"ఏమో వచ్చిన్రేమే" అడిగాడు సమ్మయ్య.
"ఏందే కత ఎరికెలేనట్లడగుతవ్? పిల్లను పట్టుకొస్తివి. రాకుంట తప్పుతాదె. తోలుతీస్కపోత." సింగి తండ్రి బీరయ్య జవాబు.
"అగ్గో ఎట్లంటవేమె. తెచ్చుకున్నోడు తోల్తాడే? యాణ్ణన్నా ఉన్నదె, ఉస్స్. కట్టబెట్టరాదె" కోయగూడెం వాడన్నాడు.
"ఏమున్నదని కట్టబెడ్తడే! పోరి బుక్కెడు తినాలెకాదె. గూట్లేమి లేదాయె. ఎట్ల కట్టబెడ్తడె" బీరయ్య తరపున కింది గూడెం పలికింది.
సమ్మయ్య వళ్ళు మండింది. "ఏందె కూస్తున్నవు? ఉన్నదేం కట్కపోతావె. నా కొడుకు కూటికీ పేదైతే కులానికి పేదైతాడే? వాడికేమి కాలు కుంటను కుంటవ! కన్ను గుడ్డను కుంటవ? తుపాకి పట్టిండంటే పెద్దపులినేస్తడే పెద్దపులిని? తెచ్చుకున్నెన్క తోలడ్దిలేదు. ఏం చేస్తవో చేసుకో."
ఈ మాట మీద ఉభయపక్షాలవారు వాదించుకున్నారు. తిట్టుకున్నారు. కొట్టుకున్నారు. నానా రభస జరిగింది. వచ్చిన సింగిని లాక్కుపోయేదాకా వచ్చింది. పెద్దమనుషులూ - ఉభయపక్షాలవారూ - శాంతింపజేశారు. మాటలుసాగేయి. బేరాలు సాగేయి. జులా ఖర్చును గురించి ఒక నిర్ణయానికి వచ్చారు.
(ఈ 'జూల ఖర్చేమిటో అర్థంకాలేదు. బాగా ఆలోచించిన మీదట ఇది బహుశః ఉర్దూ 'ఝాంలా ఖర్చ్' అయ్యుంటుందనుకుంటాను. ఝులా అంటే ఊయల. ఇంత కాలం పెంచినందుకు పిల్ల తల్లిదండ్రులకు ఇచ్చే ఖర్చై ఉండాలి అనుకున్నాను) ఒక మేకపోతు కొన్ని గింజలు ఇవ్వాలని తీర్మానించబడింది. అందుకు సంచకరిగా కొత్త గుడ్డలో మూడు రూపాయలు, పసుపు కొమ్ములు, కుంకుమ కట్టి అందించాడు సమ్మయ్య బీరయ్యకు.
బీరయ్య అందుకున్నాడు. కూతురును వెంటపెట్టుకున్నాడు. గూడెం వారి సహితంగా కిందిగూడెం చేరాడు.
కోయగూడెం రిత్తపోయింది. సింగన్న మనసు చిన్నబోయింది. వసంతం పూర్వంలాగే వుంది. కాని అతనికి కాస్తంత ఆనందం లేదు. తెచ్చుకోవాలనే మురిపం ముగిసింది. కట్టుకోవాలనే ఆదుర్దా కనిపించింది. ఏర్పాట్లలో మునిగిపోయాడు. సాహుకారు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే నాగేశ్ నూ, రఘూను కలుసుకున్నాడు. లగ్గానికి రావలసిందని పిలిచాడు. రాబోయే పంట తాకట్టు పెట్టిన డబ్బుతో కోయగూడెం చేరాడు.
అప్పుడే సింగి వెళ్ళి వారం దాటింది. అది అంగారం అయిందతనికి. అనుకున్నట్లు మేకపోతును, గింజలూ పంపాడు కింది గూడెం. తాము వచ్చే రోజు నిర్ణయం చేసి చెప్పి పంపాడు కూడా.
నిర్ణీత దినం రానేవచ్చింది. నాగేశ్ కూడా వచ్చాడు. రఘు రాలేకపోయినందుకు విచారం వ్యక్తపరచాడు. అతని ఆరోగ్యం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కోయగూడెం కదిలింది. కింది గూడెపు బాట పట్టింది సాగింది. చేరింది. అక్కడ కాళ్ళకు పసుపురాచి పెళ్ళికొడుకును చేశారు సింగన్నను. సింగిని పెళ్ళికూతురుని చేశారు. ఆ జంటను చూచి ఆనందించాడు నాగేశ్. అతనికి ఏవేవో జ్ఞాపకాలు వచ్చాయి.
ఆనాడు విందులు సాగేయి. సారాయి, కల్లు, మాంసం, జనం తమను తాము మరచారు. ఆడారు, ఎగిరారు, పాడారు, అరచారు, కేకలు పెట్టారు, పోట్లాడుకున్నారు, కలుసుకున్నారు, రాజీపడ్డారు.
అలా రెండు రోజులు గడిచాయి. రెండు గూడాలూ కలిసి కోయగూడెం వచ్చాయి. అక్కడ పెళ్ళి. పెళ్ళంటే బాపడు రాడు. మంత్రాలు చదువడు. తలంబ్రాలు పోసుకోరు. తూమెడు గింజలు కుప్పలుపోశారు. దానిమీద వధూవరులను కూర్చోబెట్టారు. సమ్మయ్య వధువు తల్లికి చీర పెట్టాడు. పిల్ల మేనమామకు, తండ్రికి కండువాలు పెట్టాడు. బీరయ్య పెండ్లికొడుక్కు బట్టలు పెట్టాడు.
డోలువాడు డోలు వాయించాడు. వీరంగం వేశాడు. సింగన్న సింగికి మంగళసూత్రం కట్టాడు. వారు భార్యాభర్తలు అయిపోయారు. ఆనందంలో అంతా పప్పన్నం తిన్నారు. అంతే మాంసంలేదు. తాగుడు లేదు. తందనాలు లేవు.
కింది గూడెంవారు వెళ్ళిపోయారు. కోయగూడెం పండుగ తరువాత పల్లె అయింది. తరవాత మామూలుగూడెం అయింది. మళ్ళీ మామూలే అడవులకు పోవడం కాయగసర్లు తెచ్చుకోవడం, సింగన్నకు చేతినిండా పని దొరికింది. నాగేశ్ అక్కడే ఉండిపోయాడు కొన్నాళ్ళు. అక్కడి వాళ్ళకు ఏదేదో బోధించాడు. పొలాలు దున్నుకునేవాళ్ళవేననీ, శిస్తులు కట్టాల్సిన అవసరంలేదని, ప్రభుత్వం కోయలను దోచుకుంటూందనీ, భూములు కూడా లాక్కోవడానికి చూస్తుందనీ చెప్పాడు. నాగేశ్ చెప్పిన మాటలను కోయదొరలకు అర్థం అయ్యేటట్లు చెప్పేవాడు సింగన్న. వారు ఎన్నో కోయగూడాలు తిరిగారు. ఎక్కడో తినేవారు. ఎక్కడో పడుకునేవారు. అందులో ఏదో ఆనందం కనిపించింది సింగన్నకు. అతనిలో ఉత్సాహం ఉరకలు వేసింది. పట్టుదల పెరిగింది. చదువు నేర్చుకున్నాడు. వీరుడైపోయాడు.
నాగేశ్ తుపాకి పేల్చడం నేర్చుకున్నాడు సింగన్న దగ్గిర బాగా గురిచూచి కొట్టడం వచ్చేసిందితనికి. అడవుల్లో వేటకూడ చేశాడు.
నెమలిని కొట్టాడు.
8
మృగశిరలో నాలుగు చినుకులు పడ్డాయి. ఇంట్లో గింజలు మంట్లో పోసుకుని కూర్చున్నాడు రైతు. అతడు అందరికీ అన్నం పెడ్తాడు. అన్నదాత - మనుషులకే కాదు. పశు పక్ష్యాదులకు - దేవతలగ్గూడా. అయినా అందరు మిండలే అతనికి - కింద సర్కారు పైన వానదేవుడు. వ్యవసాయం జూదంలాంటిది. వస్తుందా బాగానే వస్తుంది. పోతుందా ఉన్నది ఊడ్చుకు పోతుంది. రెండవదశ వచ్చింది. ఇక్కడి రైతుకు - ఆ సంవత్సరం వానదేవుడు కరుణించలేదు. చెరువులతోపాటు రైతుల గుండెలు బీటలు వారేయి.
ఆకాశంలో మబ్బులు బాగానే వస్తున్నాయి. మేఘాడంబరం అధికంగానే ఉంది. రైతులు ఆ మబ్బులను చూస్తున్నారు. గుంపులు గుంపులుగా బయటికి వచ్చి ప్రార్థిస్తున్నారు. అయినా కరుణించలేదు వానదేవుడు. ఒక్క చినుకు పడడంలేదు. పెనుగాలి వీస్తూంది. మబ్బులు విడిపోతున్నాయి.
శ్రావణం కూడా వచ్చింది. అదీ గడిచిపోతున్నది. చినుకులేదు. పంటలకు కాదు తాగేందుకు నీరు లేనిదశ వచ్చింది. బావులు ఎండిపోతున్నాయి. ఎండలు వైశాఖాన్ని మించాయి. విపరీతంగా గాలులు వీస్తున్నాయి. ఎక్కడ చూసినా సుడిగాలులు, దుమ్ముకు సుళ్ళు చుట్టి ఆకాశానికి తీసుకుపోతున్నాయి.
పంట పండినంత కాలం బ్లాక్ మార్కెట్లు అనే పదం ఎవరికీ తెలియదు. బజారు సాంతం నల్లబడిపోయింది. ఎక్కడా గింజలేదు. ఉన్నా రైతులకు కూలీలకూ అందుబాటులో లేదు. మొత్తం దేశంలో ఒక భీతావహం వ్యాపించింది. అందరి కళ్ళల్లో ఆకలి బుసలు కొట్టసాగింది. ఆకలి, ఆకలి, దాహం, దాహం ఎక్కడా గింజ లేదు, ఎక్కడా నీరు లేదు.
రఘు, నాగేశ్ నల్లబజారువాళ్ళ మీద దాడి సాగించారు. చౌకదుకాణాల పేర వచ్చిన గింజలు సాహుకార్లు కాజేయకుండా చూశారు. గింజల కోసం చీట్లు జారీచేయించారు. భీముడు, రావఁడు నల్లబజార్ల వాళ్ళ పాలిట యములైనారు. వాళ్ళు దుకాణాలకు కాపలా కాయడం సాగించారు. కొంత గుడ్డిలో మెల్లగా ఉన్నమాట నిజమే. కాని డబ్బేది కొనుక్కోవడానికి?
గిర్దావరుకు అవకాశం దొరికింది. అంతా నాస్తికులు అవుతున్నారు కాబట్టి వానలు పడలేదన్నాడు. తాతల నాటినుంచి లేని పత్రిక ఊళ్ళోకివస్తే వానలెలా పడ్తాయి? అని అడిగాడు. మాల మాదుగులు ఇండ్లలోకి వస్తున్నారు. కలి పెరిగింది. ఈ ప్రచారం ముమ్మరంగా సాగించాడు. రఘు, నాగేశ్ లే ఇందుకు కారణం అన్నాడు. సాహుకార్లు అతనికి వంతపాడేరు. దేవునికి కోపం వచ్చింది. అతణ్ణి ప్రసన్నుణ్ణి చేయాలన్నాడు.
వానదేవుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకునే ప్రయత్నాలు సాగేయి. పిల్లలు తడిబట్టలతో బయలుదేరారు. కర్రకు ఒక కప్పను కట్టి ఇంటింటికీ తిరిగారు. "కప్పతల్లి నీళ్ళాడే, కడవనిండా నీళ్ళాయె, పాముతల్లి నీళ్ళాడె పటువనిండ నీళ్ళాయె" అని పదం పాడుతూ తిరిగారు. ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో కప్పుమీద కడివెడు నీళ్ళు పోశారు. వీరయ్యగారి ఇంటికి వచ్చారు. వారికి ఇలాంటివాటిమీద విశ్వాసం చచ్చిపోయి చాలాకాలం అయింది. జానకి కడివెడు నీళ్ళు పోయలేదు. కాని కడివెడు గింజలు తెచ్చి పెట్టింది. కప్పను తెచ్చిన కుర్రాళ్ళు గింజలు తీసుకొని గంతులేస్తూ ఉరికారు.
బోనాలు పట్టాలన్నాడు బైండ్లవాడు. జాతర సాగింది. ఊళ్ళో పండుగ జరిగింది. వీరయ్యగారి ఇంటికి తప్ప అన్ని ఇండ్లకూ వేప మండలు కనిపించాయి. తాసిల్దారు కూడా తన ఇంటికి వేపమండలు చెక్కాడు. డప్పులు, జముకులు, కొమ్ములు బోనాలు సాగేయి. తెల్లగా తోమిన బిందెల్లో నీళ్ళు తీసుకొని ఆడవారు సాగేరు. ఊరంతా కదిలింది. ముత్తాలమ్మ గుడిదగ్గర మేకలను బలి పెట్టారు. కల్లు పారబోశారు.
వీరయ్య గారింట్లో ఈ మూర్ఖత్వాన్ని గురించి చర్చలు సాగేయి.
వీరయ్యగారింటి బోనం రానందుకు ప్రజలలో నానా విధాల వ్యాఖ్యలు జరిగాయి. తాసిల్దారు, గిర్దావరు ఆ అగ్గిలో ఆజ్యంపోశారు.


