"హారినీ ?" అని ఆశ్చర్యపోతూ వ్యాకర్ణ నవ్వాడు.
అబ్బులు అద్దాలు తగిలించుకుని రవంత సిగ్గుపడుతూనవ్వాడు.
" అయితే మనిద్దరం ఈ వ్యాధి పీడితులం అన్న మాట!" వ్యాకర్ణ అడిగాడు.
" ఆ... మరే, లాట్కో డిమ్కా గ్రాఫై ఎనీషి మూఫిర్ పీడితులం" భారంగా జవాబు యిచ్చాడు అబ్బులు.
" ఇదేం బాగుండలేదు" ఉన్నట్లుండి గట్టిగా అరిచాడు వ్యాకర్ణ.
ఉలిక్కిపడ్డ అబ్బులు వీపుమిద అందినంత మేరచురుచుకుంటూ - " నీ దుంపతెగ అదేమ నవ్వురా హడలి చచ్చాను" అన్నాడు.
అదేం వినిపించుకోలేదు వ్యాకర్ణ " ఇదేం బాగుండలేదు" అన్నాడు అదేమాటని పట్టుకుని సాగదీస్తూ.
" ఏది! ఏది బాగుండంది?" అబ్బులు అడిగాడు.
" నేను ముఖ్యమంత్రి ఎలా కావాలా అని ఆలోచిస్తుంటే నీవూ అదే అలోచిస్తూ వుండటం, నాకే వెన్నుపోటు పొడవాలని చూస్తున్నావా? నమ్మక ద్రోహి, మిత్రదోహి, ఒక రాష్ట్రానికి యిద్దురు ముఖ్యమంత్రులు వుండటం చరిత్రలోనే లేదు. కావాలంటే నాకు కోపైలెట్ గా అఘెరించు" కోపంగా అన్నాడు వ్యాకర్ణ.
" అది కాదురా!" నచ్చ జెప్పబోయాడు అబ్బులు.
" ఏది కాదు?" మరింత కోపంగా అన్నాడు వ్యాకర్ణ.
" మనకిలాంటి ఆలోచనలు రావటం మన తప్పుకాదు. లాట్కో డిమ్కా గ్రాఫై ఎనీషి మూషిర్ వ్యాధి లక్షణమే అంత" బహు శాంతంగా చెప్పాడు అబ్బులు.
" సారీర అబ్బూ! ముఖ్యమంత్రిగా నీవే వుండులే" వ్యాకర్ణ తగ్గిపోతూ అన్నాడు.
" మనలో మనకేంటి బ్రదర్! నీవు ముఖ్యమంత్రివి అయితే నేను అయినట్లే కాదా?" తన నెత్తిన కిరీటంతీసి వ్యాకర్ణ నెత్తిన పెట్టినంత వుదారంగ మాట్లాడాడు అబ్బులు.
ఫక్కున నవ్వు వినిపించింది.
" నీవు నవ్వావా?" వ్యాకర్ణ అనుమానంగా అడిగాడు.
" నవ్వింది నీవు కాదా?" అబ్బులు బుర్ర తడుముకుంటూ ఎదురు అడిగాడు.
" మి యిద్దరూ కాదు. నవ్వింది నేను" అంది జయచిత్ర రూమ్ లో కాలుపెడుతూ.
" ముఖ్యమంత్రి కావాలని అవకాశంకోసం అరవైఆరు మంది ఆశగా సమయంకోసం చూస్తుంటే మధ్యలో తగుదునమ్మా అంటూ మి యిద్దరూ కూడా తయారయ్యారా!" బిందురేఖ జయచిత్ర తోకలా వెనుకనే వస్తూ అడిగింది.
" మా మాటలు విన్నారా?" వ్యాకర్ణ సిగ్గుపడుతూ అడిగాడు.
" ఆ... మొదటినుంచీ" అంది జయచిత్ర.
" ప్రతిది విన్నాం. లాట్కో డిమ్కా గ్రాఫై ఎనీషి మూఫిర్ తో సహా" పెదవి బిగింపులో నవ్వు బిగబట్టి మరీ చెప్పింది బిందురేఖ.
అబ్బులు కళ్ళద్దాలలోంచి మిర్రి మిర్రి చూశాడు. బిందురేఖ కొంటెగా నవ్వింది. దాంతో అబ్బులుకి మండి - " యాక్యూ మెగ్నిషి కార్బొర డిస్ర్పాన్ " అన్నాడు ఘాటుగ.
" యాక్యూ మెగ్నిషి కార్బొర డిస్ర్పాన్ అంటే అది కూడా ఓ వ్యాధి పేరేనా?" ఏమి తెలియనట్లు అడిగింది బిందురేఖ.
" ఎస్!" అన్నాడు అబ్బులు.
" అదికూడా అంటుకుందా?"
" ఆ..."
" దాని లక్షణాలు ఏంటి?"


