Home » Yamini saraswathi novels » సరస్వతి మహల్

                                                     పప్పూ .... నెయ్యి .... పసందైన
                                                 మనుషులు


    నాలుగు పద్యాలు చెబితే గొప్పకవిగా తనకుతానే చెలామణి చేసుకుంటారు. కానీ ఒక అద్భుతమైన చంపూ గ్రంధాన్ని చెప్పినా తనపేరు చెప్పుకోని 'సుకృతి' ఉన్నారు. ఎవరో తెలుసా? భోజరాజు చరిత్రమనే ఒక మహత్తర గ్రంధమును రచించిన కవీంద్రుడు. ఆయన ఎవరో, ఏ కాలంవాడో ఎక్కడ ఉండేవాడో, చరిత్ర పరిశోధకులకూ తెలియదు. సాహిత్య పత్తేదార్లకు తెలియదు.

    అయితేనేం ఆయన చెప్పిన చాలా శ్లోకాలు సూక్తులుగా వాడబడుతున్నాయి. ఆ గ్రంధంలోని చాలా శ్లోకాలు తెలుగులోనికి అనువదింపబడ్డాయి. పేరు తెలియక పోయినా ఆ కవి ఆ చంద్రతార్కారం నిలబడే సత్తాకలవాడు. 'పేరులోన ఏమి పెన్నిధి కలదు' అని ఆ రోజుల్లోనే అనుకున్నాడేమో!

    భోజరాజు చరితం చాలా తేలికైన సంస్కృత భాషలో వ్రాయబడినది. తెలుగుపద్యం కొన్నిచోట్ల సంస్కృత పద భూయిష్టమై అర్ధంకాదేమో కానీ-ఈ సంస్కృతం మాత్రం తెలుగుకంటే తేలిగ్గా తెలిసే సంస్కృతం.

    "స్వస్తిశ్రీ శ్రీమన్మహారాజస్య భోజరాజస్య ప్రబన్ధః కధ్యతే" అని ప్రారంభమవుతుంది కధ. భోజుడి తండ్రి సింధులుడు. ఆయనకు లేకలేక ఒక కొడుకు పుట్టాడు అదీ వృద్ధాప్యములో. అతడికి అయిదేళ్ళ వయసొచ్చింది. కొడుక్కి రాజ్యం కట్టబెడితే బలవంతుడైన తమ్ముడు మంజుడు ఏం చేస్తాడో కొడుకుని చంపేస్తాడో-రాజ్యం అక్రమిస్తాడో అని భయపడ్డంతో ముఖ్యమంత్రిని పిలిచి విచారించడంతో కధ నడక మొదలుపెడుతుంది. రకరకాలుగా ఆలోచించిన మహారాజు తమ్ముడికే పట్టం కట్ట పెడతాడు. కొడుకుని అప్పగిస్తాడు.

    అయితే భోజుడి 'జాతకం' విన్న మంజుడు అతన్ని చంపాలని వివిధ ప్రయత్నాలు చేస్తాడు. చివరికి బుద్ధి మారి అతడికే రాజ్యం అప్పగిస్తాడు. అక్కడి నుంచి భోజ చరిత్ర మొదలు. 'యధారాజా తధా ప్రజా' అనే మాట తెలుగు నాట సామెతయ్యింది. దాని పూర్తి శ్లోకం ఇది.
   
    రాజ్ఞ ధర్మిణి ధర్మిష్టా పాపే పాపవరాః సదా
    రాజాన మనువర్తన్తే యధారాజా తధా ప్రజాః

    అంటే రాజు ధర్మవంతుడైతే ప్రజలు అలాగే ఉంటారు. రాజు పాపాత్ముడు అయిన అలాగే ఉంటారు రాజెలా ఉంటే ప్రజలూ అంతే.... అని.
   
    ఇలాంటి సూక్తి ముత్యాలు కోకొల్లలు
    ఏదైనా చేయాలన్నా ఇవ్వాలన్నా తక్షణమే చేసేయాలన్నా అని
    చెప్పే శ్లోకం ఇది   
    అదానస్య ప్రదానస్య కర్తవ్యస్యచ కర్మణః
    క్షిప్ర మక్రియ మాణస్య కాలః పిబతి సంపదః

    తీసుకోవాలన్నా ఇవ్వాలన్నా అది వెంటనే చేసేయాలి. అలాకాక అప్పుడో ఇప్పుడో అనుకుంటే కాలం ఆ సంపదని మింగేస్తే ఆ మీదట ఇవ్వటం ఉండదు, పుచ్చుకోవడము ఉండదు.
    మంచి చెప్పేవాడు - వినేవాడు లోకంలో ఉండరు అనే నీతి చెప్పే శ్లోకం చూద్దాం.
   
    సులభాః పురుషాలోకే సతతం ప్రియవాదినః
    అప్రియస్య చ పధ్యస్య వక్తాశ్రోతా చదుర్లభ

    కమ్మని కబుర్లు చెప్పేవారు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. అయితే చెప్పేటప్పుడు కష్టంగా ఉన్నా తరువాత మేలుకూర్చే మాటలు చెప్పేవాడు. దాన్ని వినేవారు దొరకడం కష్టం.

    ఈ లోకంతీరు గురించే ఓ తమాషా (శ్లోకం) పద్యం ఉంది. ఎవరో కవి ఒక పాదం రాసుకుని వచ్చాడు. కాళిదాసుని ఆశ్రయించి రాజుగారితో సంభావన ఇప్పించమని అడిగాడు. మిగతాపాదం కవిగారు పూరించి రాజసభా ప్రవేశం చేయించి సన్మానం చేయించారు. ఆ శ్లోకం మొదటి భాగంలో కేవలం ఆశా, అర్ధింపు ఉంది. కవిత్వం లేదు. రెండో భాగంలో చక్కని ఊహా ఉంది చూడండి.

    భోజనం దేహి రాజేంద్ర ఘృత సూప సమన్వితం
    మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం దధి

    ఓ రాజా! భోజనం పెట్టు - పప్పు నెయ్యి కూడా ఉండాలి. ఇదీ అపండితుడికైత. శరత్కాల వెన్నెలలా తెల్లగా ఉండే గేదె పెరుగు ఉండాలి అనేది కాళిదాసు కవిత. పెరుక్కి వేసిన విశేషణంలో ఉంది కవిత్వమంతా!

    కువిందుడనే నేతపనివాని కధ మరీ చిత్రంగా ఉంది. కవిత చెప్పే వాడు తప్ప మరొకడు రాజ్యంలో ఉండరాదు.... అంటే కువిందుడు ఒకడే దొరికాడు. రాజును చూసీ చూడగానే కావ్యం కరోమి-నహి చారుతరం కరోమి యత్నాత్ కరోమి యదిచారుతరం కరోమి - భూపాల మౌళిమణిరంజిత పాద పీఠః హేసుహసాంక కవయామి వయామి యామి. అని కవిత్వం చెప్పాడు. అయ్యా కవిత చెప్తాను అయితే బాగా చెప్పలేను కానయితే కష్టపడితే బాగా చెప్పగలనేమో! ఓ మహారాజా.... కవయామి (కవిత్వం చెప్తా) వయామి (నేస్తా) యామి (వస్తా) అని మూడు ముక్కలు చెప్పేసరికి రాజు పొంగి లొంగిపోయాడు. స్నేహాన్ని గూర్చిన మరోగొప్ప శ్లోకం ఉంది.

    స్నేహో హివరమఘటితో నవరం
    సంజాత విఘటితః స్నేహః
    హృతనయనోహి విషాదీ నవిషాదీ భవతి
    సఖలు జాత్యంధః

    మైత్రి చేయకుండుటే మేలు. స్నేహం చేసి వదిలేయడం విడిపోవడం మంచిది కాదు.
కళ్ళుపోయిన వానికి బాధ. కానీ పుట్టుగుడ్డికి అంత బాధ ఉంటుందా? ఎంత చక్కని ఉపమ!

    మహారాజు పాలనలో కవులంతా సుఖంగా ఉన్నారు. ఎవడో ఒక కవికి అవకాశం చిక్కలేదు. దానికి రాజుగారు కారణమడిగితే కవి చమత్కారంగా ఎలా చెప్పాడో చూద్దాం.
   
    రాజస్ కనకదారాభిః త్వయి సర్వత్ర వర్షతి
    అభాగ్యచ్చత్ర సంఛన్నేమయి నాయాన్తి బింధవః

    భోజరాజా! నీవు కనక వర్షాన్ని కుర్పిస్తున్నావు. అయితే నేం దురదృష్టమనే గొడుగు నా తల మీదుంది. ఒక చినుకైనా నా మీద పడ్డంలేదు సుమా!

    ఇలా ఎన్నెన్ని కధలు. ఎన్నెన్ని చమత్కారాలు. ఒక్కో కవి రాజ దర్శనానికి వస్తే ఒక్కో చమత్కారం చెప్పాడు. ఒక్కో విశేషం ఒక్కో అద్భుతం. ఓ కవి వచ్చాడు. తన అన్ని కష్టాలకు మూలం దారిద్ర్యం అనే చెప్పుకుంటున్నాడు ఎలా---

    అంబా కుప్యతి నమాయా, నతయా సా
    చాపి నాంబయా నమయా
    అహ మపి న తయా నతయా వద
    రాజన్ కస్య దోషోయం

    మా అమ్మకు కోపం వస్తుంది. అందుకు నేను కారణం కాదు. మా ఆవిడా కాదు. మా ఆవిడకు కోపం వస్తుంది. కారణం నాది కాదు మా అమ్మదీ కాదు. అన్నట్టు నేనూ కోప్పడతాను! అందుకు కారణం మా అమ్మా కాదు. మా ఆవిడా కాదు. మరి తప్పంతా ఎక్కడా! ఎవరిది?.... అంటే అన్ని తప్పులకు మూలం దారిద్ర్యం.

    ఈ భోజ చరిత్ర స్వారస్యాన్ని మాటలతో చెప్పడం సాధ్యం కాదు. చదివి చూడాల్సిందే....


                                                   ----*----

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra