"వంతెన మీద వదిలేసిన "లాండ్ మైన్" ని జీపులో వస్తూ డ్రైవర్ తప్పక చూస్తాడు" అన్నాడు చైతన్య.
"అందుకని?"
"వస్తూన్న జీప్ లైట్లు పేల్చేయాలి" అన్నాడు.
ఆమె అప్రతిభురాలై- "కానీ వాళ్ళు వూరుకోరు. టాంకులు మళ్ళీ వుపయోగిస్తారు. మనం తునాతునకలు అయిపోతాం" అంది.
ఆమె అన్న మాటలో అబద్ధం లేదు. జీపు తాలూకు హెడ్ లైట్స్ పేల్చేయాలంటే వంతెన దగ్గరగా వెళ్ళాలి. తాము రైఫిల్స్ పేల్చగానే, తామెక్కడ వున్నారో అవతలి వాళ్ళకి కరెక్టుగా తెలుస్తుంది. "టాంక్" తాలుకు రేంజ్ చాలా ఎక్కువ. ఆ రేంజ్ నుంచి బయటపడటం దాదాపు అసంభవం. ఆ మాటే అన్నది ఆమె.
"అవును. మనం తునాతునకలు అయిపోతాం. కానీ ఆ రిస్క్ తీసుకునే మనం ఈ పని ప్రారంభించాం" క్లుప్తంగా అన్నాడు.
ఇద్దరూ తిరిగి వంతెన దగ్గరికి చేరుకున్నారు. సైనికులు బ్రిడ్జి రిపేరు చేయటం కనిపిస్తోంది. దాదాపు అరగంటలో పని పూర్తయింది. అందరూ జీపులు ఎక్కారు.
ప్రనూష అరచేతులు చెమట్లు పడుతున్నాయి. ఆపరేషన్ లో అతి క్లిష్టమైన దశ దగ్గరకొచ్చింది. నదికి అవతలి ఒడ్డున వరుసగా వున్న టాంకులు ఆకలిగొన్న పులుల్లా వున్నాయి. వాటి కోరల దగ్గరే కూర్చుని వున్న ఫీలింగ్ కలిగింది ఆమెకి.
మొదటి జీప్ బ్రిడ్జిమీదకు వచ్చింది. వెనుకనే వరుసగా జీపులు. ఒక్కో జీపునిండా పదిమంది దాకా వున్నారు సైనికులు. మొదటి జీపు వంతెన మధ్యభాగంలోకి వచ్చింది.
రైఫిల్ చేతుల్లోకి తీసుకున్నాడు చైతన్య.
ప్రనూష వూపిరి బిగపట్టింది.
మొదటి జీపు తాలూకు హెడ్ లైట్ కి గురిచూసి పేల్చాడు చైతన్య.
చిన్న చప్పుడుతో అద్దం పేలిపోయింది. ఏం జరిగిందో అర్ధంకాక డ్రైవర్ జీపు ఆపుచెయ్యగానే రెండో లైటు కూడా పేల్చేశాడు.
ఈ ఆకస్మిక పరిణామానికి చీఫ్ నిర్విణ్ణుడయ్యాడు. అతనికి తను చేసిన తప్పు తెలిసింది. చాలా చిన్న తప్పు. కానీ పెద్ద అవమానం..... పక్క సైనికులు ఎవరన్నా నవ్వుకుంటారేమోనని ఓరగా చూశాడు. అందరూ మిలటరీ క్రమశిక్షణతో మొహంలో ఏ ఫీలింగూ లేకుండా వున్నారు. ఎవరూ జీపు దిగలేదు.
టాంకులు పేల్చి, వంతెనకి అవతలిపక్క భాగాన్నంతా చెల్లా చెదురు చేయించాడు నిజమే! కానీ ఆ తరువాత వంతెన బాగుచేయించే టైములో శత్రువు తిరిగి దగ్గిరకి వస్తాడని అనుకోలేదు. జీపులు ప్రయాణం ప్రారంభించబోయేముందు మరొకసారి టాంకుల కాల్పులు సాగించివుంటే, అది ముందు జాగ్రత్త చర్య అయివుండేది.
...శతృవు ముందుకొచ్చి, కోరి మృత్యువును ఎందుకు ఆహ్వానిస్తున్నాడో చీఫ్ కి అర్ధంకాలేదు. జీపు దిగి, టాంకులవైపు తిరిగి- "ఫైర్ ఎగైన్" అని అరిచాడు.
అప్పటికే చైతన్య, ప్ర్నూష వెనక్కి పరుగెత్తటం ప్రారంభించారు. చుట్టూ చీకటి క్రింద రాళ్ళు... గుట్టలు... ఏవీ చూసుకోలేదు పరుగెడుతూనే వున్నారు.
వెనుక కాల్పులు ప్రారంభమయ్యాయి. టాంకునుంచి బయల్దేరిన గుండు, గాలిలో నదిని దాటి వచ్చి పడగానే వంద గజాల ప్రదేశంలో దూళి ఉవ్వెత్తున ఎగిరి, ఆ ప్రాంతాన్నంతా స్మశానంగా మారుస్తోంది.
నిలబడి గట్టిగా వూపిరి పీలిస్తే, ఆ ఒక్కక్షణమే చావుకీ బ్రతుక్కీ మధ్య రేఖని చెరిపేస్తుందన్నంత వేగంగా.... ఆనకట్ట తెగి వెనుకనుంచి నీటి వెల్లువ తరుముకు వస్తున్నట్టు ఆ ఇద్దరూ పరుగెత్తుతూనే వున్నారు. ఎటు వెళుతున్నదీ, ఆ దారి ఎక్కడికి దారి తీస్తున్నది కూడా పట్టించుకోలేదు. టాంకుల రేంజ్ ఎంత ఎక్కువగా వుంటుందో చైతన్యకి తెలుసు. తను చేసిన "చిలిపి" పని అతని చీఫ్ ని ఎంత ఇరిటేట్ చేసి వుంటుందో కూడా తెలుసు. అతడికి కావల్సింది కూడా అదే. సహనం కోల్పోయినప్పుడే మనిషి తప్పులు చేస్తాడు. అంగుళం కూడా వదలకుండా ఆ ప్రదేశాన్నంతా విధ్వంసం చేశాక టాంకులు శాంతించాయి.
పది నిమిషాల తరువాత..... కాల్పులు ఆగిపోయాక... చీఫ్ జీపు ఎక్కి పోనిమ్మన్నాడు.
"ఒకసారి ముందుకెళ్ళి చూసొస్తే మంచిదేమో" అని ఎవరూ అడగలేదు. కమాండర్- ఇన్- చీఫ్ ని సైన్యంలో ఎవరూ అడగరు. అదీగాక- అంత విస్ఫోటనం జరిగాక అవతలి పక్క ప్రాణికూడా వుంటుందని ఏ మూర్ఖుడూ కూడా అనుకోడు.
చైతన్య కూడా అనుకోలేదు.
అతడు అప్పటికే ప్రనూషతో కలిసి దాదాపు అరకిలోమీటరు దూరం పరుగెత్తి వచ్చేశాడు.
చంద్రుడు పైకి రావటంతో ఆ ప్రదేశం అంతా వెన్నెల నిండిపోయింది.
ఇస్మాయిల్ వాళ్ళు అక్కడే వుండి ఎదురు చూస్తున్నారు. వంతెన దగ్గర జరుగుతున్న భయంకరమైన కాల్పుల శబ్దానికి రంగనాయకి బెదిరిపోయింది. కొడుకు క్షేమం కోసం కోటి దేవతలకి మొక్కుకుంది. వస్తున్న ఇద్దర్నీ చూసి జగదీష్ కూడా తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు. జరిగినదంతా క్లుప్తంగా ఇస్మాయిల్ కి వివరించాడు చైతన్య.
అందరూ వంతెనవైపు చూడసాగారు. బాగా దూరంగా వుండటం వల్ల సరీగ్గా కనపడటంలేదు. హెడ్ లైట్ల వెలుతురుబట్టి వంతెనమీద జీపులు వరుసగా రావటం ప్రారంభించాయని తెలుసుకున్నాడు. ముందు జీపుకి హెడ్ లైట్లు లేవని కూడా తెలుసు.
చూస్తున్న వారిలో క్షణక్షణానికి టెన్షన్ పెరిగిపోతుంది.
మొదటి జీపు వంతెనకి ఇవతలి పక్కకి వచ్చేసింది.
రెండో జీపు దాటుతూండగా....
అప్పుడు కనిపించింది పెద్దమంట! చెవులు బ్రద్ధలయ్యే చప్పుడు!
పదిమంది సైనికులతో వున్న జీపు- ఒక్కసారిగా గాలిలోకి ఎగిరింది. ఆ తరువాత అక్కడ పల్టీకొట్టింది. ఒక తలదిండు గాలిలో విచ్చుకుంటే అందులోంచి దూది ఎలా బయటకు వస్తుందో అలా ఆ వాహనంలోంచి సైనికుల శరీరాలు బయటికి వచ్చాయి.
వంతెన నదిలోకి కూలిపోయింది.
వంతెనతోపాటే దానిమీద వున్న నాలుగు జీపులు కూడా నీళ్ళలోకి జారిపోయాయి. ఆ నీటి వేగానికి వంతెన కొద్దిదూరం కొట్టుకెళ్ళి, అక్కడ రాళ్ళకి తగిలి మరిన్ని ముక్కలుగా మారి ప్రవాహంలో కలిసిపోయింది. సైనికుల శరీరాలు ఎప్పుడో మాయమయ్యాయి.
ప్రనూష గుండెల్నిండా గాలి పీల్చుకుంది. అప్పటివరకూ వున్న ప్రమాదం తొలగిపోవటంతో మనసు తేలికగా అనిపించింది. అయితే ఆమె అభిప్రాయాన్ని తప్పుచేస్తూ అటువైపు వాహనాల లైట్లన్నీ వెలిగాయి. ఆ ప్రదేశమంతా దీదీప్యమానంగా మారిపోయింది.
విస్ఫోటనానికి ముందే జీపులో వంతెనకి ఇటుపక్కకి వచ్చేసిన చీఫ్, వెనుక జరిగిన ప్రేలుడికి నిర్విణ్ణుడయ్యాడు. తన కళ్ళముందే కూలిపోతున్న వంతెననిచూసి దాదాపు పిచ్చివాడయ్యాడు. ముప్పైమంది సైనికులు క్షణాల్లో నీళ్ళపాలవటం అతడిని కలచివేసింది.
చాలా చిన్న ఆపరేషన్ అనుకున్నది చూస్తుండగానే ఇంత వినాశనానికి దారితీయడంతో, తన అజాగ్రత్తకి ఎదుర్కొనబోయే శిక్ష గురించి ఆలోచించటంలేదు అతడు. అతడిలో మరింత పట్టుదల పెరిగింది. అప్పటికీ వాయువాహనాలకోసం కబురు చేయలేదు.
"మోర్ప్ కోడ్"లో వెనుక వైపు అవతలి ఒడ్డుకి ఆజ్ఞలు జారిచేయటం మొదలుపెట్టాడు.
అతని సూచన్లు అనుసరించి, మిగిలివున్న వాహనాలన్నీ నదివైపు తిప్పారు. ఆ లైట్ల వెలుగులో ఏంకర్ల ద్వారా తాళ్ళు అవతలి ఒడ్డుకి "ఘాట్" చేయబడ్డాయి. నదిలో పడిన సైనికుల గురించి ఎవరూ పట్టించుకోలేదు. అది అనవసరం అని అక్కడ అందరికీ తెలుసు. ఆ ఒడ్డుకీ, ఇవతలి ఒడ్డుకీ తాళ్ళు బిగించారు. అది పూర్తవగానే ఆ తాళ్ళు పట్టుకుని సైనికులు ఇవతలి ఒడ్డుకు చేరుకునే సన్నాహాలు చేయసాగారు.
మిషన్ గన్ లతో, రైఫిల్స్ తో చీమలు పాకినట్టు ఇవతలి వైపుకి రాబోతున్న శత్రుసైనికుల్ని నిస్సహాయంగా చూస్తూ వుండి పోయాడు చైతన్య. దగ్గిరవరకూ వచ్చిన విజయం చేతుల్లోంచి జారిపోయినట్టు అనిపించింది.
లైట్ల సాయంతో వాళ్ళు వెతకటం మొదలుపెటితే రెండు మూడు గంటల్లో తాము దొరికిపోవటం ఖాయం. దానికన్నా తనే వెళ్ళి వాళ్ళని ఎదుర్కొంటే సులభం.
ఆ విషయమే ప్రనూషతో చెప్పి రైఫిల్ తీసుకు బయలుదేరాడు. ఒక్క రైఫిల్ తో అంతమందిని ఎలా ఎదుర్కొంటాడో ఆమెకి అర్ధంకాలేదు. కానీ ఆమె వద్దనలేదు. ఆలోచించే శక్తి కూడా కోల్పోయినట్లు అనిపించిందామెకు.
దాదాపు పది నిముషాలు వేగంగా ప్రయాణించి అతడు తిరిగి వంతెన దగ్గరికి చేరుకున్నాడు. తనేం చేయదల్చుకున్నాడో, అతడి మనసులో ప్లాను సిద్ధంగా వుంది.
వంతెనకి బదులుగా రెండు వైపులా తాళ్ళు బిగించటం పూర్తయింది.
జీపు దగ్గిర చీఫ్ నిలబడి వున్నాడు.
అతడితోపాటు వచ్చిన ఆరుగురు సైనికులు తాళ్ళు బిగించి జీపు దగ్గిరకి వచ్చి నిలబడి చూస్తున్నారు. అట్నుంచి తాళ్ళు పట్టుకుని సైనికులు ఇటు వస్తున్నారు.
చైతన్య వెళ్ళేసరికి ఇదీ అక్కడి దృశ్యం.
చీకట్లో పాములాగా చైతన్య లాండ్ మైన్స్ దగ్గరికి వెళ్ళాడు. అజ్మరాలీని గాయపర్చిన లాండ్ మైన్ దగ్గరే వెతకటం ప్రారంభించాడు.
చాలా అపాయకరమయిన చర్య అది. మోకాళ్ళమీద కూర్చుని చేతుల్తో తడిమి "మైన్" ని పట్టుకోవటం, ఏమాత్రం అటూ ఇటూ జరిగినా శరీరం ముక్కలు ముక్కలుగా ఎగిరిపోతుంది.
దాదాపు అయిదు నిమిషాల తరువాత అతడి చేతికి మైన్ దొరికింది. దాన్ని తీసుకుని గుట్ట వెనక్కి వచ్చాడు.
జీపుచుట్టూ సైనికులు ఆరుగురు వృత్తాకారంలో నిలబడి చీఫ్ కి గార్డుగా కాపలా కాస్తున్నారు. ప్రత్యర్థి జీపు తాలూకు హెడ్ లైట్లు బ్రద్ధలు కొట్టిన దృష్ట్యా వాళ్ళు చాలా అప్రయత్నంగా వున్నారు. శత్రువు మళ్ళీ దగ్గరగా వచ్చి దెబ్బ తీస్తాడేమో అని వాళ్ళ అనుమానం.
చీఫ్ అంటున్నాడు.
"వాళ్ళు మొత్తం ఆరుగురు. అందులో ముగ్గురు ఆడాళ్ళు. ఇద్దరు ముసలాళ్ళు. సరిహద్దువైపు ఒకటే దారి వుంది. జీపులో వెళితే దొరికిపోతారు... ఎంతోదూరం వెళ్ళి వుండరు."
సైనిక శిబిరం నుంచి తీసుకొచ్చిన చెక్కపలకని రాతిమీద పెట్టాడు చైతన్య.
పార్కులో చిన్నపిల్లలు చెరోవైపున కూర్చుని ఆడే బల్లలా ఊగుతోంది అది. దాన్ని ఒక చివర పక్కగా జరిపాడు. చిన్న ఫిజిక్సు కాలిక్యులేషన్!
ఒకవిఅపు, రెండోవేపుకన్నా మూడురెట్లు ఎక్కువ పొడవుంటే, అక్కడినుంచి బయల్దేరిన వస్తువుయొక్క "వెలాసిటీ" ప్రపోర్షనేట్ గా ఎక్కువ వుంటుందనేది!!
చెక్కకి ఒక చివర "మైన్" ని పెట్టాడు.
ఇప్పుడు అదృష్టం రెండు రకాలుగా కలిసిరావాలి!
లాండ్ మైన్ వెళ్ళి జీపు సమీపంలో పడటంతో మొదటిది... పడేటప్పుడే తల క్రిందులుగా పడటం అనేది రెండోది!
అతడు గుట్ట మీద నుంచి ఎగిరి, చెక్కపలక మీదకి దూకాడు అతడి బరువుకి చెక్క పక్కకి పడిపోయింది. కానీ దాని కన్నా ముందే...... లాండ్ మైన్ గాలిలోకి ఎగిరింది.
పలక పడిన శబ్దానికి అటువేపు ఎలర్ట్ గా చూసిన సైనికులకి, గాలిలో దూసుకువస్తూన్న వస్తువేదో కనబడింది. అదేమిటో గుర్తించే లోపులోనే ఆ వస్తువు జీపుమీద పడటం, పేలిపోవటం ఒకేసారి జరిగాయి. దాంతోపాటే చైతన్య రైఫిల్ నిప్పులు కక్కింది.


