శకుంతలకు సినిమాపిచ్చి ఆ సాయంత్రం ఆడవాళ్ళమంతా సినిమాకి వెళ్దామని ప్రపోజల్ లేవదీసింది.
విమల ముఖం ముడుచుకుని "మీరంతా వెళ్ళండి వదినగారూ! నేను ఇంట్లో వుంటానులెండి. ఇంట్లో ఎవ్వరూ లేకపోతే ఎలా?" అన్నది.
"ఆవిడెందుకు? నేను వుంటాన్లెండి, నేను పిల్లల్ని చూస్తూ వుంటాను. మీరంతా సరదాగా వెళ్ళిరండి" అన్నది ప్రభావతి.
"మీరిద్దరూ రాకపోతే నేనొక్కదాన్నే వెళ్లేదా? ఇల్లేమయిపోదులెండి. అమ్మమ్మ వుంటుంది."
గదులన్నీ తాళాలుపెట్టి పనిపిల్లను వసారాలో కూర్చోబెడితేసరి. మొగవాళ్ళు ఇంట్లో వుంటే సరేసరి. లేకపోతే వాళ్ళు ఏ సినిమాకో వెడితే మనం వచ్చే టైముకే వాళ్ళూ తిరిగివస్తారు. ఇహ అడ్డుచెప్పకండి. అమ్మకూడా వస్తుంది. అంతా కలిసి వెడదాం' అంది శకుంతల.
ప్రభావతి, విమల ఏమీ మాట్లాడలేకపోయారు.
మొత్తంమీద సాయంత్రం అంతా సినిమాకి బయల్దేరారు. శారదమ్మగారూ, ఇద్దరు కోడళ్ళూ, ఆ ఇంట్లోని పిల్లలయిదుగురూ, శకుంతలా ఆమె ఇద్దరు పిల్లలూ.....నానా అవస్థా పడి రిక్షాలు మాట్లాడుకుని తెలుగు సినిమాకి వెళ్ళారు.
ఆదివారమైనా ఆ సినిమావచ్చి చాలా రోజులయింది కాబట్టి టిక్కెట్లు తేలికగానే దొరికాయి. ఒక్క సురేష్ గాడికి మినహా అందరికీ టిక్కెట్లు తీసుకోవాల్సివచ్చింది.
హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు.
రాణీ, సురేషూ ప్రభావతి ఒళ్లోనే కూర్చుంటామని పేచీలు పెట్టారు. విమల తన పిల్లల్ని తనదగ్గర కూర్చోమని బ్రతిమిలాడింది. కోప్పడింది. అయినా ఏం ప్రయోజనం లేకపోయింది. వాళ్ళు ప్రభావతి ఒళ్ళో ఎక్కి ఆమెను నానా హైరానా పెట్టేస్తున్నారు.
సినిమాలో కూర్చున్నప్పటినుంచి మల్లిబాబు పాప్ కారన్ కావాలని పేచీ పెట్టాడు.
సుజాత విసుక్కుంటూ, బయటకు వెళ్ళి పాప్ కారాన్ తీసుకొచ్చి ఇచ్చింది. ఒకడికి మంచినీళ్ళు, మరొకడికి ఒకటి, ఇంకొకరికి ఇంకోటి....ఇలా సినిమా అవుతున్నంతసేపూ లోపలకూ బయటకూ తిరుగుతూనే వున్నారు.
పాపకు ఆదుర్దా హెచ్చు. "ఇప్పుడేమవుతుందే? వాడు చచ్చిపోతాడా? ఆ దొంగోడు వాడ్ని చంపేస్తాడా?...." ఇట్లా ప్రశ్నలు వేస్తోంది తల్లిని పమిట చెంగు పట్టుకుని లాగుతూ.
"అబ్బ! చావడులేవే. హీరో మధ్యలో చచ్చిపోతే కథేముంది?" అంటూంది ప్రభావతి.
మల్లిబాబు పాప్ కారన్ తినేసి నాకు భయంవేస్తుందని చెప్పి తెరవైపు వీపుపెట్టి ఇటుతిరిగి కూర్చున్నాడు.
ఇంటర్వెల్ వచ్చింది. డ్రింకులు, బిస్కెట్లు, పిప్పరమెంట్లు, పాప్ కారను...పిల్లలు ఒకటే గోల.
సురేష్ గాడు ప్రభావతి చీరె తడిపేశాడు.
మొత్తానికి ఆ ఆడవాళ్ళు సినిమా ఏం చూశారోగానీ అంతా అయాక నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, నిద్రపోతున్న పిల్లల్నెత్తుకుని బరువుతో మధ్య మధ్య ఆపసోపాలు పడుతూ రిక్షాలలో ఇంటికి తిరిగివచ్చారు.
8
తెల్లవారుతూనే కట్టెల అడితిలో లౌడ్ స్పీకర్ లో చెవులు చిల్లులు పడేటట్లు గ్రామఫోన్ రికార్డులు మొదలయినాయి. అడితీవాళ్ళు ఇంట్లో పెద్దమ్మాయిపెళ్ళి అడితీ, ఇల్లూ ఒకటే. పందిరి వెయ్యటం, తోరణాలు కట్టటం నిన్ననే పూర్తయాయి. పాటలుమాత్రం ప్రొద్దుటినుంచే మొదలయాయి.
"సీతారాముల కళ్యాణం చూదము రారండీ!" అనేపాట చెవులు గింగురు మనేలా మ్రోగుతుంది.
కుమార్ కు మెలకువ వచ్చేసరికి ప్రభావతి, పిల్లలూ అంతా క్రిందకు వెళ్ళిపోయి వున్నారు.
అతనికి లేస్తూనే ఎందుకో వంట్లో నలతగా వున్నట్లు తోచింది. ఈ పూట క్లినిక్ కి వెళ్ళటం మానేసి రెస్ట్ తీసుకుందామా అనుకున్నాడు. కానీ అతని ఆలోచన అతనికే సబబుగా కనిపించలేదు. అతని కళ్ళముందు అతని పేషెంట్లు గిరగిర తిరిగారు. ఒకతన్ని ఎక్స్ రే తీయించుకు రమ్మన్నాడు. ఇంకో పేషెంటుకు సీరియస్ గా వుంది తప్పకుండా ఇంటికివెళ్ళి చూస్తానన్నాడు. మరో పేషెంటు ఇవేళ మందులు రాసిస్తే ఊరు వెళ్ళిపోతానన్నది.
చెప్పుకోవటానికి "మాది ఇండిపెండెంట్ లైఫ్. ఒకపూట మానేయాలన్నా ఆలస్యంగా వెళ్ళాలన్నా ఒకరి అనుమతికోసం ప్రాకులాడనక్కరలేదు" అని సామెతేగానీ తాము ఎంత బంధితులో, ఎంత స్వేచ్చాజీవులు కారో తెలిసివచ్చింది కుమార్ కి. క్లినిక్ మానేసి ఇంట్లో కూర్చుంటే తప్పుచేసినట్లుగా గిల్టీగా ఫీలవాల్సివస్తుంది. ఎప్పుడన్నా అడ్డంపడీ మంచాన పూర్తిగా పడితేతప్ప రెస్ట్ తీసుకోవటం కుదరదు.
కుమార్ ముఖం కడుక్కుని క్రిందకు వచ్చాడు.
శకుంతల వచ్చిన కారణంగా ఇంట్లో వాతావరణం చల్లబడినట్లుగా అనిపించింది. తోడికోడళ్ళిద్దరూ కాఫీలుత్రాగుతూ కబుర్లు చెప్పుకుంటూ తెగ నవ్వేసుకుంటున్నారు. వాళ్ళను చూస్తుంటే ఇదివరకెప్పుడన్నా హోరా హోరీగా కొట్లాడుకున్నారా? ముందు ముందు పోట్లాడుకోగలరా? అసలు పోట్లాడుకోవటం వచ్చా? అనిపిస్తుంది.
ఈ విధంగా ఇలా అనిపించటంలో ఆడవాళ్ళు, మొగవాళ్ళకంటే గొప్పవాళ్ళు.
కుమార్ కి కూడా వంటింట్లో కూర్చుని వాళ్ళతోబాటు కాఫీ త్రాగాలని సరదా పుట్టింది. "ఇవేళ అప్పుడే లేచారే?" అంటూ ప్రభావతి స్టెయిన్ లెస్ స్టీలు గ్లాసులో ఇచ్చిన కాఫీని అందుకుని అక్కడే నేలమీద చతికిలబడ్డాడు.
శారదమ్మగారు వేరే గిన్నెలో కాఫీ చల్లార్చుకుని త్రాగుతుంది.
శకుంతల కుమార్ కంటే నాలుగేళ్ళు పెద్ద. ఆవిడకి ఆరుగురు సంతానం. పెద్దవాళ్ళందరినీ ఇంట్లో వదిలేసి చివరి ఇద్దరి పిల్లల్నీ తనతో తీసుకొచ్చింది.
"ఏరా తమ్ముడూ! మా ఊరు ఎప్పుడూ రానన్నా రావు. ఊరికి నలభై మైళ్ళ దూరంలో వున్నా ఎప్పుడూ ఎవరూ రారని మీ బావ ఇదవుతూ వుంటారు" అంది శకుంతల.
"నాకు తీరికేదే?" అన్నాడు కుమార్.
"నువ్వు డాక్టరువి. నిజమేననుకో. కానీ తీరుబడి చేసుకుని ఆరునెలల కోసారయినా రాకపోతే చూడ్డానికెలాగో వుంటుంది. నామటుకు నాకు చెడ్డ బాధగా వుంటుంది సుమా! అందరిళ్ళలో అక్కా, తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు చక్కా వచ్చి పోతుంటారు.....పోనీ ఈసారి స్కూళ్ళకు సెలవులిచ్చినప్పుడు ప్రభావతినీ, పిల్లల్నీ పంపించు. నాలుగు రోజులుండి వస్తారు....."
"అలాగేలే."
ఇంతలో అక్కడికి హరికూడా వచ్చాడు. అన్నగారిని చూసి ఇన్స్పిరేషన్ లాంటిది వచ్చిందేమో అతనూ నేలమీద చతికిలబడ్డాడు. రంగారావుగారు పేపరు చదవటం పూర్తిచేసి పెరట్లోకి వస్తూ, వంటింట్లో అందర్నీ చూసి ఆయనా క్రింద కూలబడ్డారు.
అందరూ కలసి కలగాపులగంగా మాట్లాడుకుంటున్నారు. బయట రికార్డుల గోల ఎక్కువగా ఉండటంవల్ల నోరు నొప్పి పుట్టేట్లుగా గట్టిగా మాట్లాడుకోవాల్సి వస్తుంది.
కుమార్ కి ఈ దృశ్యం ఎంతో ముచ్చటగా అనిపించింది. సినిమాలో ముందుగా జరగకుండా నిలబడిపోయిన ఫ్రేములా ఈ మనుషులు ఎప్పుడూ ఇలానే ఉండిపోతే ఎంత బాగుండును? కానీ అలా జరగదు. ఎప్పుడూ ఒకరిమీద ఒకరు వ్యంగ్యాలు లేకపోతే ఒకరితోఒకరు కటువుగా మాట్లాడుకోవటం, లేకపోతే ఒకరిగురించి ఒకరితో చాడీలు చెప్పుకోవటం లేకపోతే ఒకరి ప్రవర్తనను తలుచుకుని ఒకరు మౌనంగా హింసను అనుభవిస్తూ వుండటం లేకపోతే కాట్లకుక్కల్లా పోట్లాడుకోవటం, లేకపోతే ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా వుండటం - ఇవే మా ఉమ్మడికుటుంబాల చరిత్రలు.
బయటినుంచి ఎవరో కేకేసినట్టయింది.
కట్టెల అడితీవాళ్ళు స్వయంపాకం తీసుకొచ్చి ఇచ్చారు. పదిగంటలకు పెళ్ళిట. మరీ మరీ రమ్మని బ్రతిమాలి వెళ్ళిపోయారు.
మొగవాళ్ళకు ఎలాగో వీలుండదు గాబట్టి ఆడవాళ్ళు వెళ్దామనుకున్నారు.


