Home » Yandamuri veerendranath » సంపూర్ణ ప్రేమాయణం


    ఈ లోపులో జగపతిరావు, విప్పిన బూట్లు సోఫా ప్రక్కకి తూస్తూ "చెప్పండి ఏం కావాలి?" అని అడిగాడు మామూలుగా అయితే విజిటింగ్ స్లిప్ లేకుండా అతడిని కలుసుకోవటం కష్టం. కానీ వచ్చింది పొరుగింటి మనిషి.

    "నేను జ్ఞాపకం వున్నానా?" తాపీగా అడిగాడు ప్రసాదరావు.

    "జ్ఞాపకం లేకపోవటం ఏమిటి- ఎదురింటి మేడమీద వుంటారు కదా!"

    "అంతకు ముందెప్పుడూ చూడలేదా?"

    జగపతిరావు అయోమయంగా, "ఇంతకుముందా? లేదే?" అన్నాడు.

    ప్రసాదరావు వెంటనే ఏమీ అనలేదు. లేచి ఆ గదిని పరీక్షగా చూస్తూ లోపలికెళ్ళే ద్వారం దగ్గిర నిలబడి దాన్ని పరీక్షగా చూడసాగాడు. ఈ విచిత్ర ప్రవర్తనకి ఆశ్చర్యమూ కోపమూ మిళితమైన స్వరంతో జగపతిరావు సోఫాలోంచి లేచి "ఏమిటిదంతా?" అని అడిగాడు.

    "ఏమీలేదు...." అంతే తాపీగా అన్నాడు ప్రసాదరావు.

    "ఒకప్పుడు రత్తి అనే పనిమనిషి వుండేది మీ యింట్లో వుందా లేదా అని చూస్తున్నాను."

    "వాట్ నాన్సెన్స్!" విసుగ్గా అంటూ బెల్ కొట్టబోయాడు జగపతి. "బహుశా ముసల్దయిపోయి వుంటుంది. ఆ రోజుల్లోనే దానికి ముప్పై ఏళ్ళు. అయినా జువ్వలా పరుగెత్తుకు వచ్చింది సుమా. ఇదిగో యిప్పుడు నువ్వు కూర్చున్నావ్ చూడు ఆ సోఫాలో అలానే నేను కూర్చుని వున్నాను. ఇదిగో ఈ ద్వారం గుండానే పిచ్చిదానిలా వచ్చి మీదపడి కొరికేసింది, పైగా రేప్ చేశానని కేసు పెట్టింది కూడా. పాపం....ఇంకా ఆ పిచ్చి అలానే వుందా? ఏమైనా తగ్గిందా?"

    జగపతిరావు బిగుసుకుపోయాడు. బెల్ వైపు వెళ్ళిన చేయి అలాగే వుండిపోయింది. అసలు ఈ ప్రపంచం తాలూకు స్పృహ వున్నట్టే కనపడలేదు. ఆ క్షణంలో అతడిని ఎవరైనా హఠాత్తుగా చూస్తే అక్కడొక శిలాప్రతిమే వుందనుకుంటారు. చివరికి ఎలాగో తెప్పరిల్లి "నువ్వు.... నువ్వు...." అన్నాడు.

    "నేనే జగపతీ! తన చెల్లెల్ని మోసం చెయ్యవద్దని వేడుకోవటానికి వచ్చిన కుర్రవాడిమీద తప్పుడు కేసు పెట్టి ఎవర్నయితే జైలులోకి తోయించావో ఆ ప్రసాదరావుని నేనే."

    వెళ్ళి సోఫాలో కూర్చుంటూ అన్నాడు- "నీ వాడని తెలియనివ్వకుండా నా దగ్గరకొక లాయర్ని పంపించి ఎవరినుంచి సాక్ష్యాధారాలు కొట్టేశావో ఆ ప్రసాదరావుని నేనే."

    జగపతిరావు ఇంకా అలానే వుండిపోయాడు. అసలు వింటున్నాడో లేదో కూడా తెలీదు.

    "ఏం ఆలోచిస్తున్నావ్ జగపతీ? మళ్ళీ ఏ కేసుపెట్టి నన్ను జైలులోకి తోయించాలని ఆలోచిస్తున్నావా? క్రిమినల్ ట్రెస్ పాస్ క్రింద అరెస్ట్ చేయించాలని చూస్తున్నావా? ఆ ఆలోచన్లు మానుకో! అప్పుడు నీ ముందు అమాయకంగా నిలబడ్డ కుర్రవాడు వేరు, అనుభవంతో పండిపోయిన ఈ ప్రసాదరావు వేరు."

    కాళ్ళలో సత్తువలేని వాడిలా జగపతిరావు సోఫాలో కూలబడ్డాడు. "ఇన్నాళ్ళూ ఎక్కడున్నావ్?" అని అడిగాడు.

    "నీ కనవసరం! కౌటిల్యుడి కథ నీకు తెలుసా? కాలిలో గుచ్చుకున్న ముల్లుని కాల్చి తాగినవాడు. అటువంటి వాడితో వైరం పెట్టుకోవటం నీ దురదృష్టం జగపతీ! ఈ రోజునుంచి ప్రతిరోజూ నీకు నరకమే నేనేం చేస్తానో నీకు చెప్పను. నువ్వే నీ చుట్టూ చూసుకో. ఈ క్షణంనుంచి నీ ఆస్తిని వేయి కళ్ళతో నువ్వు చూసుకోవాలి? నీ ప్రాణంతీసే ప్రయత్నం ఏదైనా వుందా అని ప్రతిదాన్నీ పరిశీలించి చూడాలి. అయినా నేను నిన్ను ఎటునుంచి దెబ్బతీస్తానో నీకు చెప్పను. అది తెలియక నువ్వు భయంతో కుళ్ళి కుళ్ళి చావాలి. ఈ క్షణం గురించే నేనే ఇన్నాళ్ళూ తపస్సు చేసింది. కొన్నాళ్ళుగా నీ చుట్టూ వల బిగిస్తూ వచ్చాను. అది ఇప్పటికి బిగుసుకుంది. ట్రై జగపతీ!.... వలలోంచి బయటపడటానికి ట్రై చెయ్యి!! కనీసం ఆ వల ఏమిటో తెలుసుకోవటానికి ప్రయత్నించు__ గుడ్ బై...." అంటూ తాపీగా వెనుదిరిగాడు.

    "ఆగు" అన్నాడు జగపతిరావు.

    గుమ్మం దాటబోతున్న ప్రసాదరావు ఆగి, వెనుదిరిగి చూశాడు. జగపతిరావు అతడి దగ్గరగా వచ్చాడు.

    "నేను చేసిన పనికి పశ్చాత్తాపంతో కుమిలిపోవటంలేదు. కానీ నేను నీకో విషయం చెప్పాలి. కొంచెం లోపలికి రా."

    ప్రసాదరావు అతడివైపు అనుమానంగా చూసి, "మళ్ళీ ఇది ఓ కొత్త ఎత్తా?" అని అడిగాడు.

    జగపతిరావు జీవంలేని నవ్వుతో, "ఎత్తులూ పై ఎత్తులూ వేసే స్థితి దాటిపోయాను ప్రసాదరావు! అంత ఓపికకూడా లేదు నాకు. విధి నామీద చాలా గ్రాండ్ గా కసి తీర్చుకుంది. ప్లీజ్, లోపలికి రా" అన్నాడు. అతడి కంఠంలో సిన్సియారిటీ చూసి ప్రసాదరావు విచలితుడయ్యాడు. వెళ్ళి కూర్చుంటూ, "ఏమిటి చెప్పు" అన్నాడు. అతడు వెంటనే జవాబు చెప్పలేదు. నుదుటిమీద చెయ్యి వేసుకుని కళ్ళు మూసుకున్నాడు. కొంచెంసేపటికి అతడి కంఠం నెమ్మదిగా వినిపించింది.

    "నువ్వు జైలుకి వెళ్ళిన రాత్రి మేము గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నాం ప్రసాదరావ్. ఆరోజే దయానందం తన ప్లీడరీ వృత్తికి రాజీనామా ఇచ్చేసి నా దగ్గర చేరిపోయాడు. అతడికి నా వ్యాపారంలో పార్టనర్ షిప్ యిచ్చాను కూడా. వారం రోజులు తిరిగేసరికల్లా మేము నీ గురించి నీ చెల్లెలి గురించీ పూర్తిగా మర్చిపోయాము. జీవితం అంటే కేవలం ఆనందించటం మొక్కటేనని మాకు ఆ రోజుల్లో తెలిసింది. ఆ తరువాత ఒక్క సవ్మత్సరానికి నాకు వివాహమయింది. ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. సన్నీ, చిన్నీ, రోజీ. అందర్లోకి పెద్దపిల్ల రోజీ. దానికి ఆరేళ్ళు అప్పుడు. నా భార్యకు పిల్లలంటే వల్లమాలిన ప్రేమ. ఆయాలని పెట్టటానికి వప్పుకునేది కాదు. ఆమె చాలా చురుకైనది కూడా."

    ఆ జ్ఞాపకాల్తో అతడు ఆగాడు. కేవలం ఫాన్ తిరుగుతున్న శబ్దం మాత్రం వినిపిస్తూంది.

    "ఆ రోజు దురదృష్టం నన్ను వెంటాడి వేటాడింది. ప్రొద్దున్న మామూలుగానే ఫ్యాక్టరీ వ్యవహారాలూ చూసుకోవటానికి ఆఫీసుకు వెళ్ళాను. తరువాత జరిగింది నాకు తెలీదుగానీ ఆ సంఘటన తల్చుకుంటేనే కళ్ళ ముందు ఆ దృశ్యం కదలాడినట్టుంది...."

    అతడు మళ్ళీ ఆగి చెప్పటం ప్రారంభించాడు.

    బాత్ టబ్ లో సన్నీని నిలబెట్టి స్నానం చేయిస్తూంది నా భార్య. వాడు చాలా అల్లరివాడు. అప్పడప్పుడే తప్పటడుగులు వేస్తున్నాడు. ఒక పట్టాన స్నానం చేయకుండా తల్లిని తెగ వేధిస్తాడు. చిన్నీ అలా కాదు. నాలుగేళ్ళ వయసులోనే ఆమె చాలా నెమ్మది. ఒకచోట కూర్చుని ఆడుకుంటుంది.

    ఉన్నట్టుండి కెవ్వున కేక వినిపించటంతో నా భార్య సన్నీని వదిలి వంటింట్లోకి పరుగెత్తింది. అక్కడ దృశ్యం చూసి ఆమె నోటమాట రాలేదు. తల్లికి పనిలో సాయం చేద్దామని నా పెద్దకూతురు స్టౌ దగ్గరికి వెళ్ళిందనుకుంటా. ఆమె గౌను అంటుకుంది. చుట్టూ మంటల మధ్య ఆ పాప నేలమీద పడి దొర్లుతూంది. అప్పటికే వళ్ళంతా కాలిపోయింది. ఇంట్లో నౌఖర్లు ఏమయ్యారో తెలీదు. ఉన్న ఒక్క పనిమనిషీ, వంట మనిషీ అక్కడి కొచ్చి మరింత గోల చేసారే తప్ప మరేమీ చేయలేదు. ఫోన్ వల్ల లాభంలేదు. అపప్తికే కొనప్రాణం కొట్టుమిట్టులాడుతుంది.

    వడలిపోయిన అరటి కాడలా వేలాడుతున్న కూతుర్ని చేతుల మీద వేసుకుని నా భార్య గ్యారేజీ దగ్గరకు పరుగెత్తింది. తలుపులు తీసే వున్నాయి. సీటు పక్కలో పడుకోబెట్టి క్షణాల్లో స్టార్ట్ చేసి, రివర్స్ చేయడం కోసం కాస్త ముందుకు పోనిచ్చింది.

    అప్పుడో సన్నటి కేక హృదయ విదారకంగా వినిపించింది. గ్యారేజీలో కారు ముందు కూర్చుని లక్క పిడతలు ఆడుకుంటున్న నా రెండో కూతురు గోడకీ కారుకీ మధ్య నలిగి పచ్చడయిపోయింది. విరిగిన ఎముకల మధ్య నుంచి కారుతున్న రక్తాన్ని చూసి నా భార్యకి షాక్ తో నోటమాట రాలేదు. ఈ లోపులో పనివాళ్ళ అరుపులకి ఇరుగూ పొరుగూ అక్కడికి చేరుకున్నారు. పక్కింటిలో ఒక డాక్టరు వున్నాడు. అప్పటికే ప్రాణం పోయిన రెండో కూతుర్ని వదిలిపెట్టి, పెద్ద అమ్మాయి నేవిధంగానయినా రక్షించవచ్చేమోనని ప్రయత్నించసాగాడు ఆయన. చుట్టూ చేరిన జనాన్ని దూరంగా తొలగమని, ఆయన ఆ వళ్ళుకాలిన పాలని పరీక్షించసాగాడు. అప్పటికే నా భార్యకి ఏమీ తెలియటంలేదు. కేవలం కళ్ళప్పగించి జరుగుతున్న దాన్నంతా ప్రేక్షకురాలిలా చూస్తుంది. అంతలో ఆ మైకంలోంచి ఒక్కసారి ఎవరో తట్టిలేపినట్టయి ఏదో గుర్తొచ్చినట్టు లోపలికి పరుగెత్తింది. బాత్ రూమ్ గుమ్మం దగ్గిర ఆగిపోయి, లోపల దృశ్యాన్ని చూసి పిచ్చిగా కేక పెట్టింది.

    బాత్ టబ్ లో, పైకి రావటానికి ప్రయత్నించి ప్రయత్నించి విఫలుడయిన పసివాడి శవం నీళ్ళలో తేలుతూంది.


                                                      *    *    *    *  


    తన చేతివేళ్ళు వణకటం ప్రసాదరావుకి స్పష్టంగా తెలుస్తూంది. అతడి వళ్ళంతా చెమటల్ తడిసి ముద్దయింది. "వద్దొద్దు ఇంక చెప్పొద్దు" అందామనుకున్నాడు. నాలుక మాట్లాడటానికి నిరాకరించింది. ఇంత విషాదాన్ని అతడి మనసు భరించలేకపోతుంది. మనిషన్నవాడు ఎవడూ దీన్ని జీర్ణం చేసుకోలేడు.

    కానీ జగపతిరావు చెప్పుకుపోతున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా అది అలవాటయినవాడిలా నిర్వికారంగా చెపుతున్నాడు.

    "....నా భార్యకి పిచ్చెక్కింది. ఎంతో ప్రయత్నించాము. కానీ లాభం లేకపోయింది. ఆ తరువాత ఒక సంవత్సరానికి ఆమె కూడా మరణించింది" అంటూ ఆగాడు.

    ఈ లోపులో నౌఖరు ట్రేతో రెండు కాఫీలు తీసుకొచ్చి బల్లమీద పెట్టాడు. ఎవరూ వాటిని ముట్టుకోలేదు. ప్రసాదరావయితే ఇంకా ఆ కథ తాలూకు విషాదం నుంచి బయటకు రాలేదు.

    ఇంతలో జగపతిరావు తిరిగి చెప్పటం ప్రారంభించాడు.

    "కొన్ని నెలలపాటు మా కెవరికీ మతి మతిలో లేదు. కనురెప్పపాటు కాలంలో అంతా ఏదో కలలోలా జరిగిపోయింది. కళకళలాడే యిల్లు ఒక్కసారిగా బోసిపోవటంతో ఆ శూన్యత మరింత ఎక్కువైంది. నా భార్య చనిపోయాక నేను మరి తట్టుకోలేకపోయాను. అప్పుడే నా మనసులో ఒక అనుమానం ప్రవేశించి పురుగులా తొలిచెయ్యసాగింది. రాజ్యలక్ష్మికి చేసిన అన్యాయమే దీనికంతటికీ కారణం ఏమో అన్న అనుమానం అది! దీన్ని పశ్చాత్తాపం అనను. కేవలం నా వంటరితనమే నన్ను భయపెట్టింది. ఆమె ఎక్కడుందో అని వెతికాను. చచ్చిపోయిందని తెలిసింది. నువ్వు జైలు నుంచి విడుదలయి వెళ్ళిపోయావని కూడా తెలిసింది. ఇక మిగిలింది నా కూతురు ఒక్కటే. తల్లి చచ్చిపోయాక దాన్నెవరో అనాధాశ్రమంలో జేర్పించారట. కనీసం ఆ పాపయినా దక్కినందుకు సంతోషించాను. తీసుకొచ్చి పెంచి పెద్ద చేశాను. నీ పేరూ, నా పేరూ కలిసేలా ఆ పాపకి ప్రగతి అని పేరు పెట్టింది ఆమె తల్లి. ఆ పేరు కాస్త మరీ కొత్తగా వుందని మార్చి 'ప్రేమ' అని పెట్టాను...." ప్రసాదరావు ఉలిక్కిపడ్డాడు.

    అప్పటివరకూ మామూలుగా వింటున్నవాడు ఈ చివరి వాక్యానికి ఏదో లోకంనుంచి బయటపడిన వాడిలా తేరుకుని "ఏమిటీ?" అన్నాడు. ఎగ్జయిట్ మెంట్ తో అతడి కంఠం కీచుమంది.

    "అవును ప్రసాదరావ్! ప్రేమ నీ చెల్లెలి కూతురు. ఇప్పుడు ఇంటిలో లేదు. ఒక్క అరగంట ఆగు_ వస్తుంది. చూద్దుగాని. అప్పటికీ నమ్మకం కుదరక నా మీద పగ అలాగే వుంటే, నీ ఇష్టం. ఏమైనా చేసుకో...."

    ప్రసాదరావు వినటంలేదు. అతడి దృష్టి అసలిక్కడలేదు. టెన్షన్ తో అతడి శరీరం వణుకుతూంది.

    తన చెల్లెలి కూతురు అదే క్షణంలో అక్కడ గెస్ట్ హౌస్ లో పాడుచెయ్యబడబోతున్నందుకు కాదు. వేణు నిజంగా ఆమెని ప్రేమించాడు. కాబట్టి అంతవరకూ వస్తే వాళ్ళిద్దరూ ఎలాగూ పెళ్ళి చేసుకుంటారు. అది కాదు సమస్య.

    తన గదిలోంచి బయటికి వెళ్ళేటప్పుడు వేణు మొహంలో అదో రకమైన తెగింపు చూశాడు. ఎలాగయినా దీన్ని సాధించి తీరాలనే పట్టుదల చూశాడు. ఆ అమ్మాయి కాస్త సంస్కారం వున్న అమ్మాయి కాబట్టి, కాస్త రెసిస్ట్ చేయవచ్చు. కాని వేణు సాధించి తీరుతాడు.   

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra