ఒ
ఒకనొక అనగా అనగాల వేళ
(అదికృతయుగం
కాదు మృతయుగం)
అదే మన కథలకీ కవిత్వాలకీ డోల
మనుష్యుని బాల్యంలోని అమాయకత్వం
(ప్రార్థించే మొక్కలూ
మాట్లాడే నక్కలూ)
కళలో జీవితంలో నిదర్శించే అరణ్య తత్వం
సామూహికం స్వాతంత్ర్యం అన్వేషించు అగత్యం
(ఒంటరితనం
తుంటరితనం)
సామాజికంగా పెరుగుతోంది స్వేచ్చ ఇది సత్యం
అజ్ఞానం చీకటి భయానికి క్రౌర్యానికీ కాణాచి
(శిశుత్వం అదే
పశుత్వం అదే)
చంపడానికి సరదా అమ్మయ్యో బూచి
మార్చాలంటా ఇదంతా ప్రసరించాలి కాంతి
(శాస్త్రం కళని చంపబోదు
జనాన్ని భయంతో నింపలేదు)
మానవాళికి పరిణామం కనుక పావురంలాంటి శాంతి
ఓ
ఓహో విహంగమా
ఎగురు
ఎగురు
నీ రెక్కల విసరులో మన్వంతరాలు
తరలు
తరలు
ఓహో తరంగమా
కదలు
కదలు
నీ ముంచెత్తు వరదలో నిమ్నోన్నతాలు
కరగు
కరగు
ఓహో మృదంగమా
పలుకు
పలుకు
నీవిచ్చు హెచ్చరికలో నిరాశా దురాశా భాండాలు
పగులు
పగులు
ఓహో జనాంగమా
నడువు
నడువు
నీ పరాంకోటి హస్తాలతో నూతన గవాక్షాలు
తెరువు
తెరువు
ఔ
ఔను వాహనం మారింది, దూరానికి పూర్వపు టర్థం పోయింది
పూర్వం దూరం పోయింది వెనకటి వాహనం మారింది
ఆ సూర్యుడే నేడూ
ఆ చంద్రుడీ నాడూ
అవే నక్షత్రాలూ - ఐనా కాలం మారింది
ఔనా కాలం మారింది మరి:, మానవుడా మేలుకో నేస్తం
ఎద్దుబండితో కొలవకు దూరాన్ని ఎగరవోయ్ చదలయెద చీలుస్తూ
రేపు బయల్దేరా లనుకున్నావు
నేడే ఇచ్చటికి వచ్చేశావు
విచ్చేసింది నీ తరుణం పుచ్చుకో ఇది నీ భావి
ఇది నీ భావి గ్రహించు:, ఈ భావి నీకు నా ప్రెజెంటు
భూతకాలపు సరీసృపాలని పాతరాతి యుగంలో పారేయ్
పాతెయ్ నీ సందేహాలని
తోలెయ్ నీ మందాక్షాలని
నిటారుగా నిలబడు నేస్తం హుటాహుటిగా ముందుకిసాగు
హుషారుగా ముందుకిసాగు:, ఊరిఖే వెనక్కి చూస్తావేం
దుప్పివీ కుక్కవీ కావు తిర్యగ్దృక్కువి నువ్వు కావు
దూరం కరిగిపోతోంది
కాలం మరిగిపోతోంది
మానవుడిగా మేలుకో నేస్తం ఏలుకో ఈ విశ్వం సమస్తం
- తెలుగు స్వతంత్ర, 1.9.1953


