ఎన్నాళ్ళు ఇంకా
గండభేరుండపు లెక్కలతో ద్వేషం వచ్చింది. పేదవాళ్ళతో చెప్పింది, "మిమ్మల్ని దోచుకున్నా" రని.
మురికి కాలువలను చూపిస్తే నగరం మొగం చిన్నబోయింది. ఫ్యాక్టరీ గొట్టంలో ప్రతిధ్వనించిన కేక విని కార్మికుడు తుళ్ళిపడ్డాడు. అతని కళ్ళలో ఆహాశ్చర్యం.
ఎన్నాళ్ళు అంది ఎలక్ట్రిక్ ట్రెయిన్, ఎన్నాళ్ళు అంది ట్రాంబండి, బస్సు, జట్కా, రిక్షా, ఎన్నాళ్ళు అంది షాపునోరు. ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు అంది కాలేజీ అంది ఆసుపత్రి అంది మ్యూజియం.
నడి వీధిలో వాన.
ఎక్కడయినా దొరుకుతుందా ఒక్క పుష్పం అని వెదికాను. ఏ కాఫీ క్లబ్బు కూడా నన్ను ఆహ్వానించలేదు. ఈ చీమలకు రెక్కలు వస్తే ఏం దారి అనుకున్నాను.
ఎన్నాళ్ళు అంది ద్వేషం.
కళపెళ కాగుతోంది రక్తం. బిగుసుకుపోతున్నాయి సంకెళ్ళు. పిడికిలిపట్టి ఆకాశాన్ని బెదిరించాను. వికటంగా నవ్వింది మెరుపు. ఉరుము నన్ను ఓదార్చింది.
ఎన్నాళ్ళు అంది వాన.
- ఆంధ్ర పత్రిక - 11.12.1940


