ఆత్మార్పణం
అద్భుతమైన రాజభక్తితో అన్నదమ్ముల ఐకమత్యంకోసం ఆత్మార్పణ చేసిన మహాత్యాగి హరభట్టారకుడు. హరభట్టారకుడు రాణాప్రతాపసింహుని రాజపురోహితుడు. మేవాడరాణా ప్రతాపసింహుడు సాటిలేని స్వాతంత్ర్యవీరుడు. అసమానుడైన అభిమానధనుడు. ఆ కాలంలో అగ్బరుపారుషాను ధిక్కరించిన ఏకైక ప్రభువు.
మహారాణా ప్రతాపసింహుడు రాజగురువైన హరభట్టారకుణ్ణి పరమభక్తితో పూజించేవాడు. కన్నతండ్రిగా గౌరవించేవాడు. అనురాగపూర్వకంగా ఆదరించేవాడు.
హరభట్టారకుడు నిరంతరం మహారాణాను కంటికి రెప్పగా కాపాడేవాడు. అన్ని సమయాలలో అండగా ఉండి కర్తవ్యబోధ కావించేవాడు. రాజకుటుంబాన్ని రక్షించటానికి దీక్షాబద్ధుడై ఉండేవాడు.
ఒకనాడు ప్రతాపసింహుడు అశ్వారూఢుడై సపరివారంగా వేటకు వెళ్లాడు. అతని తమ్ముడు శక్తిసింహుడు మేలుజాతి గుర్రం మీద అన్నగారిని అనుసరించాడు. సామంతులూ-వీరభటులూ వెంటవచ్చారు. రాజగురువు హరభట్టారకుడు బంగారు పల్లకీలో బయలుదేరాడు. విభూతిరేఖలు తీర్చిదిద్ది, రుద్రాక్షమాల ధరించి, పట్టుబట్టలు కట్టుకొని, రూపుదాల్చిన బ్రహ్మతేజస్సులాగా విరాజిల్లుతున్నాడు రాజగురువు.
వీరులందరూ కోలాహలం చేస్తూ అరణ్యమధ్యంలో విచ్చలవిడిగా విహరించారు. కంటికి కనపడ్డ క్రూరజంతువునల్లా వెంటబడి వేటాడారు. ఆ విధంగా అరణ్యమంతా కలయతిరిగి అలసిపోయారు. మహారాణా సపరివారంగా ఒకచెట్టునీడకు చేరుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు.
అంతలోనే ఒక అడవి పంది భయంకరంగా ఘుర్ఘురిస్తూ అటువైపు వచ్చింది. వెంటనే ప్రతాపసింహుడు విల్లెక్కు పెట్టి పందికి గురిచూచి బాణం విడిచాడు. బాణం రివ్వునబోయి పంది డొక్కలో గ్రుచ్చుకొన్నది. ఆ సమయంలో మరొకవైపు నుంచి శక్తిసింహుడు విడిచిన బాణం కూడా పంది ప్రక్కలో నాటుకొన్నది. వెనువెంటనే ఆ అడవిపంది గిరగిర తిరిగి క్రిందపడి ప్రాణాలు విడిచింది.
శక్తిసింహుడు పరుగెత్తివచ్చి "ఇది నా బాణం తగిలి నేలగూలింది. అంతదూరం నుంచి గురిచూచి కొట్టాను. ఒక్కదెబ్బకు బొబ్బలు పెడుతూ క్రిందపడి చచ్చింది" అన్నాడు రొమ్ము విరుస్తూ. ప్రతాపసింహుడు ఆశ్చర్యపడుతూ "కాదుకాదు. ఆ వరాహం నా శరాఘాతం వల్లనే చచ్చింది. దానికి ముందుగా నా బాణమే తగిలింది. అనవసరంగా అబద్ధమాడకు. ఇది చాలా అల్పమైన విషయం" అన్నాడు. శక్తిసింహుడు ఆవేశంతో "ఏమిటేమిటీ? నేను అబద్ధమాడుతున్నానా? నీవు మాత్రం సత్యహరిశ్చంద్రుడివా? అధికార గర్వంతో అహంకార పడుతున్నావు. మాట సాగుతుందని నోటికి వచ్చినట్లు ప్రేలుతున్నావు. పైగా ఇది అల్పమైన విషయమా? మాట పట్టింపు వస్తే ఏదైనా మహావిషయమే! ఒక్క పంది కోసం కదూ ఆ కిరాతార్జునులు అంత భయంకరంగా యుద్ధం చేసిందీ?" అన్నాడు గుడ్లురుముతూ.
అది విని మహారాణా చిరాకుపడుతూ "రాజద్రోహీ! అనవసరంగా మహారాణాను అవమానిస్తున్నావు! అక్రమంగా కయ్యానికి కాలుదువ్వుతున్నావు. తగినశిక్ష అనుభవిస్తావు! పందిని చంపింది నేను. ఇక మారుమాటాడకు." అని ఆజ్ఞాపించాడు.
శక్తిసింహుడు అట్టహాసం చేస్తూ "చాలు నీ ప్రగల్భాలు కట్టిపెట్టు. మహారాణానని మితిమీరుతున్నావు. అందరమూ ఆమోదిస్తే నీవు రాణావు! కాకపోతే నీవూ నావంటివాడవే! చేతనైతే కత్తిబట్టి కయ్యానికిరా! బలబలాలు తేల్చుకుందాం. పందిని చంపిందేవరో బాహుబలమే చెపుతుంది." అని చివాలున కత్తిదూశాడు.
వెంటనే ప్రతాపసింహుడు కోపావేశంతో పండ్లు కొరుకుతూ ఒరలో నుంచి కరవాలం పెరికి శక్తిసింహుడి మీదకు దుమికాడు. అన్నదమ్ములు అడవిపంది కోసం నడుములు గట్టి కత్తులు బట్టి యుద్ధానికి సిద్ధమైనారు. వాళ్ళను వారించటానికి సామంతరాజులకు ధైర్యం చాలలేదు. ఆకస్మికంగా వచ్చిన ఈ ప్రళయం చూచి అనుచరులందరూ నిర్విణ్ణులై నిలబడిపోయారు. కాని సర్దారుల సమక్షంలో ఆ రాజపుత్రుల అంతఃకలహం సహించలేకపోయాడు హరభట్టారకుడు.
వెంటనే ఆయన రాజకుమారుల మధ్య నిలచి వాళ్ళను వారిస్తూ "నాయనలారా! కొంచెం శాంతించండి. నా మాట మన్నించండి. పనికిమాలిన పందికోసం కత్తులు దూసి కదనం చేస్తారా! తగదు నాయనా! మిమ్మల్ని ఈ చేతుల్తో పెంచి పెద్దచేశాను. మీకు విద్యాబుద్ధులు నేర్పించాను. నా కళ్ళ ఎదుట మీరు కయ్యం చేయటం నేను భరించలేను. అన్నదమ్ముల యుద్ధం అనర్థకమైనది. నాయనా! అటు మొగల్ పాదుషా మన రాజ్యాన్ని కబళించాలని కాచుకొని ఉన్నాడు. ఇటు మీలో మీరు కలహించుకుంటే మేవాడదేశం నాశనమైపోతుంది. జాతి స్వాతంత్ర్యం రూపుమాసి పోతుంది. ఈ సమయంలో మీ అంతః కలహం సంతాపకరమైనది. నామాట పాటించండి. శాంతం వహించండి." అని హితోపదేశం చేశాడు హరభట్టారకుడు.
ఆ మాటలు విని శక్తిసింహుడు విసుగుపడుతూ "భట్టారకా! మీకు పదివేల దణ్ణాలు. ఇప్పుడు మీరు అడ్డురాకండి. ఇది భోజన గృహంకాదు. రాజుల రణరంగం. మీరు దూరంగా ఉండండి. ఒక్క వ్రేటులో రాణా శిరస్సు తెగనరికివేయాలి." అని ముందుకు దూకాడు.
తళతళ మెరిసే విచ్చుకత్తులతో అన్నదమ్ములిద్దరూ "నువ్వా నేనా" అన్నట్లు భీకర పోరాటం మొదలుపెట్టారు. ఆ సోదరులను ఎట్లా శాంతపరచాలో తెలియక హరభట్టారకుడు నిర్విణ్ణ్ుడై నిలబడిపోయాడు. ఇంతలో ఆయనకు ఒక ఆలోచన తట్టింది. రాజకుటుంబ క్షేమం కోసం, రాజ్యక్షేమం కోసం తన జీవితాన్నే అర్పిద్దామనుకున్నాడు ఆయన. వెంటనే ఆ యిద్దరు వీరులమధ్యా చటుక్కున వెళ్లి నిశ్చలంగా నిలబడ్డాడు. ఇంకేముంది! సోదరుల కత్తులు రెండూ రెండువైపులా ఆయన కడుపులోకి దిగబడిపోయాయి.
అనుకోని సంఘటనకు అన్నదమ్ములు బిత్తరపోయారు. నోటమాటరాక పశ్చాత్తాపంతో నీళ్లునిండిన నేత్రాలతో నిలబడిపోయారు. హరభట్టారకుడు ఆ యిద్దరి చేతులూ కలిపి "నాయనలారా! అన్నదమ్ములు ఐకమత్యంతో ఉంటేనే అందరికీ శ్రేయం. నా ఆత్మార్పణతోనైనా మీరు అన్యోన్యంగా కలిసి కాలం గడపండి" అన్నాడు. ఇద్దరి చేతులూ కలిపి తృప్తిగా కన్నుమూశాడు రాజగురువు.
* * * *


