మత పిచ్చి ప్రభుత్వం
అయోధ్య గొడవల్లో 'మతం' అనేది వీధిన పడిందని న్యూస్ పేపర్స్, దూరదర్శన్ ద్వారా మాకు తెలిసింది.
దేశమంతా 'మతం' యుద్ధంలో మునిగిపోయిందనీ, దీనిక్కారణం బి.జె.పి. అనీ న్యూస్ పేపర్ల నిండా స్టేట్ మెంట్లు గుప్పించేస్తున్నారు ఎవరు పడితే వాళ్ళు. పైగా దూరదర్శన్ నిండా 'హిందు - ముస్లిమ్ భాయ్ భాయ్" అంటూ కీచురు గొంతుతో అరిచేవాళ్ళూ 'ఒక హిందువు, ఒక ముస్లీమ్, ఒక సిక్కు, ఒక క్రిస్టియన్' కౌగిలించుకుని డాన్స్ చేయడం లాంటి ప్రోగ్రాములు మాకు అనిపించినయ్.
ఒక హిందువు, ఒక ముస్లీమ్ ఫలానా ఊళ్ళో ఎంత ప్రేమగా వుంటోంది దూరదర్శన్ వాళ్ళు తెగ మెచ్చుకుంటుంటే మాకు అనుమానం కలిగింది దూరదర్శన్ మీద.
దేశంలో నిజంగానే జనమంతా రెండు మతాలుగా విడిపోయారుమో అన్న ఫీలింగ్ కూడా పత్రికలు మాకు కలిగించాయి.
ఆ విషయం నిజమా కాదా అని మా కాలనీ వారందరం సమావేశంలో తర్జనభర్జనలు చేసుకుంటున్నాము.
మేము మాట్లాడుతుండగానే నిసార్ హాకీ స్టిక్ తీసుకుని వచ్చాడు. వాడిని చూడగానే మా కాలనీ పిల్లలంతా వాడిచుట్టూ మూగారు.
అందరికీ హాకీ ప్రాక్టీస్ చేయించడానికి తీసుకెళ్ళిపోయాడు వాడు. ఆ సమయంలోనే మామూలుగా కూరగాయల బండి తీసుకొచ్చాడు పాతబస్తీ రహీమ్ ఖాన్. అందరూ బండి చుట్టూ మూగి కూరగాయలు కొనుక్కెళ్ళారు. కొంతమంది డబ్బిచ్చి కొన్నారు. కొంతమంది అప్పు పెట్టారు.
మా కాలనీ పక్కనే వున్న మెయిన్ రోడ్డు మీద హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజు దగ్గరకు వెళ్ళాం నేనూ, రెడ్డీ. అక్కడ పేషెంట్ల క్యూ చాలా పెద్దదిగా వుంది. అందులో చాలామంది ముస్లిమ్‌లు కూడా కనిపించారు.
"హలో! ఏమిటిలా వచ్చారు?" అనడిగాను.
"నా హార్ట్ లో కొంచెం ప్రాబ్లెమ్ వున్నాయ్- చెక్ చేసినికి వచ్చినయ్" అన్నాడతను వచ్చీరాని తెలుగులో.
అతను కొంచెం పజిలయ్యాడు. "హిందూ డాక్టరుంటే ఉండనీ! మాకేం తాలూక్?" అన్నాడు ఆశ్చర్యంగా.
"మన కేంద్రమంత్రుల దగ్గర్నుంచీ స్టేట్ ఎమ్మెల్యే వరకూ అందరూ హిందూ ముస్లిములు పొడుచుకు చచ్చిపోతున్నారని అంటున్నారు కదా! అందుకని అనుమానం వచ్చి అడిగాను."
"వాండ్లంతా పాగల్ గాళ్ళు! ఆరోగ్యం ముఖ్యమ౧ మతం కాదు! మంచి ఆరోగ్యం గావలి, మంచి డాక్టర్ కావాలి! మధ్యల మతంకే పనున్నయ్?"
"మరి పేపర్లో పొడుచుకు చస్తున్నారని రాశారు వాళ్ళెవరు?"
"గవర్నమెంట్ గూండాలు!"
"గవర్నమెంట్ గూండాలేమిటి? అలాంటిది నేనెక్కడా విన్లేదే?"
"గవర్నమెంట్ గూండా అంటే ఏ పార్టీ పేపర్లోకి వచ్చినా ఈ గూండాల్కి ప్రొటెక్షన్ యిస్తయ్. దానివల్లే ఈ మతం కిరికిర్లు!" మాకు ఆశ్చర్యం వేసింది.
ఇరుగుపొరుగునున్న వాళ్ళు వ్యాపార సంబంధాలున్న వాళ్ళు, ఆరోగ్యం ముఖ్యం అనుకునే వాళ్ళు- వీళ్ళందరికీ మతం పట్టింపులు లేవన్నమాట!
"మరి గవర్నమెంట్, న్యూస్ పేపర్స్ అలా చెపుతున్నాయేమిటి?" అప్పుడే మెయిన్ రోడ్ లో వున్న సినిమా వదిలారు.
అదేదో టీనేజ్ లవ్ పిక్చర్ అవడంతో యువకులు ఎక్కువగా కనిపించారు ప్రేక్షకుల్లో. అందులో సగం మంది మా కాలనీవాళ్ళే ఉన్నారు.
"సినిమా ఎలా వుంది?" అడిగాడు రంగారెడ్డి వాళ్ళను.
"ఫస్టు క్లాస్ అంకుల్! షారుఖ్ ఖాన్ మంచిగ యాక్ట్ చేసిండు."
"షారుఖ్ ఖాన్ హీరోనా? అంటే ముస్లిం హీరో సినిమాకు హిందూ ప్రేక్షకులయుండి మీరు వెళ్ళారా?"
వాళ్ళు మమ్మల్ని పిచ్చాళ్ళను చూసినట్టు చూశారు. "ఎంటర్ టెయిన్ మెంట్ గూడా కులం మతం ఏమిటంకుల్! మీరు మరీ టూ మచ్ గా ఉన్నారు!" అన్నాడొకతను.
"ఎంటర్ టెయిన్ మెంట్ కి సంబంధించినంతవరకూ మతం గురించి మీరు పట్టించుకోరా?" తిరిగి అడిగాడు రంగారెడ్డి.
"ట్రాష్" అనేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడే కొంతమంది కాలనీ పిల్లలను తీసుకుని తల్లిదండ్రులు బస్ దిగడం కనిపించింది. "పిల్లల అడ్మిషన్ కోసం సెయింట్ మేరీ స్కూల్ కెళ్ళి వస్తున్నాము."
"అదేమిటి హిందువులయుండి క్రిష్టియన్ స్కూల్లో పిల్లల్ని చేర్పిస్తారా?" ఆశ్చర్యంగా అన్నాడు రంగారెడ్డి.
"మీకేం పిచ్చెక్కిందా? మా పిల్లలకు మంచి చదువు రావడం ముఖ్యం గానీ ఆ స్కూలు వాళ్ళు ఏ మతం వాళ్ళయితేనేం?"
"మరి గవర్నమెంట్ వాళ్ళు 'మతం' గురించి అలా అల్లరల్లరి చేస్తున్నారేమిటి?"
"ఎలక్షన్స్ కోసం" అనేసి వెళ్ళిపోయారు వాళ్ళు.
"అంటే 'ఎడ్యుకేషన్' సంబంధించిన విషయాల్లో కూడా ఎవరూ మతాన్ని పట్టించుకోవడం లేదన్న మాట!" అన్నాన్నేను.
"మరి కాంగ్రెస్ వాళ్ళు, బి.జె.పి. 'మతం' ఒక్కటే ముఖ్యం ఈ రోజున అంటున్నారేమిటి?" అయోమయంగా అడిగాడు రంగారెడ్డి.
నాకు ఠక్కున గుర్తుకొచ్చింది "ఎలక్షన్ లు! ఓట్లు"
* * *


