ప్రెస్ బిల్ వస్తోంది
కాలనీ వాళ్ళందరం తెల్లారుజామున అయిదుగంటలకే లేచి రడీ అయిపోయి ఆరుగంటల కల్లా వేదిక దగ్గరకు చేరుకున్నాం.
ప్రెస్ బిల్ ని ప్రభుత్వం బలవంతంగా అమలు జరపటం ప్రారంభిస్తోందని తెలిసి మా కాలనీలో అందరం పేపర్ కొనడం మానివేశాం. ఎందుకంటే ఏ పేపర్ లోనయినా ఒకటే న్యూస్ ఉంటుందనీ, అంచేత అందరూ కలిసి ఒకటే కొని అయిదు నిముషాలు అందులో న్యూస్ చదివితే సరిపోతుందనీ గోపాల్రావ్ మాకు సలహా ఇచ్చాడు. గోపాల్రావ్ జర్నలిస్ట్ కనుకా, ప్రెస్ బిల్ గురించీ వార్తాపత్రికల గురించీ, అతనికి తెలిసినంతగా మాకు తెలీదు గనుక- మేము ఆ సలహాను ఫాలో అయిపోయాము.
మరికాసేపట్లో గోపాల్రావ్ వాళ్ళ పత్రికాఫీస్ నుంచి "ఈక్షణం" దినపత్రిక కాపీ ఒకటి తీసుకొచ్చాడు.
వేదిక మీద నిలబడి పత్రిక చదవడం ప్రారంభించాడు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థాపించిన రికార్డ్. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలన్నీటినీ పరిష్కరించడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినంత వరకూ ఎలాంటి సమస్యలూ లేవు. ఇది ప్రపంచ చరిత్రలోనే అపూర్వం! ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి ప్రభుత్వాధికారులకూ ప్రజలకూ తమ అభినందనలు తెలియజేశారు. అంతే కాదు. 164వ సారిగా తను మళ్ళీ ప్రజలసేవకు అంకితమవుతున్నానని తెలియజేశారు-"
అందరూ తప్పట్లుకొట్టారు.
మా ముందు కూర్చున్న ఆడవాళ్ళంతా సంబరపడిపోయారు.
"నేన్చెప్పలేదూ? అన్నగారికి దైవాంశ ఉందనీ! అందుకే పదవిలో కొచ్చిన సంవత్సరంలోనే ప్రజల సమస్యలన్నీ తీర్చేశారు-" అంది సావిత్రమ్మ.
"అవును మరి! అన్నగారు ఎంత గొప్పవారు కాకపోతే అలా అన్ని వందలసార్లు మన సేవకి అంకితమయిపోతున్నారు? ఇంతకు బోలెడు మంది ముఖ్యమంత్రుల్ని చూశాం- సంవత్సరాల తరబడి ముఖ్యమంత్రిగా ఉన్నాళ్ళు, నెలకోసారి మారిపోయేవాళ్ళూ, వారానికోసారి మారిపోయేవాళ్ళూ- మరెందరో ఏ ఒక్కరయినా ఇలా ఇన్నిసార్లు ప్రజాసేవకి అంకితమయ్యారా?" అంది కల్చరల్ సెక్రటరీ పార్వతీదేవి.
వాళ్ళ మధ్యలో కూర్చుని వాళ్ళ మాటలు వింటూన్న ఓ పాప ఛటుక్కున వాళ్ళమాటలకు అడ్డుపడింది.
"మమ్మీ, మమ్మీ! అంకితమవటం అంటే ఏమిటి?"
వాళ్ళిద్దరికీ ఏం చెప్పాలో తెలీక మొఖాలు చూసుకున్నారు.
"అంకితమవటం అంటే అంటే అదే జీవితం ధారపోయటం అన్నమాట!"
"ధారపోయటం అంటే ఏమిటీ?"
"నోర్మూసుకో కాసేపు"
"అసలు ఎందుకే అలా ధారపోయటం?" మళ్ళీ అడిగిందాపిల్ల.
"ఎందుకేమిటి! మంచివాళ్ళూ, గొప్పవాళ్ళూ అలా ధారపోస్తారన్న మాట!"
"మరి పునఃరంకితం అంటే ఏమిటే?"
"అంటే మళ్ళీ ధారపోయటం అన్నమాట.
"ఎందుకే అన్నిసార్లు ధారపోయటం?"
"నోర్మూసుకో కాసేపు" ఆ పిల్ల కాసేపు నోరు మూసుకుంది.
"ధారపోయటం అంటే ఏమిటి?" మళ్ళీ అడిగింది.
"అంటే మనకి సహాయం చేయడానికే బ్రతకటం. అలా చేస్తే చాలా గొప్పవాళ్ళన్న మాట!"
"మరి డాడీ కూడా ఎందుకు అంకితమవ్వరు?"
"ఛస్! అది ఎన్టీఆర్ లాంటి గొప్పవాళ్ళే చేయగలరు! మీ డాడీ లాంటి వాళ్ళు చేయలేరు-"
"ఎన్టీఆర్ మనకి ఏం సహాయాలు చేశాడు మమ్మీ?"
"పిచ్చివాగుడు వాగకు! బోలెడు చేశారని పేపర్లో రాయలేదూ?"
"మరి మనం మా స్కూల్లో డొనేషన్ కట్టనవసరం లేకుండా సహాయం చేయరెందుకని?"
"నోర్మూసుకుంటావా లేదా?" కసురుకుంది సావిత్రమ్మ. ఆ పిల్ల నోర్మూసుకుంది.
రెండోవార్త చదవసాగాడు గోపాల్రావ్.
"రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ తగ్గిపోయినందుకు ఆంధ్రప్రదేశ్ పౌరుల హర్షం!" హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలో ఒక సింగిల్ రూమ్ క్వార్టర్స్ లో జరిగిన బ్రహ్మాండమయిన బహిరంగ సభలో లక్షలాది ప్రజల ప్రసంగం! ప్రెస్ బిల్ వచ్చిన ఒక్క రోజులో అన్ని వస్తువుల ధరలూ సగానికి పైగా తగ్గించి వేయగలిగిన ప్రభుత్వానికీ, ముఖ్యమంత్రికీ ప్రజలు తమ కృతజ్ఞతలు తెలియజేశారు-"
ఆ వార్తకు ఏంచేతో ఎవరూ చప్పట్లు కొట్టలేదు.
"ఒకవేళ ఆ మీటింగ్ జరిగినచోట ధరలు తగ్గాయేమో" అంది భారతీదేవి సావిత్రమ్మతో.
"అవును అక్కడ తగ్గే ఉంటాయ్- కాకపోతే అన్ని లక్షల మంది ఎందుకు అబద్ధాలు చెప్తారు?"
గోపాల్రావ్ మళ్ళీ చదివాడు.
"నగరంలోని నిర్భయ్ నగర్ కాలనీలో జరిగిన మరో చారిత్రాత్మక మయిన సభలో కాలనీకి చెందిన అనేకమంది గృహిణులు ఆడపడుచులు కూడా అకస్మాత్తుగా ధరలు తగ్గిపోయినందుకు ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ ప్రసంగాలు చేశారు. సభ ఆఖర్లో ఆ సభకు అధ్యక్షత వహించిన శ్యామల్రావ్ గారు మన ముఖ్యమంత్రి అవతార పురుషులనీ అందుకే అలా ధరలు తగ్గించగలిగారనీ అన్నారు-"
ఆ వార్తతో పెద్ద ఎత్తున కలకలం బయల్దేరింది అందరిలోనూ.
"మన కాలనీలో సభ ఎప్పుడు జరిగింది?" ఆశ్చర్యంగా అడిగాడు రంగారెడ్డి శాయిరామ్ వంక అనుమానంగా చూస్తూ.
"అబ్బే- నాకేం తెలీదు! నేనేం మీటింగ్ పెట్టలేదు నిన్న-" అన్నాడు శాయిరామ్ కంగారుగా.
"అయ్యో! మనం ఎప్పుడన్నామలా? అసలు ధరలు తగ్గిందెక్కడ? పైగా పాలధర ఇవాళ నుంచే మళ్ళీ పెరిగిందని మిల్క్ బూత్ వాడు ఇరవై పైసలు ఎక్స్ స్ట్రా వసూలు చేశాడు కదా!" అంది పార్వతీదేవి.


