"ఏమన్నా పిచ్చా? మట్టిలో పడుకుంటావేం?"
"కాసేపు."
తల్లి చెయ్యి పట్టుకుని లేవదీయడానికి ప్రయత్నించింది అరుణ.
"లే!"
ఒక్కసారి బాధగా మూలిగి, వెలుతురు చూడలేనట్లుగా కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టుకుని పడుకునే ఉండిపోయింది జాహ్నవి.
"మళ్ళీ ఏడుస్తున్నావా అమ్మా!"
మాట్లాడలేదు జాహ్నవి.
ఆమె చెవుల్లో ఇంకా దాసు మాటలే గింగురుమంటున్నాయి.
"మీ తల్లీ కూతుళ్లిద్దరికీ నేనే గార్డియన్ లాగా ఉంటా!"
ఒక్కొక్కసారి మాటలే తూటాలుగా తగిలి మనసుకి తూట్లు పొడవడం అనేది అందరికీ అనుభవమే!
కానీ అతని మాటలు ఆటంబాంబులలాగా ఆమె మనసుని శతకోటి ముక్కలయిపోయేటట్లు చేశాయి.
వాతావరణాన్ని తేలిక చేయాలని ప్రయత్నం చేస్తూ సరదాగా అంది అరుణ.
"ఏమిటమ్మా చిన్నపిల్లలాగా! ఎవరైనా చూస్తే నవ్వుతారు. మట్టిలో మాణిక్యం లాగా వున్నావులే! ఇంకలే!
అరగంట తర్వాత అర్థమైంది అరుణకి - తన తల్లి లేచే స్థితిలో లేదని, ఒంట్లోని రక్తం అంతా తోడేసినట్లుగా నిస్సత్తువగా కనబడుతోంది ఆమె.
కొద్దిగా భయం కలిగింది అరుణకి.
భావన పక్కన ఉంటే బావుండనిపించింది.
కానీ-
భావన ఎక్కడికి వెళ్ళిందోగానీ బొత్తిగా కనబడటంలేదు ఈ మధ్యన.
వెయ్యిళ్ళ పూజారిణి లాంటి తను.
కాదు కాదూ...వెయ్యి ఊళ్ళ పూజారిణిలాంటిది.
ఇవాళ విశాఖపట్నం అంటుంది.
రేపు వికారాబాద్ అంటుంది.
డ్రెస్సులు మార్చినట్లు అడ్రెస్సులు మారుస్తుంది. ఉద్యోగాలు మారుతుంది.
పైగా, క్షణం వీలు దొరికితే చాలు - ఆ లతీఫ్ తో కలిసి ఏవేవో గుసగుసలు.
స్వీట్ నథింగ్సా?
ప్రేమ జాడ్యం తనకి కూడా తగులుకుందా ఏం?
అలా అనుకుంటూనే, అతి కష్టంమీద జాహ్నవిని అక్కడనుంచి లేవదీయగలిగింది అరుణ.
ఇంట్లోకి తీసుకెళ్ళీ తీసుకెళ్ళగానే మళ్ళీ విరుచుకు పడిపోయినట్లుగా పడిపోయింది జాహ్నవి. తేల కళ్ళు వేసి, వెర్రి చూపులు చూడడం మొదలెట్టింది.
ఇంక ఆ పూట అంతా ఇద్దరూ అభోజనమే!
"ఒక్కసారి డాక్టరు దగ్గరికి వొళ్ళొద్దామమ్మా" అంది అరుణ కంగారుగా.
"డాక్టర్ వెంకయ్య లేరుగా!" అంది జాహ్నవి. "అయినా ఇప్పుడు నాకు ఏమయిందనీ!"
"ఏమీ కాలేదని చెప్పి, ఏదో అయ్యేదాకా ఏమీ చెయ్యకుండా ఊరుకుంటామా? అంది అరుణ.
అక్కడికి కూత వేటు దూరంలోనే ఉంది ఒక కార్పొరేట్ హాస్పిటల్.
కానీ -
కాసుల గలగల వినబడితేనే కాసింత కరుణ దొరికే చోటు అది.
'నైవేద్యం' పెడితేనే వైద్యం దొరికే చోటు అది.
'ఆరోగ్యమే మహా భాగ్యము" అన్న ఉదాత్తమైన సూక్తి వికటించి, 'ఆరోగమే మహా భాగ్యము' అనుకుంటూ, జబ్బులకీ, డబ్బులకీ అనుసంధానంగా మారుతున్న విష సంస్కృతిలో భాగం -
కార్పొరేట్ హాస్పిటల్సు!
'వైద్యం చేయడం అనే ధర్మం ఒక ప్రవృత్తిగా ఉండాలి. బతకడం కోసం వైద్యాన్ని ఒక వృత్తిగా చేసుకున్నా తప్పులేదుగానీ, వ్యాపారంగా మారకూడదు' అన్న డాక్టర్ వెంకయ్యలాంటి వాళ్ళ దృక్పథానికి విరుద్ధంగా -
కార్పొరేట్ హాస్పిటల్సు.
'పల్సు' కంటే కూడా ముందుగా 'పర్సు' చూసి వైద్యం చేసే పద్ధతి.
వైద్యానికి జబ్బు చేసిన వైనం!
ఆ కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్ళే స్తోమత తనకి లేదు. అక్కడికి కూతవేటు దూరంలోనే గవర్నమెంటు హాస్పిటల్ ఉంది.
పేరుకి అది పేదలకి ఉచితంగా వైద్యం చేసే ధర్మాసుపత్రే గానీ నిజానికి అదొక 'అధర్మాసుపత్రి'
మరి...
చటుక్కున గుర్తువచ్చాడు అరుణకి డాక్టర్ జోగేశ్వరరావు. భావన ఫ్రెండు. 'జోకేశ్వరరావు' అని అంటుంటుంది భావన సరదాగా. అతను ఆయుర్వేదం డాక్టరు. అప్పటికి ఆరుతరాల నుంచీ వాళ్ళింట్లో ఆయుర్వేదం వుంది.
జబ్బులని డబ్బులతో కాదు. నవ్వులతో తగ్గించాలనేది అతని పద్ధతి. "సంతోషం సగం బలం" అంటాడు. 'లాఫ్టర్, ది బెస్ట్ మెడిసిన్' అని చెప్పి, నిరంతరం జోకులేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు.
అమ్మకి ట్రీట్ చెయ్యడానికి అతను బెస్టు!
"ఇప్పుడే ఒక్క నిమిషంలో వస్తానమ్మా!" అంటూ బయటికి వచ్చింది అరుణ.
ఇటు పక్కఇంట్లో ఇంజనీరుగారుంటారు.
ఛీఫ్ ఇంజనీరు.
ఈ ఏరియాలో అందరూ అంతే! పెద్ద డాక్టర్లు, పెద్ద ఇంజనీర్లు, పెద్ద బిజినెస్ మెన్, పెద్ద ఉద్యోగులు. వాళ్ళ మధ్య చిన్న మనుషులు తామిద్దరూ!
తనకి తెలిసి పనికిరాని పర్రెగా ఉండిన ఈ ప్రాంతం ఇవాళ అన్ని రంగాలలోని అతిరథ మహారథులకీ అది ఆవాసం!
తోటమాలి గేటు దగ్గరే కనబడ్డాడు.
అరుణని చూడగానే, "అందరూ పెళ్ళికెళ్ళారమ్మా!" అన్నాడు.
హతాశురాలయింది అరుణ.
చీఫ్ ఇంజినీరుగారి ఫ్యామిలీ తమకి అవసరమొచ్చినప్పుడు అండగా వుంటూ వుంటారు. ఇప్పుడెలా?
* * * *
"ఆనంద్!" అని అతి చనువుగా పిలిచింది శృతి. తనకి ఇరవై, అతనికి అరవై అని తెలిసినా కూడా.
తను అలా పిలవడమే అతను ఇష్టపడతాడన్న ఆమె ఊహ కరెక్టే అయింది.
తన యవ్వనం తిరిగి వచ్చినట్లు ఫీలయ్యాడు ఆనంద్.
తన బాడీ ఏజ్ సిక్స్ టీ కావచ్చునుగానీ తన మెంటల్ ఏజ్ మాత్రం ఇంకా సిక్స్ టీన్ లోనే వుంది.
లేదా- సిక్స్ టీన్ అనడం కరెక్టేమో!
మనసుకు రాని ముసలితనం శరీరానికి మాత్రం ఎందుకు రావాలి?
అసలు ఈ సృష్టిలోనే వుంది లోపం!
పరమ లోపభూయిష్టమైన ఈ సృష్టిలో, కనీసం ఇష్టమైన పనులు చేయనీయకుండా పనికిరాని నీతి నియమాలు!
ఈ లోకంలో కేవలం ప్రేమలు మాత్రం వుండి పెళ్ళిళ్ళు, మెళ్ళో తాళ్ళూ వగైరా వగైరాలు లేకుండా వుంటే ఎంత బావుంటుంది!
ఫ్రీలవ్ సొసైటీలో ఫ్రీబర్డ్స్ గా వుండాలి.
ప్రేమపక్షులలాగా!
అంతే!
"నువ్వు నాకు అర్థమయ్యావ్ ఆనంద్!" అంది శృతి. "నేను ఈ ప్రపోజల్ చేస్తోంది నీ మంచి కోసమే!"
ఆ పిల్ల తనని "నువ్వు నువ్వు" అని అంటూ వుంటే తను ఆమెకి సమ వయస్కుడిలాగా ఫీలయ్యాడు ఆనంద్. ఉత్సాహం వచ్చింది.
"చెప్పు చెప్పు" అన్నాడు.
"నీకు డబ్బు అవసరం! నాకు ఒక వాలంటీర్ అవసరం!"
"అది ఇందాకే చెప్పావుగా!"
"అవుననుకో! పూర్తిగా చెప్పనీ! మా యూనివర్శిటీలో నేను ఒక రిసెర్చి స్కాలర్ ని. నీకేమో కొన్ని హెల్త్ కంప్లయింట్స్ వున్నాయి. నువ్వు గనక నా ప్రయోగాలకి వాలంటీర్ గా ఉంటే నా పని గడుస్తుంది. పనిలో పనిగా నీకు డాలర్లు వస్తాయి." అంది శృతి.
"ఆ డాలరు డాలరు కూడబెట్టి నేను ఇండియాకి వెళ్ళిపోవచ్చు" అనుకున్నాడు ఆనంద్.
"నీకు డయాబెటిక్ రెటినోపతీ ఉంది. అంటే షుగర్ వల్ల కళ్ళకి వచ్చే కంప్లయింటు. దానితోడు హైబ్లడ్ ప్రెజర్. అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు నాన్ స్టాప్ గా ఇరవైనాలుగు గంటలపాటు టీవీ చూస్తే ఎలాంటి రియాక్షను వస్తుందీ అన్నది నా ఎక్స్ పెరిమెంట్" అంది శృతి.
అలా రకరకాల హెల్తు కంప్లయింట్లు వున్నవాళ్ళతో ఎక్స్ పెరిమెంట్సు చేసి, వాళ్ళకి డాలర్లు ఇస్తూ వుండడం అమెరికాలో అలవాటే!


