"తప్పయిపోయింది మావయ్యా. ఇంకెప్పుడూ చేయను మావయ్యా."
చిరంజీవి మనసంతా పాడైపోయింది.
తను వీళ్ళను ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరైన దారిలో పెట్టటం సాధ్యం కావటం లేదు. ఇంచుమించుగా ప్రతి రెండు మూడు రోజులకొకసారి ఏదొక సమస్య తీసుకొస్తున్నాడు.
పది రోజుల క్రితమే క్లాస్ టీచర్ కబురు చేసింది.
వాళ్ళ అటెండెన్స్ సరిగ్గా లేదనీ, ఆబ్సెంట్ అవుతున్నారనీ కంప్లైంట్ చెసిందామె. వాళ్ళనడిగితే రోజూ స్కూలుకెళుతున్నామనే అంటున్నారు.
తను ఉదయంనుంచీ రాత్రివరకూ ఇంటిదగ్గర లేకపోవటంతో వాళ్ళు విచ్చలడివిగా ప్రవర్తించి చెడిపోతున్నారు. వాళ్ళను సరైన మార్గంలో పెట్టాలంటే ముందు ఇంట్లో వారిని కనిపెట్టి ఉంటానికి ఒకరుండాలి.
కాని ఎవరుంటారు?
కృష్ణయ్య అంటుంటాడు తను పెళ్ళి చేసుకుంటే సమస్య పరిష్కారమవుతుందని.
కానీ తనకు సరైన ఉద్యోగం లేకుండా పెళ్ళి ఎలా చేసుకోవటం?
చిరంజీవి బెల్టు అవతలకు విసరగొట్టి మంచంమీద కూలబడిపోయాడు.
ఎన్నిసార్లని వాళ్ళను శిక్షించటం?
వాళ్ళను ఎంత హింసించినా ప్రయోజనం వుండటం లేదు.
మర్నాటికి మళ్ళీ మామూలే.
వాళ్ళను బెల్టు దెబ్బలు కొట్టి మార్చాలనుకోవడం తన భ్రమ అని ఎప్పుడో తెలిసిపోయింది.
* * * *
ఆ రాత్రి చిరంజీవికి మళ్ళీ కల వచ్చింది.
తను బెల్టు తీసుకుని దీపను ఇష్టమొచ్చినట్లు కొడుతున్నాడట. దీప తండ్రి తల్లి కల్పించుకోకుండా దూరంగా నిలబడి ఆనందంగా చూస్తున్నారట.
చివరకు దీప దెబ్బలకు తాళలేక కిందపడిపోయింది.
అప్పుడు మెలకువ వచ్చింది తనకు.
ఎంత ఆనందం కలిగించిన కల అది.
అతను మంచంమీద నుంచి లేచి కూర్చున్నాడు.
హఠాత్తుగా అతని ఆలోచనలు దీప తండ్రి మీదకు పోయినయ్.
అంత గొప్ప ధనవంతుడు దీపను ఎందుకు వదిలేసినట్లు?
పోనీ ఆమె మిస్సయిందనుకున్నా పేపర్లో ఫోటో వేసినా రాకపోవటమేమిటి?
అసలామె దీపేనా?
దీప లాంటి పోలికలతో ఉన్న మరో అమ్మాయా?
ఆమె దీప అవటానికి ఆస్కారం లేదు.
దీప ఏనాటికీ అలా రోడ్డు పక్కన గాయాలతో దిక్కులేనట్లు పడివుండే అవసరం రాదు.
ఆమె కార్లల్లో, విమానాల్లో తిరుగుతుంది.
ఇంట్లో తప్ప బయట నేలమీద కాలు పెట్టాల్సిన అవసరం ఆమెకు లేదు.
అయితే ఆమె ఎవరు మరి?
చిరంజీవి మనసు ఒప్పుకోవటం లేదు. ఆమె ఖచ్చితంగా దీపే. కొన్ని లక్షలమందిలో వున్నా తను గుర్తుపట్టగలడు.
అంత బలంగా ఆమె రూపం తన మనసులో నిలిచిపోయింది.
ఆమెమీద ప్రతీకారం తీర్చుకునేవరకూ ఆ రూపం అలానే వుంటుంది.
లేచి పచార్లు చేయసాగాడతను.
ఆమె అలా హాస్పిటల్లో గతాన్ని మర్చిపోయి పదిరోజుల్నుంచీ ఉందట.
ఆమె 'మా అమ్మాయి' అని ఇంతవరకు ఎవరూ రాలేదట.
ఇదంతా చాలా తమాషాగా అనిపిస్తోంది.
ఆమె వున్న ఈ నిస్సహాయ స్థితిని ఆసరాగా తీసుకుని తనామెను తనింటికి తీసుకువస్తే?
అతని గుండెలు వేగంగా కొట్టుకోసాగాయ్. రక్తం వాడిగా ప్రసరించసాగింది.
అవును తీసుకొస్తే ఏమవుతుంది? ఏం జరుగుతుంది?
ఆమెను కొద్దిరోజులు చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత బయటకు గెంటితే తన కసి తీరుతుంది. ఇంక జన్మలో ఆమె తనలాంటి బీదోళ్ళతో అలా పొగరుగా ప్రవర్తించకుండా బుద్ధి తెచ్చుకుంటుంది. చిరంజీవి ఎగ్జయిటయి పోతున్నాడు తన ఆలోచనకు.
అవును! చాలా మంచి ఆలోచన ఇది. దీపను ఎవరూ క్లెయిమ్ చేయటంలేదు.
దీపకు గతం గుర్తులేదు.
అసలు ఆమె ఎవరో ఆమెకు తెలీటం లేదంటే నిజంగా గోల్డెన్ ఛాన్స్ యిది.
తను వెళ్ళి ఆమెను తీసుకొచ్చేస్తే ఎవరూ అభ్యంతరం పెట్టరు.
దీపక్కూడా తను గుర్తుండదు కాబట్టి తనను అభ్యంతరం పట్టదు.
'ఎక్కడికి?' అని అడిగితే మనింటికి అని చెప్పేస్తే చాలు. వచ్చేస్తుంది."
'ఇదే మనిల్లు' అంటే అక్కడే వుంటుంది.
కాదన్న విషయం ఆమెకు తెలీదు, గుర్తురాదు.
కానీ పోలీసులకేం చెప్తాడు తను?
ఆమె ఎవరంటే ఏం చెప్పాలి?
మా చెల్లెలు అనాలా?
అంటే ప్రూఫ్ అడుగుతారేమో.
పోనీ మా చుట్టాలమ్మాయ్ అంటే?
అదీ ప్రూవ్ చేయటం కష్టమే.
చిరంజీవి ఉత్సాహంగా ఆలోచిస్తూ పచార్లు చేయసాగాడు.
తను సరైన ఉపాయం పన్నకపోతే పోలీసులకు దొరికిపోతాడు.
హఠాత్తుగా మరో ఆలోచన మెరుపులా తాకిందతనికి.
ఆమె తన భార్య అని చెప్తే...
ఋజువు కావాలంటే తను అక్కయ్య పిల్లల్ని చూపించవచ్చు. వీళ్ళందరూ మాకు పుట్టిన పిల్లలే అంటే ఎవరయినా నమ్ముతారు.
తను పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వటం ఏమాత్రం కష్టం కాదు.


