ఆమె వచ్చి ప్రక్కమీద అతని ప్రక్కగా కూర్చుంది. అతని ఫాలంమీద చెయ్యివేసి 'అబ్బ! జ్వరం మండిపోతుంది. నీకింత మొండితనం ఎందుకయ్యా? డాక్టరుకి ఎందుకు కబురు పంపలేదు?' అన్నది బాధగా.
రాజారావు ఏమీ సమాధానం చెప్పలేదు. ఆమె కళ్లలోకి చూస్తూ మెదలకుండా ఊరుకున్నాడు.
'మాట్లాడవేం?' అంది వదిన.
అతను కష్టమ్మీద గొంతు స్వాధీనం చేసుకుని 'కారణం అంటూ ఏమీ ఉండదమ్మా! అయినా ఎవరికోసం నా జ్వరం నయం కావడం?' అంటుంటే కళ్లనుండి నీళ్లు జలజలమని రాలాయి.
ఆమె హృదయం ద్రవించింది. 'ఛ! ఇదేమిటి?' అని చేత్తో అతని కన్నీరు తుడిచింది.
'వదినా! ఆనాడు మన చిన్నతనాన్ని అనాలోచితంగా గుర్తుచేశాను. బాధ కలిగించానా?'
'లేదయ్యా! ఇవే బాధలయితే ప్రపంచంలో అసలు బాధలకు అర్థం వుండదు. అవునూ... నీవిలా పెంకితనంచేసి ఎవర్ని సాధిద్దామని?'
రాజారావు పెదవులమీద చిరునవ్వు ఉదయించింది. అది చూసి ఆమె 'ఎందుకు నీకు నవ్వు వచ్చింది?' అని ప్రశ్నించింది.
అతనామె ప్రశ్నకు జవాబు చెప్పకుండా 'నా కన్నీరైతే తుడవగలిగావు. నా నవ్వును చెరపగలవా?' అన్నాడు.
ఆమె నిర్ఘాంతపోయింది. అప్పుడంది తగ్గుస్వరంతో 'చూడు! చాలా రోజులకు నీతో మనసు విప్పి మాట్లాడుతున్నాను.... కానీ నీవు నాకు దుఃఖం కలిగించేలా మాట్లాడుతున్నావు. తగునా?'
'అబ్బే! నేను ఊరికినే అన్నానమ్మా! అమ్మ రాలేదా?'
'ఉహుఁ వాళ్ళు ఉండమని బలవంతం చేస్తే ఆమెగారక్కడే ఉండిపోయారు. అవునుగానీ, నా ప్రశ్న ఒకటుంది సమాధానం చెబుతావా?'
'ఉహూఁ చెప్పను. నువ్వడిగే ప్రశ్న నాకు తెలుసు.'
"కానీ జవాబు పొందనిదే ఇక్కడనుండి కదలదలచలేదు."
"ఇతరుల దోషాలు వినాలని నీకింత కుతూహలం ఎందుకు? నువ్వు నా వదినవు! ఇలాంటి సంగతులు మనమధ్య రావడం నాకు ఇష్టముండదు. ఏమన్నావు? నేను చెప్పందే ఇక్కడినుండి కదలననా? మరీ మంచిది. ఆ కారణంగానైనా చాలాసేపు కూర్చుంటావు ఇక్కడ."
ఆమె ఏదో చెప్పడానికి పెదాలు కదిలించబోతుంది... గదిబయట అడుగుల చప్పుడయేసరికి, ఉలికిపడి లేచి నిల్చుంది. అప్పటికే తలుపులు తోసి లోపలకు వచ్చాడు పెద్ద అన్నగారు.
ఒక్కక్షణం మాత్రం మౌనంగా ఊరుకుని - హఠాత్తుగా ఆప్యాయతలొలికిస్తూ 'ఏమిటి రాజా ఈ అఘాయిత్యం? ఇన్నాళ్లనుండి జ్వరంతో బాధపడుతూ మాకు కబురైనా చేయలేదు. మేము చచ్చిపోయామనుకున్నావా? మేము నీకు చేసిన అన్యాయమేమిటి?' అంటూ దగ్గరకు వచ్చాడు.
రాజారావు పలకలేదు. కళ్లప్పగించి చూస్తూ ఊరుకున్నాడు.
"ఉండు... తెల్లవారగానే డాక్టరుకోసం కబురుపెడతాను ప్రక్కఊరికి. అమ్మకు కబురు చెయ్యమన్నావా బెజవాడకు?"
"వద్దు" అన్నాడు రాజారావు.
"వద్దంటే ఎలా? అయినా నీ ఇష్టం! మేము చెబితే వినవుగా?"
ఆ తరువాత ఇలాంటివే నాలుగు అనునయ వచనాలు చెప్పి ఆయన హడావుడిగా అక్కడినుండి నిష్క్రమించాడు. ఆయన భార్య అక్కడినుండి అంతకుముందే వెళ్లిపోయింది. ఓ అరగంట గడిచాక చిన్న అన్నగారు కూడా వచ్చి మొక్కు చెల్లించుకుని వెళ్లిపోయాడు.
కొంచెంసేపు గడిచాక రాజారావు పనివాణ్ణి పిలిచాడు. "ఒరేయ్! అమ్మగార్నేమైనా అన్నారా అన్నయ్య ఇక్కడ్నుంచి వెళ్లాక?"
వాడు చెప్పనా వద్దా అని సంకోచిస్తూ తల గోక్కోసాగాడు.
"ఫర్వాలేదు చెప్పరా మొద్దు?"
వాడు ఎలాగో "ఆఁ ఏమిటతనితో గుసగుసలని గద్దించి అడిగారండీ! అమ్మగారేమో జ్వరమొస్తే పలకరించేందుకు వెళ్లాను తప్పా? అన్నారండీ. అయ్యగారేమో "నేను వద్దని చెబితే?' అంటూ..." అని చెప్పి నీళ్ళు నమిలాడు.
"కొట్టరా?" అని అడిగాడు రాజారావు.
పనివాడు తల ఊపాడు.
"సరేలే! నువ్వు పో!"
ఆ రాత్రి పదకొండు దాటింది. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. రాజారావు కళ్లు మూసుకుని నిద్రపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతనికి మంజువాణి గుర్తుకువచ్చింది. ఇప్పుడు ఏం చేస్తుంటుంది మంజువాణి? విస్మరించి వుంటుందా తనను?
ఇంతలో అతనికి ప్రక్కగా అన్నగారి గదిలోనుండి మాటలు వినిపిస్తున్నాయి.
"నేను బయటకు పోతాను" అంటుంది ఆమె.
"వీల్లేదని చెప్పాను..."
"చెయ్యి వదలండి చెబుతున్నా... ఛ! ఏమిటిది? ప్రక్కగదిలో అతను జ్వరంతో అట్టా అవస్థ పడుతుంటే?"
నిముషాలు విరామంతో కుయ్యోమని మూలిగాయి.
"అబ్బా! మీరు మనుషులేనా? ఏమిటీ మోటుతనం? నేను చచ్చిపోతాను ఉరేసుకుని..."
ఒక వికటాట్టహాసం వినిపించింది. ఆడదాని ఆర్తనాదం అందులో మిళితమై పోయినట్లయింది. ప్రకృతి ఊపిరి బిగబట్టింది సిగ్గుపడి.
రాజారావు అసహ్యంగా మంచానికి అంటుకుపోయాడు. కసి తీర్చుకోవడానికి ఇలాంటి నిర్వచనంకూడా వుందేమిటి? పురుషుడికి పెళ్లి ఒక ఆయుధమా?
అతనక్కడి నుండి పారిపోదామనుకున్నాడు. కానీ... జ్వరం, బలహీనత.
మానవుడు రాజారావు.
12
చక్రపాణికి జ్యోతిశ్శాస్త్రం అంటే అభిమానం జనించింది.
పుస్తకాలు కొని చదవసాగాడు. చాలాభాగం ఇంగ్లీష్ పుస్తకాలే! అందులో ఆసక్తివున్న ఎవర్ని కలుసుకున్నా చర్చలు చేసేవాడు. వీధుల్లో అప్పుడప్పుడూ కోయవాళ్లు కనిపిస్తుంటారే... వాళ్ళతోకూడా మైత్రి చేశాడు. వాళ్ళు చెప్పే విషయాల్లో కొంత సత్యం వున్నట్లుగా తోచసాగింది అతనికి.


