రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. ఒకరోజు అతనికి రీడైరెక్టు చేయబడి ఓ కవరు వచ్చింది. దస్తూరీ గుర్తుపట్టి అతను నిర్విణ్ణుడయాడు. ఉత్తరం జగతి రాసింది.
కవరు చింపి, కాయితాలు చేతిలోకి తీసుకుంటూంటే చేతులు వణుకుతున్నాయి.
"జయా!
నా దగ్గర్నుంచి ఉత్తరం వస్తుందని నువ్వు విన్నప్పటికీ ఊహించివుండవు. అసలు నేను బ్రతికివున్నానో లేదోకూడా నీకు తెలిసివుండదు. కాని అప్పుడప్పుడూ నన్ను గురించి ఆలోచిస్తూ వుండివుంటావు. నేనంటే నీకు ఆపేక్షా, అనురాగం వున్నాయని నాకు తెలుసు. నువ్వు అమాయకుడివి. మంచి మానవుడివి. నువ్వంటే నేనెప్పుడూ అభిమానం చూపలేదు. పైగా నిన్ను నా అవసరానికి వాడుకున్నాను. ఇప్పుడు, యీ ప్రశాంత యాత్రలో నువ్వు గుర్తుకొస్తున్నావు. అప్పుడప్పుడూ నిన్ను తల్చుకుంటున్నాను. అసలిప్పుడు ఎవరిమీదా ద్వేషంలేదు నాకు.
నేను బ్రతికే వున్నానురా. మరణించటం చేతకాలేదు. మరణించటంకన్నా బ్రతికి నన్ను తీర్చిదిద్దుకోవటంలో సుఖం కనబడింది నాకు.
నిన్ను విడిచివెళ్ళాక, కొన్నాళ్ళు పిచ్చిదానిలా తిరిగి, అలా తిరగడం చేతకాక మాధవీపురం స్వామివారి సన్నిధికి చేరుకున్నాను. వారు దయతలచి నాకాశ్రమంలో ఆశ్రయం యిచ్చారు. కొన్నాళ్ళు ప్రశాంతంగానే గడచిపోయింది గానీ, రోజులు గడిచినకొద్దీ అక్కడ విషవాతావరణం ఏర్పడసాగింది. అది రానురానూ పేరుకుని, మనుషులు పిశాచాలుగా మారేసరికి స్వామివారికీ, నాకూ అక్రమసంబంధం అంటగట్టబడింది. అంతేకాదు, మా యిద్దర్నీ హింసించారు. రాళ్ళతో రువ్వారు. క్రిందపడేసి కొట్టారు. మా యిద్దరిదుస్తులూ రక్తశిక్తమైనాయి. స్వామివారు ఎలాగో లేచి ఆ చీకటిలో తూలుతూ ఎటో వెళ్ళిపోయారు. వారిని అనుసరిస్తూనే నేను పరిగెత్తబోయాను. ఓ చెట్టుకొమ్మ తగిలి క్రిందపడిపోయాను. అంతే, తర్వాత ఏం జరిగిందో?
ఏవో కలలు వస్తున్నట్లు వుండేది. ఆ కలల్లో నేనరుస్తూ వుండేదాన్ని, ఏడుస్తూ వుండేదాన్ని నవ్వుతూ వుండేదాన్ని. అంతేగాని ఇంకేమీ తెలియదు.
నాకు నేను తెలిసేసరికి విశాఖపట్నం పిచ్చాసుపత్రిలో వున్నాను. అక్కడ నేను ఒకటిన్నర సంవత్సరంపైగా వున్నానుట. 'నువ్వెవరు? మీ యిల్లెక్కడోచెబితే మీ యింటికి పంపిస్తాము' అన్నారు. నాకెవరూ లేరని చెప్పి, నా కాళ్ళమీద నేను నిలబడగలనని వాళ్ళకు నచ్చచెప్పి అక్కడ్నుంచి బయటపడ్డాను.
'ఎక్కడకు పోవాలి? నా మిగతా జీవితాన్ని ఏవిదంగా గడపాలి?' వేసే ప్రతి అడుగూ సంకోచంగా పరణమించింది. నా రూపంలో ఏమీ మార్పు రాలేదు. అది నాకు శత్రువని తెలుసు.
నా మనస్సులో స్వామివారు, వారి చిన్మయరూపం తప్ప మరొకటిలేదు. నావల్ల వారి జీవితం పరాభూతమైంది. నావల్ల వారు యిడుములపాలయ్యారు. వారిని నేను చూడాలి. వారి సాహచర్యం నాకు కావాలి. వారి పవిత్ర సాహచర్యంతో నేను కోల్పోయింది తిరిగి పొందగలగాలి.
కాని ఎక్కడున్నారని వెదకను? ఈ విశాల జగత్తులో ఎక్కడున్నారని ఊహించను? ఆలోచిస్తూ వ్యర్ధంగా కొన్నిరోజులు గడిపాను. చివరకు మెరుపులా ఓ ఆలోచన స్పురించింది. వారు శృంగేరి పీఠాధిపతులవద్ద ఉపదేశం పొందారు. అక్కడికి పోతే కనబడతారని ఆశతోచింది. వెంటనే అక్కడికి ప్రయాణమయాను.
శృంగేరిలో పిచ్చిదాని దుస్తులతో కనిపించిన ప్రతివారివంకా అన్వేషిస్తున్న నేత్రాలతో చూస్తూ తిరుగాడుతున్న నావంక అందరూ విచిత్రంగా తిలకించ సాగారు. అక్కడి వాతావరణం నాకు అమిత పవిత్రంగా కనిపించింది. అక్కడి గాలి తగలగానే నా మనసంతా నిర్మలంగానూ, సంపుల్లమానంగానూ మారిపోయింది. తెలియని ఆనందం ఆవహించింది. నేను రావలసిన ప్రదేశం యిదే అని స్పురించింది.
అక్కడి చెట్లు, అక్కడి పక్షులు, అక్కడి భూమి అన్నీ నాకు ఆహ్లాదాన్ని కూర్చాయి. అవి కొత్తగీతాలను ఆలపిస్తున్నాయి. "జగతీ! నీ గమ్యం యిదే" అని ఎవరో చెవిలో ఊదినట్లయింది.
శృంగేరిస్వామిని, జగద్గురువును సందర్శించాను. నా పాపాలన్నీ హరించి పోయినట్లయింది. శరీరంలో ఎంతో చైతన్యం ప్రవేశించింది. పోయి ఆయన పాదాలమీద వ్రాలిపోయాను. ఎంతో మనశ్శాంతిగా వుంది. ఊరట కలిగింది. నేనేడుస్తున్నాను."
"లేమ్మా!" అన్నారు స్వామి.
"స్వామీ! నేను పాపిని. నాకు పునర్జీవితం ప్రసాదించండి" అన్నాను.
"నీవు జగతివా?" అన్నారు.
నివ్వెరపోయాను. తల ఎత్తి చకితనేత్రాలతో వారివంక చూస్తున్నాను.
ఆయన పెదవులపై చిరునగవు వెలసింది. ఆదరస్వరంతో అన్నారు. "నీపేరు ఎలా తెలిసిందని కదూ సందేహం! ఇంతటి అపురూప సౌందర్యవతి తను పాపినని చెప్పుకునే ధైర్యంగల యువతి జగతిగాక ఎవరుంటారు? నీకోసమే ఎదురుచూస్తున్నాను. నీ శిక్ష అయిపోయింది. నువ్వు ఒక దశ పైకి వెళ్ళావు జగతీ!" నా శిరస్సు నిమురుతున్నారు.
"ధన్యురాల్ని స్వామీ!" అన్నాను తన్మయంగా.
ఓ శిష్యుడ్ని పిలిచి విద్యాధరస్వామిని పిలుచుకురమ్మని కబురుపంపారు. నాతో "మాధవపురంలో ప్రజల మూర్ఖతకు గురి అయ్యాక విద్యాధరుడు నన్ను వెదుక్కుంటూ వచ్చాడు. జరిగిన ప్రతి విషయం సవిస్తరంగా నాకు చెప్పాడు. పసిపిల్లాడివలె, ఏమీ తెలియని అజ్ఞానివలె బాధపడ్డాడు. అతని తప్పేమీ లేదని, జరిగింది నిమిత్తమాత్రమనీ ఎంతో ఊరడించిన మీదటగానీ అతనికి ఉపశాంతి కలగలేదు. ఊరడిల్లాక నాకే ఆధిపత్యమూ వద్దు. నేనెవరికీ సందేశాలు యివ్వను. భగవంతుడి సేవచేస్తూ నన్నిక్కడే వుండనివ్వండి' అన్నాడు. అలాగే అన్నాను. అప్పటినుంచీ యిక్కడే వుంటున్నాడు" అన్నారు.
విద్యాధరస్వామి వచ్చారు. నన్ను చూసి ఆశ్చర్యచకితులవుతూ, ఆనందాన్ని వ్యక్తంచేస్తూ "జగతీ! వచ్చావా? నీపట్ల చాలా అత్యాచారం చేశాను. నావల్ల నీవు చాలా హేళనకు గురయ్యావు. ఆరోజు అదో ఉన్మాదం. నిన్ను తిరిగి చూస్తేగాని నా పాపంనుంచి నిష్కృతి కలగదని తెలుసు. నన్ను క్షమించవా జగతీ?" అన్నారు.
నా మనసు ద్రవించిపోయింది. గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది. "స్వామీ! క్షమించటానికి మీరేం నేరం చేశారు? నాకేపాటి అర్హత వుంది? మనం ఉభయులమూ అనుకోని పరిణామాలకు గురి అయాము. ఇద్దరమూ ప్రగతిపథంలోనే ప్రయాణం చేశాం. మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదు. మీకు అపశృతి ఏర్పడలేదు. అదే నాకు తృప్తి" అని శృంగేరిస్వామివంక తిరిగి "స్వామీ! నేను దిక్కు తెలియకుండా వున్నాను. శూన్యంలో, అంధకారంలో వున్నాను. కర్తవ్యం తెలియదు. ఈ స్థితిలో మీరుతప్ప నాకెవరూ లేరు. భగవానుని సేవలో తరిస్తూ నా శేషజీవితం యిక్కడే వెళ్ళబుచ్చుతాను. దయవుంచి నన్ను వెళ్ళమని నిర్దేశించకండి" అని వేడుకున్నాను.
స్వామి చిరునవ్వుతో, శాంతంగా "వెళ్ళమనటానికి నేనెవర్నమ్మా?" అన్నారు.
అంతే! ఆనాటినుంచీ ఇక్కడే, యీ ఊరిలోనే స్థిరపడిపోయాను. ఊళ్ళో నాకు చిన్నయిల్లు యివ్వబడింది. అందులో వుంటూ రోజూ స్వామి దర్శనం చేసుకుంటూ, సమావేశాలలో పాల్గొంటూ, భగవత్ చింతనలో కాలం గడుపుతున్నాను. ఇప్పుడు నా దగ్గర అనేక గ్రంథాలున్నాయి. అవి పఠిస్తూ వుంటాను. ఎన్నో నూతన విషయాలు తెలుసుకుంటున్నాను. ఎంతో చైతన్యం పొందుతున్నాను. సూర్యోదయ, అస్తమయాలు యిక్కడెంతో శోభాయమానంగా వుంటాయి. ఎంతసేపు చూసినా తృప్తితీరదు. ప్రకృతీ నేనూ అనేక విషయాలూ మాట్లాడుకుంటూ వుంటాం. అయినా తనివితీరదు.
విద్యాధరస్వామీ, నేనూ తరచు కలుసుకుంటాం. ఆయన నాకు అనేక విషయాలు బోధిస్తారు. మేము ఎన్నో చర్చించుకుంటూ వుంటాం. నాకు విసుగు వుండదు.
ఇప్పుడు నాకు ఒకే అనుభూతి, ఒకే ప్రాణం, ఒకే మనసు, మసకతనం హరించిపోయింది. దృఢత్వం పెరిగిపోయింది. నేను ఏమిటోగా మారిపోతున్నాను. కొన్నాళ్ళకు యింకేమవుతానో తెలియదు!
జయా! నీపట్ల చాలా కఠినంగా ప్రవర్తించి వుంటాను. చిన్నతనంనుండీ నిన్ను ఎన్నోసార్లు బాధించాను. అప్పటి జగతివేరు. నన్ను కష్టకాలంలో ఆదరించి, రక్షణ యిచ్చావు. నీ ఋణం ఎన్నటికీ తీర్చుకోలేను. నా మార్పుకి కారణం నిన్ను కలుసుకోవటమే. నా అపరాధాలని క్షమించు.
ఎప్పుడైనా మైసూరువైపువస్తే యిక్కడికి రావటం మరిచిపోకు. నువ్వు కులాసాగా వున్నావా? అమ్మ ఎలావుంది? పాపం అమ్మకి నావల్ల ఎంతో అన్యాయం జరిగింది. సుఖంలేని విషాదజీవి అమ్మ. ఉంటాను.
నీ అక్క "జగతి"
ఎంతటి ఉపద్రవాల సమ్మేళనం జగతి! అతని కన్నులలో నీళ్ళు నిలిచాయి. తన అక్క జీవితం ధన్యమైంది. తనకన్నా ఆమె ఎన్నో రెట్లు మెరుగు. ఆమె జీవితాన్ని అన్నివిధాలా సాధించింది. తను ఏమీ చెయ్యలేకపోయాడు. ఎప్పుడూ అలానే... అలానే... అలానే వున్నాడు.
ఈ ఉత్తరం మాలతికి చూపించుదామా అని ఆలోచించాడు. చూపిస్తూ ఆమె అడగనీ, అడగకపోనీ ఆమెకు చాలా సంగతులు చెప్పవలసి వుంటుంది. అదీగాక పెళ్ళయ్యాక ఆమె ఎప్పుడూ జగతి సంగతి ఎత్తలేదు. తను అది రేపెట్టటం ఎందుకు? ఆ ఉత్తరాన్ని భద్రంగా పెట్టెలో బట్టల అడుగున దాచాడు.
మరునాడు జగతికి ఉత్తరం రాశాడు. తల్లి చనిపోయిన విషయమూ, తను మాలతిని పెళ్ళిచేసుకున్న విషయమూ, ఆమె కొత్తబాటలో పయనిస్తున్నందుకు తన అభినందనలూ అన్నీ రాశాడు.
అంతే! ఆ తర్వాత యిద్దరిమధ్యా ఎప్పుడూ ఉత్తరాలు నడవలేదు.
నెలలు నడిచినకొద్దీ మాలతి ఆరోగ్యం క్షీణించసాగింది. కాళ్ళకూ, చేతులకూ నీరుపట్టింది. మనిషి నీరసంగా వుండి, తూలి పడిపోతూ వుండేది. చాలాసార్లు మృత్యుంజయరావు ఆమె బాధ చూడలేక "డాక్టరు దగ్గరకు పోదాం పద" అంటే, ఆమె నవ్వేసి "నీకు చాలా భయం, నేనంటే వల్లమాలిన ప్రేమ, ఈ కాస్తదానికి డాక్టరెందుకు?" తిరస్కరించేది. వంట చెయ్యొద్దంటే వినేదికాదు. పశుపతిగారు కూతుర్ని పంపించమని ఉత్తరం రాశారు. పోనీ పుట్టింటికి వెళ్ళు అని బలవంతం చేశాడు. "ఉహుఁ! నేనక్కడికి వెళ్ళను. ఇక్కడే డెలివరీ అవుతాను. నేనుంటే మీకు భారమా చెప్పండి?" అన్నది. అతను ఖిన్నుడై "అలా అనకు మాలతీ! భారమనే ప్రశ్నలేదు. నీవు యిబ్బంది పడతావని చెప్పాను" అన్నాడు.
ఒకరోజు ఆమె వంటచేస్తూ స్టవ్ ముందు క్రిందపడిపోయింది. అదృష్టవశాత్తూ కొద్దిలో తప్పిపోయిందిగాని, కొంచెంవుంటే మంటలో ఆమె చీరపడి తగలబడి వుండును. మృత్యుంజయరావు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను లేవదీసి, ఎత్తుకు వెళ్ళి మంచంమీద పడుకోబెట్టాడు. ముఖంమీద నీళ్ళు జల్లుతున్నాడు.


