ఇంక వినలేక కుమార్ దగ్గిరగా వచ్చి అతని తలని గుండెలకి హత్తుకుంది సుమతి.
కుమార్ భారంగా "ఈ ఇరవయ్యో శతాబ్దంలో, ఈనాడు మన కళ్ళముందే ఈ ఘోరం జరిగింది అమ్మా! వీళ్ళ దరిద్రానికి తోడు, ఈ మూర్ఖత్వానికీ, అజ్ఞానానికీ అంతులేదు. వీళ్ళంతా నా వాళ్ళు-నేను వాళ్ళ దగ్గిరకే పోతానమ్మా!" అన్నాడు.
సుమతి వ్యాకుల స్వరంతో "కుమార్! అలా అనకు! వీళ్ళంతా నీవాళ్ళు కాదు-మనవాళ్ళు, నువ్వు వాళ్ళ దగ్గిరకి పోవటంకాదు-చెయ్యవలసింది-వాళ్ళందరినీ కనీసం మన స్థాయిలోకి తీసుకురావటం. ముందు నీ చదువు పూర్తిచేసుకుని నీ కాళ్ళమీద నువ్వు నిలబడు. ఆ తరువాత తప్పకుండా నీవాళ్ళకోసం నువ్వు చెయ్యగలిగింది చేద్దువుకాని, నేను కోరేదీ అదే"! అంది.
తల్లి హృదయంలో తలదాచుకుని తన చికాకంతా మరిచిపోయి తేలిగ్గా నిట్టూర్చాడు కుమార్.
"నీ మాట నేనెప్పుడు కాదననమ్మా!" అన్నాడు.
"నాకు తెలుసురా, కుమార్! మీ అత్తవచ్చి నన్ను తిట్టిపోసేసరికి నేనూ మతిపోయి పిచ్చిదానినయిపోయాను."
ఆ రాత్రి కుమార్ మంచం పక్కనే తనూ పక్క వేసుకుని పడుకుంది సుమతి. పిల్లలిద్దరిలో ఎవరికి వంట్లో బాగుండకపోయినా అలా పడుకోవటం సుమతికి అలవాటే.
కుమార్ కి అలసటవల్ల వచ్చిన జ్వరం మరునాటికే తగ్గిపోయింది. సుమతి వద్దంటున్నా వినకుండా "నీదంతా చాదస్తం!" అని కాలేజీకి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం అన్నగారింటికి బయలుదేరింది సుమతి. ఆడబిడ్డను చూసి మూతి ముడుచుకుంది అనూరాధ. సరోజ మాత్రం అత్తకి సకల మర్యాదలూ చెయ్యబోయింది. సుమతి అదేమీ పట్టించుకోకుండా సరోజ చెవిపుచుకుని "ఏయ్! అల్లరి పిల్లా? నిజం చెప్పు? నిన్న నువ్వు మీ బావతో తిరిగావా?" అంది. సరోజ బిక్కముఖంవేసి "ఏం చెయ్యను? రాగానే అమ్మ కొట్టి అనుమానంగా 'ఎక్కడికి వెళ్ళావ్?' అంటూ ఆరాలు మొదలుపెట్టింది. వొళ్ళుమండి కావాలని అబద్ధం చెప్పేశాను. అంతే!" అంది.
సుమతి సరోజ చెవి వదిలి "వదినా? అర్ధమయిందా, నీకూతురి ఆగడం! నిష్కారణంగా నన్నూ, నా కొడుకునీ ఆడిపోసుకున్నావు- కుమార్ వాడి చదువు పూర్తయ్యే వరకూ నీ కూతుర్నేకాదు ఏ ఆడపిల్లనీ కన్నెత్తి చూడడు. నీ కూతురేమన్నా అల్లరిచేస్తే అందుకు నేను బాధ్యురాలినికాదు" అంది అనురాధతో.
అనూరాధ ముఖం వికసించింది.
"ఏమీ అనుకోకు సుమథే౧ మనసుకి కష్టంతోచి ఏదో అనేశాను. ఆడపిల్ల తల్లిని. ఆ సాధక బాధకాలు నీకు మాత్రం తెలియవా?" అంది సర్దుతున్నట్లు.
సరోజ కోపం తెచ్చుకుని "అత్తా! నేను నీ జట్టు ఉండను_నీతో మాట్లాడను" అంది.
సుమతి నవ్వి "బంగారు తల్లివి! ఆ కోపం అలాగే కనీసం ఈ పరీక్షలయ్యేవరకూ ఉంచుకో?" అని సరోజ బుగ్గ ఆప్యాయంగా మెలిపెట్టింది.
18
మంజు స్నేహితులంతా కలసి సినిమాకు వెళ్లాలని ప్రోగ్రాం వేసుకున్నారు. మంజు భయపడుతూనే తల్లిని పర్మిషన్ అడిగింది. సుమతి కనుబొమలు ముడిచి "ఫస్ట్ షోకా? అంటే వచ్చేసరికి చాలా రాత్రి అవుతుందికదూ! వద్దమ్మా! నీకు కావాలంటే నేనూ నువ్వూ నాన్నగారూ వెళ్దాం!" అంది.
మంజుకి ఏడుపొచ్చేసింది. తనకు కావలసింది సినిమా కాదు-స్నేహితులతో కలసి చూడటం. అమ్మా నాన్నలతో కలసి ఎప్పుడైనా చూడచ్చును. అలా చూస్తే స్నేహితులతో కలసిచూసిన థ్రిల్ వస్తుందా? తను ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్తానంటోందా? ఒక్కసారి సరదాగా స్నేహితులతో కలసి సినిమా చూస్తానంటే కూడా ఆంక్ష విధించాలా?
మంజు ఏడుస్తోంటే చూడలేకపోయింది సుమతి. "సరే! నువ్వూ వెళ్దువుగానిలే!" అనేసింది చటుక్కున. మంజు కళ్ళు తుడుచుకుని హుషారుగా కాలేజికి వెళ్లిపోయింది. కానీ తీరా మంజు సినిమాకు బయలుదేరబోతూంటే సుమతి తను కూడా తయారై "నేనూ వస్తున్నాను." అంది. మంజు వెల వెలబోతూ "నువ్వూ వస్తున్నావా" అంది. సుమతి నవ్వి "ఏం నేను రాకూడదా? అప్పుడే అంత ముసలిదాన్ని అయిపోయానా?" అంది. మంజు ఏం మాట్లాడలేదు. కానీ, మంజు హుషారులో సగం చచ్చిపోయింది.
మంజు స్నేహితులందరూ మంజుతో కూడా వచ్చిన సుమతిని చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళ హావభావాలు అర్ధం చేసుకుంది సుమతి. నవ్వుతూ "నేనూ మీతో కలిసి సినిమా చూద్దామని వచ్చాను. మీకేమీ ఇబ్బంది లేదుగా!" అంది. వాళ్ళు చచ్చినట్లు నవ్వి "ఛ! ఇబ్బందేం లేదు ఆంటీ, ఇట్ ఈజ్ ఎ ప్ల్రెజర్!" అన్నారు.


