"అవును ఏం చేద్దాం!" చంద్ర అడిగాడు.
"భోజనం చేయడం తప్పనిసరి కాబట్టి వంటచేయాలి"
"అవును నేను వంటచేయాలి. నాకు వంట చేయడంవచ్చు ఏదో ఒకటి చేస్తాను." చంద్ర కుర్చీలోంచి లేస్తూ అన్నాడు.
"నేను వంట చేయడంలో ఏ వన్ ని. ఇందర్ కి రోజూనేనే వంటచేసి పెట్టేదాన్ని. నన్ను రక్షించిన మీకు ఆ మాత్రం వంట చేసి పెట్టలేనా! నన్ను వంటచేయవద్దన్నారనుకోండి నాకు చచ్చేబాధ వేస్తుంది. చెప్పండి చేయనా వద్దా!"
"అయితే ఓ కండిషన్" అన్నాడు చంద్ర.
"చెప్పండి" అంది అవంతి.
"మనమధ్య ఈ మీరు. గారు నాకు బొత్తిగా నచ్చలేదు. మనం పేర్లుపెట్టి పిల్చుకుందాము"
"ఓస్....ఇంతేకదా?"
"ఎస్....ఇంతే"
అవంతి నవ్వుకుంటూ లేచివెళ్ళింది. చంద్ర తృప్తిపడ్డాడు.
* * *
అవంతి వంటచేస్తూ తను పారిపోయే పథకం తయారుచేసుకుంది. రాత్రికిరాత్రే ఇక్కడ నుంచి వెళ్ళిపోక నిద్రపోవడం పెద్ద పొరపాటు. పగలు ఎలాగూ కుదరదు కాబట్టి ఈ రాత్రి పన్నెండు లోపల వెళ్ళిపోదామనుకుంది. ఖర్మకాలి ఓ వేళ ఈ రాత్రి పన్నెండు గంటల లోపు తను ఇక్కడనుంచి వెళ్ళకపోతే ఇందర్ తిరిగి వచ్చేవాడు. దానికి తను ఓ ప్లాన్ ఆలోచించే రెడీగా ఉంది.
ఇందర్ ఇంట్లో ఉన్నప్పుడు వీధి తలుపు తాళం ఎలాగూ ఉండదు. ఇందర్ బాత్ రూంలో ఉన్నప్పుడు చప్పుడుగాకుండా బాత్ రూంబైట గడియవేసి వెళ్ళిపోవడం. ఇందర్ బలవంతుడు. బాత్ రూం తలుపులు పగల గొట్టగలడు. అతను బాత్ రూంలోంచి వచ్చే సరికి తను చాలాదూరం వెళ్ళిపోతుంది. అలాగాకపోతే అర్దరాత్రి ఇందర్ గాఢనిద్రలో ఉన్నప్పుడు అవాకులు, చవాకులతో ఓ లెటర్ రాసి దానిని అతని పక్కనపెట్టి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవడం. ఓ వేళ అతనులేచి తన్ని పట్టుకుంటే మాట్లాడకుండా కళ్ళనీళ్ళు పెట్టుకుని లెటర్ వేపు వేలు పెట్టి చూపిస్తుంది.
ఆ లెటర్ చదివి అతను బాధపడతాడు. ఎందుకీ తొందరపాటు పని అంటూ ప్రేమగా మందలిస్తాడు. తను అంత బాగా లెటర్ రాస్తుంది కదా! ఇందర్ మీరు చాలామంచివారు. నేనే మంచిదాన్ని కాను. మీతో చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. ఎన్నాళ్ళని మీ చేత వంట చేయించుకుంటూ తినను! ఇక్కడ నుంచి సరాసరి చాటుగా మాయింటికి వెళతాను. మా బుచ్చికక్కి వచ్చిందేమో అని తోటమాలి సీతారాముడిని అడిగిచూస్తాను. బుచ్చికక్కి లేదని చెప్పాడనుకోండి. ఇంకా మా ఇంట్లోకి వెళ్ళను. చచ్చిపోతాను అంతే....ఈవిధంగా రాసిన లెటర్ చూసి గురుడు నమ్మకేం చేస్తాడు!
తను ఇన్నిరకాల ప్లాన్లు వేసుకుంటే ఈ చిన్న గురుడు దిగాడు. ఈ చంద్రశేఖర్ ఆజాద్ మహాశయుడు. ఏక్షణాన అయినా రావచ్చు. అప్పుడు తన మోసం బైటపడుతుందనే కదా ఇక్కడ నుంచి వెళ్ళడానికి తను తొందరపడింది. తనువుండగానే చిన్నగురుడు రానేవచ్చాడు. ఇప్పుడు పెద్ద గురుడుకూడా వస్తే తనజాతకం మొత్తం తారుమారు అవుతుంది. కనుక....
ఈ రాత్రి పన్నెండు లోపల ఇక్కడ నుంచి ఎలాగో అలా బైటపడాలి.చంద్రని బాత్ రూంలోవుంచి వెళ్ళిపోడం లేకపోతే ఫస్ట్ షోకి ఇద్దరూ సినిమాకి వెళ్ళటం. సినిమా మధ్యలో బాత్ రూం కానీవెళ్ళి అటునుంచి అటే ఉడాయించడం. ఇదీకాకపోతే మరోప్లాను. వెళ్ళటం అనేది మటుకు ఖాయం. తనగురించి ఇందర్, చంద్ర తర్జనభర్జన పడతారు....
"ఏంటి అవంతీ రాకుమారి తనతో తాను నవ్వుకుంటున్నది" ఎప్పుడు వచ్చాడో తెలియదు చంద్ర గుమ్మానికి ఆనుకుని నవ్వుతూ ప్రశ్నించాడు.
అవంతి ఆలోచన స్రవంతి లోంచి బైట పడింది.
"నవ్వినమాట నిజమే. ఎందుకు నవ్వానో చెప్పుకో" అవంతి నవ్వుతూ అంది.
"నాకెలా తెలుస్తుంది! నేనేమన్నా డాక్టరునా హృదయం లోతులు చూడడానికి?"
"అయ్యో కవికుమారా! రవికాంచనిచోట కవికాంచును అన్న సత్యం ఆ మాత్రం తెలియదా! డాక్టర్లకి హృదయం ఉండదు. గుండె ఆపరేషన్ అప్పుడు మాత్రం పదునైన కత్తులతో హృదయాన్ని పరపరకోసి అప్పుడు హృదయం లోతులు చూస్తారు. అప్పుడైనా వాళ్ళకి కనిపించేది ఏముంది? మాంసం, రక్తం, పేగులు వగైరా వగైరా....
"నీ మాటలు భలేగుంటాయి అవంతీ"
"నాకొచ్చిన విద్య ఇదొక్కటే. మాట్లాడడం కూడా ఓ కళే అని పెద్దలు అన్నారు"
"నీకు ముఖం నాకేం తెలియదు. అదేం చిత్రమో ఇందర్ కూడా నాతో ఇదే మాట అన్నాడు"
"ఉన్నమాట ఎవరైనా ఒకటే అంటారు"
"ఏమో బాబూ" అంది అవంతి.
"ఇంతకీ నీలోనీవు ఎందుకు నవ్వుకుంటున్నావో చెప్పలేదు"
"చెప్పక తప్పదా!"
"తప్పదు"
"నీవు రాకముందు ఇందర్ నాకో విషయం చెప్పాడు. మనిద్దరము తమాషా చేసి చంద్రని ఏడిపిద్దాము" అని....
"ఆరి ఇడియట్. వాడికి నన్ను ఏడిపించడం తప్ప మరోపని లేదా! చూసి చూసి వాడిని నేనే ఏడిపిస్తాను."


