"అంటే?"
"............."
"ఇల్లు విడిచి వెళ్లిపోయాడా?"
"అవును."
"బతికే వున్నాడా?"
"ఆ......"
"ఎలా తెలుసు?"
"ప్రశాంత్ చెప్పాడు."
"ఐసీ. ప్రశాంత్ మీ ఇంటికి తరచుగా వస్తాడా?"
"తరచుగా రాడు. నెలకి రెండు మూడు సార్లు వస్తాడు."
"దేనికి?'
బసవపున్నమ్మ రెండు క్షణాలాగి అన్నది.
"డబ్బు ఇవ్వడానికి."
"డబ్బా?" ఆశ్చర్యంగా చూశాడు ఇన్స్ పెక్టర్ .
ఆమె మాట్లాడలేదు.
"మీ కొడుకు స్నేహితుడైన మాత్రం చేత ప్రతినెలా వచ్చి డబ్బు ఇవ్వడానికి అతనికేం పనుంటుంది. మీకు
డబ్బు ఇవ్వడంచేత అతనికి కలిగే లాభం ఏమిటి?"
"తెలీదు."
"నిజం చెప్పండి."
"నాకు అంతవరకే తెలుసు."
"మీ కొడుకు ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. అతని స్నేహితుడు మీకు ఆర్దికంగా సాయం చేస్తున్నాడు.
అలా సాయం చేయడానికి ఓ కారణం అంటూ వుండాలి కదా?
బసవపున్నమ్మ మాట్లాడలేదు.
ఏడుస్తోంది.
"దయచేసి నా ప్రశ్నకి సమాధానం చెప్పమ్మా!" అడిగాడు ఇన్స్ పెక్టర్.
జనంలోంచి ఓ పెద్ద ముందుకొచ్చాడు.
"ఏమిటయ్యా నీ ప్రశ్నలు? ఓ పక్క ఆమె కూతురుపోయి ఏడుస్తుంటే."
"మా డ్యూటీ మేం చేయాలి. నేరస్థుడిని పట్టుకోవాలంటే నా ప్రశ్నలకి సమాధానం అవసరం. "
ఇన్స్ పెక్టర్ అన్నదానికి అవతలి వ్యక్తి మౌనం వహించాడు.
"వెనుకాముందు మగదిక్కులేని మీకు అతను వూరికే సాయం దేనికి చేస్తున్నాడో మాకు చెప్పండమ్మా"
"..........."ఆమె మాట్లాడలేదు.
"మీ అమ్మాయికీ, అతనికీ సంబంధం గానీ వుందా?"
"బాబూ!" ఆమె గొల్లుమంది.
"నా బిడ్డ.... నా బిడ్డ మగ పురుగుకేసి కూడా కన్నెత్తి చూసేది కాదు. నా బిడ్డ నిప్పయ్యా....
నిప్పు. దాన్ని ముట్టుకుంటే కాలుతుంది."
"ఇంకేం కాలుతుందమ్మా. ఇంత జరిగేక కూడా మీరు నిజం చెప్పకపోతే మేము నేరస్థుడిని పట్టునేదెలా?"
బస్తీలో వాళ్లకి ఇన్స్ పెక్టర్ని కొట్టాలన్నంత కోపం వచ్చింది.
"ఏమి నేరస్థుడివి పట్టుకోవడమయ్యా! ఆ ముసలిదాన్ని కూడా నీ ప్రశ్నలతో చంపేలా వున్నావు."
"ఆ అమ్మాయి ఎందుకు చచ్చిపోయిందో తెలుసుకోవాలి."
అసలిది ఆత్మహత్యా?
హత్యా?
దర్యాప్తు చేయవలసిన అధికారిని నేను. నాకు అడ్డు రాకండి.
"ఓయబ్బో! మాలావు చెప్పావు లేవయ్య. దర్యాప్తు చేస్తాడట దర్యాప్తు.
జరగవలసింది జరిగిపోయాక వచ్చి శ్రీరంగనీతులు చెప్పడం మీ డిపార్టుమెంటుకి అలవాటేనేనే?"
"నీకు మతి వుండి మాట్లాడుతున్నావా బాబూ! ఇక్కడ మాన భంగం జరుగుతుందని కలగనడానికి, ఆమె
ఆత్మహత్య చేసుకొంటుందని ఊహించడానికి నేను దేవుణ్ని కాదు బాబూ! ఇలా అనుకొంటే ఆడపిల్లలున్న ప్రతి ఇంటి దగ్గరా
కాపలా కూర్చోవాలి" అన్నాడు ఇన్స్ పెక్టర్ రాజు.
దాంతో అవతలవాడి నోరు మూతపడింది.
"ఇంతకు ఇది ఎవరు చేసి వుంటారబ్బా!" ఎవరో అంటున్నారు.
"ఇంకెవరు? ఆ కారులో వచ్చినవాడే అయుంటుంది. ..."
"అక్కడ ప్రత్యక్షసాక్ష్యాధారాలనిబట్టి ప్రశాంత్ అనే వ్యక్తి ఆ ఇంటికి వచ్చాడు. ఓ గంట తర్వాత అతను
వెళ్లిపోయాడు. ఆ సమయంలో కామినీ తల్లి గుడిలో భగవద్గీత వింటోంది.
"ఏమ్మా మీకు ప్రశాంత్ పైన అనుమానం వుందా?" అడిగాడు.
"లేదు. ఆ బాబు ఇలాంటి పని చేయడు. నాకు మందులు వేయించి బతికిస్తున్న వాడు ఆ ప్రశాంత్
బాబూ! నా కూతురికి పెళ్లికూడా చేయాలని ప్రయత్నిస్తున్న అతన్ని నేరస్థుడని నేనెలా చెప్పను బాబూ?"
ఆమె చేతుల్లో మొహాన్ని దాచేసుకుంది.
దాంతో ప్రసాంత్ ఆ నేరానికి ఒడిగట్టలేదన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగాడు ఇన్స్ పెక్టర్.
"అయితే... నేరస్థు డెవరు?" అడిగా డెవరో.
"మీ లోనే ఎవరైనా కావచ్చు." అన్నాడు ఇన్స్ పెక్టర్.
దాంతో బాంబుపడినట్లు అందరు వులిక్కిపడ్డారు.
"అవును. ఎప్పటినించో అవకాశం చూస్తున్న మీలోనే ఒకరు, ప్రశాంత్ వచ్చి వెళ్లడం చూసి, ఆ
తర్వాత ఇంట్లో ప్రవేశించి కామినీ శీలాన్న అపహరించి వుండాలి. దాంతో ఆమె ఆత్మహత్య చేసుకొని వుంటుంది. అది
ఆత్మహత్య కాకపోతే ఆమె ఈ విషయాన్ని ఎక్కడ బయట పెడుతుందో అన్న భయంచేత హత్యచేసి వుండొచ్చు."


