మరి తనేమిటి........
ఒక ఆత్మ విమర్శనలా ఉన్నట్టుండీ ఆమె ముందో ప్రశ్న నిలిచింది.
బాల్యం....... యవ్వనం....... కాలేజీ రోజుల ఆలోచనలు ...... కబుర్లు...... కలలు....... కవితల్లాంటి స్మృతులు...... పాటలు...... ఏవీ........ అవన్నీ యిప్పుడేమయ్యాయి? కరిగిపోయాయా ధీరలా? గుడిసెలోని పండు ముసలి అవ్వలా..... కళ్ళుండీ కనిపించని కొడిగట్టిన దీపంలా...... కట్టుబడిన నీతుల గోతుల్లో కూరుకుపోతున్న సుఖాల్లా......
మనసు మండిపోతూంటే పైకి లేచింది ఆర్తి.
ఆకలిని మరిచిన ఆలోచనలతో అంతసేపూ పేరుకున్న చీకటి మీద కసితో గదిలో లైటు వెలిగించింది.
డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో కనిపిస్తున్న తన ఆకృతి తనను చూసి పరహసిస్తున్నట్టుగా వుంది.
చలువరాతి సౌధంలాంటి మేనితో ఆగని ప్రత్యూషంలా...... ఆరని ప్రభాతంలా వెలిగే అందమైన సౌష్టవంతో....... సురభిళ శయ్యాసజ్జితంలా..... తమస్సుని చీల్చి నవనవోన్మేష సరాగాల విపంచికల్ని శృతిచేసే ఉషస్సులా....... రసస్లావిత చిత్ర శిల్ప కవితా పరాగంలా...... ఇంత అందమూ అడవిగాచిన వెన్నెలై ఎందుకు నిట్టూర్పుల మధ్య నలిగిపోతూంది?
కసి....... క్రోధం........ రోషం......... ఉక్రోషం........
అది ధీర దూరమైందన్న బాధో లేక కన్న కలలు పగిలి బ్రతుకుని శిధిల శిల్పంగా మార్చాయన్న దుగ్ధో తనను తాను మరిచింది. చేతనపై అంతచ్ఛేతన సాధించిన గెలుపులాంటి స్థితిలో విస్కీ బాటిల్ అందుకుని గడగడా రెండు గుక్కలు తాగింది.
పొలమారింది గుండె మంటతో.
పగిలిన స్వప్న స్వగతాలు కళ్ళలో జీరలై ఆమెను రెచ్చగొడుతుంటే మరింత తాగింది.
కాష్టంలా గుండె కాలిపోతుంది. నరాల నెత్తురు సలసలమని కళ్ళముందు పేరుకున్న నల్లని పొగలాంటి వర్తమానంపై గెలుపు సాధించి ఆమెను క్రూరంగా, కర్కశంగా ఓడించింది.
శరీరం తూలిపోతుంది.
కళ్ళు బైర్లుకమ్ముతున్నాయి.
అదికాదు...........
ధీర చెప్పినట్లు అదోలాంటి నిబ్బరం. నీతుల గురించి చెప్పేనాల్కల్ని కోసేయాలన్నంత ధైర్యం.
నడవలేక నడుస్తూ వెళ్ళి బెడ్ పై తూలిపడింది.
ఏమౌతూంది తనకు? స్పష్టంగా అర్ధంకావడంలేదు. ఇంతకాలానికి ఏదో చేసింది తను.
అది చేయకూడనిదని అనిపిస్తూనే వుంది. కానీ చేస్తేనేం అని మనసు బుద్దిని శాసించి బుజ్జగిస్తూంది.
గొంతు పిడచకట్టుకుపోతుంటే క్రమంగా పేరుకుంటున్న మత్తులోకి జారిపోతూ అదిగో అప్పుడు గుర్తుచేసుకుంది అసంకల్పితంగా.
అంతే......
వెంటనే రిసీవరు అందుకుంది తేజాకి ఫోన్ చేయాలని.
ముందు నెంబరు గుర్తుకురాలేదు.
రెండుసార్లు రాంగ్ నెంబరు తర్వాత మూడోసారి లైనులోకి వచ్చాడు తేజ.
"హలో!"
"నేనే" మగతగా అంది ఆర్తి. ఆ క్షణంలో తేజాతో మాట్లాడటం ఆనందంగా వుంది. "ఆర్తికి"
"అర్ధమైంది"
ఫకాల్న నవ్వింది. "గూడ్.... గుర్తుపట్టారే!"
"గొంతేం అలా వుంది?"
"ఎలా వుంది?"
"అదోలా"
"అంటే?" అల్లరిగా అడిగింది.
"మామూలుగా లేదు"
"అయినా గుర్తించారుగా"
"గొంతు మాత్రమే కాదు."
"మరి......"
"నువ్వు మరేదో మూడ్ లో వున్నట్టు కూడా గుర్తించగలిగాను"
"రియల్లీ" పడీపడీ నవ్వింది. "మరి రావచ్చుగా"
నిశ్శబ్దం.....
"ఏమైంది రచయితగారూ! జవాబు చెప్పరేం?" బెడ్ పై వెల్లకిలా దొర్లింది. "ఇదిగో ఇదే నాకు నచ్చదు."
తేజ కంఠం నెమ్మదిగా వినిపించింది. "ఒంట్లో బాగోలేదా?"
"నిజమే..." నిట్టూర్పుగా అంది "మనసు కూడా బాగోలేదు."
"ఏం? ఎందుకని?"
అతని గొంతులోని ఆర్ద్రతకి ఆమె నేత్రాలు అశ్రుశిక్తాలయ్యాయి. "చెప్పాలీ అంటే మీరు రావాలి తేజా! ప్లీజ్.... నాకు చచ్చిపోవాలనుంది"
అరనిమిషం తర్వాత ఏమనుకున్నాడో "సరే..... వస్తున్నాను పదినిమిషాల్లో"
అవతలివైపు ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు.
ఆలోచనలు తెగిపోయినట్లు పైకి లేచిందామె.
ఇప్పుడేమంది తను?
చచ్చిపోవాలనుందని కదూ!
ఎందుకలా అంది? బహుశా ధీర జ్ఞాపకాలే తనచేత అలా మాట్లాడించాయా? అది నిజం కాదని ఆమెకు తెలుసు. తేజాని చూడాలనే తపన, అతడి సమక్షంలో కూర్చుని కబుర్లు చెప్పాలనే ఉత్సాహం. అలాంటి ఆవేదన్ని ప్రకటింపచేసినా, ధీర మరణాన్ని ఒక కారణంగా చెప్పింది. అలా ప్రవర్తించటానికి ఆమె తాగిన విస్కీ దోహదం చేసివుంటే ఆ విషయం కూడా ఆమె తెలుసుకునే స్థితిలో లేదు.
క్షణాలు గడుస్తుంటే టెన్షన్ గా వుంది.
ఇంతకాలమూ ఫోన్ కే పరిమితమైన పరిచయం (హద్దులు దాటి) ఇప్పుడు కలుసుకోవడందాకా వస్తూంది.
తన ఆర్తిని అర్ధం చేసుకుని వస్తానన్నాడూ అంటే అతనికి తనంటే......


