చుట్టూ మంటలు, లోపల వేడిగాలులు, పొగ! ముందు హాలులో ఏవో వైర్లు వున్నాయి. గజిబిజిగా అంతకంటే ఏంలేదు. అతి జాగ్రత్తగా వాటిని తప్పించుకుంటూ పక్కగదిలోకి వెళ్ళారు. కొండరాళ్ళతో కట్టిన గోడలు, చాలారోజులుగా శుభ్రం చెయ్యకపోవటం వల్ల ముక్కులు పగలగొట్టే దుర్గంధం!
అంతకంటే అక్కడ ఏంలేదు. అనిల చకచక ఒక గదిలోంచి మరో గదిలోకి వెళ్తోంది. ఆ యింట్లో ఎన్ని గదులున్నాయో కూడా అర్థం కావటంలేదు రవికి. అనిలని అనుసరిస్తున్నాడు. గోడల నిండా బూజులూ, గూళ్ళూ, దుర్గంధం తప్ప ఏమీ కనిపించటంలేదు.
విశాలంగా వున్న వరండాలాంటి ప్రదేశంలోకి వచ్చారు. ఒకసారి పైకి చూసి భయంతో కెవ్వుక కేక పెట్టింది అనిల. రవి కూడా అటు చూశాడు. అతడికి భయం వెయ్యలేదు. అది భారవాహక శిల్పం! అతనికి తెలుసు. దేవాలయ ప్రాంగణాలలోనూ, ప్రాచీన కట్టడాలలోనూ ఇలాంటి భారవాహక శిల్పాలుంటాయని, రెండు చేతులూ పైకెత్తి పట్టుకుని పైకప్పు పడిపోకుండా ఆపుతున్నట్లుగా ఉంటాయి ఆ శిల్పాలు.
బెజవాడ కనకదుర్గ దేవాలయంలో కూడా ఉంటుంది అలాంటి శిల్పం, వాస్తుశాస్త్ర రీత్యా. ఈ శిల్పాల ప్రాధాన్యమేమిటో రవికి తెలీదు. కాని, ప్రతి ప్రాచీనకట్టడంలోనూ ఈ భారవాహక శిల్పాలు సాధారణంగా ఉంటాయని తెలుసు! అక్కడక్కడ కొట్టుకుపోవటం వల్ల చూడగానే కొద్దిగా భయంవేసేలా ఉంది ఆ శిల్పం!
"భయంలేదు!" అని అనిలకి చెప్పబోయాడు రవి! అక్కడ అనిల లేదు! అతడు భారవాహక శిల్పం పరీక్షిస్తుండగా మరో గదిలోకి వెళ్ళిపోయింది. అతదికా ఇల్లు కొత్త. బోలెడన్ని గదులు! ఎక్కడ వెతకాలి?
ఒక గదిలోకి వెళ్ళి "అనిలా!" అని పిలిచాడు గట్టిగా. కొండరాళ్ళతో ఆ గది అతడి పిలుపునే ప్రతిధ్వనించింది. కానీ అనిల సమాధానం రాలేదు. ఒక గదిలోంచి ఒక గదిలోకి తిరుగుతూ "అనిలా!" అంటున్నాడు. "అనిలా" అని ప్రతిధ్వనిస్తున్నాయి గోడలు.
అప్పటివరకూ నిబ్బరంగా వున్న రవి అనిల కోసం భయపడసాగాడు. ఏమయిపోయింది? ఈలోగా ఎవరైనా వస్తే? మరో గదిలోకి వెళ్ళి "అనిలా!" అన్నాడు గట్టిగా. ఈసారి అతడి మాటల ప్రతిధ్వనితో పాటు మరో గొంతు వినిపించింది.
"హెల్ప్! ప్లీజ్ హెల్ప్!"
స్త్రీ గొంతు అది మూసి ఉన్న తలుపులలోంచి వినిపిస్తున్నట్టుగా సన్నగా ఉంది ఆ ధ్వని.
ఆ ధ్వని వినిపిస్తున్న వైపు వెళ్ళాడు. ఆ గదికున్న తలుపులు భగభగ మండుతున్నాయి. లోపలి నుంచి వినిపిస్తోంది "హెల్ప్!" అన్న సన్నని కేక!
మూసిన తలుపుల గదిలోకి అనిల ఎలా వెళ్ళింది? ఆలోచించకుండా తన భుజాలతో తోసి చేతులతో నెట్టి ఆ తలుపులు విడగొట్టటానికి ప్రయత్నించాడు. రవి చేతులు దగ్గిరా భుజాల దగ్గిరా చర్మం కాలుతోంది. బాధగా ఉంది. తలుపులు కూడా ఇటీవల చేయించినట్లు గట్టిగా ఉన్నాయి. బాధ భరిస్తూ పళ్ళు బిగబట్టి నెట్టాడు.
అలా చాలాసార్లు నెట్టవలసి వచ్చింది. చర్మం చాలా చోట్ల బొబ్బలెక్కి కమిలిపోయి, భరింపరాణి బాధపెడుతోంది. చివరికి వెనక్కుపడ్డాయి తలుపులు. మంటల మధ్య పొగతో ఉక్కిరిబిక్కిరవుతూ ఒక స్త్రీ మూర్తి.
ఆమెని రెండు చేతులతోనూ ఎత్తుకుని బయటికి తీసుకొచ్చాడు. చీర అంటుకుంది. ఆ మంటలు శరీరమంతా వ్యాపించకుండా నేలమీద పడుకోబెట్టి అటూ ఇటూ దొర్లించి మంటలార్పేశాడు. అప్పుడు చూశాడు ఆమెని, అనిల కాదు.
"మీరా?" అందామె.
రవి కూడా విభ్రాంతితో "నువ్వు..." అని ఆగిపోయాడు.
ఆమె లేచి నిలబడింది.
"అవును నేను విజయనే! ఇది రెండోసారి, మీరు నన్ను కాపాడటం!"
"నువ్విక్కడికెలా వచ్చావ్? ఈ పాడుబడ్డ ఇంట్లో ఏం చేస్తున్నావ్? ఏం జరుగుతోంది ఇక్కడ?" ఆమె సమాధానం చెప్పేలోగా బయట అడుగుల సవ్వడి వినిపించింది. మాటలు కూడా వినిపించాయి.
"అన్నీ తర్వాత చెప్తాను. ముందు మీరు పారిపోండి, ఇలా రండి!"
రవి చెయ్యి పట్టుకుని నడిపించబోయింది విజయ. ఆ చెయ్యి విడిపించుకున్నాడు రవి.
"అనిల ఏది? తననిక్కడ వదిలి నేనెలా తప్పించుకుంటాను?"
"అనిల కూడా వచ్చిందా? ఎంత సాహసం? అనిలకేం ఫర్వాలేదు. ప్రాణాపాయం లేదు. ఉండదు. ముందు మీరు తప్పించుకోండి. అన్ని సంగతులూ తర్వాత తెలుస్తాయి. రండి!"
అతడి చెయ్యి పుచ్చుకుని మరోగదిలోకి తీసుకుపోయింది. ఆ గదిలోంచి సొరంగంలాంటి మార్గం ఉంది. కిందకి ఆమె వెంట మెట్లు దిగబోతూ ఒక్కక్షణం భయంతో బిగుసుకుపోయాడు. గోడ పక్కనుంచి ఏదో భయంకర ఆకారం కత్తి పట్టుకుని మీదకు దుముకబోతోంది.
విజయ నెమ్మదిగా "భయపడకండి, అవి శిల్పాలు. ఇది పాతకాలపు రాజుల కోటలు! రహస్య మార్గాలలో ఇలాంటి శిల్పాలు చేక్కించేవారు. శత్రువులు ఒకవేళ ఈ మార్గాలు కనుక్కున్నా చీకట్లో వాళ్ళను భయపెట్టటానికి" అంది.
చాలా చీకటిగా ఉంది ఆ దారి. విజయ అలవాటైన దానిలా ముందు నడుస్తోంది. ఆమెననుసరించి నడవటమే తప్ప అతడికి దారి తెలియటంలేదు. రెండు పక్కలా గోడలకి ఆయుధాలతో ఉన్న ఆకారాలు శిల్పాలని తెలిశాక కూడా భయపెడుతున్నాయి. కొంత దూరం సాగాక తిన్నగా నడవలేక వంగుని చేతిలతో కాళ్ళతో నడవవలసివచ్చింది మృగంలా.
దారి ఎంత ఇరుకుగా ఉందంటే, పాకుతూ ముందుకు వెళ్తున్నప్పుడు రెండు భుజాలకూ రెండు పక్కలా ఉన్న గోడలు తగులుతున్నాయి. కాలిపోయి కమిలి పుండు పడ్డ రవి భుజాలకు గోడలు ఒరుసుకుంటున్నప్పుడల్లా మంటతో ప్రాణం పోయినట్లుగా అవుతోంది.
అలా ఎంతదూరం పాకారో? రవి ప్రాణాలకి కొన్ని యోజనాలు పాకినట్లుగా అనిపించింది. భుజాలూ, అరచేతులూ పుళ్ళు పడిపోయాయి. అప్పుడు కనిపించింది వెలుతురు.
దారి విశాలమయింది. ఇప్పుడు దిగటం కాదు, ఎక్కుతున్నారు. సొరంగం బయటికొచ్చారు. ఎత్తుగా ఉన్న కొండ నేల! అంతటి బాధలోనూ చుట్టూ చూశాడు రవి. దగ్గిరలోనే కనపడింది ఒక లోయ. తవ్వుతూ ఏదో పని చేస్తున్నారు. కొంతమంది తట్టలతో ఏవో ఏరుతున్నారు. అందరూ చీమల్లా కనిపిస్తున్నారు. రవి కుతూహలంగా "వాళ్ళంతా ఎవరూ! అక్కడేం చేస్తున్నారు?" అన్నాడు.
"అదే ఈ ఇంటి రహస్యం! ఆ పని వాళ్ళని సూపర్ వైజ్ చేస్తూనే నేనా గదిలో చిక్కుకుపోయాను. ఇందాక మీరు గమనించే అవకాశం లేకపోయింది కానీ నేనున్న గదిలోంచి కూడా ఈ లోయ కనిపిస్తుంది. ఆ ఇంటి నుంచి ఈ లోయకి మరో దగ్గిర దారి కూడా ఉంది" చెప్పింది విజయ.
"ఏమిటీ రహస్యం?"
"వివరించే టైం లేదు. మీరు ముందు పారిపోండి. ఇటు ఎడమవైపు వెళ్ళండి. అన్నీ కొండలు. కొంత కష్టమైనా దాక్కుంటూ తప్పించుకోవచ్చు. తొందరగా పారిపోండి. వాళ్ళు ఏ క్షణంలోనైనా రావచ్చు. ఇప్పుడీ రహస్య మార్గం అందరికీ తెలిసిపోయింది."
విజయ ఈ మాటలంటుండగానే సొరంగ మార్గంలో ఏదో అలికిడయింది.
"పారిపోండి!" తొందర పెట్టింది విజయ.
"మరి మీరు?"
"నా గురించి మీరు భయపడక్కర్లేదు. నేను వీళ్ళలో ఒకదానిని. నన్నేం చెయ్యరు. మీరు పారిపోండి. మళ్ళీ కలుస్తాను"
చటుక్కున మళ్ళీ సొరంగమార్గంలోకే వెళ్ళిపోయింది విజయ.
ఒక్క క్షణం ఏమీ తోచని మూఢుడిలా నిలబడిపోయాడు రవి. సొరంగమార్గంలోకి చూశాడు. ఒక తల బయటికి వస్తోంది. విజయది కాదు, ఎవరిదో మొగవాడిది!
వెంటనే పరుగుతీశాడు విజయ చెప్పినట్లే. కొండలు బొబ్బలెక్కిన కాళ్ళతో ఎక్కటం, దిగటం కష్టంగా ఉంది. కొంతదూరం నుంచి తుపాకి పేలిన ధ్వని. ఒక గుండు రవి పక్క నుంచి దూసుకుపోయింది.
లాఘవంగా తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు రవి. అడుగుల చప్పుళ్ళు దగ్గిరవుతున్నాయి. అతడు నిలబడ్డ కొండకి కొద్దిదూరంలో మరో కొండ వుంది. మధ్య అఘాతం లాంటి లోయ. ఎంత లోతు ఉందో తెలీదు. ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదికి వెళ్ళటం అసంభవం. బొబ్బలెక్కిన అరచేతులు గరుగ్గా ఉన్న కొండరాళ్ళను పట్టుకున్నప్పుడల్లా సూదులతో గుచ్చినట్లు సలుపుతున్నాయి. మళ్ళీ దూసుకొచ్చింది. తుపాకీ గుండు తప్పించుకునే ప్రయత్నంలో రవి చేతి పట్టు సడలింది. పెద్ద చావు కేకతో లోయలోకి జారిపోయాడు.


