"నేనెందుకో నీ వాదనతో ఏకీభవించలేకపోతున్నాను పావనీ. అతనికేం? ఇంకో పెళ్ళి చేసుకుంటాడు. హాయిగా సంసారం కొనసాగిస్తాడు. నీ సంగతలా కాదు. ఈ ప్రపంచంలో ఒంటరి ఆడదాని బ్రతుకు ఎంత దుర్భరమో నాకు తెలుసు. అదీగాక నీవు నీ చెల్లెళ్ళ పెళ్ళి సంగతి కూడా ఆలోచించాలి నువ్వు. 'ఇలా లేచిపోయే రక్తం వాళ్ళ కుటుంబంలోనే వుందిరా' అని ఎవరూ అనుకోకూడదు."
పావని మొహం మ్లానమైంది. ఆవేశాన్ని అతికష్టంమీద అణుచుకుని, "నాన్నా! నువ్వు నాకు చదువు చెప్పించలేదు. బయట ప్రపంచంలో ఎలా బ్రతకాలో నేర్పలేదు. అమాయకంగా పెంచావు. పెళ్ళిచూపులకు వచ్చినవాళ్ళు గుడ్డలిప్పి పరీక్షించినా నవ్వుతూ ఓర్చుకునేటంత సహనం అలవాటు చేశావు. మరి పెళ్ళి చేసేముందు నీ అల్లుడు మగవాడా, కాదా? అని ఎందుకు పరీక్ష చేయించలేదో నాకు అర్ధంకావటంలేదు. అది అలా వుంచు నాన్నా! చెల్లెలి గురించి సమస్య అన్నావు. పొలం అమ్మేయ్! నా గురించి తాకట్టు పెట్టావుగా! రెండో కూతురి గురించి దాన్ని అమ్మేయ్! తమ్ముడికి కట్నం తీసుకో.....డబ్బు శీలాన్ని రక్షిస్తుంది! మన కుటుంబం గురించి అప్పుడు ఎవరూ ఏమీ అనుకోరు. మన సంస్క్రుతి కూడా దీనికి అడ్డు చెప్పదు."
విశ్వపతి అదిరిపడ్డాడు. "అసలు నువ్వు పావనివేనా?" అనుమానంగా అడిగాడు.
ఆమె విషాదంగా నవ్వింది. "కాదు నాన్నా! బ్రతకనేర్చిన స్త్రీని, మీ దృష్టిలో బరితెగించిన స్త్రీని."
అతడు లేచి, "వెళ్ళొస్తానమ్మా!" అన్నాడు. గుమ్మంవరకూ వెళ్ళి ఆగి, "నా కూతురు ఇలా చేస్తుందనీ నాతోనే ఇలా మాట్లాడగలుగుతుందని కలలో కూడా వూహించలేదు. ఇకనుంచీ నా పెద్ద కూతురు లేదనుకుంటాను."
ఆమె చేతులు జోడించి, "మంచిది నాన్నా" అంది, కంటి తడి కనబడనివ్వకుండా.
* * *
రెండు రోజుల తర్వాత భాస్కరరామ్మూర్తి వచ్చాడు. మనిషి కొంచెం చిక్కినట్టు కనిపించాడు.
"ఇల్లు మార్చాను. వచ్చేసెయ్యి. ఇంకెవరికీ తెలీదులే" అన్నాడు ఆమె విజిటర్స్ గదిలోకి రాగానే.
"ఏమిటి తెలిసేది?"
"అదే.....నువ్వూ, రామనాథం.... ఆ సంగతి."
"నువ్వు వీధి మార్చింది దానికోసం అయ్యుండదు. ఆ వీధిలో అందరికీ నీ నపుంశకత్వం సంగతి తెలిసిపోయిందని అయ్యుంటుంది."
"ఇంట్లోంచి వెళ్ళగొట్టినా నీ పొగరు తగ్గలేదన్నమాట?"
"నువ్వు వెళ్ళగొట్టటమేమిటి? నేనేగా నీ కాళ్ళ మధ్యలో తన్ని వచ్చేశాను."
"పావనీ...."
"గట్టిగా అరవకండి. మీ రెండుకు వచ్చారో నాకు తెలుసు. తీసుకున్న కట్నం డబ్బులు మా నాన్నకి ఇవ్వవలసి వస్తుందనేగా?"
"చచ్చినా యివ్వను. నిన్ను కోర్టుకీడ్చి మూడు చెరువుల నీళ్ళు తాగించకపోతే నా పేరు భాస్కరరామ్మూర్తే కాదు" అన్నాడు ఆమెకు విసుగేసింది.
"నీతో విడాకులు తీసుకోవటానికి నీకున్న ఒక్క అవలక్షణం చాలు రామ్మూర్తీ! ఫో....నేనే నీకు విడాకులిస్తాను. వెళ్ళి ఆ వాసంతినే చేసుకో ఫో" అంది.
"ఏం కూశావ్?" ఆవేశంతో వణికిపోతూ అరిచాడు.
"అవును ఎలాగూ శారీరక సంబంధాలుండవు కాబట్టి మీ ఇద్దరికీ సరిపోతుంది" అంది తాపీగా.
"ఒసే....నీ నాలుక తెగిపోనూ. నాకూ, నా చెల్లికీ రంకు కడతావా?"
"వయసొచ్చిన ఏ చెల్లి వళ్ళోనూ అది నిజమైన అన్నా చెల్లి బంధమైతే ఏ మగాడూ పడుకోడు. ఏ శారీరక బలహీనతో, మానసిక బలహీనతో వుంటే తప్ప."
"నీతులు చెప్పకు. ఇంటికి తిరిగొస్తావా? రావా? అది చెప్పు."
"వస్తాను."
అతను తెల్లబోయి "వస్తావా?" అన్నాడు.
"ఒక షరతుమీద వస్తాను."
"ఏమిటది?"
"నాకు ఓ బిడ్డకు తల్లిని కావాలనుంది ఎవరి ద్వారా, ఏ పద్దతి ద్వారా అని నువ్వు ప్రశ్నించకూడదు."
భాస్కరరామ్మూర్తికి ఒక్కక్షణం అర్ధంకాలేదు. తర్వాత పూనకం వచ్చిన వాడిలా కదిలిపోయాడు. "ఒసేయ్! ఈ మద పిచ్చితో పురుగులుపట్టి పోతావే! మొగుడు చాల్లేదని మఠాలు పట్టి పోతావా? అసలు నువ్వొక ఆడదానివేనా?"
"అడదాన్నే రామ్మూర్తీ! నేను చాలా మామూలు ఆడదాన్ని తోటలో చెట్లకు నీళ్ళుపోస్తూ, జీవితం అందమైన పూలగుచ్ఛమని కలలు గన్నదాన్ని ఇంటిముందు ముగ్గులేస్తూ భవిష్యత్తుని కూడా అలాగే అమాయకంగా ఊహించుకున్నదాన్ని చదువులేనిదాన్ని గుండెల్నిండా అదైర్యమే నిండివున్నదాన్ని కన్న కలలన్నీ కరిగిపోగా, కళ్ళనిండా నీళ్ళూ, వణికే చేతివేళ్ళూ మాత్రం మిగిలివున్న దాన్ని నన్నిక విసిగించకు, వెళ్ళిపో నేను పదిమందినీ పిలవకముందే, నా మాజీ భర్త అవమానాన్ని నేను కళ్ళారా చూసే దౌర్భాగ్యం కలుగకముందే ఇక్కన్నుంచి వెళ్ళిపో."
ఆమె చేతుల్లో మొహం దాచుకుంది.
అతడు మౌనంగా వెనుదిరిగాడు.
7
పావనికి ఉద్యోగం బాగా అలవాటు అయిపోయింది. నవ్వుతూ మర్యాదగా మాట్లాడటం వల్లనైతేనేం, చిరునవ్వుతో వెలిగే ఆమె అందం వల్లనైతేనేం కష్టమర్సు ఆమె దగ్గరికి విపరీతంగా వచ్చేవారు. ఒక్కసారి బయట ప్రపంచంలోకి వచ్చేసరికి ఆమెకి రకరకాల ద్వారాలు తెరుచుకున్నట్టు అనిపించింది. ముఖ్యంగా "స్వేచ్చ" అర్ధం తెలిసింది. స్వేచ్చ ఎంత ఆనందం ఇస్తుందో తెలిసింది. అయితే ఆ స్వేచ్చ మధ్యాహ్నం పూట పక్కింటావిడతో మ్యాట్నీకి వెళ్ళడానికి వీలు కలిగించేదో, లేక అర్దరాత్రి వరకూ బోయ్ ఫ్రెండ్స్ తో తిరిగితే వచ్చేదో కాదు.
ఇంట్లో వున్నప్పుడు..... భర్త ఇంటికి వస్తున్నాడంటేనే భయం కలిగేది. వాసంతిని చూస్తే కంపరం కలిగేది. ఇప్పుడు అలాంటివి లేవు. ప్రొద్దున్న లేవాలంటేనే అయిష్టం కలిగే 'రేపు' కన్నా.....ప్రొద్దున్న లేవగానే హుషారుగా అనిపించే 'రేపు' కన్నా మనిషికి జీవితంలో కావల్సిందేముంది?
అయితే ఆమెలో ఆలోచన లేదనికాదు. తండ్రి లేడు. భర్త కాదన్నాడు. ఇంకెవరి కోసం.... అన్న ఆలోచన అప్పుడప్పుడు కలిగేది. ఒక మంచి స్నేహం కోసం మనసు తపించేది. అయితే దానికన్నా ముందు సాధించవలసింది చాలా వుందని ఆమెకు తెలుసు. రోజులు సరదాగా గడిచిపోతున్నాయి. ఆ షోరూంకి ఎక్కువగా విదేశీయులు వస్తుంటారు. ఆమెకు ఇంగ్లీషు అంత బాగా రాదు. చదువు కూడా తక్కువే. ఆ విషయంలో మాత్రం ఇబ్బంది పడుతూ వుండేది. దానికోసం ఏం చేయాలో తెలియలేదు. తన సమస్య 'చేతన' కార్యదర్శి భారతీదేవితో చెప్పుకుంది.
"దానికేముందమ్మా! అసలు నేను చదువుకున్నది పిల్లలు పుట్టాకే. రోజూ ఒక గంట ఇంగ్లీషు నేనే చెపుతాలే" అంది.
ఆ మరుసటిరోజు నుంచే ఆవిడ చెప్పడం మొదలుపెట్టింది. పావనిలో ఉన్న ఉత్సాహం చూసి నాలుగు రోజులు పోయాక, "నువ్వు ప్రైవేటుగా డిగ్రీకి కట్టకూడదు పావనీ?" అంది.
"నేనా? ఇంత పనిలో...." సందిగ్ధంగా అంది పావని.
"పని ఎక్కువయ్యే కొద్దీ తీరుబడి ఎక్కువ వుంటుంది. పరీక్షకి కట్టు ఎంతకాలం ఇలా సేల్స్ గర్ల్ గా వుంటావ్?"
పావని తలూపింది.
ఒకరోజు షాపుకి ఆంగ్లేయుని జంట వచ్చింది. పది నిముషాలపాటు రకరకాల బొమ్మల్ని పరీక్షించి, చివరికి ఒకదాన్ని ఎన్నుకుని, "ఈ బొమ్మ ఖరీదెంత?" అన్నారు.
"పదిహేను వందల రూపాయలు అంటే దాదాపు వంద డాలర్లు సర్...."
"చాలా ఎక్కువ ఖరీదు అనుకుంటాను."
"కాదు సార్! ఒక కొండపల్లి కార్మికుడు ఇరవైరోజులు కష్టపడి చేసిన బొమ్మయిది. చూడండి. ప్రతీ కోణంలోనూ అతడి హస్తకళా నైపుణ్యం కనపడుతుంది. ఇదే మిషన్ మీద అయితే మీకు ఇంకా నాజూగ్గా తయారవవచ్చు. ఇంకా చౌకగా దొరకవచ్చు కూడా. కానీ ఈ కళ, నేర్పరితనం అందులో మీకు లభ్యంకాదు."
"ఈ మూడో కన్ను ఏమిటి?"
"ఇతడు మా దేవుడు శివ. దుర్మార్గులనణచడానికి మూడో కన్ను తెరిస్తే చెడు అంతా భస్మీపటలం అవుతుందని మా పురాణాలు చెపుతున్నాయి."
"ప్యాక్ చేయించండి."
ఆమె ప్యాక్ చేయిస్తుంటే ఆ జంట తమలో తాము మాట్లాడుకోవటం దూరంనుంచి వినిపించింది. "....ఆ అమ్మాయి చాలా బావుంది కదూ డియర్ భారతీయ వుట్టిపడుతూంది."
"ఉచ్చారణ కూడా బావుంది" అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు.


