అదేమీ లేదులే అన్నట్టు కళ్ళతోనే చెప్పాడు యోగి.
"యూ...నాటీ...దటీజ్ ఏన్ ఇంపాజిబుల్ క్వశ్చన్" అందామె నవ్వుతూనే.
ఆమెకి కోపం రానందుకు రిలాక్స్ డ్ గా ఫీలయి.
"సరే...నేను స్పెసిఫిక్ గా అడుగుతాను చెప్పు...నీది ఎలాంటి జుత్తు?"
"బ్లాక్"
"పొడవా? పొట్టా?"
"వెరీ లాంగ్...చాలా పొడవు. పెళ్ళయ్యాక మొగుడికి నాకు జడ వెయ్యాలంటే గంటన్నర పడుతుంది" అందామె నవ్వుతూ.
"అంత దృశ్యముండదేమో!"
"నా అందం చూస్తే నా కాబోయే మొగుడు ఆఫీస్ వదిలేసి ఇంట్లోనే సెటిలయిపోతాడు. నా అందం గురించి నేనేం గొప్పలు చెప్పుకోవడం లేదు. నిన్ను టెమ్ట్ చేయాలని కూడా కాదు. నిజంగానే నేనంత గొప్ప అందగత్తెని. దట్సాల్-ఇకపోతే ఇంత అందమైన ఆడపిల్ల జడ వెయ్యమంటే ఎప్పుడూ నిదరపోయే దేవగౌడయినా లేచి రావలసిందే! ఇక నా కాబోయే మొగుడెంత ...యూ నో...భార్యకి జడ వెయ్యడం అటు భర్తకి, ఇటు భార్యకి ఎంత థ్రిల్లింగ్ గా వుంటుందో తెలుసా?"
ఆమె మాటలకు ఒక్కక్షణం ఏం మాట్లాడాలో అర్థంకాలేదు.
"కళ్ళు."
"రెండు...బాగానే పనిచేస్తున్నాయి."
"వెరీ ఫన్నీ...నీ పొడవెంత?"
"5.6"
"వెయిట్."
"యూ ఆర్ గెటింగ్ పర్సనల్- సరిగ్గా తెలీదు. 50 లేక 55 కిలోలు. ఈ మధ్య నాకు నిన్ను చూడ్డంతోనే సరిపోతోంది. దాంతో బరువు చూసుకోవాలనే ఆలోచనే రాలేదు. అవునూ-చాలా సేపట్నుంచీ నిన్నో ప్రశ్న వేయాలని మర్చిపోతూ వస్తున్నాను. ఈ రోజేమిటి రొటీన్ కి భిన్నంగా ఫ్లాట్ లోకి ఎంటరయ్యావు? ఎప్పుడూ రాగానే డ్రాయింగ్ రూమ్ కర్టెన్ ని పక్కకి లాగేసి ఫ్రిజ్ దగ్గరకెళ్ళి మంచినీళ్లు తాగివచ్చి, సోఫాలో కూర్చుని పోస్ట్ చూసుకునేవాడివి- అలా ఎందుకు ఈరోజు చేయలేదు?" ఆమె మాటల్ని బేస్ పీస్ స్పీకర్ ఫోన్లో వింటూనే ఎలర్టయిపోయాడు యోగి.
తను అనుమానం నిజమనే దిశకేసే ఆమె వస్తోందనిపించగానే యోగిలో అప్పటివరకు ప్రోది చేసుకున్న ఉత్సాహం రెట్టింపయి పోయింది.
శ్రీధర్ ఏదో మాట్లాడబోయే ప్రయత్నం చేయబోతుండగానే ఫోన్ లో అపశృతుల హార్మోనియం పెట్టె శబ్దాలు వినిపించాయి.
వాటిని యోగి శ్రద్ధగా విన్నాడు.
"ఫోన్ లో ఏమిటా శబ్దాలు?" అడిగాడు శ్రీధర్.
"ది సేమ్ ఇండియన్-నీరో...వాడు ఫిడేలయితే-వీడు హార్మోనియం- తరువాత ఫోన్ చేస్తా...బై" అని శ్రీధర్ ఏదో మాట్లాడబోతుండగానే ఫోన్ పెట్టేసిందామె.
నిరాశగా చూశాడు శ్రీధర్ యోగికేసి.
"మంచిపనయింది. ఈలోపు నీకు క్లాస్ తీసుకోవచ్చు" అన్నాడు యోగి రిలాక్స్ గా.
"అయినా...ఏమిటిదంతా? కేవలం ఆమె మాటల ద్వారానే ఆమె ఆచూకీ ఎలా తెలుసుకోగలవు?" అడిగాడు శ్రీధర్ అమాయకంగా.
"చెబుతా...రేపు చెబుతా...నాకొచ్చిన సందేహం ఈలోపే నీకు చెప్పేస్తే నువ్వు దాని గురించి ఆమెతో మాట్లాడినా మాట్లాడేస్తావ్... రేపంతా నీకు ఆఫీసులో ట్రైనింగ్ ఇస్తా. దాన్ని జీర్ణించుకుని, నేను చెప్పినట్టు చేశావనుకో- ఆమె వుండే ఇల్లేదో తెలీకపోయినా, లొకాలిటీ మాత్రం పట్టుకోగలం. సరి...సర్లే...ముందిది ఫినిష్ చేద్దాం పట్టు" అంటూ సగం మాత్రమే వున్న బాటిల్ ని చేతుల్లోకి తీసుకున్నాడు యోగి అమితోత్సాహంతో.
* * * *
ఉదయం 9-30 సమయం.
బస్టాప్ లో నించుని తను ఎక్కవలసిన మెట్రోలైనర్ కోసం ఎదురుచూడసాగాడు శ్రీధర్.
క్రితం రాత్రి తీసుకున్న మందు తాలూకు హేంగోవర్ ఇంకా తన మస్తిష్కం మీద పనిచేస్తున్నట్టుగానే వుంది. ఓ పక్క బస్ కోసం చూస్తూ మరోపక్క పరిసరాల్ని గమనిస్తున్నాడు అప్రమత్తంగా.
సరిగ్గా...అప్పుడే...శ్రీధర్ నే ఫాలో అవుతూ వచ్చిన ఆమె...అపరిచితురాలు. పూజ...ఓ బడ్డీకొట్టు పక్కన నుంచుని, ఓరగా శ్రీధర్ పడుతున్న పాట్లను గమనిస్తూ లోలోనే నవ్వుకోసాగింది.
మరో పది నిమిషాలకు తను ఎక్కవలసిన బస్ వచ్చింది. పరిసరాల్ని మరోసారి శ్రద్ధగా పరికిస్తూ, బస్ ఎక్కాడు.
ఒక పనిని సాధించడానికి మనిషిలో లోపించేది బలంకాదు- సంకల్పం అని తరచూ తన తాతగారు తనకి చెప్పే సూత్రం గుర్తుకొచ్చింది శ్రీధర్ కి.
యోగి సహాయంతో అపరిచితురాలి ఆచూలీ పట్టుకోగలిగితే- ఎంత థ్రిల్లింగ్ గా వుంటుందో అని ఆలోచిస్తూ దొరికిన ఖాళీ సీట్లో కూర్చున్నాడు.
క్రితం రోజు సాయంత్రం ఫ్లాట్ కి వెళ్ళగానే రొటీన్ కి భిన్నంగా ఏమీ చేయలేదు తను. మరెందుకలా ప్రశ్నించింది అపరిచితురాలు? ఫ్రిజ్ దగ్గరకి వెళ్ళి మంచినీళ్ళు తాగి, వచ్చి సోఫాలో కూర్చుని పోస్ట్ చూసుకున్నాడు.
ఆ విషయం మీదే కొద్ది క్షణాలు ఆలోచించి, ఏమీ తట్టక ఆలోచనలకు స్వస్తిచెప్పి ఆమె పొడవైన నల్లటి జుత్తు, 5.6 అడుగుల ఎత్తు, 50 లేదా 55 కేజీల బరువుకి ఒక అందమైన ఆకృతిని ఊహించుకోసాగాడు.
* * * *
"ఏ మనిషికైనా రెండు ధ్యేయాలుండాలి. ఒకటి కోరుకున్నది సాధించుకోవడం- రెండు, సాధించుకున్నది అనుభవించటం. అపర్ణని కోరుకున్నావు- దక్కేలా లేదు. ఇక, రెండో ధ్యేయం గురించి ఆలోచనే వృధా. ఇప్పుడు అపరిచితురాల్ని కోరుకుంటున్నావు-సాధించుకొనే ప్రయత్నానికి నేను తొడవుతాను. ఇప్పుడు చెప్పు-నీలో ఏమైనా సందేహాలు తలెత్తాయా?" అడిగాడు యోగి.


