్ని కష్టాలు పడిన తల్లి తనను "నీవు నా కూతురివీ కాదు, నేను నీ తల్లినీ కాదు" అందా? తనకోసం జీవితమంతా అల్లుడింట్లో ఊడిగం చెయ్యటానికి తయారైన తల్లేనా తనను ఆ మాటలంది? పార్వతిలో అభిమానం, రోషం పెనవేసుకున్నాయి. గుండె రాయి చేసుకుంది.
"ఛీ! ఈ నీచపు బ్రతుకు బ్రతక్కపోతేనేం?" ఎవరో చెవుల్లో అరుస్తున్నట్లుగా వుంది.
మంచంమీద దిగ్గున లేచి కూర్చుంది పార్వతి.
నాగమ్మ యాంత్రికంగా ఆ సాయంకాలంకూడా ఇంటిపనులన్నీ చేసింది.
భద్రయ్య వచ్చేసరికి అతనికి ఎలాంటి అనుమానం కలగకుండా వుండాలనే ఆమె తాపత్రయం.
పార్వతి గదిలోంచి బయటకు రాలేదు.
నాగమ్మకు పిలవాలనిపించలేదు.
సూర్యనారాయణ యెక్కడ కెళ్ళాడో పత్తా లేడు.
అల్లుడికి అన్నం వడ్డించింది నాగమ్మ. ఆ తరువాత వెళ్ళి సావిట్లో మంచం వాల్చుకుని పడుకుంది. బుర్ర బద్దలయే ఆలోచనలు.
పార్వతి మధ్యాహ్నంనుంచీ ఏమీ తినలేదు. తను పార్వతిని ఎందుకు కొట్టింది? తను ఎందుకంత తొందరపడింది? మందలిస్తే సరిపోయేది కదూ? ఇందులో పార్వతి ఒక్కదానిదే తప్పా? వాళ్ళంత చనువుగా వుంటే చూసి వూరుకోవటం తన తప్పుకాదా? పార్వతిని ముసలివాడికిచ్చి పెళ్ళి చేయటం తన తప్పు కాదా? కోపంతో ఏమేమో అంది. చిట్టితల్లి ఎంత బాధపడిందో!
తను అన్ని మాటలన్నా నోరెత్తలేదు. అలా పడటం దాని స్వభావానికే విరుద్దం!
తను బుజ్జగించి చెబితే పార్వతి వినేది కాదా?
తనకు ఇంత నీడ దొరుకుతుందనేకదా పార్వతి గొంతు కోసింది? తన భర్త పార్వతి గురించి ఎన్ని కలలు కన్నాడు?
స్వర్గంలోవున్న తన భర్త ఇదంతా చూడగలిగితే తననే నిందిస్తాడు. అసలు తప్పంతా తనదే నంటాడు.
అవును, తప్పంతా తనదే. లోకంమీద కసిని తను పార్వతిమీద తీర్చుకుంది. హే భగవాన్!
పార్వతిని గురించిన తర్కవితర్కంతో నాగమ్మ అర్దరాత్రిదాకా మధన పడుతూనే వుంది. అప్పుడే కలతనిద్ర పట్టింది! అన్నీ పీడకలలే!
పీడకల చెదరింది.
భయంతో ఒక్కసారిగా లేచికూచుంది నాగమ్మ.
ఇంటికి వంద గజాల దూరంలోవున్న రావిచెట్టుమీద గుడ్లగూబ కూస్తూంది.
నాగమ్మ శరీరాన్నీ మనస్సునూ ఏదో అర్ధంకాని బలహీనత ఆవరించింది. ఏదో భయం.... దిగులు.... చల్లగాలి వీస్తున్నా వొళ్ళంతా చెమట్లు పడుతూంది.
పార్వతిమీద పీడకల వచ్చింది. ఎప్పుడూ రాలేదు. తను చాలా కఠోరంగా ప్రవర్తించింది.
పార్వతి ఏమయిందో? ఏ అఘాయిత్యానికైనా పాలుపడలేదుకదా?
నాగమ్మ చివ్వునలేచి లోపలికి వచ్చింది. సుడిగాలిలాగా వచ్చింది. పార్వతి గది తలుపులు బార్లా తెరచివున్నాయి.
గుండెలు గొంతులోకి ఎగబాకినట్లు ఉక్కిరిబిక్కిరి అయింది.
గడపలో నుంచుని లోపలకు చూసింది. పక్క గదిలోనుంచి భద్రయ్య గురక వినిపిస్తోంది. పార్వతి మంచం ఖాళీగా వుంది.
నాగమ్మకు ప్రపంచం ఖాళీగా కనిపించింది.
గోడ పట్టుకొని కాళ్ళను నేలమీద నిలదొక్కుకుంది. అంతలో ఏదో జ్ఞాపకం వచ్చింది. సూర్యనారాయణ గదికేసి నడవాలంటే నాగమ్మకు మనస్కరించలేదు. మళ్ళీ ఆమెలో ఏదో సందేహం, దాంతోపాటు జుగుప్స. గబగబా సూర్యనారాయణ గదికేసి నడిచింది. ఆ గది తలుపులు కూడా బార్లా తెరచి వుండటం చూసిన నాగమ్మ నేలమీద కూలబడిపోయింది.
విచ్చిపోతున్న నరాలను కూడదీసుకుంటు మళ్ళీ పార్వతి గదిలోకి వెళ్ళింది.
ఖాళీగా వున్న గది నాగమ్మ ముఖంలోకి జాలిగా చూసింది.
నాగమ్మ చుట్టూ ప్రపంచంతోపాటు, తన్నుకూడా మర్చిపోయింది. గోడ గడియారం మూడు కొట్టి నాగమ్మను మళ్ళీ ఈ లోకంలోకి తెచ్చింది. పిచ్చిగా గదంతా కలయ చూస్తున్న నాగమ్మ దృష్టి దిండుమీద మడత పెట్టివున్న నీలంరంగు కాగితాలమీద పడింది. యాంత్రికంగా లేచి వెళ్ళి ఆ కాగితాన్ని అందుకుంది. గోడకు తగిలించి వున్న కోడిగుడ్డు లాంతర్ను తీసి, వత్తి పెద్దది చేసి కింద పెట్టింది. లాంతరు దగ్గర కూచుని గుండె రాయి చేసుకొని, కాగితాల మడతలు విప్పి చదవసాగింది.


