"నా డిమాండ్స్ సంగతి ఏమయింది?"
మెహతా కొంచెం గాభరాగా అన్నాడు. ఢిల్లీలో అత్యవసర సమావేశం జరుగుతోంది ఈ విషయం గురించే! ఇంకా నాకు ఇన్ స్ట్రక్షన్స్ ఏమీ రాలేదు."
కసిగా నవ్వాడు శతృఘ్న. "తీరుబడిగా మీటింగ్ పెట్టుకుని చర్చలు జరిపే వ్యవధి మీకు నేనివ్వను. ఇంకో గంట - సరిగ్గా ఇంకొక్క గంటలో నా డిమాండ్ ని ఒప్పుకోకపోతే, ఒక పాసెంజెర్ ని చంపేస్తాను మీకు నమ్మకం కుదరడం కోసం, ఆ తర్వాత ప్రతిగంటకీ ఒకళ్ళని చొప్పున చంపేస్తూ ఉంటాను. అందుకని చప్పున తేల్చుకోమను."
"చెబుతాను."
"మరో విషయం! ఇక్కడొక సబిన్స్ పెక్టరు ఉన్నాడు. చాలా అసమర్థుడనుకుంటాను. ఒకసారి రివర్షనూ, లెక్కలేనన్ని సార్లు ట్రాన్స్ ఫర్లూ వచ్చాయిట. అతనికి ఒక్క ప్రమోషనూ రాలేదుట! అతనేదో హడావిడి చేస్తున్నాడు ఇక్కడ. డర్టీ ట్రిక్స్ ప్లే చెయ్యొద్దని చెప్పు."
"అతన్ని లైనులోకి రమ్మను."
"నీకు!" అని హెడ్ ఫోన్స్ రెడ్డికి అందించాడు శతృఘ్న.
హెడ్ ఫోన్సు తగిలించుకుని వింటున్న రెడ్డి ముక్కుపుటాలు కోపంతో పెద్దవయ్యాయి.
"యస్సర్!" అని విసురుగా లేచి నిలబడ్డాడు.
కన్ను గీటాడు శతృఘ్న.
"ఆఫీసర్! లిమిట్స్ దాటకు! గుర్తుంచుకో!" అని హెడ్ ఫోన్స్ తగిలించుకున్నాడు "గుర్తుంచుకోండి! సరిగ్గా అరవై నిమిషాల తర్వాత, మొదటి పాసెంజరు శవంగా మారతాడు!"
హఠాత్తుగా ప్రత్యక్షమయిన ఇనస్పెక్టరు హైజాకర్స్ కి ఆప్తుడు కావడంతో, సమస్యలు సమసిపోతాయేమో అని ఆశపడ్డ ప్రయాణీకులకు నిరాశే ఎదురయింది.
గడియారంలో సెకండ్లముళ్ళు గబగబగబా పరిగెడుతూ నిమిషాలని మింగేస్తోంది.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చుని ఉన్నారు అందరూ.
ఇనస్పెక్టరు రెడ్డి విమానంలో నుంచి కిందికి దిగిపోయాడు.
చండ శాసనుడైన టీచరుగా క్లాసులో వణికిపోతూ లేచి నిల్చుని చిటికెన వేలు చూపించే పిల్లవాడిలాగా లేచి నిలబడ్డాడు ప్రొఫెసరు సుందరం.
"మిస్టరు... మిస్టరు హైజాకర్?" అన్నాడు మాటల కోసం తడుముకుంటూ. "నేను వెంటనే వెళ్ళిపోవాలి! నేను వెళ్ళకపోతే, నా లేబొరేటరీ పేలిపోయి, అమాయక ప్రజలు ఎంతోమంది చనిపోతారు ప్లీజ్ లెట్ మీ గో! నా ప్రాణాలు దక్కించుకోవాలని నేను ఆరాటపడటం లేదు! నన్ను పోనివ్వు! ప్లీజ్?"
చిరాగ్గా మొహం పెట్టాడు శతృఘ్న.
కంగారుగా కాసేపు దిక్కులు చూసి, మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు ప్రొఫెసర్. "ఒకవేళ నీకు నన్ను పూర్తిగా వదిలెయ్యడం ఇష్టంలేకపోతే, నేను వెళ్ళి, ఆ ఎక్స్ పెరిమెంటుని ఆఫ్ చేసేసి, తిరిగి వచ్చి ఈ నిర్భాగ్యులతో చేరిపోతాను" అని మెల్లగా, 'నీలాగే నాకు కూడా నా ప్రాణాలంటే లెఖ్కలేదు, హైజాకర్! సైన్సుకి జీవితం అంకితం చేసేసిన వాడిని నేను. ఒకవేళ ఈ జీవితం ఇలా హఠాత్తుగా ముగిసిపోవలసి వచ్చినా, నా ఎక్స్ పెరిమెంటు ఒకటి ఫ్లాప్ అయిపోయిందనుకుంటానే తప్ప బాధపడను!" అన్నాడు.
"ఆల్ రైట్ ఆల్ రైట్!" అన్నాడు అసహనంగా "చెవికోసిన మేకలా ఊరికే అరవకు! యూ కెన్ గో!"
"మే గాడ్ బ్లెస్ యూ? దేవుడు నీలో పరివర్తన తెచ్చి నా ఈ తోటి ప్రయాణీకులని కూడా వదిలిపెట్టేలా చెయ్యాలని కోరుకుంటున్నాను!"
"సైంటిస్టునని చెప్పుకుంటావ్, దేవుడనే వాడు ఉన్నాడని మూఢనమ్మకం కూడా ఉందా నీకు?"
కొద్ది క్షణాలసేపు శతృఘ్న మొహంలోకి తదేకంగా చూశాడు ప్రొఫెసరు.
"సైన్సుని లోతుగా తరచి చూసినకొద్దీ ఏదో తెలియని అదృశ్య శక్తి ఈ విశాల విశ్వాన్ని కంట్రోల్ చేసి, గైడ్ చేస్తోందనే నమ్మకం బలపడుతోంది నాకు. ఇంకో తమాషా చూశారా సైన్సుని బాగా చదువుకున్న వాళ్ళెవరూ దేవుడు లేడని చెప్పడానికి త్వరగా సాహసించరు" అన్నాడు!
"వెళ్ళు! వెళ్ళు!" అన్నాడు శతృఘ్న విసుగ్గా.
ప్రొఫెసర్ సుందరం కంగారుగా వెనక్కి తిరిగి, పీతలాంటి వంకర నడకతో గబగబ పైలట్ కేబిన్ వైపు నడిచాడు!
"ఇదిగో మిస్టర్ అయోమయం! అటెక్కడికి? ఇటు! ఇటు!" అన్నాడు శతృఘ్న.
అప్పటికే పైలట్ కేబిన్ లోకి వెళ్ళిపోయాడు ప్రొఫెసర్ సుందరం. లోపలికి అడుగుపెడుతూ ధనామని తలుపుని తట్టుకొని, విసురుగా సవ్యసాచి మీద పడ్డాడు.
ఆయన వెనకే కాక్ పిట్ తలుపు మూసుకుంది.
శతృఘ్న కనుబొమ్మలు ముడిపడ్డాయి.
"ఇక్బాల్! నువ్వు వీళ్ళని కనిపెట్టి ఉండు! నేను ప్రొఫెసర్ ని లాక్కొస్తాను." అంటూ కాక్ పిట్ వైపు పరిగెత్తాడు శతృఘ్న, తలుపు నెట్టాడు.
ధృడంగా మూసుకుపోయి ఉంది తలుపు.
దబదబ బాదాడు శతృఘ్న "తెరు! తలుపు తెరు! ఆలస్యం అయిందంటే ఇక్కడ ఉన్న అందరినీ వరసపెట్టి కాల్చేస్తాను! తలుపు తెరు! దిస్ ఇన్ స్టన్ టర్"
లోపల నుంచి తలుపు తెరవడానికి ప్రయత్నిస్తున్న శబ్దాలు. కానీ అది జామ్ అయిపోయినల్టు ఉంది. తెరుచుకోవడం లేదు.
చెమటలు ఏకధారగా కారిపోతున్నాయి శతృఘ్నకి. కాలు ఎత్తి బలంగా డోరుని తన్నాడు.


