"అంటే ఎప్పుడు రిలీజ్ చేద్దామనుకుంటున్నారు?"
"దగ్గర్లో దసరా, దీపావళి పండుగలున్నాయి కదా! ఏదో ఒక పండుగకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము"
"అప్పటికి డబ్బింగ్ వగైరాలన్నీ అయిపోతాయా?"
"అవ్వాల్సిందే! మరో పదిహేను రోజుల్లో పెద్దయెత్తున పబ్లిసిటీ మొదలెడుతున్నాము. నీ పేరు బాగా హైలెట్ చేస్తున్నామనుకో. పోస్టర్స్ నువ్వింకా చూడలేదు కదూ! రేపోసారి మనాఫీసుకెళ్ళి వద్దాం. చూద్దువుగాని. అది సరేగాని నాకు కాఫీ ఇవ్వవా ఏమిటి? నీ చేతి కాఫీ నాకు ప్రాణమని చెప్పాను కదా, మర్చిపోయావా?"
సీత లేచి లోపలకు నడిచింది. అయిదు నిమిషాల్లో ఇద్దరికీ కాఫీలు తీసుకొచ్చి అతనికెదురుగా కూర్చుంది.
"సీతా! రాత్రంతా నిద్రపట్టలేదు నాకు. జరిగిందంతా కలేమోనని అనుమానం. కల కాకుండా వుంటే బావుండునని ఆశ" కాఫీ తాగేసి అన్నాడతను.
సీత మాట్లాడలేదు. లేచి కిటికీలో నుంచి బయటకు చూస్తూ నుంచుంది. అప్రయత్నంగా కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగాయామెకి. ఆమె వెనుకగా వచ్చి నిలబడ్డ వర్ధనరావు గమనించాడది.
"సీతా! ఏడుస్తున్నావా?" చప్పున ఆమెను తనవేపు తిప్పుకుంటూ అన్నాడు.
వెంటనే చేత్తో కన్నీళ్ళు తుడిచేసుకొందామె.
"ఏమయింది సీతా? ఎందుకలా ఉన్నావ్? రాత్రి నా ప్రవర్తనకేమయినా బాధ కలిగిందా?" ఆప్యాయంగా అడిగాడతను.
"ఊహు!" తలూపిందామె. జరిగిందానికి ఇద్దరూ బాధ్యులే! తనెలాగూ బాధపడుతూనే ఉంది. ఇంక అతన్నెందుకు బాధించటం.
"సీతా! నువ్విలా డల్ గా ఉండటం నాకు బావుండలేదు. పద! అలా తిరిగొద్దాం. ప్లీజ్!" అన్నాడు. అతనితోపాటు బయల్దేరింది సీత.
ఇద్దరూ కారులో ఒక గమ్యం లేకుండా తిరిగారు చాలాసేపు. అతని బలవంతంమీద అతన్తోపాటు హోటల్లోనే భోజనం చేసింది సీత.
సాయంత్రానికి ఆమెని తిరిగి ఇంటిదగ్గర వదలి వెళ్ళిపోయాడతను. చాలా వరకూ జరిగిన తప్పుని మనసులో నుంచి తొలగించ గలిగిందామె. ఆమె ఆలోచనా విధానంలో కూడా కొంతవరకూ మార్పు వచ్చింది.
ఆ మర్నాడు మధ్యాహ్నం వర్ధనరావు వచ్చినప్పుడు అతనికి ఎలాంటి అభ్యంతరమూ తెలుపకుండానే లొంగిపోయింది. అతనికి తను కావాలి! డబ్బు అవనీ, రచయిత్రిగా మరిన్ని అవకాశాలు కానీ_ ఎలా అనుకున్నా సరే.
మరికొద్ది రోజులు గడిచేసరికి వారి అనుబంధం మరింత గట్టిపడిపోయింది. ఆరోజు ఆమె ప్రప్రధమంగా సంభాషణలు రాసిన "జీవిత సోపానాలు" సినిమా విడుదల.
"సీతా! ఇంచుమించుగా ఈ రాత్రంతా నాతోనే గడపాలి" అన్నాడు వర్ధనరావు.
"అమ్మో. ఆయనకు అనుమానం రాదూ?" భయంగా అంది సీత.
"ఎలా వస్తుంది? నువ్వు కొంచెం గట్టిగా మాట్లాడితే సరి. ఇంకోసారి అలాంటి అనుమానాలు వెలిబుచ్చితే మర్యాదగా ఉండదని హెచ్చరించు. అతనే తగ్గుతాడు"
సీతకేం చెప్పడానికీ తోచలేదు.
ఎలా జరగాలో అలా జరుగుతుంది. అంతకంటే తను మాత్రం ఏం చేయగలుగుతుంది? తన సినిమా రిలీజయ్యేరోజు. జనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో, తన సంభాషణలు రాయడంలో సఫలీకృతురాలయిందో_ విఫలమయిందో అవన్నీ తెలుసుకోవాలంటే ఈ రాత్రి వర్ధనరావు పక్కనే గడపక తప్పదు.
14
"ఈ రాత్రి ఇంటికొచ్చేసరికి బాగా ఆలస్యమయిపోతుంది" అంది సీత బయల్దేరేముందు.
"ఎందుకని?" అడిగాడు మాధవరావు.
"సెకండ్ షో వరకూ చూసి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి..." అతనివంక చూడకుండానే బయటకు నడిచిందామె.
అబిడ్స్ లోని ఓ ఖరీదయిన హోటల్లో రెండు గదులు రిజర్వ్ చేయించాడు వర్ధనరావు. ఒక గదిలో డైరక్టర్ ఉన్నాడు. మరో గది సీత కోసం.
కార్లో ఫస్ట్ షోకి బయల్దేరింది సీత.
వర్ధనరావు మేనేజరు గదిలో హడావుడిగా ఫోనులో మాట్లాడుతున్నాడు. సీత అతని మాటలు వింటూ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. అతని మాటలను బట్టి తెలుస్తూనే ఉందామెకు. సినిమా చాలా బాగుందన్న వార్తలు అన్ని సెంటర్ల నుంచీ వస్తున్నాయని. ఆమెని తమకోసం ఉంచిన సీట్లలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి తనూ పక్కన కూర్చున్నాడు వర్ధనరావ్.


